ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ సమీక్ష

Posted On: 24 NOV 2021 7:05PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.

   సమావేశంలో 8 ప్రాజెక్టులు, ఒక పథకానికి సంబంధించిన 9 చర్చనీయాంశాలున్నాయి. ఈ ఎనిమిది ప్రాజెక్టులలో మూడు రైల్వే మంత్రిత్వశాఖకు చెందినవి కాగా, రోడ్డు రవాణా-రహదారులు, విద్యుత్‌ మంత్రిత్వశాఖలకు చెందినవి రెండేసి, పెట్రోలియం-సహజవాయువుల శాఖకు చెందినది ఒకటి వంతున ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు.. బీహార్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ పరిధిలోని ఈ ఎనిమిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం దాదాపు రూ.20,000 కోట్లు. ఖర్చులు పెరిగే అవకాశం లేకుండా సకాలంలో వీటన్నిటినీ పూర్తిచేయాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   సమీక్షలో భాగంగా ‘పోషణ్‌ అభియాన్‌’పైన కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యమం తరహాలో అమలు చేయటంపై ప్రభుత్వాలు పూర్తి శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం కింద బాలల ఆరోగ్యంపై, పౌష్టికతపై స్వయం సహాయ బృందాలుసహా ఇతర స్థానిక సంస్థల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన పెంచడానికి కృషి చేయాలని కోరారు. పోష్టికాహార కార్యక్రమం ప్రజల్లోకి చేరడంతోపాటు ఆచరణలోకి రావడంలో ఈ కృషి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

   ఇప్పటిదాకా నిర్వహించిన 38 ‘ప్రగతి’ సమావేశాల్లో రూ.14.64 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులపై సమీక్ష పూర్తయింది.

 

***



(Release ID: 1774887) Visitor Counter : 166