వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో


‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’!
సెప్టెంబరు 20నుంచి 26 వరకూ నిర్వహణ
ఆత్మనిర్భర భారత్.కు ప్రాధాన్యంతో ‘వాణిజ్య సప్తాహ్’

ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్.ను పేర్కొంటూ
కేంద్ర వాణిజ్య శాఖ తరఫున అనేక కార్యక్రమాలు..

ప్రత్యేక ఆర్థిక మండలుల ప్రమేయంతో
దేశంలో హరిత, స్వచ్ఛతా కార్యకలాపాలు..

దేశవ్యాప్తంగా ఎగుమతిదార్ల సదస్సులు,
739 జిల్లాల్లో ‘వాణిజ్య ఉత్సవ్’ కార్యక్రమాలు..

“ఎగుమతికి ప్రోత్సాహం, దిగుమతికి ప్రత్యామ్నాయం” పేరిట
దేశంలోని 5 ప్రాంతాల్లో ఐదు జాతీయ చర్చాగోష్టులు..

ఎగుమతుల ప్రోత్సాహం లక్ష్యంగా
సెప్టెంబరు 21-22 తేదీల్లో 35 కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు...


పారిశ్రామిక పార్క్ రేటింగ్ వ్యవస్థపై డి.పి.ఐ.ఐ.టి.
ఆధ్వర్యంలో ఇక సింగిల్ విండో విధానం..

ఈశాన్య ప్రాంతంకోసం -ఇన్వెస్ట్ ఇండియా- పేరిట
పెట్టుబడిదార్ల వర్చువల్ సదస్సు


“స్వాతంత్ర్యం,... ఎగుమతికి ప్రోత్సాహం, దిగుమతికి
ప్రత్యామ్నాయం” అన్న అంశంపై జాతీయ వ్యాసరచన పోటీ

Posted On: 19 SEP 2021 2:27PM by PIB Hyderabad

   ప్రగతి కాముక స్వతంత్ర భారతదేశం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ వైభవోపేత చరిత్రను స్మరించుకుంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వచ్చే వారమంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  ‘వాణిజ్య సప్తాహ్’ పేరిట వాణిజ్య వారోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. 2021 సెప్టెంబరు 20నుంచి 26వ తేదీవరకూ వాణిజ్య వారోత్సవం చేపడతారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర భారత్ పథకంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా, హరిత, స్వచ్ఛ దేశంగా భారత్ సాధించిన ప్రగతిని, ప్రత్యేక ఆర్థిక మండలుల అభివృద్ధిని వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా, ‘వ్యవసాయ క్షేత్రాలనుంచి విదేశీ భూములకు’ అన్న కార్యక్రమం పేరిట, సదస్సులను, ఎగుమతులను ప్రోత్సహించే సమ్మేళనాలను నిర్వహిస్తారు. దేశంలోని 739 జిల్లాలకు వర్తింపజేస్తూ, ‘వాణిజ్య ఉత్సవ్’ పేరిట మరో కార్యక్రమాన్ని కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.

  దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతికి కేంద్రంగా తీర్చిదిద్దాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురునుంచి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ‘ఒక జిల్లా ఒక ఉత్పాదన(ఒ.డి.ఒ.పి.)’ పథకాన్ని 2020 సెప్టెంబరులో ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆదేశాలకు అనుగుణంగా ఒ.డి.ఒ.పి. పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక జిల్లా సిసలైన సామర్థ్యాన్ని వెలికి తీసే ఉద్దేశంతో చేపట్టిన పరివర్తనా చర్యగా ఒ.డి.ఒ.పి. పథకాన్ని పరిగణిస్తున్నారు. సంబంధిత జిల్లా ఆర్థిక ప్రగతిని మరింత క్రియాశీలం చేయడం, ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం, గ్రామీణ ప్రజల్లో ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య తత్వాన్ని అలవర్చడం, చివరకు ఆత్మనిర్భర భారత్ పథకం లక్ష్యాలను సాధించడం వంటి లక్ష్యాలతో ఒ.డి.ఒ.పి. పథకాన్ని రూపొందించారు.

  2021 సెప్టెంబరు 24నుంచి 26వరకూ జరగనున్న వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా, దేశవ్యాప్తంగా 700కు పైగా జిల్లాల్లో ఎగుమతి ప్రాధాన్యంతో సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వంద జిల్లాల్లో విదేశ వాణిజ్య వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో  మరింతగా భారీ స్థాయిలో కార్యక్రమాలు కూడా చేపడతారు. ఎగుమతి, మార్కెట్ అభివృద్ధి వ్యవహారాల మద్దతు సంస్థ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తాయి. ఈ సదస్సుల నిర్వహణలో  సంబంధిత జిల్లాల కమిషనర్లు, కలెక్టర్ల సారథ్యంలోని జిల్లా స్థాయి ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు (డి.ఇ.పి.సి.లు) కూడా కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. వాణిజ్య ఉత్సవాల్లో భాగంగా, ఆయా జిల్లాల్లోని స్థానిక ఎగుమతిదార్లు, ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకోసం రెండు-మూడు గంటల వ్యవధితో సదస్సులను  కూడా నిర్వహిస్తారు. లీడ్ బ్యాంకు, స్థానిక ఎగుమతి మండలులు, సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహ మండలులు (ఇ.పి.సి.లు) తదితర భాగస్వామ్య సంస్థల ప్రమేయంతో విదేశీ వాణిజ్య అంశాలపై ఈ సదస్సులను నిర్వహిస్తారు.

   వీటికి తోడుగా, దేశంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు జాతీయ స్థాయి సదస్సులను, ప్రదర్శనలను, ఎగ్జిబిషన్లను భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ (ఐ.ఐ.ఎఫ్.టి.) నిర్వహిస్తుంది. –ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో  ఈ ఐదు సదస్సులను, ప్రదర్శనలను నిర్వహిస్తారు.

 “స్వాతంత్ర్య, ఎగుమతికి ప్రోత్సాహం/దిగమతికి ప్రత్యామ్నాయం – ఆత్మనిర్భర భారత్” అన్న ఇతివృత్తంతో ఈ సదస్సులను చేపడతారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు), ప్రభుత్వ ఇ-మార్కెట్ వేదికలు, ఇ.పి.సి.లను కార్యోన్ముఖం చేసే ప్రక్రియను కూడా ఈ సదస్సుల సందర్భంగా పూర్తి చేస్తారు.

   ఇక ‘వాణిజ్య సప్తాహ్’ పేరిట నిర్వహించే వాణిజ్య వారోత్సవంలో భాగంగా, 35 ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలను, ఎగ్జిబిషన్లను సెప్టెంబరు 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. 14 ఎగుమతి ప్రోత్సాహ కమిటీల (ఇ.పి.సి.ల) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఒక కార్యక్రమం, ప్రదర్శన నిర్వహించి తీరేలా చర్యలు తీసుకుంటారు. భారతదేశాన్ని ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ఈ కార్యక్రమాల్లో ప్రతిఫలింపజేస్తారు. ఎగుమతి ప్రోత్సాహక చర్యలను ప్రజోద్యమం మార్చేందుకు వీలుగా, ఈ కార్యక్రమాలకోసం స్థానిక ఎగుమతిదార్లను, తయారీ దార్లను, పారిశ్రామిక యూనిట్లను ఇ.పి.సి.లు సమీకరస్తాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారిని ఉద్దేశించి పలువురు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రసంగిస్తారు. కార్యక్రమాల్లో పాల్గొనే వారితో, భాగస్వామ్య వర్గాల ప్రతినిధులతో వివిధ అంశాలపై వారు అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుంటారు.

  ఇదిలా ఉండగా,..పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) కూడా రెండు పెద్ద కార్యక్రమాలను చేపట్టబోతోంది. జాతీయ సింగిల్ విండోవ్యవస్థ, పారిశ్రామిక పార్క్ రేటింగ్ వ్యవస్థ అనే రెండు కార్యక్రమాలను డి.పి.ఐ.ఐ.టి. చేపట్టబోతోంది. అలాగే, భారతదేశంలో తమ వాణిజ్యం ప్రారంభించేందుకు వీలుగా, పెట్టుబడి దారులు తాము ప్రారంబించబోయే సంస్థను గుర్తించేందుకు, అందుకు ఆమోదం మంజూరు చేసేందుకు వీలుగా ఒక డిజిటల్ వేదికను కూడా ఏర్పాటు చేస్తారు. వాణిజ్యం ప్రారంభానికి తగిన సదుపాయాలు కల్పించడం, మద్దతు ఇవ్వడం, పెట్టుబడులకు ముందు సలహా సంప్రదింపులు అందించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అనుమతులు, ల్యాండ్ బ్యాంకుల సమాచారం వంటివి కూడా ఈ వేదిక ద్వారా కల్పిస్తారు. పెట్టుబడి దార్లు, విధాన నిర్ణయ కర్తలకోసం బాగా పనిచేసే పారిశ్రామిక పార్కులను గుర్తించడం తదితర వ్యవహారాల విషయంలో పారిశ్రామిక పార్క్ రేటింగ్ వ్యవస్థ (ఐ.పి.ఆర్.ఎస్.) తగిన సేవలందిస్తుంది. ఇక పారిశ్రామిక పార్క్ రేటింగ్ వ్యవస్థ రెండవ దశ (2.0)లో మరిన్ని ఎక్కువ అంశాలకు సేవలను విస్తరింజేస్తారు. ఈ దశలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక వాణిజ్య మండలులతో సహా, మొత్తం పారిశ్రామిక పార్కుల విలువలను మధింపు చేస్తారు. ఇందుకోసం గుణాత్మక సూచికలను వినియోగిస్తారు. అంతర్గత మౌలిక సదుపాయాలు, వినియోగ అంశాలు, బాహ్య మౌలిక సదుపాయాలు, అనుసంధానం, వాణిజ్య మద్దతు వ్యవస్థలు, పర్యావరణ, నిర్వహణా వ్యవస్థ తదితర అంశాల పరిధిలో ఈ అంచనాను చేపడతారు.

  దేశపు ఉత్పాదనా సామర్థ్యాన్నిగరిష్ట స్థాయిలో వినియోగించుకుని, స్థూల స్వదేశీ ఉత్పాదనను (జి.డి.పి.ని) పెంచుకునేందుకు జరిపే ప్రయత్నాలకు అనుబంధంగా పలు కార్యక్రమాలను చేపట్టేందుకు పారిశ్రామిక కారిడార్ల పథకాన్ని రూపొందించారు. తమతమ ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ల పథకం సాధించిన ప్రగతిపై మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ధొలేరా ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (డి.ఐ.సి.డి.ఎల్.), మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లిమిటెడ్ (ఎ.ఐ.టి.ఎల్.), ఉత్తప్రదేశ్ కు చెందిన డి.ఎం.ఐ.సి. ఇండిగ్రేటెడ్ టౌన్.షిప్ గ్రేటర్ నోయిడా లిమిటెడ్ (ఐ.ఐ.టి.జి.ఎన్.ఎల్.), కర్ణాటక రాష్ట్రానికి చెందిన సి.బి.ఐ.సి. తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్, మధ్యప్రదేశ్ కు చెందిన డి.ఎం.ఐ.సి. విక్రమ్ ఉద్యోగ్ పురి లిమిటెడ్ (వి.యు.ఎల్.) ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

  వీటికి తోడుగా, డి.పి.ఐ.ఐ.టి. కూడా జాతీయ స్థాయి చర్చాగోష్టులు నిర్వహిస్తుంది.  వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ చర్చాగోష్టుల్లో పాలుపంచుకుంటాయి. అన్ని విధాన, నిబంధనలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, ఎ.ఎం.లు తదితర ప్రక్రియల్లో నియంత్రణలతో కూడిన భారాన్ని తొలగించడం, ఎలాంటి మెరుగుదల సాధించకుండానే జరిగే కాలహరణాన్ని, వ్యయాన్ని తగ్గించడం, కొన్ని సాంకేతికేతర అంశాలకు సంబంధించి పదేపదే తారసపడే ఒకే తరహా నిబంధనలను రద్దు చేయడం, సవరించడం, ఇతర నిబంధనల్లో కలిపేయడం, సంబంధిత నిబంధనలను అవసరమైన చోట్ల సడలించడం, ప్రజా ప్రయోజనాలకు హానికరంగా పరిణమించే తీవ్రమైన అక్రమాలు, నేరాలకు సంబంధించి కఠిన నిబంధనలను ఎప్పటిలా పునరుద్ధరించడం వంటి చర్యలను డి.పి.ఐ.ఐ.టి. తీసుకుంటుంది.

   ఇందుకు సంబంధించి,.. జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి సంస్థ (ఎన్.ఐ.సి.డి.సి.) కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కోల్కతా, చెన్నై, ముంబై ఓడరేవుల్లో ఈ కార్యక్రమాలు చేపడతారు. దేశ వ్యాప్తంగా ఎగుమతి, దిగుమతి కంటెయినర్ విజిబిలిటీ సేవల ద్వారా, లాజిస్టిక్ డాటా బ్యాంక్ ద్వారా జరిగే ప్రగతిని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ప్రధానంగా వివరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకున్న చర్యలను, రాజస్థాన్ రాష్ట్రంలోని నీమ్రానాలో 6 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్ ప్రాజెక్టు సాధించిన ప్రగతిని ప్రధానంగా పేర్కొంటూ మరో కార్యక్రమాన్ని కూడా ఎన్.ఐ.సి.డి.సి. నిర్వహిస్తుంది.

ఇక, ఇన్వెస్ట్ ఇండియా పేరిట ఈ శాన్య ప్రాంతంలో పెట్టుబడిదార్లతో ఒక శిఖరాగ్ర సదస్సును, లేదా చర్చా వేదికను వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రైవేటు పారిశ్రామిక పార్కులను నిర్వహించే సంస్థలతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు.

  దేశంలోని తేయాకు, కాపీ తోటలు, వివిధ తోటపనుల్లో పనిచేసే దాదాపు పది లక్షలమంది కార్మికులు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు ప్లాంటేషన్ ప్రాంతాల్లో ఈ నెల 26న ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ‘వ్యవసాయ క్షేత్రాలనుంచి విదేశీ భూములకు’ అన్న ఇతివృత్తంతో వాణిజ్య శాఖలోని ప్లాంటేషన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించిన అభివృద్ధి మంత్రానికి అనుగుణంగా, దేశంలోని 250కిపైగా ప్రత్యేక ఆర్థిక మండలులు (ఎస్.ఇ.జెడ్.లు) స్వచ్ఛతా ఉద్యమాన్ని, మెక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాయి. ‘హరిత, స్వచ్ఛ ఆర్థిక మండలుల’పై దృష్టిని కేంద్రీకరిస్తూ, తమతమ పరిధిలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఎస్.ఇ.జెడ్.లు ఈ నెల 23న చేపడతాయి.

   వాణిజ్య  సప్తాహ్ పేరిట నిర్వహించే వాణిజ్య వారోత్సవంలో భాగంగా “స్వాతంత్ర్యం, ఎగుమతికి ప్రోత్సాహం/దిగుమతికి ప్రత్యామ్నాయం- ఆత్మ నిర్భర భారత్..” అనే అంశంపై జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీని 2021, సెప్టెంబరు 20న నిర్వహించనున్నారు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐ.బి.ఇ.ఎఫ్.) ఆధ్వర్యంలో పోటీ జరుగుతుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్యం వంటి ఐదు ప్రాంతాలకోసం ప్రత్యేకంగా, విడివిడిగా ఈ పోటీలు నిర్వహిస్తారు. ప్రతి ప్రాంతానికీ సంబంధించి అగ్రశ్రేణి సాధించిన ఐదు ఎంట్రీలకు బహుమతులను ప్రదానం చేస్తారు.

  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు ఈ మంత్రిత్వ శాఖ, విభాగం ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలోనూ పలు రకాలుగా జరుగుతున్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన గుర్తింపు, విభిన్నత్వం గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 మార్చి నెల 12న అహ్మదాబాద్.లో ప్రారంభించారు. 2022 ఆగస్టు 15వ తేదీలోగా 75 వారాలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు 2023 ఆగస్టు 15వరకూ జరుగుతాయి. అభివృద్ధి పథంలో, దేశ ప్రజలకు ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఉత్సవాలను 75 వారాలపాటు జరుపుకోవాలంటూ ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

***



(Release ID: 1756299) Visitor Counter : 543