ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో డెన్ మార్క్ ప్రధాని పర్యటన (2021 అక్టోబరు 9) సందర్భం గా భారత్-డెన్ మార్క్ సంయుక్త ప్రకటన
Posted On:
09 OCT 2021 3:40PM by PIB Hyderabad
డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ గారు 2021 అక్టోబరు 9వ, 11వ తేదీల మధ్య కాలం లో భారతదేశం ఆధికారిక సందర్శన కు వచ్చిన సందర్భం లో భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య సూత్రాలు- విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కుల కు గౌరవం తదితరాల ప్రాతిపదిక గా భారతదేశం- డెన్ మార్క్ ల మధ్య సౌహార్దభరితమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు వర్ధిల్లుతున్నాయి అని ప్రధాను లు ఇద్దరూ పేర్కొన్నారు. భారతదేశం-డెన్ మార్క్ సహజ, సన్నిహిత భాగస్వాములు అని ప్రకటిస్తూ బహుళపక్షవాద బలోపేతం, సంస్కరణ ల దిశ గానే కాకుండా సముద్రయాన స్వేచ్ఛ సహా నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధానాల కోసం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేశారు.
భారతదేశం, డెన్ మార్క్ ల మధ్య 2020 సెప్టెంబరు 28 నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు సందర్భం లో రెండు దేశాల మధ్య ‘వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం’ మొదలయ్యాక ద్వైపాక్షిక సంబంధాల లో సానుకూల- ప్రోత్సాహకర పురోగతి పై ప్రధానులిద్దరూ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ మేరకు రాబోయే సంవత్సరాల్లో పరస్పర ప్రాధాన్యంగల అంశాల్లో... ముఖ్యం గా హరిత రంగం మాత్రమేగాక ఆరోగ్యం సహా సహకారానికి ప్రాముఖ్యం గల ఇతర రంగాలన్నిటా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కాగలవన్న ఆశాభావాన్ని వారిద్దరూ వెలిబుచ్చారు. అలాగే సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం, డెన్ మార్క్ ల మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదానాల ను మరింత పెంచడానికి ప్రధానమంత్రులు ఇరువురు అంగీకరించారు.
వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక
సత్ఫలితాలను ఇవ్వగలిగినటువంటి, ప్రగతిశీల వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం దిశ గా తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ మరోసారి ప్రస్ఫుటం చేశారు. తదనుగుణం గా సమగ్ర పంచవర్ష (2021-2026) కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన పై వారు హర్షం వ్యక్తం చేయడంతో పాటు దాని అమలు లో పురోగతి ని ప్రశంసించారు. హరిత వృద్ధి సాధన దిశ గా వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం బలోపేతానికి గల ప్రాధాన్యం పై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పరస్పరం ప్రయోజనకరమైన సహకారాని కి ఇది బాట ను పరుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తు లో తగిన తరుణం వచ్చినపుడు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం పురోగమనం పై సమీక్షించి మరింత పెంపు, బలోపేతం చేయగల మార్గాలను అన్వేషించాలని వారు నిర్ణయించారు.
సుస్థిర ప్రగతి – హరిత వృద్ధి
పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తున్న ప్రకారం హరిత, స్వల్ప కర్బన ఉద్గార సహిత వృద్ధి ని వేగిరపరచడం, సమీకృతం చేయడానికి అనుసరించవలసిన మార్గాల పై ఇద్దరు ప్రధానులూ దృష్టి సారించారు. ఈ కార్యాచరణ కు ఉద్దేశించిన రంగాల లో: “నీరు; పర్యావరణం; నవీకరణ యోగ్య శక్తి- గ్రిడ్ తో దాని అనుసంధానం; జలవాయు పరివర్తన సంబంధి కార్యాచరణ; వనరుల సామర్థ్యం- సర్క్యులర్ ఇకానమి; సుస్థిర- అత్యాధునిక నగరాలు; వర్తకం; మేధో సంపత్తి హక్కుల పై సహకారం తో పాటు వాణిజ్యం-పెట్టుబడులు; సముద్ర భద్రత-సహకారం; ఆహారం-వ్యవసాయం; శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు-ఆవిష్కరణ లు; ఆరోగ్యం-జీవశాస్త్రాలు; బహుపక్షీయ సంస్థల లో సహకారం; సాంస్కృతిక-పరస్పర ప్రజా సంబంధాలు” తదితరాలు ఉన్నాయి.
నవీకరణ యోగ్య శక్తి అభివృద్ధి కి భారతదేశం లో గల అపార అవకాశాల ను ప్రధాన మంత్రులిద్దరూ గుర్తుచేశారు. ఈ మేరకు సరికొత్త తయారీ, సాంకేతిక రంగాల కు సంబంధించి దేశంలోని గుజరాత్, తమిళ నాడు రాష్ట్రాల లో పెట్టుబడులు పెట్టవలసింది గా డెన్ మార్క్ కంపెనీల కు ఆహ్వానం పలికారు. నిరుడు సెప్టెంబరు నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు అనంతరం రెండు దేశాల మధ్య పవన విద్యుత్తు, విద్యుత్తు నమూనా ల ఆవిష్కరణ- గ్రిడ్ తో సంధానం సహా శక్తి రంగం లో విశాల పునాది గల సహకారం వేగం గా విస్తరిస్తున్న నేపథ్యం లో వారు ఈ విధం గా పిలుపునిచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు- ముఖ్యంగా హరిత ఉదజని, విద్యుత్తు-రవాణా, నిల్వ తదితరాల లో వాణిజ్యపరమైన సహకారం విస్తరణ కు ప్రధానమంత్రులు ఇద్దరూ అంగీకరించారు. ‘ఈయూ హరైజన్ ప్రోగ్రామ్స్, మిషన్ ఇనొవేశన్’ ల వంటి కార్యక్రమాల ద్వారానే కాకుండా సరికొత్త హరిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల పై చురుకైన అంతర్జాతీయ సహకారం అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ గుర్తు చేశారు. అలాగే ఉద్గారాల తగ్గింపు లో భారతదేశం- డెన్ మార్క్ సంయుక్త కృషి కి గల ప్రాధాన్యాన్ని వారు నొక్కిచెప్పారు. దీంతోపాటు హరిత ఉదజని సహా హరిత ఇంధనాల రంగం లో పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టు పైనా ప్రణాళికబద్ధ సంయుక్త కృషి అవసరం అని కూడా వారు పిలుపునిచ్చారు.
జల రంగం లో సహకారం ప్రాముఖ్యాన్ని ప్రధానులిద్దరూ నొక్కిచెప్పారు. ఈ దిశ గా పట్టణ-గ్రామీణ నీటి సరఫరా, వ్యర్థ జల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో రెండు ప్రభుత్వాల వినూత్న చర్యల పై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగం గా నీటి సరఫరా, వ్యర్థ జలాల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో నగరాల స్థాయి నుంచి రాష్ట్రాల/నదీ పరీవాహకాల స్థాయి దాకా కార్యకలాపాల ను ముమ్మరం చేయగల అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి మార్గాన్వేషణ కోసం సంబంధిత అధికార వర్గాల తో చర్చించవచ్చునని వారు గుర్తు చేశారు. భారతదేశం లో సుస్థిర నీటి సరఫరా తో పాటు నీటి నష్టాల తగ్గింపు, జల వనరుల నిర్వహణ, వ్యర్థ జలాల నిర్వహణ నుంచి వనరుల పునరుద్ధరణ దాకా సహకారాన్ని మరింత గా మెరుగు పరచేందుకు వీలు ఉందని వారు ఇరువురూ పేర్కొన్నారు.
అంతర్జాతీయ సౌర శక్తి కూటమి (ఐఎస్‌ఎ) ని తమ దేశం ఆమోదించడం గురించి డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ ప్రస్తావించారు. నవీకరణ యోగ్య శక్తి వనరులన్నిటికీ తగిన ప్రోత్సాహం దిశ గా కృషి ని ఏకీకృతం చేయడం సహా వాతావరణ మార్పు పై సమష్టి కార్యాచరణ కు తోడ్పడగల నిర్దిష్ట సామర్థ్యం ఈ వినూత్న కూటమికి ఉందని ఆమె నొక్కిచెప్పారు. భారతదేశం, డెన్ మార్క్ లకు ‘లీడ్‌ఐటీ’ లో సభ్యత్వం ఉన్న నేపథ్యం లో ‘పారిశ్రామిక పరివర్తన పై నాయకత్వ కూటమి’ కి సంబంధించి అనివార్య కీలక రంగాల లో సహకారాన్ని కొనసాగించడం పై వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
పారిస్ ఒప్పందం, ఐక్య రాజ్య సమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి స్) కు అనుగుణం గా అంతర్జాతీయ వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కార చర్యల పై సంయుక్త సహకారం కొనసాగుతుందని ఇద్దరు ప్రధానమంత్రులూ ధ్రువీకరించారు. జలవాయు పరివర్తన ప్రపంచ వ్యాప్త సంక్షోభం కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం అని వారు స్పష్టం చేశారు. సుస్థిర- హరిత భవిష్యత్ దిశ గా న్యాయమైన, పారదర్శక పరివర్తన ను అత్యవసరం గా సాధించడం లో అంతర్జాతీయ సంఘీభావాన్ని సాధించవలసి ఉంది అని పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ పరిస్థితులు, సమానత్వ సూత్రాలతో పాటు పారిస్ ఒప్పందం నాటి హామీల కు తగినట్లు సామూహిక చర్య లు అవసరం అనే అభిప్రాయాన్ని భారతదేశం, డెన్ మార్క్ అభిప్రాయపడ్డాయి. అదేవిధం గా వాతావరణ మార్పు అనుసరణ, ఉపశమనం ల కోసం ప్రపంచం ప్రధాన కార్యాచరణ ను చేపట్టవలసి ఉంది అని ప్రధానులు ఇద్దరూ అంగీకరించారు. అందుబాటు లో గల అత్యుత్తమ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పాటు, జలవాయు పరివర్తన పై అంతర ప్రభుత్వ సంఘం 6వ అంచనా నివేదిక సిఫారసుల కు అనుగుణం గా ఈ కార్యాచరణ ఉండాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే విశ్వమారి అనంతర సంఘటిత ఆర్థిక పునరుద్ధరణ లోనూ అంతర్జాతీయ సహకారం జరూరు అని ఇద్దరు ప్రధానమంత్రులూ స్పష్టం చేశారు. త్వరలో గ్లాస్‌గో లో నిర్వహించనున్న ‘సిఒపి 26’ సదస్సు ను గురించి చర్చించిన సందర్భం లో నిర్దిష్ట, కీలక తీర్మానాల అవసరాన్ని గుర్తిస్తూ, ఇందుకోసం సన్నిహితం గా కృషి చేయాలని వారు ఉభయులూ నిర్ణయించారు.
సుస్థిర ఆర్థిక సహాయ, పెట్టుబడుల దిశ గా సముచిత వనరుల ను గుర్తించవలసిన ఆవశ్యకత ను ఇద్దరు ప్రధానులూ నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రైవేటు ఆర్థిక సహాయ సంస్థ లు గణనీయ ఆసక్తి ని, నిబద్ధత ను ప్రదర్శించడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. సానుకూల చట్రం నిర్దేశిత షరతుల కు తగినట్లు గా చర్చలను, సహకారాన్ని విస్తరించడం ద్వారా పెట్టుబడుల ను ప్రోత్సహించడానికి, ప్రాజెక్టుల ను అభివృద్ధి పరచడానికి కట్టుబడి ఉన్నాం అని వారిద్దరూ నిర్ధారించారు. అంతేకాకుండా కర్బన ఉద్గారాలు స్వల్ప స్థాయి కి పరిమితం అయ్యేటటువంటి శక్తి, పారిశ్రామిక పరివర్తన కు ప్రోత్సాహం తో పాటు వినూత్నమైనటువంటి, ఖర్చు తక్కువగానే అయ్యేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ అత్యంత ప్రధానం అని ప్రధానులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హరిత ఉదజని, హరిత మిథెనాల్ తదితరాలు సహా విద్యుత్తు రవాణా, సముద్రతీర పవన విద్యుత్తు ఉత్పాదక ఇంధన సాంకేతికతల కు సంబంధించి వాణిజ్యపరమైన సహకార విస్తరణ అవసరమని వారు అంగీకరించారు.
వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణల కు వేదికగా నిలిచిన ‘అన్‌లీశ్’ తదుపరి దశ ను 2022 లో భారతదేశం లోని బెంగళూరు లో ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రులు ఇద్దరూ ప్రకటించారు. ఐరాస నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన కు అవసరమైన నవపారిశ్రామికత్వానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లో యువత పోషించే పాత్ర కు ఇది అవసరమైన మద్దతు ను ఇస్తుందని వారు పేర్కొన్నారు. నీతి ఆయోగ్, అటల్ ఇనొవేశన్ మిశన్, డెన్ మార్క్ లోని ఆవిష్కరణ ల కేంద్రం ‘వాటర్ చాలింజ్’ నేతృత్వం లో 2022, 2023 లలో సంఘటిత జల పారిశ్రామిక సమారంభం నిర్వహించనుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు.
వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం అమలు లో భాగం గా ఇప్పటికే చేపట్టిన చర్యల ను ఇద్దరు ప్రధానమంత్రులూ స్వాగతించారు. సంఘటిత నీటి సరఫరా పై జల్ జీవన్ మిశన్ కు మద్దతు గా మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక తో పాటు సంఘటిత పట్టణ- అత్యాధునిక నీటి సరఫరా కార్యక్రమంపై డెన్ మార్క్ ప్రభుత్వానికి, భారతదేశం గృహనిర్మాణ/పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ల మధ్య 2021 జూలై 5 నాటి ‘ఆసక్తి వ్యక్తీకరణ లేఖ’ తదితరాలు ఈ చర్యల లో భాగం గా ఉన్నాయి. అంతేకాకుండా ‘పరిశుద్ధ గంగానది’ సంబంధిత సాంకేతిక పరిష్కారాల రూపకల్పన కు మద్దతు దిశ గా భారతదేశం లోని ‘సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ ఎండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాన్ పుర్; డెన్ మార్క్ లో ప్రభుత్వ పరిధి లో గల ‘ఇనొవేశన్ సెంటర్ డెన్ మార్క్’ ల మధ్య అవగాహన ఒప్పందం పైనా వారు హర్షం వ్యక్తం చేశారు.
కోవిడ్-19.. ఆరోగ్యం-టీకా లపై భాగస్వామ్యం
కోవిడ్-19 మహమ్మారి పరిణామాల పై తమ అభిప్రాయాలను ప్రధాన మంత్రులు ఇద్దరు ఒకరికి మరొకరు తెలియజేసుకున్నారు. అంతర్జాతీయం గా ప్రయోజనకరం కాగల టీకా ల భాగస్వామ్యం ఏర్పాటు అవసరాన్ని వారిద్దరూ గుర్తించారు. ముఖ్యం గా టీకామందు ల ఉత్పత్తి సహా అవసరమైన దేశాలన్నిటికీ టీకాల సరఫరా పై భరోసా దిశ గా భారతదేశానికి గల శక్తి సామర్థ్యాలు ఇందుకు ఎంతగానో తోడ్పడతాయన్న నిర్ణయానికి వారు వచ్చారు. గుండె, జీవక్రియ సంబంధ వ్యాధుల విషయం లో పరిశోధన-అభివృద్ధి లక్ష్యం గా భారతదేశం తరఫు న శాస్త్రవిజ్ఞాన సంస్థలు, డెన్ మార్క్ తరఫున ‘నోవో నార్డిస్క్ ఫౌండేశన్’ ల మధ్య ఆదాన ప్రదానాల కు సంయుక్త సహకారం పై ఇద్దరు ప్రధానమంత్రులూ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం టీకా ధ్రువీకరణ పత్రాల పరస్పర ఆమోదానికి గల అవకాశాల ను పరిశీలించాలని వారిద్దరూ నిర్ణయించారు.
ఆరోగ్య రంగం లో కుదిరిన కొత్త అవగాహన ఒప్పందాని కి తమ మద్దతు ను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. దీనిపై తొలి సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే సమావేశం కావడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. కోవిడ్-19 నేపథ్యం లో ‘డిజిటల్ ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, టీకాలు- సూక్ష్మజీవ నిరోధకత పెరుగుదల’ సహా ఆరోగ్య రంగం లో సమగ్ర సంయుక్త సహకార విస్తరణ కు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో తోడ్పడగలదని వారు ప్రకటించారు.
కొత్త ఒప్పందాలు
ప్రధానమంత్రులు ఇద్దరి సమక్షం లో ఇచ్చి పుచ్చుకొన్న కొత్త ఒప్పందాలు ఈ కింది విధం గా ఉన్నాయి:
- భారతదేశం శాస్త్ర- పారిశ్రామిక పరిశోధన మండలి, డానిష్ పేటెంట్ ఎండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ ల మధ్య ‘సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయ లభ్యత’ ఒప్పందం.
- భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ, డెన్ మార్క్ ప్రభుత్వం ల మధ్య ‘సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ లేఖ.’
- భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ-హైదరాబాద్; డెన్ మార్క్ లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం, డెన్ మార్క్-గ్రీన్‌లాండ్ భౌగోళిక అధ్యయన సంస్థ ల మధ్య ‘భూగర్భజల వనరులు, జలాశయాల గుర్తింపు ఒప్పందం.’
- బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సైన్స్, డెన్ మార్క్ లోని ‘డాన్‌ఫోస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల మధ్య ‘ఉష్ణమండలాల కు తగిన అప్లికేశన్ లతో సహజ రిఫ్రిజిరెంట్ ల రూపకల్పన కోసం నైపుణ్య కేంద్రం ఏర్పాటు’ ఒప్పందం.
బహుపక్షీయ సహకారం
కోవిడ్-19 ని సమర్థం గా ఎదుర్కోవడం లో బహుపక్షీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఉంది అని ఇద్దరు ప్రధానులూ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం-సంస్కరణలు, అంతర్జాతీయం గా అత్యవసర సమయ సంసిద్ధత సహా పచ్చదనం మరింత పెంపు అనేవి ఇందులో భాగంగా ఉండాలంటూ వారు నొక్కిచెప్పారు. కాగా, ఆగస్టు లో ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం విజయవంతం గా నెరవేర్చడంపై డెన్ మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ అభినందన లు తెలిపారు. అలాగే మండలి విస్తరణ సహా అందులో భారతదేశాని కి శాశ్వత సభ్యత్వం డిమాండ్ పై డెన్ మార్క్ పూర్తి మద్దతును ఇస్తుందంటూ పునరుద్ఘాటించారు. మరో వైపు 2025-26 కాలానికి గాను భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వం కోసం డెన్ మార్క్ అభ్యర్థిత్వానికి భారతదేశం సమర్థన ను ఇస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.
ప్రాంతీయ – అంతర్జాతీయ అభివృద్ధి
అఫ్ గానిస్థాన్ లో ఆందోళనకర పరిస్థితులు సహా తమ తమ ప్రాంతదేశాల లోని పరిణామాల పై ప్రధానమంత్రులు ఇద్దరూ వారి అభిప్రాయాలను వెల్లడించుకొన్నారు. ఈ సందర్భం లో- 1) ప్రాంతీయ అస్థిరత మరింత ముదరకుండా చూడటం; 2) ప్రాంతీయ వాణిజ్యం-అనుసంధానం సహా ప్రాంతీయ సంబంధాల బలోపేతం, సమూల సంస్కరణ వాదాన్ని అడ్డగించడానికి తీసుకోవలసిన చర్య లు; 3) మౌలిక హక్కుల విషయం లో ముందుకు సాగడాన్ని కొనసాగించడం తదితరాల కు గల ప్రాధాన్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. అఫ్ గాన్ ప్రజల కు నిరంతర మద్దతు పై తమ నిబద్ధత ను ప్రకటించారు. అయితే, అఫ్ గానిస్థాన్ సార్వజనీనత, ఉగ్రవాద నిరోధం పై హామీ లు, ఐక్య రాజ్య సమితి తీర్మానం 2593 (2021) కి అనుగుణం గా మానవ హక్కుల కు... ముఖ్యంగా మహిళల హక్కుల కు గౌరవం అవశ్యం అని వారు స్పష్టం చేశారు. కాగా, ఇండో-పసిఫిక్ ప్రాంతం విషయం లో యూరోపియన్ యూనియన్ (ఇయు) తన వ్యూహాన్ని వెల్లడి చేయడం పట్ల ఇద్దరు ప్రధానులూ హర్షం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతాని కి సంబంధించి ఐరోపా దేశాల కార్యాచరణ మెరుగుదల ప్రణాళికల అవసరాన్ని గుర్తు చేశారు.
భారతదేశం-ఇయు నేత ల సమావేశాని కి 2021 మే నెల లో పోర్చుగల్ ఆతిథ్యాన్ని ఇచ్చిన నేపథ్యం లో భారతదేశం-‘ఇయు’ వ్యూహాత్మక భాగస్వామ్యం లో ఇది ఒక మైలురాయి అని ఇద్దరు ప్రధానులూ పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భం గా- ప్రగతికాముక, సమతూక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర భారత-‘ఇయు’ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చ ల పునరుద్ధరణ, పెట్టుబడుల పై ప్రత్యేక ఒప్పందం కోసం చర్చల కు శ్రీకారం పై నిర్ణయం తీసుకోవడాన్ని వారిద్దరూ స్వాగతించారు. కాగా, ఈ చర్చలు వీలైనంత త్వరగా మొదలవ్వాలని ఇద్దరు ప్రధానులూ ఆకాంక్షించారు. అలాగే భారతదేశం-‘ఇయు’ అనుసంధాన భాగస్వామ్యం పైనా వారిద్దరూ హర్షం వెలిబుచ్చుతూ దీనికి ద్వైపాక్షిక సహకారం సహా సదరు అనుసంధాన ప్రాజెక్టుల ను ‘ఇయు’ స్థాయి లో ప్రోత్సహించేందుకు నిర్ణయించారు.
కోపెన్‌హాగెన్ వేదిక గా 2022 లో నిర్వహించే భారతదేశం-నార్డిక్ రెండో శిఖర సమ్మేళనానికి హాజరు కావలసిందంటూ ప్రధాని ఫ్రెడరిక్సన్ అందించిన ఆహ్వానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
***
(Release ID: 1762852)
Visitor Counter : 207