ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల పురోగతిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్రం సమీక్ష


పాఠశాల ఉపాధ్యాయులకు టీకాలు వేయడానికి ఈ నెల చివరిలో 2 కోట్ల అదనపు డోసులు అందించనున్న కేంద్రం
కొవిడ్‌ ఔషధాల అదనపు నిల్వలు నిర్వహించే వ్యూహంపైనా సమీక్ష

Posted On: 25 AUG 2021 4:32PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ఔషధ విభాగం 
కార్యదర్శి శ్రీ ఎస్.అపర్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొవిడ్-19 టీకాల పురోగతిపై సమావేశంలో సమీక్షించారు. రెండో డోసు కవరేజీని పెంచడంతోపాటు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేట్) రోగ నిరోధకతపైనా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అత్యవసర కొవిడ్ ప్రతిస్పందన ప్యాకేజీ (ఈసీఆర్‌పీ) నిధుల సత్వర వినియోగం గురించి వివరించారు. రాబోయే పండుగ సీజన్‌కు ముందే తగిన కొవిడ్ జాగ్రత్తలు ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు.

    రెండో డోసు కవరేజీని పెంచడానికి ఖచ్చితమైన జిల్లా స్థాయి ప్రణాళిక ఉండాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. టీకా కోసం నిర్దిష్ట రోజులు, నిర్దిష్ట ప్రాంతాలు, ప్రతిరోజూ నిర్దిష్ట సమయాలు, రెండో డోసు కోసం ప్రత్యేక వరుసలు వంటి వ్యూహాలను చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి విస్తృత ఐఈసీ ప్రచారాలు చేపట్టాలని కూడా చెప్పారు. డోసుల కవరేజీలో రాష్ట్ర సగటు కంటే తక్కువ సగటు ఉన్న జిల్లాలను గుర్తించాలని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పురోగతి పెంచాలని కూడా అభ్యర్థించారు.

    కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా; ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేయడానికి ఈ నెల 27-31 తేదీల్లో 2 కోట్లకు పైగా అదనపు డోసులు రాష్ట్రాలకు అందుతాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 'యుడైస్‌' (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌) సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు, రాష్ట్రాల విద్యాశాఖలు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌, నవోదయ విద్యాలయ సంఘటన్‌ వంటివాటితో సమన్వయం చేసుకోవచ్చు.

    రాబోయే పండగ సీజన్‌లో కొవిడ్‌ కేసుల పెరుగుదలపై శ్రీ రాజేష్ భూషణ్‌ రాష్ట్రాలు, యూటీలను హెచ్చరించారు. కొవిడ్‌ను అడ్డుకోవడానికి అన్ని ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఓనం తర్వాత గత వారం రోజులుగా కేసుల్లో వృద్ధి కనిపిస్తున్న కేరళను ఉదాహరణగా చెప్పారు.

     కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించిన ఈసీఆర్‌పీ-II ప్యాకేజీలోని 50 శాతం నిధులతో పరికరాలు, యంత్రాలు, పడకలు, ఔషధాలు వంటివాటిని కొనడానికి రాష్ట్రాలు, యూటీలు వెంటనే సేకరణ, సరఫరా ఆర్డర్లను వేగవంతం చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. రాష్ట్రాలు నెలవారీ వ్యయ ప్రణాళికను రూపొందించాలని, క్షేత్ర స్థాయిలో పురోగతిని పర్యవేక్షించాలని చెప్పారు.

    కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధాల అదనపు నిల్వలను నిర్వహించే విధానంపైనా సమీక్ష జరిగింది. తప్పనిసరిగా నిల్వగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిన ఎనిమిది ముఖ్యమైన ఔషధాలతోపాటు, కొవిడ్‌ చికిత్సలో అవసరమైనవిగా రాష్ట్రాలు భావించే మందుల అదనపు నిల్వలను కూడా రాష్ట్రాలు నిర్వహించవచ్చు.

    వీటిలో ఎక్కువ ఔషధాలు ఉత్పత్తి అయిన 2-4 వారాల తర్వాత మాత్రమే (నాణ్యత పరీక్షకు ఆ బ్యాచ్‌ ఔషధాలు వెళ్లినప్పుడు) ఉపయోగించేందుకు సరఫరా జరుగుతుందని
కేంద్ర కార్యదర్శి (ఔషధాలు) శ్రీ ఎస్.అపర్ణ హెచ్చరించారు. ముందుగానే ఆయా ఔషధాలను సేకరించి పెట్టుకోవాలన్నది ఆ హెచ్చరిక అర్ధం. కేసుల సంఖ్య, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ముందుగానే మందులను నిల్వ చేసుకోవాలని రాష్ట్రాలను ప్రోత్సహించిన శ్రీ అపర్ణ, రవాణాలో అస్థిరత ఉండకుండా క్రమపద్ధతిలో సేకరణలు చేయాలని సలహా ఇచ్చారు.

    అదనపు కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఎం మిషన్ డైరెక్టర్ శ్రీ వందన గుర్నానీ, అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) డాక్టర్ మనోహర్ అగ్నానీ, అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ వికాశ్ షీల్,  సంయుక్త కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ విశాల్ చౌహాన్‌తోపాటు, ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యం), అదనపు ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం), మిషన్ డైరెక్టర్ (ఎన్‌హెచ్‌ఎం) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిఘా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 1749090) Visitor Counter : 157