నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ ఇంధనం దిశగా అడుగులు!
2005తో పోల్చితే 28శాతం తగ్గిన
కలుషిత వాయువుల విడుదల..
2030నాటికి 35శాతం లక్ష్య సాధనే భారత్ లక్ష్యం..
100 గిగావాట్ల పునరుత్పాదక ఇందన సామర్థ్యం
భారతదేశ విద్యుత్ రంగానికే గర్వకారణం
‘ఇండియా-ఐ.ఎస్.ఎ. ఇంధన పరివర్తన చర్చాగోష్టి’లో
కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ ప్రధానోపన్యాసం
Posted On:
25 AUG 2021 1:00PM by PIB Hyderabad
వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య వాయువుల స్థాయిని తగ్గించడంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. 2005వ సంవత్సరంతో పోల్చితే కాలుష్యవాయువుల విడుదల 28శాతం తగ్గింది. నేషనల్లీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ (ఎన్.డి.సి.) ప్రమాణాల ప్రకారం 2030వ సంవత్సరానికి కాలుష్య వాయువులను 35శాతం వరకూ తగ్గించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కలుషిత వాయువుల తగ్గింపు విషయంలో సాధించిన ఈ ఫలితాలతో భారతదేశం,.. పారిస్ వాతావరణ మార్పుల సదస్సు (సి.ఒ.పి.-2) తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టుగా రుజువైంది. ఇలా ఈ తీర్మానాలకు కట్టుబడిన ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన భారతదేశం కూడా స్థానం సాధించగలిగింది. అలాగే, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో గణనీయమైన ప్రగతిని కూడా మనదేశం సాధించింది.
ఇంధన రంగంలో దేశం అభివృద్ధి వేగాన్ని పరిశీలించినపుడు భారతదేశం ఎన్.డి.సి. ప్రమాణాలకు కట్టుబడి ఉండటమే కాకుండా, వాటిని అధిగమించేందుకు కూడా కృతనిశ్చయంతో ఉందని చెప్పవచ్చు. కేంద్ర విద్యుత్ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐ.ఎస్.ఎ.) అధ్యక్షుడు అయిన ఆర్.కె. సింగ్ ఈ విషయం తెలిపారు. ‘ఇండియా-ఐ.ఎస్.ఎ. ఇంధన చర్చాగోష్టి- 2021’ పేరిట ఐ.ఎస్.ఎ., కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ,.. ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ సదస్సులో ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇందుశేఖర్ చతుర్వేది ప్రారంభోపన్యాసం చేశారు. ఐ.ఎస్.ఎ. డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కూడా పాల్గొన్నారు.
చర్చాగోష్టిలో మంత్రి ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ, ఇంధన రంగంలో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సానుకూలమైన విధానాలను, నియంత్రణలను రూపొందిస్తూ వస్తోందన్నారు. ఇంధన సామర్థ్యం మెరుగుదలకోసం సృజనాత్మక మార్కెట్ వ్యవస్థలు, వాణిజ్య నమూనాల ద్వారా ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా అనేక చర్యలు తీసుకుంటూ వస్తోందన్నారు. సంస్థాగత పటిష్టత, సామర్థ్యాల నిర్మాణం, డిమాండ్ సృష్టి వంటి చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోందన్నారు.
సరఫరా వ్యవస్థ పటిష్టత, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, పోటీ తత్వంతో కూడిన మార్కెట్టు వంటివి నెలకొనేందుకు నియంత్రణతో కూడిన విధానపరమైన మద్దతు చాలా అవసరమని, అలాంటపుడే ఇంధన ధరలు తగ్గిపోయి, ఇంధన పరిశ్రమ కూడా స్వయంశక్తితో నిలదొక్కుకుంటుందని కేంద్రమంత్రి ఆర్.కె. సింగ్ అన్నారు. 2050వ సంవత్సరానికల్లా భారతదేశపు పూర్తి విద్యుత్ ఉత్పాదనా సామర్థ్యంలో 80-85శాతంమేరకు వాటా పునరుత్పాదక రంగంనుంచే అందవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారతదేశపు ఇంధన డిమాండు ఇప్పటికే 200 గిగావాట్ల (జి.డబ్ల్యు.)కు చేరుకుందన్నారు. కోవిడ్ సంక్షోభానికి ముందున్న డిమాండును భారత్ అధిగమించిందని, విద్యుత్ కోసం డిమాండ్ ఇకపై పెరుగుతూనే ఉంటుందని అన్నారు. మరింత ఎక్కువ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తోందన్నారు. అయితే, ఇందుకు విద్యుత్ వ్యవస్థలో తగిన సడలింపులు అవసరమని, నిల్వకు సంబధించి పలు రకాల సాంకేతిక పరిజ్ఞానాలు అమలులోకి రావాలని అన్నారు.
ప్రతిష్టాత్మకమైన వంద గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారతీయ విద్యుత్ వ్యవస్థ సాధించడం ఎంతో సంతోషదాయకం, గర్వకారణమని ఆయన తెలిపారు. ఇప్పటికే స్థాపించిన వంద గిగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చిందని, అదనంగా మరో 50 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు చేయబోతున్నారని మంత్రి చెప్పారు. 2021 జూలై 31 నాటికి, భారతదేశపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 38.5శాతం,..స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగానే జరుగుతోందని మంత్రి చెప్పారు. ఇదే వేగంతో ఇంధన సామర్థ్యం కొనసాగిన పక్షంలో, 2023నాటికల్లా మనం 40శాతం లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందని, సౌరశక్తి సామర్థ్యంలో 5వ స్థానాన్ని, పవన విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానాన్ని అందుకుందని ఆయన చెప్పారు.
గౌరవ ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో, స్వచ్ఛ ఇంధన రంగంలో ఇదే ఒరవడిని సాగించాలని భారతదేశం సంకల్పించిందని, 2030 నాటికల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విషయంలో 450 గిగావాట్ల లక్ష్యం చేరుకోవడానికి నిర్ణయించుకుందని చెప్పారు. 2022నాటికి నిర్దేశించుకున్న 175 గిగావాట్ల లక్ష్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సంకల్పించినట్టు ఆయన చెప్పారు. 2030 నాటికి 450 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో, ఇపుడు వంద గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించడం ఒక ముఖ్యమైన పరిణామన్నారు. దీనితో,.. పునరుత్పాదన ఇంధన సామర్థ్యం విషయంలో మరిన్ని ఫలితాలు సాధించి, అగ్రశ్రేణి దేశాల సరసన స్థానం సాధింగలమన్న ధీమా పెరిగిందన్నారు.
క్రియాశీలకంగా ఉంటున్న ప్రైవేటు రంగం ఎన్నో ఫలితాలు సాధిస్తోందని,. సామర్థ్యాల నిర్మాణ ప్రక్రియ ద్వారా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తోందని మంత్రి అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఇంధన నిల్వ, గ్రీన్ హైడ్రోజన్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో ఇవే ఫలితాలు పునరావృతం కావచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన హరిత ఇంధన కారిడార్ల కారణంగా, పునరుత్పాదక ఇంధనం అభివృద్ధి చేసే వారికి గ్రిడ్ అనుసంధానం సులభతరమైందని మంత్రి అన్నారు. అంతేకాక,..దేశంలోని పునరుత్పాదక ఇంధన సంపన్న ప్రాంతాల్లో 40,000 మెగావాట్ల ఇంధనాన్ని అంచనా వేసేందుకు కూడా వీలు కలిగిందన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విషయంలో మరిన్ని చర్యలు తీసుకోనున్నామని, దేశ వ్యాప్తంగా ఉన్న నీటి వనరులు, జలాశయాలపై తేలియాడే సౌరశక్తి ప్లాంట్లను స్థాపించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని కేంద్రమంత్రి చెప్పారు.
ఇంధన పరివర్తన విషయంలో ప్రపంచ అగ్రగామి దేశంగా భారత్ వ్యవహరిస్తోందని, ఇక కర్బన కాలుష్య రహిత వాతావరణం లక్ష్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్న అంశంపై తాజాగా ఇతర దేశాలతో చర్చించడం సంతోషదాయకమని మంత్రి అన్నారు. కలుషిత వాయువుల విడుదలను పూర్తిగా పరిహరించే లక్ష్య సాధనకోసం నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని ఇతదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కీలకమైన అంశాలపై చర్చకు రావాలని, వాస్తవిక ఇంధన పరివర్తన, పునరుత్పాదక ఇంధనాన్ని మరిన్ని రంగాల్లోకి ఎక్కువ స్థాయిలో ప్రవేశపెట్టడం వంటి అంశాలను సానుకూలం చేసుకునే మార్గాలను కనుగొనాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. “భారతదేశం, ఐ.ఎస్.ఎ. సభ్యదేశాలు పాటించే ఉత్తమ విధానాలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. వాతావరణంలో పెను మార్పుల నివారణపై భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కూడా ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఇప్పటికీ శిలాజ ఇంధనాలపైనే ఆధారపడిన చాలా వరకు దేశాలు ఇంధన పరివర్తన దిశగా అడుగులు వేసేందుకు ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను.” అని ఆయన అన్నారు.
చర్చాగోష్టిలో రెండు ప్యానెల్ చర్చలు చోటుచేసుకున్నాయి. పౌర ప్రయోజన ప్రాధాన్యంతో కూడిన ఇంధన పరివర్తన- భారతదేశపు పరిణామాలు అన్న అంశంపై రెండు పరిశోధనా పత్రాలను కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సమర్పించింది. భారతదేశపు ఇంధన మార్పిడి క్రమాన్ని ఈ పత్రాల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
“ఎక్కువ స్థాయి పునరుత్పాదక ఇంధన పరివర్తనలో గ్రిడ్ సమీకృత సమస్యల పరిష్కారం” అన్న అంశంపై జరిగిన తొలి ప్యానెల్ చర్చకు అంతర్జాతీయ. పునరుత్పాదక ఇంధన ప్రాధికార సంస్థ (ఇరెనా-ఐ.ఆర్.ఇ.ఎన్.ఎ.) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌరీ సింగ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. “పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని వేగవంతం చేసే వ్యవస్థ” అన్న అంశంపై జరిగిన రెండవ ప్యానెల్ చర్యకు ప్రపంచ బ్యాంకు గ్రూపు ఇంధన వ్యవహారాల సీనియర్ నిపుణుడు డాక్టర్ అమిత్ జైన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ చర్చాగోష్టికి ఐ.ఎస్.ఎ. సభ్యదేశాల ప్రతినిధులు, ప్రభుత్వ సీనియర్ అధకారులు, పారిశ్రామిక రంగం భాగస్వామ్య ప్రతినిధులు, విద్యావేత్తలు, సృజనాత్మక నిపుణులు, పరిశోధకులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అధ్యయన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఐ.ఎస్.ఎ. సభ్యదేశాల్లో ఇంధన మార్పిడి ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధించి ప్రపంచ పునరుత్పాదక ఇందన రంగం భాగస్వామ్య వర్గాల మధ్య అభిప్రాయ మార్పిడికి ఈ చర్చాగోష్టి అవకాశం కల్పించింది. అలాగే, ఇంధన మార్పిడికి ఆయా దేశాలు పాటించే వ్యూహాలను మరోసారి పరిశీలించేందుకు కూడా వీలు కల్పించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే చర్చలో, సి.ఒ.పి.26 సదస్సులో ఉన్నత స్థాయి చర్చను చేపట్టే కృషిని మరింత బలోపేతం చేసేందుకు కూడా ఈ చర్చాగోష్టి దోహదపడింది.
***
(Release ID: 1749003)
Visitor Counter : 269