పార్లమెంటరీ వ్యవహారాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా!


24 రోజుల్లో 18 సార్లు సమావేశం..

11 బిల్లులకు ఉభయ సభల ఆమోదం;

సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులు13..
లోక్.సభలో12,.. రాజ్యసభలో 1.

లోక్.సభ సమావేశాలు దాదాపు 82శాతం,..
రాజ్యసభ సుమారు 48శాతం ఫలవంతం.

ఆర్జినెన్సుల స్థానంలో 3 బిల్లుల పరిశీలన,
ఉభయ సభల ఆమోదముద్ర

జీవవైవిధ్య (సవరణ) బిల్లు జె.పి.సి.కి నివేదన;
స్థాయీ సంఘాల పరిశీలనకు ఐదు బిల్లులు

Posted On: 22 DEC 2021 2:21PM by PIB Hyderabad

   2021వ సంవత్సరపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 22 బుధవారం నిరధవధికంగా వాయిదా పడ్డాయి. 2021 నవంబరు 29 సోమవారం మొదలైన శీతాకాల సమావేశాలు, డిసెంబరు 23 గురువారం వరకూ జరగాల్సి ఉండగా, డిసెంబరు 22న బుధవారంనాడే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ప్రభుత్వానికి ముఖ్యమైన సభా కార్యకలాపాలన్నీ ముగిసిపోవడంతో నిర్ణీత గడువుకంటే ఒక రోజు ముందుగా శీతాకాల సమావేశాలను పూర్తి చేశారు. 24 రోజుల పాటు సాగిన శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు మొత్తం 18సార్లు సమావేశమైంది.

  శీతాకాల సమావేశాల్లో 13 బిల్లులు (12 బిల్లులు లోక్ సభలో, ఒక బిల్లు రాజ్యసభలో) ప్రవేశపెట్టారు. వాటిలో 11 బిల్లులను పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి.

  పార్లమెంటు ఉభయసభల ఆమోద ముద్ర పొందిన బిల్లుల్లో 2021-21వ సంవత్సరపు అనుబంధ పద్దులకు సంబంధించిన బిల్లును,.. లోక్ సభ ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభకు పంపించారు. అయితే, రాజ్యాంగంలోని 109(5)వ ఆర్టికల్ ప్రకారం బిల్లు సభ పరిశీలనలో ఉండగానే 14 రోజుల గడువు ముగిసిపోవడంతో ఈ బిల్లును లోక్.సభతో పాటుగా రాజ్యసభ కూడా ఆమోదించినట్టుగా పరిగణిస్తారు. పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టిన బిల్లులకు, ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించిన పూర్తి జాబితా అనుబంధంలో పొందుపరచబడింది.

  పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్రపతి జారీ చేసిన మూడు ఆర్డినెన్సుల స్థానంలో రూపొందించిన 3 బిల్లులను పార్లమెంటు పరిశీలించి, ఆమోదముద్ర వేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్, ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) ఆర్డినెన్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధక (సవరణ) ఆర్డినెన్స్.ల స్థానంలో ఈ 3 బిల్లులను రూపొందించారు.

  జీవ వైవిధ్య (సవరణ) బిల్లును మాత్రం పార్లమెంటు ఉభయసభల సంయుక్త కమిటీ (జె.పి.సి.) పరిశీలనకు పంపించారు. మరో ఐదు బిల్లులు పార్లమెంటు స్థాయీ సంఘాల పరిశీలనకు వెళ్లే దశలో ఉన్నాయి. మూడు ఆర్డినెన్సుల స్థానంలో పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లులతో సహా మరికొన్ని ముఖ్యమైన బిల్లుల వివరాలు ఈ దిగువన చూడవచ్చు.:

  1. వ్యసాయ చట్టాల రద్దు బిల్లు, 2021: కొంతమంది రైతుల బృందం నిరసనల నేపథ్యంలో, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, అభివృద్ధి పథంలో అందరినీ సమ్మిళంగా కలుపుకుపోయే ఉద్దేశంతో 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదింపచేశారు.  రైతుల (సాధికారత, రక్షణ), ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం-2020, రైతుల ఉత్పాదనల వాణిజ్యం (ప్రోత్సాహకాల, సదుపాయాల) చట్టం-2020,  నిత్యావసర సరకుల (సవరణ) చట్టం-2020, వంటి చట్టాలను రద్దుచేస్తూ ప్రతిపాదించిన బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. రైతుల బహుముఖ అభివృద్ధి లక్ష్యంగా గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ఈ మూడు చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. 
  2. ఆనకట్ట భద్రత బిల్లు, 2021: ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆనకట్ట ఏదైనా వైపరీత్యాల్లో దెబ్బతినకుండా నివారించేందుకు, ఆనకట్టపై నిఘాను, తనిఖీని, నిర్వహణను పర్యవేక్షించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే, ఆనకట్టలు భద్రంగా ఉంటూ, సక్రమంగా పనిచేసేలా చూసేందుకు, ఇతర సంబంధిత విషయాల పరిశీలనకు తగిన సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
  3. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లు 2021: సంతాన సాఫల్య కేంద్రాలపై, ఫెర్టిలిట సెంటర్లపై, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంకులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయి మండలిని, రాష్ట్రాల స్థాయిలో బోర్డులను, జాతీయ స్థాయిలో రిజిస్ట్రీని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. సంతాన సాఫల్య కేంద్రాల దుర్వినియోగాన్ని నివారించేందుకు, సంతాన సాఫల్య సేవలను నైతికంగా కొనసాగేలా చూసేందుకు, ఇందుకు సంబంధించిన ఇతరత్రా వ్యవహారాలను పర్యవేక్షణకు కూడా ఈ బిల్లు దోహదపడుతుంది.
  4. సరొగసీ (నియంత్రణ) బిల్లుl, 2021: సరోగసీ (అద్దెగర్భం) సేవల పేరిట దేశంలో జరిగే అనైతిక వ్యాపారాన్ని నియంత్రించేందుకు, సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనిచ్చే తల్లికి  అన్యాయం జరక్కుండా చూసేందుకు, సరోగసీ ద్వారా జన్మించే పిల్లల హక్కులకు తగిన రక్షణ కల్పించేందుకు కూడా ఈ బిల్లు దోహదపడుతుంది.
  5. జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్.స్టిట్యూట్ (సవరణ) బిల్లు, 2021జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థ చట్టం పరిధిలో ఏర్పాటైన సంస్థలు, ఆ చట్టం పరిధిలోని అదే స్వభావం కలిగిన సంస్థలు ఏవైనా జాతీయ ప్రాధాన్యతతో పనిచేసేలా చూసేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. అలాగే,  ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన సమన్వయంతో అభివృద్ధి చెందేలా చూసేందుకు వీలుగా మండలి రూపంలో ఒక కేంద్ర సంస్థను ఏర్పాటు చేయడానికి, ఆయా సంస్థలు ప్రమాణాలను పాటించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రతి సంస్థ గవర్నర్ల బోర్డును హేతుబద్ధంగా రూపొందించేందుకు, ఆ సంస్థలు నిర్వహించే కోర్సుల సంఖ్యను, పరిధిని విస్తృతం చేసేందుకు కూడా ఈ బిల్లు దోహపడుతుంది.
  1. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు, 2021: పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు అదనపు పరిమాణంలో పెన్షన్ ప్రయోజనాలు కల్పించేందుకు, ఇందుకు సంబంధించిన ఇదివరకటి నిబంధనలను సవరించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
  2. మాదక ద్రవ్యాల, సైకోట్రాపిక్ పదార్థాల నిరోధక చట్టం (సవరణ) బిల్లు, 2021: మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల నిరోధక చట్టానికి సంబంధించి, 27ఎ సెక్షన్.లోని లోపాన్ని సరిదిద్దడానికి ఈ బిల్లును రూపొందించారు. 27ఎ సెక్షన్.లోని 'క్లాజు (viiia)' స్థానంలో 'క్లాజు (viiib)'ని చేర్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చట్టాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకుని, అమలు చేసే ఉద్దేశంతో తగిన మార్పు చేసేందుకు కూడా దోహదపడుతుంది.
  3. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2021: ప్రజా ప్రయోజనాలకు అవసరమైన సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.) డైరెక్టర్ పదవీ కాలాన్ని ఒక ఏడాదివరకూ పొడిగించడానికి ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ముందస్తుగా నియామక పత్రంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తంగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకూ పొడిగించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.
  4. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, 2021: ప్రజా ప్రయోజనాల రీత్యాకు అవసరమైన సమయంలో ఎన్ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) డైరెక్టర్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ముందస్తుగా నియామక పత్రంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తంగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకూ పొడిగించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.
  5. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021: ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో వోటరుగా నమోదు కావడాన్ని నిరోధించేందుకు వోటర్ల జాబితాకు ఆధార్ వ్యవస్థతో అనుసంధానం చేయడం;

ఈ కింది అంశాలపై,.. లోక్.సభలో 193 నిబంధన కింద రెండుసార్లు స్వల్ప వ్యవధి చర్చ జరిగింది:

    1. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి,  ఇందుకు సంబంధించిన వివిధ కోణాలు,
    2. వాతావరణ మార్పులు.

కోవిడ్-19కు సంబంధించి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తితో తలెత్తిన తాజా పరిస్థితులపై రాజ్యసభలో చర్చ జరిగింది.

లోక్ సభ సమావేశాలు దాదాపుగా 82శాతం ఫలవంతమయ్యాయి. రాజ్య సమావేశాలు మాత్రం సుమారు 48శాతం ఫలవంతమయ్యాయి.

*----*----*----**----*----*----*

 

అనుబంధం

 17వ లోక్.సభ 7వ సమావేశాలు, 255వ రాజ్యసభ సమావేశాల్లో కార్యకలాపాలు

(శీతాకాల సమావేశాలు, 2021)

I లోక్.సభలో ప్రవేశపెట్టిన బిల్లులు

  1. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021
  2. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు, 2021
  3. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, 2021
  4. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2021
  5. మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల (సవరణ) బిల్లు, 2021
  6. జీవ వైవిధ్య (సవరణ) బిల్లు, 2021
  7. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, 2021
  8. వన్యజీవుల (రక్షణ) సవరణ బిల్లు, 2021
  9. చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల (సవరణ) బిల్లు, 2021
  10. ద్రవ్య వినియోగం (నంబర్. 5) బిల్లు, 2021
  11. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021.
  12. బాల్య వివాహాల నిషేధం (సవరణ) బిల్లు, 2021.

II రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు

  1. మధ్యవర్తిత్వ బిల్లు, 202

III లోక్ సభ ఆమోదం పొందిన బిల్లులు

  1. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021
  2. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్స్) బిల్లు, 2020
  3. నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021
  4. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు, 2021
  5. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, 2021
  6. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2021
  7. మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల నిరోధక (సవరణ) బిల్లు, 2021
  8. ద్రవ్య వినియోగం (నంబర్. 5) బిల్లు, 2021
  9. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021.

*ఆనకట్ట భద్రత బిల్లు, 2019

*సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2019

*రాజ్యసభ చేసిన సవరణలకు లోక్.సభ సమ్మతి తెలిపింది.

IV ఆమోదించిన/తిప్పి పంపిన బిల్లులు

  1. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021.
  2. ఆనకట్ట భద్రత బిల్లు, 2019.
  3. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్స్) బిల్లు, 2021.
  4. సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2020.
  5.  నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021
  6. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు, 2021
  7. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2021.
  8. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, 2021
  9. మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల నిరోధక (సవరణ) బిల్లు, 2021
  10. ద్రవ్య వినియోగం (నంబర్. 5) బిల్లు, 2021
  11. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021.

V పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించిన బిల్లులు.

  1. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021.
  2. ఆనకట్ట భద్రత బిల్లు, 2021.
  3. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్స్) బిల్లు, 2021.
  4. సరోగసీ (నియంత్రణ) బిల్లు, 2021.
  5. నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021.
  6. ద్రవ్య వినియోగం (నంబర్. 5) బిల్లు, 2021
  7. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు, 2021
  8. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2021.
  9. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, 2021.
  10. మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల నిరోధక (సవరణ) బిల్లు, 2021.
  11. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021.

*వీటిని ఆమోదం పొందినట్టుగా పరిగణించవలసి ఉంటుంది.

 

***



(Release ID: 1784453) Visitor Counter : 238