ప్రధాన మంత్రి కార్యాలయం
వాతావరణ పెనుమార్పులపై 'కాప్26' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రకటన
Posted On:
01 NOV 2021 11:30PM by PIB Hyderabad
మిత్రులారా..!,
ఈరోజు నేను మీ మధ్య ఉన్నాను. ఈ కింది మంత్రాన్ని వేలాదికిపైగా సంవత్సరాల కిందటనే అందించిన పుణ్యభూమి తరఫున నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
సం-గచ్ఛ-ధ్వం,
సం-వ-దద్వం,
సంవో మానసి జానతామ్.
21వ శతాబ్దంలో ఈ రోజున ఈ మంత్రం చాలా ముఖ్యమైనదిగా పరిణమించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అనుసరణీయంగా మారింది.
సం-గచ్ఛ-ధ్వం – అంటే కలసి ముందుకు కదలుదాం అని అర్థం
సం-వ-దద్వం–అంటే, పరస్పరం చర్చించుకుందాం అని అర్థం.
సంవో మానసి జానతామ్-అంటే,. అందరి మనసులు తప్పక ఏకం కావాలి..అని అర్థం.
మిత్రులారా!,
వాతావరణ మార్పులపై జరిగిన శిఖరాగ్ర సదస్సుకోసం నేను తొలిసారి పారిస్ నగరానికి వచ్చినప్పటి సంగతి గుర్తు చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న పలు హామీలకు మరొక్క హామీని జోడించాలన్న ఉద్దేశం అప్పట్లో నాకు ఏ మాత్రం లేదు. మొత్తం మానవాళి పరిస్థితిపై ఆవేదన నిండిన మనసుతోనే వచ్చాను. 'సర్వే భవంతు సుఖినాః' అన్న సందేశాన్ని లోకానికి అందించిన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నదే ఈ సందేశం సారాంశం.
నావరకూ నాకు సంబంధించి, పారిస్ నగరంలో జరిగింది వట్టి శిఖరాగ్ర సదస్సు మాత్రమే కాదు. అది దృఢమైన మనోభావానికి. గట్టి నిబద్ధతకు నిదర్శనం. ఈ వాగ్దానాలు,.. భారతదేశం ప్రపంచానికి ఇస్తున్నవి మాత్రమే కాదు. ఆ వాగ్దానాలన్నీ,. 125కోట్లమంది భారతీయులు తమకు తాముగా నిర్దేశించుకున్నవి కూడా.
కోట్లాది మంది ప్రజలకు పేదరికంనుంచి విముక్తి కలిగించేందుకు కృషిచేస్తున్న భారతదేశం,..కోట్లాదిమందికి సౌకర్యవంతమైన జీవితం అందించేందుకు రేయంబవళ్లు పనిచేస్తున్న దేశం..ఈ రోజున 17శాతం ప్రపంచ జనాభాను కలిగి ఉన్నప్పటికీ వాతావరణంలో కలుషిత వాయువులను 5శాతానికి తగ్గించాలన్న బాధ్యతను కలిగి ఉంది. ఈ విషయంలో తనవంతు బాధ్యతను, కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించేందుకు వర్ధమాన దేశం హోదాలో తనకు అందివచ్చిన భారత్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
వాతావరణంపై పారిస్ ఒప్పందపు వాగ్దానాలను తు..ఛ తప్పకుండా అమలు చేస్తున్న అతిపెద్ద దేశం భారతదేశం మాత్రమేనని ఈ రోజున ప్రపంచం యావత్తూ భావిస్తోంది. ఇందుకోసం మేం ఎంతో కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో కృషి చేస్తున్నాం. కష్టపడి పనిచేస్తూ ఫలితాలను కూడా చూపిస్తున్నాం.
మిత్రులారా,
నేను ఈ రోజున మీ మధ్యకు వచ్చినపుడు, భారతదేశం సాధించిన ట్రాక్ రికార్డును కూడా నా వెంట తీసుకువచ్చాను. నేను చెప్పేవి వట్టి మాటలు మాత్రమే కాదు,...అవి భావితరాల సమున్నత భవితకోసం, ఆనందం కోసం ఉద్దేశించిన సూత్రాలు. ఈ రోజున ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. భారతదేశపు శిలాజేతర ఇంధన సామర్థ్యం గత ఏడేళ్లలోనే 25శాతంపైగా పెరిగింది. మా మొత్తం ఇంధన వినియోగంలో ఇపుడు శిలాజేదర ఇంధనం వాటా ఏకంగా 40శాతానికి చేరుకుంది.
మిత్రులారా,
మిగతా ప్రపంచ జనాభాను మించిన సంఖ్యలో జనం ప్రతి ఏటా భారతీయ రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారు. వాతావరణంలో వెలువడే కలుషిత ఉద్గారాలు, వాతావరణంనుంచి తొలగించివేసే ఉద్గారాల మధ్య సమతుల్యతను సూచించే 'నెట్ జీరో' స్థాయిని 2030వ సంవత్సరానికల్లా సాధించాలని భారతీయ రైల్వే తనకుతానుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే ఒక్క రైల్వే వ్యవస్థ చొరవతోనే ప్రతి ఏటా 6కోట్ల టన్నులమేర కలుషిత ఉద్గారాలు కట్టడి అవుతాయి. అలాగే,..ఎల్.ఇ.డి. బల్బుల ఏర్పాటుకోసం మేం చేపట్టిన కార్యక్రమంతో సంవత్సరానికి 4కోట్ల టన్నులమేర కలుషిత ఉద్గారాలు తగ్గుతాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో దృఢ సంకల్పంతో భారతదేశం ఇపుడు పనిచేస్తూ వస్తోంది.
.
దీనికి తోడుగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు సహకారం అందించేందుకు సంస్ఘాగతమైన పరిష్కారాలను కూడా భారతదేశం సూచించింది. సౌరశక్తి విషయంలో ఒక విప్లవాత్మక చర్యగా అంతర్జాతీయ సౌరశక్తి కూటమిని ఏర్పాటు చేశాం. వాతావరణ పెను మార్పులకు ప్రభావంనుంచి రక్షణ పొందేందుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలిగే సంకీర్ణ వ్యవస్థను మేం సృష్టించాం. కోట్లాది మంది జీవితాలను కాపాడటంలో ఈ వ్యవస్థ ఎంతో కీలకపాత్ర వహిస్తోంది.
మిత్రులారా,
మరో ముఖ్యమైన అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకు రాదలుచుకున్నాను. మారిన ప్రజల జీవన శైలి కూడా భారీ స్థాయిలో వాతావరణ మార్పులను ప్రభావితం చేస్తున్నాయని ఈ రోజున ప్రపంచం గుర్తించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పదంతో కూడిన ఉద్యమాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను.
వాతావరణానికి సంబంధించిన ఈ ఒక్క పదం, ఏకంగా ఒక ప్రపంచానికే మౌలికమైన పునాది అవుతుంది. అదే లైఫ్ (LIFE...L, I, F, E) అనే పదం. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం కోసం ప్రజల జీవన శైలి అన్నమాట...పర్యావరణంకోసం జీవనశైలి పేరిట ఈ కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కలసికట్టుగా భాగస్వామ్యం వహించాలి.
పర్యావరణ స్పృహ కలిగిన జీవనశైలి లక్ష్యంగా ఇది ఒక భారీ ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది. ఈ రోజున మనకు కావలసింది బుద్ధికుశలత, సదుద్దేశాలతో కూడిన వనరుల వినియోగం. బుద్ధిహీనతతో, వినాశనానికి దారితీసే చర్యలు మనకు వద్దే వద్దు. ఇలాంటి ఉద్యమాలన్నింటితో మనం గట్టి లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. దీనితో విభిన్నమైన రంగాలను విప్లవాత్మకంగా మార్చుకోవచ్చు. చేపలవేట, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలు, ఆహారపు అలవాట్లు, ప్యాకేజింగ్ పద్ధతులు, గృహనిర్మాణ, ఆతిథ్య, పర్యాటక రంగాలు, దుస్తులు, ఫ్యాషన్, నీటి వినియోగ నిర్వహణ, ఇంధన రంగాలను మనం ఈ లక్ష్యాలతో విప్లవాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ అంశాలన్నింటిలో మనం ప్రతిరోజూ పర్యావరణ స్పృహతో కూడిన ఎంపిక పద్ధతిని ఆశ్రయించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రతి రోజూ ఇలాంటి ఎంపికను పాటించిన పక్షంలో వాతావరణ మార్పులు విసిరే సవాళ్లను దీటుగా ఎదుర్కొనవచ్చు. ప్రతి రోజూ వందలకోట్ల కార్యక్రమాలతో మనం ముందుకు సాగవచ్చు.
గతించిన శతాబ్దంలో మన అనుభవాలు ప్రాతిపదికగా చేసుకుని, ప్రతి రంగంలోనూ ఈ ఉద్యమాన్ని చేపట్టవచ్చని నేను భావిస్తున్నాను. ఆర్థిక రంగం కావచ్చు, లేదా వైజ్ఞానికరంగం కావచ్చు,,ఇలా ఏ రంగంలో అయినా మనం ఉద్యమాన్ని చేపట్టవచ్చు. మనంతట మనం వాస్తవం తెలుసుకునేందుకు ఇదే సరైన మార్గం. అసలు ఇదే మనకు లాభకరమైన మార్గం.
మిత్రులారా,
వాతావరణం విసిరే సవాళ్ల పరిష్కారాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ స్థాయి మేధోమథన సదస్సులో భారతదేశం తరపున అమృతతుల్యమైన ఐదు అంశాలను, అంటే పంచామృతాలను నేను సూచించ దలుచుకున్నాను.
మొదటిది- శిలాజేతర ఇంధనానికి సంబంధించి భారతదేశం 2030వ సంవత్సరంనాటికి 500 గెగా వాట్ల సామర్థ్యానికి చేరుకుంటుంది.
రెండవది- 2030నాటికల్లా భారతదేశం తన అవసరాలకోసం 50శాతం ఇంధనాన్ని పునరుత్పాదక ఇంధన వనరులనుంచి సంపాదించగలుగుతుంది.
మూడవది- ఇప్పటినుంచి 2030వ సంవత్సరం నాటికి కర్భన ఉద్గారాల విడుదలను వందకోట్ల టన్నులకు పైగా తగ్గించగలుగుతుంది.
నాల్గవది- 2030నాటికల్లా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గాగారాల గాఢతను 45శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గిస్తుంది.
ఐదవది- 2070వ సంవత్సరానికల్లా కర్భన ఉద్గార వాయువుల విషయంలో భారతదేశం,.-నెట్ జీరో- స్థాయికి చేరుకుంటుంది.
వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం అందించిన ఈ పంచామృతాలు ఇదివరకెన్నడూ ఎవరూ అందించని గొప్ప వరాలు.
మిత్రులారా,
వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు అందించే ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు వరకూ చేసిన వాగ్దానాలన్నీ వట్టి మాటలుగానే తేలిన సంగతి మనందరికీ తెలిసిన సిసలైన వాస్తవం. వాతావరణ సమస్యల పరిష్కారంకోసం మనమంతా గట్టిగానే ఆశిస్తున్నా, ప్రపంచ దేశాల తీరు అలా లేదు. పారిస్ ఒప్పందం నాటికి ఉన్న వాగ్దానాలకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి లేదు.
ఈ రోజున కొత్త వాగ్దానంతో, కొత్త ఇంధన ప్రత్యామ్నాయంతో ముందుకు సాగాలని భారతదేశం గట్టిగా తీర్మానించుకుంది. ఇలాంటి సమయాల్లో వాతావరణ సమస్యల పరిష్కారానికి ఆర్థిక సహాయం, తక్కువ ఖర్చుతో కూడిన వాతావరణ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మరింత ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ పరిస్థితుల్లో సంపన్నదేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు సాధ్యమైనంత త్వరగా ఒక ట్రిలియన్ డాలర్లమేర ఆర్థిక సహాయం అందించాలని భారతదేశం భావిస్తోంది. ఈనాటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా అవసరం. మనం వాతావరణ పరిస్థితుల మెరుగుదలను మధింపు చేసినట్టుగానే, అవసరమైన ఆర్థిక సహాయం కోసం కూడా ప్రయత్నించాల్సిందే. ఈ దశలో,..తమ వాగ్దానాలకు అనుగుణంగా వ్యవహరించని దేశాలపై ఆర్థిక సహాయం కోసం తగిన ఒత్తిడి తీసుకురావడమే సమంజసం.
మిత్రులారా,
వాతావరణ మార్పులు విసిరే సవాళ్ల పరిష్కారం విషయంలో భారతదేశం ఈనాడు ఎంతో ధైర్యంతో, గొప్ప ఆశయాలతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఇతర వర్ధమాన దేశాల బాధలపై కూడా భారతదేశానికి అవగాహన ఉంది. వారి బాధలను పంచుకుంటోంది. వారి ఆశలను, ఆశయాలను భారత్ ఇకముందు కూడా వ్యక్తం చేస్తూనే ఉంటుంది.
చాలా వర్ధమాన దేశాల ఉనికికి వాతావరణ పెనుమార్పులు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాల రక్షణకు మనం ఈనాడు భారీ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఇది తక్షణావసరం. ఈ చర్చా వేదికకు కూడా ఇది వర్తిస్తుంది. గ్లాస్గో సదస్సు తీసుకునే నిర్ణయాలు భావితరాల భవిష్యత్తును రక్షించగలవని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. భావితరాలకు సురక్షితమైన, సుసంపన్నమైన జీవితాన్ని కానుకగా అందించగలవని కూడా నమ్ముతున్నాను.
స్పీకర్ సర్,..నేను ఈ సదస్సులో ఇప్పటికే ఎక్కువ వ్యవధి తీసుకున్నాను. అందుకు క్షంతవ్యణ్ణి. అయితే, వర్ధమాన దేశాల వాణిని వినిపించేందుకు దీన్ని నా విధి నిర్వహణలో భాగంగా పరిగణించాలని కోరుకుంటున్నాను. అందువల్లనే ఆ అంశాన్ని సదస్సులో గట్టిగా ప్రస్తావించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
గమనిక: ప్రధానమంత్రి తన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలకు ఇది రమారమి అనువాదం. అసలు ప్రకటనన హిందీలో వెలువడింది.
***************
(Release ID: 1768929)
Visitor Counter : 617
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam