ప్రధాన మంత్రి కార్యాలయం
ఆఫ్ఘనిస్తాన్ పై జి-20 దేశాల అసాధారణ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న - ప్రధానమంత్రి
Posted On:
12 OCT 2021 7:07PM by PIB Hyderabad
ఆఫ్ఘనిస్తాన్ పై జి-20 దేశాలు నిర్వహించిన అసాధారణ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఉదయం దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ప్రస్తుతం జి-20 దేశాల కూటమి కి అధ్యక్ష స్థానంలో ఉన్న ఇటలీ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటలీ ప్రధాన మంత్రి శ్రీ మారియో డ్రాగి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆఫ్ఘనిస్తాన్ లో మానవతావాద పరిస్థితులు; ఉగ్రవాదానికి సంబంధించిన ఆందోళనలతో పాటు ఆ దేశంలో మానవ హక్కులకు సంబంధించిన సమస్యలను ఈ సమావేశం పరిగణలోకి తీసుకుంది.
ప్రధానమంత్రి ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించడానికి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో జి-20 దేశాల కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న ఇటలీ చొరవను స్వాగతించారు. భారత - ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య శతాబ్దాల నాటి ప్రజల పరస్పర సంబంధాల గురించి, ఆయన నొక్కిచెప్పారు. గత రెండు దశాబ్దాలుగా, ఆఫ్ఘనిస్తాన్ లో యువత మరియు మహిళల సామాజిక-ఆర్థికాభివృద్ధి, సామర్థ్యాల నిర్మాణానికి భారతదేశం దోహదపడిందని, ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆఫ్ఘనిస్తాన్ లో 500 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను భారతదేశం అమలు చేసిందని కూడా ఆయన గుర్తు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భారతదేశం పట్ల గొప్ప స్నేహ భావాన్ని కలిగి ఉన్నారని ప్రధానమంత్రి గుర్తించారు. ఆకలితో పాటు, పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజల బాధ పట్ల ప్రతి భారతీయ పౌరుడు విచారం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. మానవత్వం తో కూడిన తక్షణ సహాయం అందుకోడానికి ఆఫ్ఘనిస్తాన్ కు ఎటువంటి అవరోధాలు లేకుండా చూడాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజంపై ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
ప్రాంతీయంగా లేదా అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం విప్లవానికి, తీవ్రవాదానికి కేంద్రంగా తయారవకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఈ ప్రాంతంలో విప్లవ వాదం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, మన ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేయవలసిన అవసరాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
గత 20 సంవత్సరాల సామాజిక-ఆర్ధిక ప్రయోజనాలను కాపాడటానికి, అదే విధంగా తీవ్రవాద భావజాల వ్యాప్తి ని పరిమితం చేయడంతో పాటు, మహిళలు, మైనారిటీలతో కలిసి, ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సమగ్ర పరిపాలన కోసం ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఐక్యరాజ్యసమితి ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆయన పేర్కొంటూ, ఆఫ్ఘనిస్తాన్ పై ఐక్యరాజ్య సమితి మండలి తీర్మానం-2593 లో ఉన్న సందేశానికి జి-20 మద్దతు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిలో కావలసిన మార్పు తీసుకురావడం కోసం, ఏకీకృత అంతర్జాతీయ ప్రతిస్పందనను రూపొందించాలని ప్రధానమంత్రి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. లేని పక్షంలో, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిలో కావలసిన మార్పు తీసుకురావడం చాలా కష్టం అని ఆయన స్పష్టం చేశారు.
*****
(Release ID: 1763439)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam