ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా పరిస్థితి, టీకాల కార్యక్రమంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
అలసత్వం ప్రదర్శించకుండా సూక్ష్మ స్థాయి విశ్లేషణ నిర్వహించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుని అవసరమైన ఔషధాలు, మానవ వనరులను సిద్ధం చేయాలని సూచించిన కార్యదర్శి
రానున్న పండుగల కాలంలో కేసుల సంఖ్య పెరగకుండా చూడడానికి అమలు చేయాల్సిన ముందస్తు చర్యలను వివరించిన కార్యదర్శి
సెరోటైప్ -2 డెంగ్యూ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాలకు సూచన
Posted On:
18 SEP 2021 3:24PM by PIB Hyderabad
కోవిడ్-19 తాజా పరిస్థితి, టీకాల కార్యక్రమంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ తాజా పరిస్థితి, పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సమగ్రంగా చర్చించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్,నీతీ ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్రాం) డాక్టర్ వి.కే.పాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ముఖ్య కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు (ఆరోగ్యం), ప్రధాన కార్యదర్శులు (ఆరోగ్యం), మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
నిన్న ఒక్కరోజున 2.5 కోట్ల డోసుల టీకాలను వేసి రికార్డు సృష్టించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కేబినెట్ కార్యదర్శి అభినందించారు. దీనికి సహకరించిన ఆరోగ్య కార్యకర్తలు, ప్రధాన వైద్య అధికారులు, జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు ఆయన అభినందనలు తెలిపారు. వాక్సిన్ లభ్యత పెరగడంతో టీకాలు వేసే కార్యక్రమం మరింత వేగంగా సాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అయితే, కోవిడ్ పట్ల ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేబినెట్ కార్యదర్శి సూచించారు. కోవిడ్ అనుగుణ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆయన అన్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించడం పట్ల కేబినెట్ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉందన్న అంశాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితిపై సూక్ష్మ స్థాయి విశ్లేషణ జరిపి, పరిస్థితిని ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, అవసరమైన ఔషధాలను సమకూర్చుకోవడానికి, మానవ వనరులను సమీకరించడానికి కార్యచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన సూచించారు.
సెరో టైప్-II డెంగ్యూ కేసుల పట్ల 11 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్నారు. ఇతర వ్యాధులతో పోల్చి చూస్తే ఈ రాష్ట్రాల్లో సెరో టైప్-II డెంగ్యూ కేసుల సమస్య జటిలంగా మారిందని అన్నారు. సెరో టైప్-II డెంగ్యూ కేసులను ముందుగానే గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని సూచించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష సదుపాయాలను మెరుగు పరచడానికి, అవసరమైన ఔషధాలను సమీకరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాధిని గుర్తించడానికి సర్వే నిర్వహించి, వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాలని సూచించారు. రక్తం ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ తగినంత నిల్వలను నిల్వ చేయాలని బ్లడ్ బ్యాంక్‌లకు సూచనలు జారీ చేయాలని ఆయన అన్నారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అమలు చేస్తున్న నివారణా చర్యలను ప్రజలకు వివరించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ వ్యాపించ కుండా ఇళ్లలో తీసుకోవలసి జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
15 రాష్ట్రాలలోని 70 జిల్లాలో పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉందని ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ఈ 70 జిల్లాల్లో 34 జిల్లాల్లో పోజిటివిటీ శాతం 10కి మించి ఉందని, మిగిలిన జిల్లాల్లో ఇది 5 నుంచి 10 శాతం వరకు ఉందని అన్నారు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉందని ఆయన ఆదేశించారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. మాల్‌లు, స్థానిక మార్కెట్లు, ప్రార్థనా స్థలాలలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. కోవిడ్ అనుగుణం ప్రవర్తన నియమావళిని అమలు చేస్తూ ఉత్సవాలను నిర్వహించాలని ప్రజలను కోరుతూ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్రాలను కోరారు. అన్ని జిల్లాల్లో పరిస్థితిని గమనిస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడానికి అవసరమైన ఆంక్షలను నిబంధనలకు అనుగుణంగా విధించాలని అన్నారు.
కోవిడ్ నివారణకు అనుసరిస్తున్న అయిదు అంచెల విధానాన్ని (టెస్ట్, ట్రీట్, ట్రాక్, టీకా, నిబంధనలు పాటించడం) అమలు చేయడానికి, వ్యాధిని ముందుగా గుర్తించడానికి పరీక్షలను నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు (గ్రామీణ ప్రాంతాలు, చిన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం), కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘా మరియు అధిక కేసులు ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు, ఆంక్షలు అమలు చేయడం,అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి టీకా వేయడం, 2 వ మోతాదు టీకాపై దృష్టి సారించి కోవిడ్ నివారణలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం మరోసారి కోరింది.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు , ఆక్సిజన్ లభ్యత, ముఖ్యమైన ఔషధ నిల్వలు , అంబులెన్స్ సేవలు, ఐటి వ్యవస్థలు/ హెల్ప్‌లైన్‌లు/ టెలిమెడిసిన్ సేవలను మెరుగు పరచడానికి తక్షణ చర్యలను అమలు చేయవలసి అవసరం ఉందని సమావేశంలో గుర్తించారు. అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ కింద అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల అయ్యాయని వాటిని సత్వరమే వినియోగించాలని ఆరోగ్య కార్యదర్శి పేర్కొన్నారు.
జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించి అవసరమైన సౌకర్యాలను కల్పించి, ఔషధాలను సమీకరించడానికి చర్యలను తీసుకోవాలని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే వినియోగించుకోవడానికి ప్రైవేట్ రంగ సేవలను గుర్తించాలని కోరారు.
కేసుల సంఖ్య పెరగకుండా చూడడానికి రాష్ట్ర అధికారులు కింది చర్యలను అమలు చేయాలని కేంద్రం సూచించింది.
* కోవిడ్ అనుగుణ ప్రవర్తనతో సురక్షిత ఉత్సవాలను పాటించేలా చూడాలి
*కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ చర్యలు అమలు చేసి ఆంక్షలు విధించడంలో ఆలస్యం చేయకూడదు.
* ఆర్టీ -పీసీఆర్ నిష్పత్తిని కొనసాగిస్తూ పరీక్షలను ఎక్కువ చేయాలి
*పి ఎస్ ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లను వెంటనే అందుబాటులోకి తేవాలి.
* కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు తెరిచినందున పిల్లలలో వ్యాధి వ్యాప్తిపై నిఘా
* టీకా తర్వాత సోకుతున్న ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించి అవసరమైన సాక్ష్యాల విశ్లేషణ
* జన్యు శ్రేణి కోసం తగినంత నమూనాలను పంపడంతో సహా ఇన్ఫెక్షన్లను గుర్తించడం
* టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం
* డెంగ్యూ మరియు ఇతర వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కోసం అవసరమైన చర్యలు చేయడం.
(Release ID: 1756104)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam