ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబరు 7న ప్రధానమంత్రి గోరఖ్‌పూర్ సందర్శన; రూ.9600 కోట్ల విలువైన వివిధ పథకాలు జాతికి అంకితం
30 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ;
యూరియా ఉత్పత్తిలో స్వావలంబనపై ప్రధాని దార్శనికత స్ఫూర్తితో పునరుజ్జీవం;
ముఖ్యంగా పూర్వాంచల్ సహా పరిసర ప్రాంత రైతులకు ఈ ప్రాజెక్టుతో ఎంతో లబ్ధి;
నాణ్యమైన తృతీయ ఆరోగ్య సంరక్షణ లభ్యతలో ప్రాంతీయ అసమతౌల్యాలు సరిదిద్దే దిశగా ‘ఎయిమ్స్’ గోరఖ్‌పూర్ మరో కీలకమైన ముందడుగు;
ఈ రెండు ప్రాజెక్టులకూ ప్రధాని చేతులమీదుగా 2016లో శంకుస్థాపన
Posted On:
03 DEC 2021 7:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబరు 7న గోరఖ్‌పూర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రూ.9600 కోట్ల విలువైన వివిధ పథకాలను జాతికి అంకితం చేస్తారు. ఇందులో భాగంగా 2016 జూలై 22న తన చేతులమీదుగా శంకుస్థాపన చేసిన గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇప్పటికి 30 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న ఈ కర్మాగారం పునరుద్ధరణ ప్రక్రియ కింద రూ.8,600 కోట్ల వ్యయంతో తిరిగి నిర్మించబడింది. యూరియా ఉత్పత్తిలో స్వావలంబనపై ప్రధాని దార్శనికత స్ఫూర్తే ఈ ఎరువుల కర్మాగారం పునరుజ్జీవనానికి తోడ్పడింది. గోరఖ్‌పూర్ కర్మాగారంలో ఏటా 12.7 లక్షల టన్నుల దేశీయ వేపపూత యూరియా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ముఖ్యంగా పూర్వాంచల్ సహా పరిసర ప్రాంతాల రైతుల యూరియా అవసరాలు తీరడం ద్వారా వారికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సర్వతోముఖ ఆర్థిక వృద్ధికి ఇది ఉత్తేజమిస్తుంది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ల సంయుక్త-సహకార సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్-రసాయన్ లిమిటెడ్ (HURL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా గోరఖ్‌పూర్‌తోపాటు సింద్రీ, బరౌని ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకూ ఈ సంస్థ కృషి చేస్తోంది. గోరఖ్‌పూర్ ప్లాంటుకు సంబంధించి అమ్మోనియా, యూరియాల కోసం అమెరికాకు చెందిన ‘కేబీఆర్’, జపాన్‌కు చెందిన ‘టోయో’ సంస్థ సాంకేతికత/లైసెన్సుల తోడ్పాటుతో ‘టోయో ఇంజనీరింగ్ కార్పొరేషన్, జపాన్ సహా టోయో ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం నిర్మాణ పనులు పూర్తిచేశాయి. ఈ ప్రాజెక్టులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 149.2 మీటర్ల శీతలీకరణ (ప్రిల్లింగ్) టవర్ నిర్మితమైంది. అలాగే భద్రత అంశాల మెరుగుదల కోసం భారత్‌లోనే మొట్టమొదటి వాయు ఆధారిత ‘రబ్బర్ డ్యామ్-బ్లాస్ట్ ప్రూఫ్ కంట్రోల్ రూమ్’ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది.
ప్రధానమంత్రి తన గోరఖ్‌పూర్ పర్యటనలో భాగంగా రూ.1,000 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధం చేసిన ‘ఎయిమ్స్’ సముదాయాన్ని కూడా జాతికి అంకితం చేస్తారు. ఈ సముదాయానికి 2016 జూలై 22న ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారు. నాణ్యమైన తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ లభ్యతలో ప్రాంతీయ అసమానతలను సరిదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఏర్పాటవుతున్న సంస్థలలో ఒకటిగా ‘ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన’ కింద ఈ ఆరోగ్య సంస్థను నిర్మించారు. ‘ఎయిమ్స్’ గోరఖ్‌పూర్‌లోని సౌకర్యాలలో 750 పడకల ఆస్పత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, ఆయుష్ భవనం, సిబ్బంది మొత్తానికీ నివాస సదుపాయం, యూజీ-పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి తదితరాలు కూడా ఉన్నాయి.
గోరఖ్‌పూర్‌లోని ఐసీఎంఆర్-ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (RMRC) కొత్త భవనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో జపనీస్ ఎన్సెఫలైటిస్/అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ సవాళ్లను ఎదుర్కొనడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోంది. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల విభాగాల్లో సరికొత్త పరిశోధన కోణాలను ఈ అత్యాధునిక సౌకర్యాలుగల కొత్త భవనం ఆవిష్కరించగలదు. అంతేకాకుండా సామర్థ్యం పెంపులో తోడ్పాటునిస్తూ ఈ ప్రాంతంలోని ఇతర వైద్య సంస్థలకు అండగా నిలుస్తుంది.
(Release ID: 1778012)
Visitor Counter : 152
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam