ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిడ్నీ చర్చల సందర్భంగా ప్రధాన మంత్రి కీలకోపన్యాసం

Posted On: 18 NOV 2021 9:40AM by PIB Hyderabad

ప్రియమిత్రుడు, ప్రధాని స్కాట్ మోరిసన్,
మిత్రులారా,
నమస్కారం!
సిడ్నీ చర్చ ప్రారంభం సందర్భంగా కీలకోపన్యాసం చేయటానికి నన్ను ఆహ్వానించటం భారతీయులందరికీ గర్వకారణం.   కొత్తగా రూపుదిద్దుకుంటున్న డిజిటల్ ప్రపంచంలో ఇండో పసిఫిక్ ప్రాంతపు కేంద్ర బిందువుగా భారత్ కు దీన్నో గుర్తింపుగా నేను భావిస్తున్నాను. అదే విధంగా  మన రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నివాళిగా కూడా భావిస్తున్నాను.  ఇది ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ఎంతో మేలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న  కీలకమైన సైబర్ టెక్నాలజీల దృష్టి సారించినందుకు సిడ్నీ చర్చ బృందాన్ని అభినందిస్తున్నా.   
మిత్రులారా,
శకానికి ఒకసారి మార్పు జరిగే కాలంలో మనమున్నాం. డిజిటల్ కాలం మనచుట్టూ ఉన్న ప్రతిదాన్నీ మార్చేస్తూ ఉంది.  అది రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని పునర్నిర్వచించింది.  సార్వభౌమాధికారం మీద, పాలనమీద, నైతికత, చట్టం, హక్కులు, భద్రత తదితర అనేక  అంశాలమీద అది కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతర్జాతీయ పోటీ, నాయకత్వ స్వరూపస్వభావాలను మార్చేస్తోంది. పురోగతికోసం, సుసంపన్నత కోసం కొత్త అవకాశాలకు అది నాంది పలికింది. అయితే, అదే సమయంలో కొత్త రిస్క్ లు, కొత్త రూపాలలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. సైబర్ నుంచి అంతరిక్షం దాకా వైవిధ్యంతో కూడిన  అనేక ముప్పులు పొంచి ఉన్నాయి. అంతర్జాతీయ పోటీలో ఇప్పటికే  టెక్నాలజీ ఒక ఆయుధంగా మారింది. అంతర్జాతీయ సమాజ స్వరూప స్వభావాలను మార్చబోయేది అదే. టెక్నాలజీ, డేటా అనేవి కొత్త ఆయుధాలుగా మారాయి. ప్రజాస్వామ్యపు అతిపెద్ద బలం దాపరికం లేకపోవటం. అదే సమయంలో కొన్ని స్వార్థపర శక్తులు దీన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాన్ని మనం  అడ్డుకోవాలి.
మిత్రులారా,
ఒక ప్రజాస్వామ్య దేశంగా, డిజిటల్ నాయకత్వ దేశంగా భారతదేశం ఉమ్మడి ప్రయోజనాలు, భద్రత కోసం భాగస్వాములతో కలసి పనిచేయటానికి సిద్ధంగా ఉంది.  భారతదేశపు డిజిటల్ విప్లవ మూలాలు దాని ప్రజాస్వామ్యంలో, దాని జనాభాలో, ఆర్థిక వ్యవస్థ స్థాయిలోనే దాగి ఉన్నాయి. మన యువతను నడిపించేది వారి నవకల్పనే. మనం భవిష్యత్తులోకి దూకటానికి గతకాలపు సవాళ్ళనే అవకాశాలుగా మార్చుకుంటున్నాం.
భారతదేశంలో ఐదు ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. మొదటిది ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాసమాచార మౌలికసదుపాయాల నిర్మాణం.  130 కోట్లమందికి పైగా భారతీయులకు డిజిటల్ గుర్తింపు ఉంది. మనం 6 లక్షల గ్రామాలను బ్రాడ్ బాండ్ తో అనుసంధానం చేసే పనిలో ఉన్నాం. ప్రపంచపు అత్యంత సమర్థవంతమైన చెల్లింపుల మౌలికసదుపాయమైన యూపీఐ ని నిర్మించుకున్నాం. 80 కోట్లమండికి పైగా భారతీయులు ఇంటర్నెట్ వాడతారు. 75 కోట్లమంది స్మార్ట్ ఫోన్ వాడతారు. తలసరి  డేటా వినియోగించే దేశాల్లో  మనం ముందువరసలో ఉండటమే కాకుండా ప్రపంచంలో అత్యంత చౌకగా డేటా అందుబాటు ఉన్నది కూడా భారత్ లోనే.
ఇక రెండోది - మనం పాలనలో, సమ్మిళితాభివృద్ధిలో,  స్వావలంబనలో, అనుసంధానతలో, సంక్షేమ ఫలాలు అందించటంలో డిజిటల్ టెక్నాలజీని వాడుకోవటం ద్వారా ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాగలుగుతున్నాం. భారతదేశపు ఆర్థిక సమ్మిళతం, బాంకింగ్,  డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మకత గురించి వినే ఉంటారు. ఇటీవలే మనం టెక్నాలజీని వాడుకుంటూ సువిశాలంగా ఉన్న  దేశంలో  110 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయగలిగాం.  ఇందుకోసం ఆరోగ్య సేతు, కోవిన్  పోర్టల్స్ సమర్థంగా వాడుకున్నాం.  అదే విధంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ను నిర్మించటం ద్వారా కోట్లాది ప్రజలకు సార్వత్రిక వైద్య సేవలు అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాం.  ఒక దేశం –ఒక కార్డు ద్వారా దేశంలో ఎక్కడున్నా సరే కోట్లాది మందికి లబ్ధి అందించగలుగుతాం. 
మూడోది- భారత్ లో మూడో అతిపెద్ద ఎదుగుదలతో కూడిన స్టార్టప్ వ్యవస్థ ఉంది. ప్రతి కొద్ది వారాల వ్యవధిలో కొత్త యూనికార్న్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.  అవి ఆరోగ్యం, విద్య మొదలుకొని దేశ భద్రత దాకా అన్నీ అవసరాలకూ పరిష్కారమార్గాలు చూపగలుగుతున్నాయి. 
నాలుగోది – భారతదేశపు పరిశ్రమలు, సేవారంగంతోబాటు వ్యవసాయం కూడా డిజిటల్ మార్పులో భారీగా భాగమయ్యాయి. ఒడిదుడుకులు లేని విద్యుత్ సరఫరాలో, వనరుల మార్పిడి, జీవవైవిధ్య పరిరక్షణలో  కూడా డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటున్నాం.
ఐదోది – భారత్ ను భవిష్యత్ కు అనుగుణంగా తీర్చిదిద్దే కృషి జరుగుతోంది. టెలికాం రంగంలో 5జి, 6జి లాంటి సరికొత్త టెక్నాలజీల దిశగా స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి  పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నాం. కృత్రిమ మేధ, యాంత్రిక అధ్యయనంలో ప్రముఖ దేశాలలో భారత్ ఒకటిగా గుర్తింపు సంపాదించింది. క్లౌడ్ ప్లాట్ ఫాం,  క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా మనం బలమైన శక్తిగా తయారవుతున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారంలో ఉనాట స్థాయికి చేరటానికి ఇది చాలా కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనం ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని నిర్మించుకుంటున్నాం.
భారత అంతరిక్ష కార్యక్రమం మన ఆర్థిక వ్యవస్థలో, భద్రతలో చాలా కీలకం.   ఇప్పుడు ఇందులో నవకల్పనలకు, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలలా కార్పొరేట్ సంస్థలకు సైబర్ సెక్యూరిటీ పరిష్కార మార్గాలు అందించటంలో భారత్ ఇప్పటికే ఒక ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది.  సైబర్ సెక్యూరిటీకి ఒక అంతర్జాతీయ కేంద్రంగా తయారవటానికి మనం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం. మనకు నైపుణ్యాలతోబాటు అంతర్జాతీయ విశ్వసనీయత ఉంది. ఇప్పుడు మనం హార్డ్ వేర్ మీద దృష్టిసారిస్తున్నాం. సెమీ కండక్టర్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నాం. ఉత్పాదకతో అనుసంధానమైన ప్రోత్సాహకాల పథకం వలన స్థానిక వ్యాపారులతోబాటు అంతర్జాతీయ వ్యాపారులు కూడా భారత్ లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
మిత్రులారా,
టెక్నాలజీ ప్రతిఫలాల్లో నేడు చాలా గొప్పది  డేటా. భారత్ లో మనం డేటా రక్షణకు అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటఱు చేసుకున్నాం. అదే సమయంలో  డేటా ను మనం ప్రజల  స్వావలంబన కోసం వాడుకుంటున్నాం. దీన్ని ఒక ప్రజాస్వామ్య బద్ధమైన చట్రంలో తీర్చిదిద్దటంలో భారత్ విజయవంతమైంది. అదే సమయంలో వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తోంది.
మిత్రులారా,
ఒక దేశం టెక్నాలజీని ఎలా వాడుతుందనే విషయం ఆ దేశ నైతిక విలువలు, దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది. భారత ప్రజాస్వామ్య పునాదులు ఇప్పటివి కావు. దీని ఆధునికత కూడా బలమైనది. వసుధైక కుటుంబ భావన మనది.  భారత దేశపు ఐటీ పరిజ్ఞానం ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఎంతో సహాయపడింది. వై2కె  సమస్య వచ్చినప్పుడు సహాయపడింది.  టెక్నాలజీలు మన రోజువారీ జీవితాలలో మారుతూ వస్తున్నప్పుడు భారత్ తన వంతు పాత్ర పోషించింది. ఈరోజు మనం కోవిన్ వేదికను యావత్ ప్రపంచానికి ఆదర్శంగా చూపించగలిగాం.  యావత్ ప్రపంచం ఉచితంగా వాడుకునేలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఇచ్చిన ఘనత మనది.  టెక్నాలజీ వాడకంలో మనకున్న విస్తృతమైన అనుభవాన్ని ప్రజల మేలు కోసం వాడుకున్నాం. సామాజికంగా బలోపేతం కావటంలో దాని పాత్ర ఉంది. ఆ విధంగా భవిష్యత్ కోసం జరిగే నిర్మాణంలో భాగమవుతాం.  అది మన ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం. అది కూడా మన భద్రతకు సమానమైనదే.
మిత్రులారా,
మనం ఒక చారిత్రాత్మక సందర్భంలో ఉన్నారు. టెక్నాలజీలో మనకున్న అద్భుతమైన శక్తిని ఎలా వాడుకుంటామన్నది చాలా ముఖ్యం. సహకారానికా, సంఘర్షణకా; వత్తిడి చేయటానికా, ఎంచుకునేందుకా; ఆధిపత్యానికా, అభివృద్ధికా; అణచివేతకా, అవకాశం కోసమా అనేది మన చేతుల్లో ఉంది.  . భారత్, ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ లోని మన భాగస్వాములు, ఇంకా సుదూరంగా ఉన్నవారు సైతం మన పిలుపు వింటూ ఉంటారుమన బాధ్యతలు నెరవేర్చటానికి మనం సిద్ధం. మన భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దయటానికి సిడ్నీ చర్చ ఒక అద్భుతమైన వేదిక అవుతుందని, మన భావిష్యత్తుకోశం, యావత్ ప్రపంచం కోసం మన బాధ్యతను నెరవేర్చుతుందని  నా నమ్మకం. 
ధన్యవాదాలు
 

 

***
 


(Release ID: 1772915) Visitor Counter : 175