రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన శ్రీ మన్సుఖ్ మాండవీయ
' ప్రపంచంలో జనరిక్ ఔషధ ఉత్పత్తి రంగంలో దేశం అగ్రగామి.. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ కు గుర్తింపు'.. శ్రీ మాండవీయ
పరిశ్రమలతో నైపర్ సమన్వయంతో పనిచేసి ఎంఎస్ఎంఈ ల సమస్యలను పరిష్కరించాలి
ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి రానున్న 25 సంవత్సరాలకు ప్రణాళిక రూపొందాలి... కేంద్ర మంత్రి
Posted On:
04 OCT 2021 3:24PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. పంజాబ్ ఎస్ఎఎస్ నగర్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు సెమినార్లు, ప్రదర్శనలు, ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన శ్రీ మాండవీయ ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువగా జనరిక్ మందులు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ప్రపంచ ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని అన్నారు. ఫార్మా పరిశ్రమల అభివృద్ధిలో నైపర్ కీలక పాత్ర పోషించిందని మంత్రి అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపర్ బోధనా అంశాలను, పరిశోధనలను రూపొందించాలని ఆయన సూచించారు. ఎంఎస్ఎంఈ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అన్నారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి కోసం ఏర్పాటైన పార్కులతో నైపర్ కలసి పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.
75 వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో రానున్న 25 ఔషధ రంగంలో అమలు చేయాల్సి ఉన్న కార్యాచరణ కార్యక్రమంపై ఫార్మాస్యూటికల్స్ శాఖ, నైపర్ దృష్టి సారించాలని ఆయన సలహా ఇచ్చారు. ఔషధ తయారీలో వినియోగించే ముఖ్య పదార్దాలను ఇప్పటికీ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేటెంట్ హక్కు కలిగిన ఔషధాల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. ఔషధ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి చేయడానికి చర్యలు అమలు జరగాలని శ్రీ మాండవీయ స్పష్టం చేశారు. దీనికోసం 25 సంవత్సరాల ప్రణాళిక రూపొందాలని మంత్రి అన్నారు.
కోవిడ్-19 చికిత్స కు అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసి భారతదేశం తన ప్రతిభను చాటి దేశంలో మానవ వనరులకు కొరత లేదని ప్రపంచానికి తెలిపిందని శ్రీ మాండవీయ న్నారు. దేశ శాస్త్రవేత్తలు, పరిశోధకుల ప్రతిభపై నమ్మకం ఉంచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద 9000 కోట్ల రూపాయలను కేటాయించారని మంత్రి తెలిపారు. కోవాక్సిన్ అభివృద్ధిలో దేశానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇదే తరహాలో, ఇతర పరిశోధన, విద్యా సంస్థలు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు.
ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎస్. అపర్ణ, నైపర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దూలాల్ పాండా, రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=OKzn4daXoXM ద్వారా వెబ్‌కాస్ట్ చేశారు.
***
(Release ID: 1760848)
Visitor Counter : 226