మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

బాలల హక్కులపై జాతీయ వర్క్‌-షాప్‌ ను ప్రారంభించిన - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


పౌరులుగా మనం, ఒక దేశంగా మనం, మన పిల్లలందరికీ న్యాయం చేయగలిగితే, ప్రజాస్వామ్యానికి అదే అత్యుత్తమ పరీక్ష: శ్రీమతి ఇరానీ

Posted On: 21 NOV 2021 5:28PM by PIB Hyderabad

పౌరులుగా మనం, ఒక దేశం గా మనం, మన పిల్లలందరికీ న్యాయం చేయగలిగితే, ప్రజాస్వామ్యానికి అదే అత్యుత్తమ పరీక్ష అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ పేర్కొన్నారు.  "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్‌" లో భాగంగా బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్ (ఎన్.సి.పి.సి.ఆర్), బాలల హక్కులపై ఈ రోజు ఇక్కడ నిర్వహించిన, జాతీయ వర్క్‌-షాప్‌ నుద్దేశించి శ్రీమతి ఇరానీ ప్రసంగించారు.  తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందనే  విషయంపైనే ప్రజాస్వామ్యానికి నిజమైన గుర్తింపు వస్తుందని పేర్కొంటూ, బాలల రక్షణ సమస్యల నివారణ అంశాల ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,  బాలల హక్కుల పట్ల సమాజంలో స్పృహ పెంపొందించడం అవసరమనీ, తద్వారా పిల్లల రక్షణ, పునరావాసం కోసం సమాజం ముందుకు రావాలని, పిలుపునిచ్చారు.   లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, బాల నేరస్థులకు న్యాయం (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టాలకు పార్లమెంటు సవరణలతో సహా, బాలల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టిందని, ఆమె తెలియజేశారు.  ఏది ఏమైనప్పటికీ, సమాజం నిరంతరం మారుతూనే ఉంటుంది, పరిపాలనా అవసరాలు చైతన్యవంతంగా ఉంటాయి, కాబట్టి మనం కాలానుగుణంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎదురౌతున్న సవాళ్లకు తగిన పరిష్కారాలతో సిద్ధంగా ఉండటం మన  బాధ్యత అని కూడా, కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

ఈ వేధింపులు అనేవి నిరుపేద కుటుంబాలకే పరిమితమనీ, వేధింపులకు గురైన పిల్లలు పేదరికానికే పరిమితమవుతున్నారనే భావన చాలా మందిలో ఉందని, అయితే, వాస్తవానికి ఈ వేధింపులు అనేవి సంపన్న కుటుంబాలలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని, కేంద్ర మంత్రి చెప్పారు.  పేదరికం నుండి ఎదురయ్యే సవాళ్లను వారు పరిశీలిస్తున్నప్పుడు,  వారు సంపన్న కుటుంబాలలో ఎదురయ్యే వేధింపులను కూడా గమనించాలని, వర్క్‌-షాప్‌ లో పాల్గొన్న వారిని ఆమె కోరారు. శక్తివంతమైన సంస్థలు, పిల్లల సంరక్షణ సంస్థల్లో కూడా ఈ విధమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, మనం నిర్వాహకులుగా కాకుండా పౌరులుగా వీటి పరిష్కారానికి తగిన మార్గాలను అన్వేషించాలని,  ఆమె సూచించారు. 

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహించిన వర్క్‌-షాప్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "మీ భుజాలపై మన భవిష్యత్ తరాలకు స్వేచ్ఛ ఉంది, తద్వారా వారు భయం లేకుండా ఎదగవచ్చు. తద్వారా న్యాయం కోరితే న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో వారు పెరుగుతారు. పిల్లల రక్షణ విషయంలో మీరు ఈ రోజు చేసే కృషి, భవిష్యత్ తరానికి భరోసాగా ఉంటుందనే నమ్మకంతో వారు పెరుగుతారు”. అని వివరించారు.   వేధింపులు అంటే ఏమిటి? వేధింపులపై ఎలా ఫిర్యాదు చేయాలి?  అనే విషయాల పై పిల్లలకు అవగాహన కల్పించాలని కూడా కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.

స్వతంత్ర భారతదేశ 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ,  2021 నవంబర్, 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధి వంటి వివిధ కార్యకలాపాలు, కార్యక్రమాలను నిర్వహించింది.  బాలల ఆలోచనలు, హక్కులు, పోషకాహారం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన ఈ కార్యకలాపాలలో శిశు  సంరక్షణ సంస్థలు (సి.సి.ఐ. లు) మరియు ప్రత్యేక దత్తత ఏజెన్సీ లు, దత్తత అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన అవగాహన, పిల్లలు, కౌమారుల ఆరోగ్యం, పిల్లల హక్కులు మొదలైన వాటిపై సెమినార్‌ లు / వెబినార్‌ లు జరిగాయి.  బాలల హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు, ఈ దిశగా సమాజం యొక్క సామూహిక ఆలోచన ప్రక్రియను ప్రేరేపించడానికి ఈ వారోత్సవాలను ఉపయోగించుకోవడం ఈ కార్యకలాపాల ముఖ్య లక్ష్యం.

 

*****



(Release ID: 1773827) Visitor Counter : 186