ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఆరోగ్య‌ రంగ కార్య‌క‌ర్త‌ల‌ ను, కోవిడ్ టీకా ల‌బ్ధిదారుల‌ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్ర‌సంగం

Posted On: 06 SEP 2021 1:20PM by PIB Hyderabad

దేశ ప్రధాన మంత్రి గానే కాకుండా ఒక కుటుంబ స‌భ్యుని గా చెబుతున్నాను.  నేను గ‌ర్వించ‌ద‌గ్గ అవ‌కాశాన్ని హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది.  ఒక‌ప్పుడు చిన్న చిన్న ప్ర‌యోజ‌నాల‌ కోసం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోరాటం చేసేది.  ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి క‌థ‌ ను ర‌చించడాన్ని నా క‌ళ్లారా చూస్తున్నాను.   దైవ కృప కార‌ణంగాను, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న స‌మ‌యోచిత విధానాల కార‌ణం గాను, రాష్ట్ర ప్ర‌జ‌ల చైత‌న్యం కార‌ణంగాను ఇదంతా సాధ్య‌మ‌వుతోంది.  మీ అంద‌రి తో సంభాషించే అవ‌కాశం ల‌భించినందుకు మ‌రొక్క‌ సారి మీకు నా కృత‌జ్ఞ‌త‌ ను తెలియ‌జేసుకుంటున్నాను.  యావత్తు జట్టు స‌భ్యుల‌ కు అభినంద‌న లు.  ఒక జట్టు లాగా ఏర్ప‌డి అద్భుత‌మైన విజ‌యాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం కైవ‌సం చేసుకుంది.  మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌ల ను తెలియ‌జేస్తున్నాను.
 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాజేంద్ర ఆర్లేక‌ర్ గారు, ఉత్సాహ‌వంతుడు, ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రి శ్రీ జయరామ్  ఠాకుర్ గారు, పార్ల‌మెంట్ లో నా స‌హ‌చ‌రుడు, భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముద్దు బిడ్డ శ్రీ జ‌గ‌త్ ప్ర‌కాశ్  న‌డ్డా గారు, కేంద్ర మంత్రిమండ‌లి లో నా స‌హ‌చర మంత్రి  శ్రీ అనురాగ్ ఠాకుర్ గారు, పార్ల‌మెంట్ లో నా స‌హ‌చ‌రుడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ బిజెపి అధ్య‌క్షుడు శ్రీ సురేశ్ కశ్య‌ప్ గారు, ఇత‌ర మంత్రులు, ఎమ్ పి లు, ఎమ్మెల్యేలు, పంచాయ‌తీ ల ప్ర‌జాప్ర‌తినిధులు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన నా సోదరులు  మరియు సోద‌రీమణులారా..

గ‌త 100 సంవత్సరాల లో అన్నింటి కంటే పెద్దదైన మహమ్మారి కి, 100 సంవత్సరాల లో ఎన్న‌డూ క‌ని విని ఎరుగనటువంటి మ‌హ‌మ్మారి కి వ్యతిరేకం గా పోరాటం చేయడం లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ విజేత‌ గా నిలచింది.  రాష్ట్రం లోని అర్హ‌త‌ గ‌ల ప్ర‌జ‌లంద‌రికీ ఒక డోసు టీకా ను వేసిన మొట్ట‌మొద‌టి రాష్ట్రం అనే ఖ్యాతి ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సంపాదించింది.  ఇదే కాదు, తన జ‌నాభా లో మూడో వంతు ప్ర‌జ‌ల‌ కు రెండో డోసు టీకా ను వేయించిన రాష్ట్రం గా కూడా హిమాచల్ ప్రదేశ్ నిలచింది.

సహచరులారా,

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు సాధించిన ఈ విజ‌యం దేశం ఆత్మ‌విశ్వాసాన్ని సైతం పెంచింది.  స్వ‌యం స‌మృద్ధి ని సాధించ‌డం ఎంత ముఖ్య‌మో చాటింది.  టీకామందు విష‌యం లో దేశం సాధించిన స్వ‌యం స‌మృద్ధి కార‌ణం గా టీకామందు ను అంద‌రి కి ఉచితం గా ఇప్పించడం, 130 కోట్ల మంది ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందడం సాధ్య‌మైంది.  ఒకే రోజు లో 1.25 కోట్ల టీకాల‌ను వేయ‌డం ద్వారా భార‌త‌దేశం రికార్డు ను సృష్టిస్తోంది.  ఒక రోజు లో భారతదేశం వేసే వ్యాక్సీ న్ ల సంఖ్య ప్ర‌పంచం లో చాలా దేశాల జ‌నాభా కంటే ఎక్కువ‌.  దేశం లోని ప్ర‌తి ఒక్కరు ప‌డుతున్న క‌ష్టం, ప్ర‌తి ఒక్కరి సాహ‌సం ల కార‌ణంగా భార‌త‌దేశం లో టీకాలను ఇప్పించే కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌ం అవుతోంది.  ఈ కార్య‌క్ర‌మ‌మ‌నేది.. భార‌త‌దేశం 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భం లో ఎర్ర‌ కోట‌  మీది నుంచి నేను ప్ర‌స్తావించిన ‘స‌బ్ కా ప్ర‌యాస్’ అంశాన్ని ప్ర‌తిఫ‌లిస్తోంది.  హిమాచల్ ప్ర‌దేశ్ త‌రువాత మొద‌టి డోసు ను నూటికి నూరు శాతం వేయించినవి గా సిక్కిమ్, దాద్ రా న‌గ‌ర్ హ‌వేలీ లు పేరు సంపాదించుకొన్నాయి. ప‌లు రాష్ట్రాలు ఈ మైలురాయి ని అందుకోవ‌డానికి దాదాపు సిద్ధం గా ఉన్నాయి. ఒకటో డోసు ను తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రు రెండో డోసు ను కూడా తీసుకొనేలా మ‌నం కృషి చేయలసిన స‌మ‌య‌ం ఇది.

సోదరులు  మరియు సోద‌రీమణులారా,

ఆత్మ‌విశ్వాసం మెండు గా ఉండ‌డం వ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ టీకాకరణ ను అత్యంత వేగం గా నిర్వ‌హిస్తోంది.  ఈ రాష్ట్రం త‌న స‌మ‌ర్థ‌త మీద న‌మ్మ‌కం తో, త‌న ఆరోగ్య‌ రంగ కార్య‌క‌ర్త‌ల, దేశ శాస్త్ర‌వేత్త‌ ల శ‌క్తి మీద విశ్వాసం తో ముంద‌డుగు వేసింది.  రాష్ట్రాని కి చెందిన ఆరోగ్య రంగ కార్య‌క‌ర్త‌ లు, ఎఎస్ హెచ్ ఎ కార్య‌క‌ర్త‌ లు, ఆంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ లు, ఉపాధ్యాయులు, ఇంకా ఇత‌ర స‌హ‌చ‌రులంద‌రిలోని స‌మ‌ర్థ‌త కార‌ణం గా ఈ విజ‌యాన్ని సాధించ‌గ‌లిగాం.  చికిత్స రంగానికి చెందిన సిబ్బంది, వాళ్లు వైద్యులు కావ‌చ్చు, పారా మెడిక‌ల్ సిబ్బంది కావ‌చ్చు, ఇంకా ఇత‌ర స‌హాయ‌కులు కావచ్చు.. వీరంద‌రి కృషి తో ఇది సాధ్యమైంది.  ఇందులో కూడా భారీ సంఖ్య‌ లో పాల్గొని నా సోదరీమ‌ణులు ప్ర‌త్యేక పాత్ర ను పోషించారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే మ‌న స‌హ‌చ‌రులంతా క్షేత్ర‌ స్థాయి లో వారు ఎదుర్కొన్న స‌వాళ్ల‌ ను గురించి వివ‌రం గా తెలియజేశారు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో టీకా కార్య‌క్ర‌మాని కి అనేక ర‌కాల అడ్డంకులు ఎదురయ్యాయి.  ప‌ర్వ‌త‌ ప్రాంతం కావ‌డం తో కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌ లో అవ‌రోధాలు వ‌చ్చాయి.  క‌రోనా టీకా ను భ‌ద్రంగా దాచి ఉంచ‌డం, స‌ర‌ఫ‌రా చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నులు.  అయితే ఈ స‌మ‌స్య‌ల‌ ను జయరామ్ గారి ప్ర‌భుత్వం రూపొందించిన వ్య‌వ‌స్థ‌ లు స‌మ‌ర్థ‌వంతం గా ప‌రిష్క‌రించుకోవ‌డం ఎంతైనా అభినంద‌నీయం.  టీకాల‌ ను వృథా చేయ‌కుండా వాటి ని ప్ర‌జ‌ల‌ కు వేగం గా  వేయ‌డంలో హిమాచ‌ల్ చేసిన కృషి ప్ర‌శంస‌నీయం.

సహచరులారా,

భౌగోళికం గా క‌ష్ట‌మైన ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీ, ప్ర‌జాబాహుళ్యాని కి స‌మాచారాన్ని అందించ‌డం, ప్ర‌జ‌ల ను భాగస్వాముల‌ ను చేయ‌డం అనే ఈ కార్యాలు టీకా విజ‌యం లో కీల‌కమైన పాత్ర ను పోషించాయి.  ఒక్కో ప‌ర్వ‌త ప‌ర్వ‌తాని కి ఒక్కో మాండ‌లికం క‌లిగిన రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.  రాష్ట్రం లో అత్య‌ధిక ప్రాంతం గ్రామీణ ప్రాంతం.  గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌నం లో సంప్ర‌దాయ విశ్వాసాలు విడ‌దీయ‌రాని బంధాన్ని క‌లిగి ఉంటాయి.  అంతే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితం లో దేవుళ్ల కు, దేవ‌త‌ల కు ప్రాధాన్య‌ం ఎక్కువ‌.  కాసేప‌టి క్రితం మాట్లాడిన ఒక సోద‌రీమ‌ణి కుల్లూ జిల్లా లోని మ‌లాణా గ్రామం గురించి ప్రస్తావించారు.  ప్ర‌జాస్వామ్యాని కి ద‌శ ను, దిశ‌ ను ఇవ్వ‌డం లో మ‌లాణా గ్రామం ప్ర‌తి సారీ కీల‌కమైనటువంటి పాత్ర ను పోషిస్తోంది.  అక్క‌డి టీకా బృందం ఒక ప్ర‌త్యేక శిబిరాన్ని నిర్వ‌హించింది.  టీకా ల పెట్టెల‌ ను స్పాన్ వైర్ ద్వారా స‌ర‌ఫ‌రా చేశారు.  దేవ్ స‌మాజాని కి చెందిన పెద్ద‌వారి స‌మ్మ‌తి ని సంపాదించారు.  టీకాల‌ ను మారు మూల ప్రాంతాల కు తీసుకుపోవ‌డం లో అలాంటి వ్యూహం ప‌లు ప్రాంతాల లో చ‌క్క‌ గా ప‌ని చేసింది.  ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని సాధించ‌డం జ‌రిగింది.

సహచరులారా,

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని లాహౌల్ స్పీతి జిల్లా కు స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు లేవు.  అయిన‌ప్ప‌టికీ ఈ జిల్లా కూడా మొద‌టి డోసు టీకా ను నూటి కి నూరు శాతం ప్ర‌జ‌ల‌ కు అందించ‌డం లో ముందువ‌రుస‌ లో నిలచింది.  అట‌ల్ సొరంగ మార్గాన్ని నిర్మించ‌డాని కంటే ముందు ఈ జిల్లా కు దేశం లోని మిగ‌తా ప్రాంతాల‌ కు సంబంధం లేని ప‌రిస్థితి.   విశ్వాసం, విద్య‌, విజ్ఞానం క‌లిస్తే ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తేవ‌చ్చ‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌రో సారి నిరూపించింది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు వదంతుల ను, త‌ప్పుడు స‌మ‌చారాన్ని న‌మ్మ‌రు.  ప్ర‌పంచం లోనే భారీదైన‌టువంటి, వేగ‌వంత‌మైన‌టువంటి టీకా కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశ గ్రామీణ ప్ర‌జ‌లు బ‌లోపేతం చేస్తున్నారనే మాటల కు  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్రమాణం గా నిలచింది.

సహచరులారా,

టీకా కార్య‌క్ర‌మాన్ని వేగం గా నిర్వ‌హించుకోవ‌డం ద్వారా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్యట‌న రంగం ల‌బ్ధి ని పొందుతుంది.  ఎందుకంటే ఈ రాష్ట్రం లో ఎక్కువ‌మంది యువ‌త‌ కు ఉద్యోగ అవకాశాల ను క‌ల్ప‌ిస్తోంది ఈ రంగమే.  టీకా వేసుకున్న‌ప్ప‌టికీ మాస్కుల ను ధ‌రించ‌డం, ఒక మ‌నిషి కి మరో మ‌నిషి కి మ‌ధ్య‌ రెండు గ‌జాల దూరాన్ని పాటించ‌డ‌ం అనే జాగ్రతల ను మనం మ‌రచిపోకూడ‌దు.  మంచు కురిసిన త‌రువాత ఇళ్ల‌ లో నుంచి బయట‌ కు వ‌చ్చిన‌ప్పుడు జాగ్ర‌త గా న‌డ‌వ‌డం ఎలాగో హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ కు బాగా తెలుసు.  అలాగే వ‌ర్షాలు కురిసిన త‌రువాత ఎక్క‌డా జారి ప‌డ‌కుండా ఎంతో జాగ్ర‌త గా మ‌నం న‌డుస్తూ ఉంటాం.  అదే మాదిరి గా క‌రోనా మ‌హ‌మ్మారి అనంతరం కూడాను మ‌నం న‌డుచుకోవాలి.  క‌రోనా కాలం లో ఇంటి నుంచే ప‌ని చేయడం లో, ఎక్క‌డి నుంచైనా ప‌ని చేయ‌డం లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఆద‌ర్శ‌వంతం గా నిలచింది.  న‌గ‌రాల లో ఇంట‌ర్ నెట్ క‌నెక్టివిటీ, ఇత‌ర స‌దుపాయాలు బాగా ఉండ‌డం వ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అనేక ప్ర‌యోజ‌నాల‌ ను పొందుతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ క‌రోనా కాలం లో కూడా ఇత‌ర ప్రాంతాల‌ తో సంబంధాల‌ ను క‌లిగి ఉండ‌డం అనేది ప్ర‌జ‌ల‌ జీవితం మీద, జీవ‌నోపాధి మీద‌ ప్రసరించే సానుకూలమైనటువంటి ప్ర‌భావాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ త‌న అనుభ‌వం లో చ‌విచూసింది.  రోడ్డు, రైలు, విమాన‌ యానం లేదా ఇంట‌ర్ నెట్ కావ‌చ్చు.. ఇప్పుడు దేశం యొక్క అత్యంత ప్రాధాన్య‌మైన విష‌యం క‌నెక్టివిటీ.  ‘ప్ర‌ధాన మంత్రి  గ్రామీణ స‌డ‌క్ యోజ‌న’ లో భాగం గా 8 నుంచి ప‌ది నివాస గృహాలు ఉన్న ప్రాంతాల‌ కు సైతం రహదారుల ను వేయ‌డం జ‌రుగుతోంది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన ప్ర‌ధాన ర‌హ‌దారులు విశాలం గా మారుతున్నాయి.  బ‌ల‌మైన సంధానం అధికం అవుతూ ఉండ‌డం వ‌ల్ల రాష్ట్రాని కి చెందిన ప‌ర్యట‌న రంగం ల‌బ్ధి ని పొందుతోంది.  అంతే కాదు రాష్ట్రం లోని రైతులు, తోట పంట‌ల య‌జ‌మానులు లాభపడుతున్నారు.  గ్రామాల లో సైతం ఇంట‌ర్ నెట్ స‌దుపాయం అందుబాటు లోకి వ‌స్తోంది.  దాంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ కు చెందిన యువ ప్ర‌తిభావంతులు ప‌ర్యట‌న రంగం లోని అవ‌కాశాల‌ ను అంది పుచ్చుకొంటున్నారు.  త‌మ సంస్కృతి ని ఇతర ప్రాంతాల‌ తోను, దేశాల‌ తోను వారు పంచుకొంటున్నారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఆధునిక‌, డిజిట‌ల్ సాంకేతిక‌త ద్వారా రానున్న రోజుల లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌రింత‌ ల‌బ్ధి ని పొందబోతున్నది.  విద్య‌ రంగం లో, ఆరోగ్యం రంగం లో భారీ మార్పు లు రానున్నాయి.  ఈ సాంకేతిక‌త ద్వారా రాష్ట్రం లో మారు మూల ప్రాంతాల పాఠ‌శాల‌లు, ఆరోగ్య కేంద్రాలు వర్చువ‌ల్ గా క‌నెక్ట్ అవుతాయి.  అవి రాష్ట్రం లోని పెద్ద పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌తోను, పేరొందిన ఆసుప‌త్రుల వైద్యుల‌తోను అనుసంధాన‌మ‌వుతాయి.

ఈ మ‌ధ్య‌నే మ‌న దేశం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌త్యేకంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ తో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను.  అది ఏమిటి అంటే డ్రోన్ సాంకేతిక‌త‌ సంబంధి నియ‌మ నిబంధ‌న‌ల లో మార్పు గురించి.  ఇప్పుడు ఈ నియ‌మ నిబంధ‌న‌ల ను సుల‌భ‌త‌రం చేయ‌డం జ‌రిగింది.  త‌ద్వారా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఆరోగ్య‌ రంగం లో, వ్య‌వ‌సాయ రంగం లో నూత‌న అవ‌కాశాలు ఏర్ప‌డుతాయి. మందుల స‌ర‌ఫ‌రా లో, ఉద్యాన‌ పంట‌ల సాగు లో, భూముల స‌ర్వేల‌ లో డ్రోన్ లను విరివి గా ఉప‌యోగించుకోవ‌చ్చు.  ప‌ర్వ‌త ప్రాంత ప్ర‌జ‌లు ఈ డ్రోన్ టెక్నాల‌జీ ని స‌రిగా ఉప‌యోగించుకుంటే వారి జీవితాల లో మార్పు వ‌స్తుంది.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని అడ‌వుల్ని సంర‌క్షించ‌డానికి కూడా ఈ డ్రోన్ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది.  ప్ర‌భుత్వ సేవ‌ల‌ ను అందించ‌డం లో ఆధునిక సాంకేతిక‌త‌ ను సాధ్య‌మైనంత వరకు ఉప‌యోగించుకొనేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వేగ‌వంతం గా అభివృద్ధి చెందుతోంది.  ఈ రాష్ట్రాని కి ప్ర‌కృతి విప‌త్తు లు భారీ స‌వాళ్ల‌ ను విస‌రుతున్నాయి.  ఈ మ‌ధ్య‌ కాలం లో సంభ‌వించిన దురదృష్ట‌క‌ర ఘ‌ట‌న‌ల లో మ‌నం ప‌లువురు స్నేహితుల‌ ను కోల్పోయాం.  కాబ‌ట్టి కొండ‌చ‌రియ‌ లు విరిగి ప‌డే ఘ‌ట‌న‌ల‌ కు సంబంధించి ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల ను పొంద‌డానికి వీలు గా శాస్త్రీయ‌ప‌ర‌మైన ప‌రిష్కారాల‌ కోసం మ‌నం వేగం గా కృషి చేయవలసి ఉంది.  కొండ ప్రాంత ప్ర‌జ‌ల అవ‌సరాల‌ కు అనుగుణం గా  చేప‌ట్టే నిర్మాణాల‌ కు సంబంధించి నూత‌న సాంకేతిక‌త‌ ను త‌యారు చేసే విష‌యం లో మ‌న యువ‌త‌ కు త‌గిన స‌హ‌కారాన్ని అందించాలి.
 
సహచరులారా,

గ్రామాల‌ ను, సముదాయాల ను క‌ల‌ప‌డం ద్వారా అర్థ‌వంత‌మైన ఫ‌లితాల‌ ను సాధించ‌వ‌చ్చ‌ు అన‌డానికి అతి పెద్ద ఉదాహ‌ర‌ణ జ‌ల్ జీవ‌న్ మిశన్‌.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో  ఒక‌ప్పుడు అసాధ్య‌ం అనుకొన్న ప్రాంతాల లో సైతం నల్లా నీటి స‌ర‌ఫ‌రా సౌక‌ర్యాన్ని ప్రవేశపెట్టగలుగుతున్నాం.  ఇదే విధానాన్ని మ‌న అట‌వీ సంప‌ద‌ ను కాపాడుకోవ‌డంలో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.  దీనికి సంబంధించి గ్రామాల స్వ‌యం స‌హాయ‌ సమూహాల లో మ‌హిళ‌ ల భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌వ‌చ్చు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అడ‌వుల లో వ‌న‌ మూలిక‌ల‌ కు, కూర‌గాయ‌ల‌ కు, పండ్ల‌కు కొద‌వ లేదు. వాటి గిరాకీ రాను రాను పెరుగుతోంది.  మ‌న సోద‌రీమ‌ణులు ఈ వ‌న సంప‌ద‌ ను శాస్త్రీయ విధానాల ద్వారా ఉప‌యోగించుకొని వారి ఆదాయాన్ని పెంచుకోవ‌చ్చు.  వారికి ఎల‌క్ట్రానిక్ కామ‌ర్స్ అనే కొత్త విధానం కూడా అందుబాటు లోకి వ‌స్తోంది కాబ‌ట్టి.. వారు దానిని కూడా ఉప‌యోగించుకొని ల‌బ్ధి పొంద‌వ‌చ్చు.
 
దేశం లో స్వ‌యం స‌హాయ‌ సమూహాల మ‌హిళ‌ ల‌ కోసం ప్ర‌త్యేక‌మైన ఆన్ లైన్ వేదిక‌ ను త‌యారు చేస్తున్నామ‌ని ఆగ‌స్టు 15న ఎర్ర‌ కోట మీది నుంచి నేను ప్ర‌క‌టించాను.  ఈ మాధ్య‌మం ద్వారా వారు త‌మ ఉత్ప‌త్తుల‌ ను దేశం లో ఇత‌ర ప్రాంతాల‌ కు, విదేశాల‌ కు అమ్ముకోవ‌చ్చు.  మ‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సోద‌రీమ‌ణులు వారు సేక‌రించిన ఆపిల్స్ ను, నారింజ పండ్ల‌ను, కిన్నుల‌ ను, పుట్ట‌గొడుగుల‌ ను, ట‌మాటాల‌ ను, ఇంకా అలాంటి అనేక ఉత్ప‌త్తుల‌ ను దేశం లోని మారు మూల ప్రాంతాల‌ కు సైతం  అమ్ముకోవ‌చ్చు.  కేంద్ర ప్ర‌భుత్వం దేశం లో వ్య‌వ‌సాయ‌ స‌దుపాయాల క‌ల్ప‌న కోసం వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధి కింద ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల నిధి ని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఈ నిధి ని ఉప‌యోగించుకొని మ‌న స్వ‌యం స‌హాయ‌ సమూహాల మ‌హిళ‌ లు, రైతు సంఘాల స‌భ్యులు వారి ప్రాంతాల‌ లో శీతలీక‌ర‌ణ గిడ్డంగుల‌ ను, ఫూడ్ ప్రాసెసింగ్ కేంద్రాల‌ ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.  త‌ద్వారా వారు వారి ఫలాల ను, కాయగూర‌ల‌ ను నిలవ చేసుకోవ‌డానికిగాను ఇత‌రుల మీద ఆధార‌ప‌డవలసిన అవ‌స‌రం ఉండ‌దు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన రైతులు, ఉద్యాన పంట‌ల య‌జ‌మానులు ఈ నిధి ని సాధ్య‌మైనంత‌ మేర‌కు ఉప‌యోగించుకోగ‌ల‌ర‌ని నాకు పూర్తి విశ్వాసం ఉంది.
 
సహచరులారా,

అమృత్ మ‌హోత్స‌వ్ కాలం లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రైతుల‌ కు నేను ఒక విజ్ఞ‌ప్తి చేయ‌ద‌లుచుకున్నాను.  రాబోయే పాతిక సంవ‌త్స‌రాల్లో రాష్ట్రాన్ని సేంద్రియ వ్య‌వ‌సాయ రాష్ట్రం గా మార్చ‌గ‌ల‌మా?  మ‌నం కాల‌క్ర‌మం లో మ‌న భూముల‌ ను ర‌సాయ‌నిక మందుల చెర‌ నుంచి త‌ప్పించాలి.  మ‌న భూమి ఆరోగ్యంతో పాటు మ‌న రాబోయే త‌రాల ప్ర‌జ‌ల ఆరోగ్యం భ‌ద్రం గా ఉండేలా మ‌నం జాగ్ర‌త్త‌ లు తీసుకోవాలి. నాకు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల మీద‌, యువ‌త స‌మ‌ర్థ‌త మీద పూర్తి న‌మ్మకం ఉంది.  దేశ స‌రిహ‌ద్దుల‌ ను ర‌క్షించ‌డం లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌త శ‌క్తియుక్తుల‌ ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టే రాష్ట్రం లో ప్ర‌తి రైతు త‌మ త‌మ గ్రామాల్లోని నేల‌ల ను ర‌క్షించుకొనే ప‌ని చేయడం లో ముందు భాగాన నిలుస్తార‌ని అనుకుంటున్నాను.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే త‌న స‌మ‌ర్థ‌త‌ ను హిమాచల్ ప్ర‌దేశ్ రాష్ట్రం ముందు ముందు కూడా కొన‌సాగిస్తుంద‌ని కోరుకుంటూ మీ అంద‌రికీ మ‌రోసారి అభినంద‌న‌లు.  పూర్తి స్థాయి లో టీకా కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకొన్న రాష్ట్రం గా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ నిల‌వాల‌ని కోరుకొంటూ మీ అంద‌రి కి శుభాకాంక్షలను తెలియ‌జేస్తున్నాను.  దేశ ప్ర‌జ‌లంద‌రి కి మ‌రో సారి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.  క‌రోనా విష‌యం లో పూర్తి స్థాయి లో జాగ్ర‌త గా ఉండండి.  ఇంత‌వ‌ర‌కు దేశం లో 70 కోట్ల టీకాల‌ ను వేయడం జ‌రిగింది.  వైద్యులు, న‌ర్సులు, ఆంగ‌న్ వాడీ, ఎస్ హెచ్ ఎ సోద‌రీమ‌ణులు, స్థానిక ప్ర‌భుత్వాల సిబ్బంది, టీకా ల త‌యారీ కంపెనీ లు, శాస్త్ర‌వేత్త‌ లు వారి పూర్తి స్థాయి సామ‌ర్థ్యాన్ని చూపారు.  టీకా కార్య‌క్ర‌మం దేశం లో వేగం గా న‌డుస్తోంది.  అయితే మ‌నంద‌రం ఎలాంటి అజాగ్ర‌త కు తావు ఇవ్వకుండా వ్య‌వ‌హ‌రించాలి.  నేను మొద‌టి రోజు నుంచి చెబుతూనే వస్తున్నాను.  టీకా వేసుకోవాలి, అదే స‌మ‌యం లో నియ‌మ నిబంధ‌న‌ల ను పాటించాలి అని అంద‌రికీ చెబుతూనే ఉన్నాను.  మ‌రో సారి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ కు నా శుభ‌కాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.  అంద‌రికీ అభినంద‌న‌ లు.


అస్వీకరణ:  ప్రధాన మంత్రి ప్ర‌సంగానికి ఇది దాదాపు గా చేసిన అనువాదం.  ప్రధాన మంత్రి ప్రసంగం హిందీ భాష‌ లో కొన‌సాగింది.



 

***



(Release ID: 1753213) Visitor Counter : 193