యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఫిట్‌ ఇండియా’ మొబైల్‌ అనువర్తనాన్ని ప్రారంభించిన క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌


135 కోట్లమంది భారతీయుల కోసం శ్రీకారం చుట్టిన అత్యంత సమగ్ర
శరీర దృఢత్వ మొబైల్‌ యాప్‌ ‘ఫిట్‌ ఇండియా’: అనురాగ్‌ ఠాకూర్‌

Posted On: 29 AUG 2021 2:15PM by PIB Hyderabad

ముఖ్యంశాలు:

  • ఈ యాప్‌ పూర్తిగా ఉచితం... అయినప్పటికీ శరీర దృఢత్వానికి తోడ్పడే అమూల్యమైనది కాగలదనడంలో సందేహం లేదు: శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌
  • నవభారతాన్ని దృఢ భారతంగా తీర్చిదిద్దడంలో ఈ ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ ఎంతగానో తోడ్పడుతుంది: శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌
  • భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్, మల్లయోధుడు సంగ్రామ్ సింగ్, క్రీడా పాత్రికేయుడు అయాజ్ మెమన్, పైలట్ కెప్టెన్ ఆనీ దివ్యలతో వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా మంత్రుల మాటామంతీ
  • ‘ఫిట్ ఇండియా’ యాప్ ‘ఆండ్రాయిడ్, ఐఓఎస్’ మొబైల్‌ వేదికలలో ఆంగ్ల, హిందీభాషల్లో ఉచితంగా లభ్యం
  • ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం వంటివాటిలో ప్రజా భాగస్వామ్యంద్వారా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ను విజయవంతం చేయాలని ప్రజలకు శ్రీ ఠాకూర్ పిలుపు

   ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా... ‘సుదృఢ భారతం’ ఉద్యమ రెండో వార్షికోత్సవం నేపథ్యంలో కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌  ఠాకూర్‌ ‘ఫిట్‌ ఇండియా’ మొబైల్‌ అనువర్తనాన్నిప్రారంభించారు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువజన వ్యవహారాలు-క్రీడాశాఖ సహాయమంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌సహా క్రీడల విభాగం కార్యదర్శి శ్రీ రవి మిత్తల్‌, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీమతి ఉషాశర్మ కూడా ఇందులో పాల్గొన్నారు. ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయనతోపాటు నిసిత్‌ ప్రామాణిక్‌ కూడా ధ్యాన్‌చంద్‌కు నివాళి అర్పించారు.

 

   అనువర్తనాన్ని ప్రారంభించిన అనంతరం భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్, మల్లయోధుడు సంగ్రామ్ సింగ్, క్రీడా పాత్రికేయుడు అయాజ్ మెమన్, పైలట్ కెప్టెన్ ఆనీ దివ్యలతోపాటు ‘ఫిట్‌ ఇండియా’ అనువర్తన వినియోగాన్ని ప్రదర్శించిన ఓ పాఠశాల విద్యార్థి, మరో గృహిణితోనూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా మంత్రులు ముచ్చటించారు. కాగా, ఈ యాప్‌ పూర్తిగా ఉచితం కావడంతోపాటు ‘ఆండ్రాయిడ్, ఐఓఎస్’ మొబైల్‌ వేదికలలో ఆంగ్ల, హిందీ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా సాధారణ స్మార్ట్‌ ఫోన్లలో కూడా వినియోగానికి వీలుగా దీన్ని రూపొందించారు.

   జాతీయ క్రీడా దినోత్సవంతోపాటు ఇవాళ ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి శ్రీ ఠాకూర్‌ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- “ఫిట్‌ ఇండియా మొబైల్‌ యాప్‌ సాయంతో తమ దృఢత్వ స్థాయిని తెలుసుకోగలిగే వెసులుబాటు ఇప్పుడు ప్రతి భారతీయుడి అరచేతిలోనే ఉంటుంది. ఇందులో ‘ఫిట్‌నెస్‌ స్కోర్‌, కదిలే బొమ్మల వీడియోలు, కసరత్తు పర్యవేక్షకాలు’ వంటి విశిష్టతలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వారివారి అవసరాలకు అనుగణంగా ప్రణాళికల కోసం ‘మై ప్లాన్‌’ సౌకర్యమూ లభ్యమవుతుంది” అని తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ- “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరుడు వయసు ఆధారిత దృఢత్వ విధానాలను ఆవిష్కరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీకరణ కూడా లభించింది. దీనికితోడు ‘నిత్యం అరగంట తర్ఫీదు –దృఢత్వానికి తగిన మోతాదు’ అనే శరీర దృఢత్వ మంత్రాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు ఉపదేశించారు” అని పేర్కొన్నారు.

   శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ తన ప్రసంగం కొనసాగిస్తూ- “ప్రతి భారతీయుడి జీవితంలో శరీర దృఢత్వం ఒక సమగ్ర భాగం కావాలన్న లక్ష్యంతో గౌరవనీయులైన ప్రధానమంత్రి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29న ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నేడు ఇది ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది! ఈ నేపథ్యంలో ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో ప్రజా భాగస్వామ్యంద్వారా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ను విజయవంతం చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన పౌరులకు ఆరోగ్యకర, సుదృఢ నవభారతాన్ని సృష్టించడమే మా ఆకాంక్ష!” అని ప్రకటించారు. ఈ మేరకు ‘ఫిట్‌ ఇండియా’ను దేశంలోని 135 కోట్లమంది భారతీయుల కోసం రూపుదిద్దిన భారతదేశపు అత్యంత సమగ్ర శరీర దృఢత్వ మొబైల్‌ యాప్‌గా శ్రీ ఠాకూర్‌ అభివర్ణించారు.

   జాతి నిర్మాణంలో యువతరం అర్థవంతమైన పాత్ర పోషించాలని మనం భావిస్తున్నపుడు వారికి అవసరమైన శరీర దృఢత్వం కల్పించడం అవశ్యమని శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యాప్‌కు బహుళ ప్రాచుర్యం కల్పించాలని కోరారు. “ఈ యాప్‌ పూర్తిగా ఉచితమే అయినా, మన శరీర దృఢత్వానికి తోడ్పడటంలో ఇదెంతో అమూల్యమైనది కాగలదనడంలో సందేహం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

   శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌ మాట్లాడుతూ- ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో దేశవాసులు తమవంతుగా ప్రశంసనీయ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న నవభారతాన్ని సుదృఢ భారతంగా తీర్చిదిద్దడంలో ఈ ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ ఎంతగానో తోడ్పడగలదని ఆయన అన్నారు. ఆదర్శప్రాయ శరీర దృఢత్వంగల క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ ‘ఫిట్‌ ఇండియా’కు ప్రత్యక్ష నిదర్శనమని, ప్రతి ఒక్కరికీ ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.

 

   ఈ యాప్‌లోని వినియోగ సౌలభ్యాలతోపాటు ఆరోగ్య పారామితులను పర్యవేక్షించగల సదుపాయం ఉండటంపై వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా మంత్రులతో ముచ్చటించిన సందర్భంగా భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే పైలట్‌ ఆనీ దివ్య మాట్లాడుతూ- తీరికలేని తన విధినిర్వహణలో తగినంత నిద్ర, నీరు తాగడాన్ని పర్యవేక్షించగల సౌకర్యం ఈ యాప్‌లో ఉండటం తనకెంత ముఖ్యమో వివరించారు. శరీరం పైభాగం దృఢంగా రూపొందడంలో కొత్తపద్ధతి బస్కీలను ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించారు. ఈ యాప్‌లో సదరు కసరత్తు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందని, దీనిద్వారా వారు తమ దృఢత్వ స్థాయిని తెలుసుకోవచ్చునని తెలిపారు. ఇదే సమయంలో శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌లు శరీర స్థిరత్వం, సమతౌల్యానికి తోడ్పడే ‘వృక్షాసనం’ను రెజ్లర్‌ సంగ్రామ్‌ సింగ్‌తో కలసి ప్రదర్శించారు. మరోవైపు వృద్ధాప్యంలో శరీర దృఢత్వ ప్రాముఖ్యం గురించి పాత్రికేయుడు అయాజ్‌ మెమన్‌ ప్రముఖంగా వివరించారు. ఇందులో భాగంగా దృఢంగా ఉండటానికి ఉపయోగపడే కుర్చీ వ్యాయామాన్ని ఆయన ‌ప్రదర్శించారు. వీరితోపాటు చదువుకు మాత్రమేగాక శరీర దృఢత్వానికిగల ప్రాధాన్యాన్ని 8వ తరగతి విద్యార్థిని శ్రుతి తోమర్‌ సోదాహరణంగా వివరించింది. అలాగే రోజువారీ ఊపిరి సలపని ఇంటిపనుల్లో దృఢంగా ఉండటానికి ఈ యాప్‌ ఎంతగా తోడ్పడుతుందో గృహిణి శ్యామలీ శర్మ ప్రదర్శించారు.

   ఆరోగ్యకర, సుదృఢ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడం లక్ష్యం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29న ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శరీర దృఢత్వం కోసం ఎక్కడైనా.. ఎప్పుడైనా.. సులువుగా, వినోదాత్మకంగా, స్వేచ్ఛగా వ్యాయామం చేసుకోగలగడమే ఈ ఉద్యమ ప్రధాన సందేశం. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత తొలి వార్షికోత్సవం సందర్భంగా నిరుడు వయసు ఆధారంగా మూడు రకాల దృఢత్వ సాధన విధానాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ మేరకు (1) 5-18 మధ్య వయస్కులు (2) 18-65 మధ్య వయస్కులు (3) 65 ఏళ్ల పైబడినవారి కోసం ఒక నిపుణుల కమిటీ ఈ పద్ధతులను రూపొందించింది. వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీకరణ కూడా లభించింది. దీంతోపాటు ‘నిత్యం అరగంట తర్ఫీదు –దృఢత్వానికి తగిన మోతాదు’ అనే శరీర దృఢత్వ నినాదంతో ప్రధానమంత్రి ప్రజలకు మేల్కొలుపు పలికారు.

   వయసుకు తగిన పరీక్ష పద్ధతుల్లో ప్రతి ఒక్కరూ తమతమ దారుఢ్య స్థాయిని అంచనా వేసుకోగలిగే వెసులుబాటు ఉండటం ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌లోని విశిష్ట ప్రత్యేకత. ఈ అంచనాలను బట్టి దారుఢ్య స్థాయి మెరుగుకు యోగా పద్ధతులుసహా శారీరక కార్యకలాపాలు చేపట్టడంపై నిర్దిష్ట సిఫారసులు పొందవచ్చు. దీంతోపాటు ఆయా పద్ధతులను అర్థం చేసుకోవడంతోపాటు దృఢత్వ పరీక్ష నిర్వహించునేందుకు ఈ యాప్‌లోని కదిలే బొమ్మల వీడియోలు తోడ్పడతాయి. ప్రధానమంత్రి నిరుడు ప్రారంభించిన వయో ఆధారిత దృఢత్వ విధానాలకు అనుగుణంగా ఈ విశేషతలన్నీ యాప్‌లో చేర్చబడ్డాయి.

   ప్రాథమిక దృఢత్వ స్థాయిని కొనసాగించడానికి వీలుగా ఈ యాప్‌లోని ‘ఫిట్‌నెస్‌ ప్రొటోకాల్‌’ విశిష్టత విభిన్న వయోవర్గాలకు తగిన వివిధ వ్యాయామాలను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న, నిపుణులు ఆమోదించిన వ్యాయామ పద్ధతులన్నీ ఈ ప్రొటోకాల్‌లో ఉంటాయి.

అదనపు విశిష్టతలు

   ప్రతి ఒక్కరికీ వారి వయసు, లింగం, ప్రస్తుత జీవనశైలి, శరీరాకృతికి తగిన విభిన్న ఆహార, జల, కార్యాచరణలుంటాయి. ఆ మేరకు ప్రస్తుత జీవనశైలిసహా శారీరక కార్యకలాపాల్లో వెచ్చించే సమయం, నీరు తాగడం, నిద్రించే గంటలు, ప్రస్తుత బరువు, లక్షిత బరువు తదితరాలకు తగిన ప్రణాళికను ఈ యాప్‌లోని ‘మై ప్లాన్‌’ విశిష్టత ప్రతి ఒక్కరికీ సూచించగలదు. తదనుగుణంగా వారు నిర్దేశించుకున్న లక్ష్యం సాధించడానికి అనువైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులను వివరిస్తుంది. ఇందులో భాగంగా భారతీయ ఆహార ప్రణాళికసహా ఎన్ని గ్లాసుల నీరు తాగాలి... ఎన్ని గంటలు నిద్రపోవాలి... అన్నది కూడా ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ సిఫారసు చేస్తుంది.

   అలాగే ఈ యాప్‌లోని ‘కార్యకలాపాల పర్యవేక్షక’ విశిష్టత ద్వారా వ్యక్తులు తమ దైనందిన కార్యకలాపాల స్థాయిని పర్యవేక్షించుకోవచ్చు. అలాగే ప్రత్యక్షంగా మన ‘అడుగుల లెక్కింపు’ విశేషత ఆధారంగా మనం రోజూ ఎన్ని అడుగులు వేస్తున్నామో తెలుసుకోవచ్చు. తద్వారా తమకుతాము మరింత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు. అలాగే రోజూ ఎంత నీరు తాగుతున్నాం.. ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం.. ఎన్ని గంటలు నిద్రిస్తున్నాం... అన్నది కూడా పర్యవేక్షించుకోవచ్చు.

   వ్యక్తులు ప్రతి గంటకూ రిమైండర్లు పెట్టుకుని, తమ దృఢత్వ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. అలాగే నిర్దిష్ట వ్యవధిలో దైనందిన కార్యకలాపాలను కూడా అంచనా వేసుకుంటూ ఇతరులతో సమాచారం పంచుకోవడంద్వారా మరింతమందిని జీవనశైలి మార్పు దిశగా, దృఢత్వ సాధనవైపు ఆకర్షించవచ్చు.

   దేశవ్యాప్తంగా నిర్వహించే ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాలు, సర్టిఫికేషన్‌ కార్యక్రమాలు వగైరాల్లో వ్యక్తులు, పాఠశాలలు, బృందాలు, సంస్థలు పాల్గొనేందుకు ఈ యాప్‌ అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా దృఢత్వ సాధనలో తమ విజయగాథలను వ్యక్తులు ఈ వేదికద్వారా పంచుకోవచ్చు.

 

***(Release ID: 1750219) Visitor Counter : 195