రాష్ట్రపతి సచివాలయం
గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 75వ భారత స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం.
Posted On:
14 AUG 2021 7:44PM by PIB Hyderabad
నా ప్రియమైన దేశ ప్రజలారా,
భారతదేశంలోనూ, విదేశాలలోనూ నివిసిస్తున్న భారతీయులందరికి ఆనంద భరితమైన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది. మనదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవంగా జరుపుకుంటున్నందువల్ల ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మహత్తర దినోత్సవం సందర్భంగా మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
స్వాతంత్ర్య దినోత్సవం మనకు స్వతంత్ర పండగా. ఎన్నో తరాల స్వాతంత్ర్య సమర యోధులు – గుర్తింపు ఉన్నవారు కొందరు, గుర్తింపుకు నోచుకోనివారు మరికొందరు ఇది సాకారం చేశారు. వారు గొప్ప త్యాగాలు చేశారు. ఈనాడు, మీరూ, నేను స్వేఛ్చా గాలులు పీల్చుకుంటున్నాం. అందుకు వారి వీరోచిత కార్యాలకు కృతజ్ఞతలు. ఆ సాహస అమర వీరుల పుణ్య స్మృతికి శిరసుస వంచి నమస్కరిస్తున్నాను.
మనదేశం, ఇతర అనేక దేశాల్లా, పరాయి పాలనలో ఘోర అన్యాయాలకు, నిరంకుశత్వానికి బలైంది. మనదేశ విశిష్టత ఏమిటంటే... మహాత్మాగాంధీ నాయకత్వంలో సత్యం, అహింసా సిద్ధాంతాల ఆధారిత జాతీయత వాద ఉద్యమ లక్షణం కలిగి వుండడం. వలస పాలన నుండి మనదేశానికి విముక్తి కల్పించడమే కాకుండా దేశ పునర్ నిర్మాణానికి అమూల్యమైన ప్రణాళికను ఆయనా, ఇతర జాతీయ వీరులు మనకు అందించారు. భారతీయ విలువలు, మానవీయ గౌరవం తిరిగి పొందేందుకు గాంధీజీ పోరాటం చేశారు.
ఇప్పుడు మనం – మన 75 సంవత్సరాల స్వాతంత్ర్య ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోదగ్గ దూరం ప్రయాణం చేశామనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. తప్పుడు మార్గంలో వేగంగా ప్రయాణించడం కంటే సరైన మార్గంలో నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం మంచిదని గాంధీజీ మనకు ప్రబోధించారు. విభిన్న సంప్రదాయాలకు నిలయమేకాక అతిపెద్దదైన, అత్యద్భుత ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశం వైపు ప్రపంచం చూస్తున్నది.
ప్రియమైన సహపౌరులారా!
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో, మన క్రీడా కారులు అద్భుత ప్రదర్శన కనబరచి మనదేశానికి గౌరవ, ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఒలింపిక్స్ లో 121 సంవత్సరాల నుంచి పాల్గొంటున్న మనదేశం ఇప్పుడు అత్యధిక పతకాలు సాధించింది. అనేక ప్రతికూలతలను అధిగమించి మన ఆడబిడ్డలు క్రీడా మైదానాలలో ప్రపంచ స్థాయి ప్రతిభను సాధించారు. క్రీడలతో పాటు క్రీడా భాగస్వామ్యంలోనూ, అన్ని జీవన మార్గాలలో మహిళల విజయంలో గతంలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ఉన్నత విద్యా సంస్థల నుంచి సాయుధ దళాల వరకు, ప్రయోగశాలల నుంచి క్రీడా మైదానాల వరకు మన ఆడబిడ్డలు తమదైన ముద్ర వేస్తున్నారు. మన ఆడబిడ్డల విషయంలో నాకు అభివృద్ది చెందిన భారతదేశ భవిష్యత్తు కనిపిస్తున్నది. ఇటువంటి ప్రతిభావంతమైన ఆడబిడ్డల కుటుంబాల నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకుని తమ కుమార్తెలు కొత్త శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం కల్పించాలి.
గత సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్థాయి మహమ్మారి కారణంగా తగ్గుతుండవచ్చు. అయినా, మన హృదయాలు ఎల్లప్పుడూ ఉత్సాహంతో నిండి వుంటాయి. మహమ్మారి తీవ్రత తగ్గింది, కానీ కరోనా వైరస్ ఇంకా పోలేదు. ఈ సంవత్సరం దీని పునరావృతం విధ్వంసకర ప్రభావాల నుండి మనం బయటపడవలసి ఉంది. గత సంవత్సరం, అందరి అసాధారణ ప్రయత్నాలతో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యాయి. మన శాస్త్రవేత్తలు అతి కొద్దికాలంలోనే వ్యాక్సిన్లు తయారు చేయడంలో విజయం సాధించారు. కాబట్టి, ఈ సంవత్సరం ప్రారంభంలో చరిత్రలోనే అతిపెద్ద టీకాకరణ ప్రారంభించినందు వల్ల ఆశాభావంతో ఉన్నామనడంలో సందేహమేలేదు. కొత్తరకం వేరియంట్‌లు, ఇతర అనూహ్య కారణాల వల్ల మనం భయంకరమైన 2వ ఉధృతితో బాధపడ్డాం. ఈ అసాధారణ దేశ సంక్షోభంలో అనేక మందిని కాపాడలేకపోయినందుకు, మరెంతో మంది తీవ్రంగా దెబ్బతిన్నందుకు నేను తీవ్రంగా బాధపడుతున్నాను. నేను యావత్తు దేశ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు, బాధిత కుటుంబాల దు:ఖాన్ని అదే స్థాయిలో నేను పంచుకుంటున్నానని చెబుతున్నాను.
తీవ్రమైన వేగంతో ప్రపండమైన శక్తితో వచ్చిన ఈ అదృశ్య శత్రువును శాస్త్ర విజ్ఞానం ఎదుర్కొంటున్నది. పోయిన ప్రాణాల కంటే కాపాడుకున్న ప్రాణాలు ఎక్కువగా ఉండడం పట్ల మనం స్వాంతనం పొందవచ్చు. ఈ 2వ ఉధృతి బలహీనపడడంలో మనకు సహాయపడిన మన సమిష్టి కృతనిశ్చయం ద్వారా ఆ సవాలును అధిగమించాము. మరోసారి, మన కరోనా యోధులు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు ఇతరులు 2వ ఉధృతి ప్రభావాన్ని అరికట్టడంలో శాయశక్తులా తెగించి పనిచేశారు.
2వ ఉధృతి వల్ల మన ప్రజారోగ్య మౌలిక వ్యవస్థపై వత్తిడి పడింది. పెక్కు నిష్పత్తుల్లో వ్యాపించిన ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఏ మౌలిక సదుపాయానికి ముఖ్యంగా సంపన్న దేశాలకు కూడా లేదన్నది వాస్తవం. వ్యత్యాసాలను పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు జరిగాయి. ఈ సవాలును ఎదుర్కొనేందుకు నాయకత్వం సంసిద్ధమయింది. ప్రభుత్వ కృషికి రాష్ట్రాలు, ప్రైవేటు రంగ ఆరోగ్య, రక్షణ సదుపాయాలు, పౌర సమాజం తదితర చర్యలు తోడయ్యాయి. ఈ ప్రత్యేక కార్యంలో మనదేశం మందులు, వైద్య పరికరాలు, వ్యాక్సిన్లను అనేక దేశాలకు చేరవేసినట్లే, విదేశాలు కూడా ఉదారంగా అత్యవసరాలను అందించాయి. ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చిన ప్రపంచ సౌభ్రాతృత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ ప్రయత్నాలు ఫలితంగా సాధారణమైనటువంటి పరిస్థితులు తిరిగి రావడంతో మనదేశం కాస్తంత ఊపిరి పీల్చుకుంది. మన ఈ పాఠాలు బాగా అవగతమై ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇదేనని మనకు అర్థమౌతుంది. మన అప్రమత్తతను విస్మరించరాదు. మనకు శాస్త్రవిజ్ఞానం అందించిన అత్యున్నత రక్షణ కవచం వ్యాక్సిన్లే. మనదేశంలో సాగుతున్న ప్రపంచలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 50కోట్ల మందికిపైగా సహ పౌరులకు వ్యాక్సిన్ వేశారు. ఇంకా వ్యాక్సిన్ వేయించుకోనే అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇతరులను కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రియమైన సహపౌరులారా,
ఈ మహమ్మారి ఆరోగ్యంపై ఎంత విధ్వంసకర ప్రభావం చూపిందో అంతే ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై కూడా చూపింది. ప్రభుత్వం దిగువ మధ్య తరగతులు, పేదలపట్ల ఎంత ఆందోళన కనబరుస్తున్నదో అంతే ఆందోళనను చిన్న, మధ్య తరహా పరిశ్రమలపట్ల కూడా చూపింది. లాక్డౌన్లు, రవాణా నిషేదాజ్ఞలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులు, యజమానుల అవసరాల విషయంలో ప్రభుత్వం సున్నితంగా ఆలోచిస్తున్నది. వారి అవసరాలను గమనించిన ప్రభుత్వం గత సంవత్సరం పలు సహాయక చర్యలు తీసుకుంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం మే, జూన్ మాసాల్లో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసింది. ఈ ప్రయోజనం దీపావళి వరకు పొగించించబడింది. ఇంకా ఎంపికగన్న కోవిడ్ ప్రభావిత రంగాల బలోపేతానికి 6 లక్షల 28 వేల కోట్ల రూపాయల విలువైన నూతన, ఉత్తేజిత ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా వైద్యసదుపాయాల విస్తరణ కోసం ఏడాదిగా 23 వేల 220 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండడం సంతోషం కలిగిస్తున్నది.
గ్రామీణ భారతావని ముఖ్యంగా, వ్యవసాయ రంగం అన్ని అడ్డంకులను అధిగమిస్తూ వృద్ది చెందుతుండడం పట్ల ఆనందంగా ఉంది. ఇటీవల నేను కాన్‌పూర్ దేహత్ జిల్లాలోని మా పూర్వికుల స్వ గ్రామం పరేంఖ్‌ను సందర్శించగా ఆ గ్రామీణ ప్రాంతంలోని ప్రజల మెరుగైన జీవనం కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలు అభివృద్ది చేస్తుండడం పట్ల నాకెంతో సంతోషం కలిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య మానసికమైన దూరం గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు చాలా తక్కువగా వుంది. ఎంతైనా.... భారతదేశం గ్రామాలలో నివసిస్తున్నది. వాటిని అభివృద్ది చేసే విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ వెనుకబడి ఉండజాలము. అందుకే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు రైతుల సంక్షేమం కోసం అమలవుతున్నాయి.
స్వయం సమృద్ధ భారతదేశపు ఆత్మనిర్భర్ భారత్ దార్శనీయతతో ఈ కృషి నిరంతరం సాగుతున్నది. మన ఆర్థిక వ్యవస్థలోని స్వాభావిక సామర్థ్యం పట్ల అంచంచల విశ్వాసానికి కట్టుబడి ప్రభుత్వం – రక్షణ, ఆరోగ్యం, పౌర విమానయానం, విద్యుచ్ఛక్తి, తదితర రంగాలను మరింతగా సరళీకరించింది. పర్యావరణ అనుకూలమైన, పునరుత్పత్తి చేయదగ్గ ఇంధన వనరులు ముఖ్యంగా సౌరశక్తి ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడ్డాయి. సరళతర వాణిజ్యంలో మెరుగుదల ఉంటే, అందరి సరళతర జీవనంపై సానుకూల ప్రభావం ఉంటుంది. దీనికి అదనంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి కొనసాగుతున్నది. ఉదాహరణకు... ఒకరికి సొంత ఇంటికల నెరవేరుతుండడం..... 70 వేల కోట్ల రూపాయల రుణ అనుసంధాన సబ్సిడీ పథకానికి ధన్యావాదాలు. వ్వయసాయ మార్కెటింగ్ సంస్కరణలు మన అన్నదాత రైతులను సాధికారులను చేసి, వారి ఉత్పత్తులకు ఉత్తమ ధర లభించడానికి దోహదపడతాయి. ప్రతి భారతీయుడి శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ఇవి.
జమ్ము కాశ్మీర్ లో కొత్త పొద్దు పొడుస్తున్నది. ప్రజాస్వామ్యంలోనూ, చట్టాలలోనూ విశ్వాసం ఉన్న భాగస్వాములందరితో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. జమ్ముకాశ్మీర్ ప్రజలకు ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రజా స్వామ్య సంస్థల ద్వారా తమ ఆకాంక్షలు నెరవేర్చు కోవడానికి కృషి చేయండి.
బహుళపక్ష వేదికల్లో మనం పాలుపంచుకోవడంపై మన సర్వతోముఖాభివృద్ది ప్రతిబింభించడంతో పాటు వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరపరచుకోవడంతో అంతర్జాతీయంగా దేశ హోదా పెరుగుతోంది.
ప్రియమైన సహపౌరులారా,
75 సంవత్సరాల క్రితం మనదేశం స్వాంతంత్ర్యం సాధించినపుడు మనదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లజాలదని అనేకమంది సంశయ పడ్డారు. ప్రాచీనకాలంలోనే ఈ భూమిలో ప్రజాస్వామ్య వేళ్ళూనుకుందని వారికెంత మాత్రం తెలియదు. ఆధునిక కాలంలో కూడా భారతదేశం అనేక పాశ్చాత్య దేశాల కంటే ముందుండి ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా పెద్దలందరికి అధీకృత భాగస్వామ్యం కల్పిస్తున్నది. ప్రజల వివేకంపట్ల మన జాతి పితామహులు పూర్తి విశ్వాసం కలిగివున్నారు. ‘మనము ... భారతదేశ ప్రజలము’ భారతదేశాన్ని పటిష్ట ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దాము.
మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆమోదించుకున్నాము. కాబట్టి, మన పార్లమెంట్ మన ప్రజాస్వామ్య దేవాలయం. ఇది ప్రజా శ్రేయసుకోసం మన సమస్యలను చర్చించి, వాదోపవాదాలు సాగించి నిర్ణయించుకొనే అత్యున్నత వేదికను కల్పిస్తున్నది. మన పార్లమెంట్ త్వరలో కొత్త భవనంలో కొలువుదీరబోతుండడం భారతీయులమైన మన అందరికి గర్వకారణం. ఇది మన దృక్కోణానికి ఖచ్చితమైన ప్రకటన అవుతుంది. ఇది మన వారసత్వాన్ని గౌరవిస్తూ సమకాలిన ప్రపంచంతో ముందుకు సాగుతుంది కూడా. ఈ నూతన భవనం 75వ స్వాతంత్ర్య దిన సంవత్సరంలో ప్రారంభించబోవడం మనందరికి గర్వకారణం.
ఈ ప్రత్యేక సంవత్సరం జ్ఞాపకార్థం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను సిద్ధం చేసింది. వీటన్నింటిలో ఆసక్తికరమైనది.... గగన్ యాన్ మిషన్. భారత వైమానిక దళ పైలెట్లు విదేశంలో శిక్షణ పొందుతున్నారు. వారు అంతరిక్షంలోకి వెళ్ళినపుడు భూమిపైన మానవ సహిత అంతరిక్షయాత్ర చేసిన నాలుగవ దేశంగా భారత్ అవతరిస్తుంది. మన అంతరిక్ష యాత్ర ఆకాంక్షల విషయానికి వస్తే ఎటువంటి పరిమితులు మనలను నియంత్రించజాలవు.
అయినప్పుటికీ మన పాదాలు నేలపైన ఉంటాయి. మనకు స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన వారి స్వప్నాలను సాకారం చేయడానికి ఇంకా మనం చాలా దూరం ప్రయాణించాల్సి వుందని తెలుసు. ఆ స్వప్నాలను మన రాజ్యాంగం చక్కటి నాలుగు పదాలలో సంక్షిప్తంగా పేర్కొంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అసమానతలు కలిగిన ప్రపంచంలో... మరింత సమానత్వంకోసం, అన్యాయమైన పరిస్థితులలో మరింత న్యాయంకోసం మనం పాటు పడాలి. ఆర్థికపరమైన పర్యావరణ పరమైన న్యాయంతో సహా పలు విసృతమైన అంశాలను న్యాయ రంగం నిర్దేశించవలసి వుంది. ముందున్న రహదారి అంత సులభతరమైనది కాదు. అనేక మెలికలు, మలుపులు దాటుకుంటూ వెళ్ళాలి. అయితే మనకు సరిపోల్చలేని మార్గదర్శకాల ప్రయోజనం మనకుంది. ఇది మనకు విభిన్న వనరుల నుంచి వస్తుంది. సహస్రాబ్ది పూర్వంనాటి పవిత్ర ఆచార్యుల నుంచి ఈ తరంనాటి సాధు పుంగవులు, నాయకుల వరకు మనకు అందుతుంది. ఏకత్వంలో భిన్నత్వం స్పూర్తితో ఒక జాతిగా మనం సరైన దిశను అనుసరిస్తున్నాము.
ప్రత్యేకమైన భారతీయ వారసత్వం నుండి వచ్చిన ఈ దృక్కోణం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగకరం. ఆధునిక పారిశ్రామిక నాగరికత సమాజం ముందు అనేక సవాళ్ళను ఉంచింది. నదుల పురోగమనం, హిమానీ నదాలు ద్రవీభవించడం, ఉష్ణోగ్రతల పెరుగుతుండడం వంటి కారణాల వల్ల వాతావరణ మార్పులు మన జీవితంలో భాగస్వామ్యం అయ్యాయి. ప్యారిస్ వాతావరణ ఒప్పందంలోని అంశాలను పాటించడంతో పాటు వాతావరణ పరిరక్షణకు దేశం చేయవలసిన దానికంటే అధికంగా కృషి చేస్తోంది. ప్రపంచం మార్పులను కోరుకుంటోంది. అందుకే ప్రపంచం యావత్తూ వేదాలు, ఉపనిషత్తుల రచయితలు; రామాయణ, మహాభారతాల్లోని వర్ణనలు, మహావీరుడు, బుద్ధుడు, గురునానక్ ల ప్రబోధాలు, మహాత్మా గాంధీ మొదలైన వారి జీవితాల్లో ప్రతిబింబించిన భారత దేశ వివేకం వైపు చూడడం పెరుగుతోంది.
ప్రకృతి అనుసంధానంతో జీవనం గడపడాన్ని అభ్యసించడం ఎంతో కృషితో కూడిందని గాంధీజీ అంటారు. కానీ ఒకసారి నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులతో అనుసంధానమైతే ప్రకృతి తన రహస్యాలను మీకు వెల్లడిస్తుంది. గాంధీజీ ప్రబోధించిన ఈ సందేశాన్ని విందాం. మనం నివసించే భూమి పరిరక్షణ కోసం బలిదానాలు చేసేందుకు తీర్మానించుకుందాం.
మన స్వాతంత్ర్య సమర యోధుల్లో దేశభక్తి, త్యాగాల భావన చాలా ప్రబలంగా ఉండేది. వారి స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఎన్నో రకాల సవాళ్ళను వారు ఎదుర్కొన్నారు. కరోనా సంక్షోభంలో కూడా ఇలాంటి పరిస్థితినే నేను చూశాను. మానవత్వానికి నిస్వార్థ సేవ చేసేందుకు ముందుకు వచ్చిన లక్షలాది ప్రజలు - ఇతరులను రక్షించేందుకు ఎన్నో అపాయాలను ఎదుర్కొన్నారు. అలాంటి కోవిడ్ పోరాట యోధులను నేను అభినందిస్తున్నాను. వారిలో చాలా మంది కోవిడ్ -19తో మరణించారు. వారందరికీ నివాళి అర్పిస్తున్నాను.
ఇటీవల కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ధైర్యవంతులైన మన సైనికులకు నివాళి అర్పించేందుకు లద్దాఖ్ లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించాలని నేను అనుకున్నాను. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఆ స్మారక చిహ్నానికి వెళ్లేందుకు వీలుపడలేదు. బారాముల్లా లోని డ్యాగర్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఆరోజు నేను సైనికులకు నివాళులు అర్పించాను. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మృత్యర్థం ఆ చిహ్నాన్ని నెలకొల్పారు. ఆ పరాక్రమ వంతులైన యోధుల శౌర్యాన్ని, త్యాగాలను నేను అభినందించే సమయంలో నేను ఆ స్మారక చిహ్నంపై ఉన్న వాక్యాన్ని గమనించాను. 'మేరా హర్ కామ్ - దేశ్ కే నామ్' అని ఆ చిహ్నం పై ఉంది. అంటే సైనికుల ప్రతి పనీ దేశం కోసమేనని.
ఈ మాటను మనం మంత్రంగా జపించాలి. పూర్తి అంకిత భావంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. జాతి, సమాజ ప్రయోజనాల కోసం; దేశాన్ని ప్రగతి మార్గంలో ప్రయాణింపజేసేందుకు మనమందరం ఏకం కావాలి.
ప్రియమైన ప్రజలారా!
అవసరమైనప్పుడు దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల పరిరక్షణ కోసం శౌర్యాన్ని సంతోషంగా ప్రదర్శించిన సాయుధ దళాల సభ్యులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రవాస భారతీయులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. 2047లో శక్తిమంతమైన, భాగ్యవంతమైన, శాంతితో కూడిన భారత స్వాతంత్ర్య శత సంవత్సర వేడుకలను ఈ సందర్భంగా ఊహించకుండా ఉండలేకపోతున్నాను.
కోవిడ్ మహమ్మారి కల్పించిన కష్టాల నుండి ప్రజలందరూ బయట పడాలని, ఆనందం, సౌభాగ్యాల మార్గంలో ప్రయాణించాలని ఆశిస్తున్నాను.
మరోసారి అందరికీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు. జై హింద్!
(Release ID: 1745975)
Visitor Counter : 380
Read this release in:
Marathi
,
Gujarati
,
Tamil
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Malayalam