ప్రధాన మంత్రి కార్యాలయం

బాబా సాహెబ్‌ పురందరే నూరో జన్మదిన వేడుకపై ప్రధానమంత్రి సందేశం

శివాజీ మహరాజ్‌ జీవితం... చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో
ఆయన అద్భుత కృషికి మనం సదా రుణపడి ఉండాలి: ప్రధాని;
శివాజీ మహరాజ్‌ ప్రస్తావనలేని భారత స్వరూపం..
ఘన చరితను ఊహించడం అసాధ్యం: ప్రధానమంత్రి;

వెనుకబడిన-అణగారిన వర్గాలకు న్యాయం.. నిరంకుశత్వంపై పోరుకు
శివాజీ మహరాజ్‌ ‘హైందవ స్వరాజ్య’ నినాదమే అపూర్వ నిదర్శనం: ప్రధానమంత్రి;

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా భారత స్వాతంత్ర్య
పోరాట చరిత్ర రచనలో బాబా సాహెబ్‌ పాటించిన ప్రమాణాలను
అనుసరించాలని యువ చరిత్రకారులకు నా విజ్ఞప్తి: ప్రధానమంత్రి

Posted On: 13 AUG 2021 8:57PM by PIB Hyderabad

   శ్రీ బాబా సాహెబ్‌ పురందరే 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నీరాజనం అర్పించారు. బాబా సాహెబ్‌ జీవితంలో శతాబ్ది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- మన రుషి పుంగవులు ప్రవచించిన చురుకైన, మానసిక చైతన్యంతో కూడిన నిండు నూరేళ్ల జీవితానికి బాబా సాహెబ్‌ పురందరే జీవితం అద్భుత తార్కాణమని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పురందరే నూరో సంవత్సరంలో ప్రవేశించడ ఒక యాదృచ్ఛిక హర్షణీయ సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ చరిత్రలో అమరువీరులైన వారి ఉజ్వల చరిత్ర రచనలో బాబా సాహెబ్‌ పురందరే కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “శివాజీ మహరాజ్‌ జీవితం, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అద్భుత కృషికి మనం సదా రుణపడి ఉండాలి” అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, శ్రీ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించగా, 2015లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్‌’ పురస్కారం అందజేసింది. అలాగే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘కాళిదాస్‌’ పురస్కారంతో గౌరవించింది.

   శివాజీ మహరాజ్‌ అద్భుత వ్యక్తిత్వం గురించి ప్రధానమంత్రి సమగ్రంగా వివరించారు. శివాజీ మహరాజ్‌ భారతదేశ చరిత్రకు ఘనతను ఆపాదించడమే కాకుండా ప్రస్తుత భారత భౌగోళిక స్వరూపాన్ని కూడా ప్రభావితం చేశారని ఆయన పేర్కొన్నారు. శివాజీ మహరాజ్‌ లేని భారతదేశంలో మన గత, వర్తమాన, భవిష్యత్‌ స్థితిగతులు ఏమిటన్నది పెనుసవాలుగా మారి ఉండేదని చెప్పారు. శివాజీ మహరాజ్‌ ప్రస్తావనలేని భారత స్వరూపం, ఘన చరితను ఊహించడం కూడా అసాధ్యమేనని పేర్కొన్నారు. తన కాలంలో ఆయన ఏంచేశారో, ఆ తర్వాతి కాలంలో ఆయన చరిత్ర, స్ఫూర్తి, వీరగాథలు అదే పాత్రను పోషించాయని చెప్పారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు న్యాయం, నిరంకుశత్వంపై పోరుకు శివాజీ మహరాజ్‌ ‘హైందవ స్వరాజ్య’ నినాదమే అపూర్వ నిదర్శనమని చెప్పారు. వీర శివాజీ నిర్వహణ సామర్థ్యం, నావికాదళ వినియోగ శక్తి, నీటి యాజమాన్యం నేటికీ అనుసరణీయాలని శ్రీ మోదీ తెలిపారు.

   బాబా సాహెబ్‌ పురందరే రచన శివాజీ మహరాజ్‌పై ఆయనకుగల అచంచల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ రచనను చదువుతున్నపుడు శివాజీ మహరాజ్‌ సజీవుడై మన హృదయంలో సంచరిస్తారని ఆయన అన్నారు. బాబా సాహెబ్‌ కార్యక్రమాలకు లోగడ తాను హాజరుకావడాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. సంపూర్ణ ఘనతతో కూడిన చరిత్రను, దాని స్ఫూర్తిని యువతకు చేరువ చేయడంలోఆయన చూపిన ఉత్సాహాన్ని ప్రశంసించారు. చరిత్రను ఎల్లప్పుడూ దాని వాస్తవిక రూపంలో తెలియజేయడంపై నిబద్ధతను ఆయన సదా పాటించారని కొనియాడారు. “దేశ చరిత్రకు సంబంధించి ఈ సమతూకం అవశ్యం. తన వ్యక్తిగత విశ్వాసంతోపాటు తనలోని సాహితీవేత్త చారిత్రక స్ఫూర్తిని ప్రభావితం చేయకుండా ఆయన సదా జాగ్రత్త వహించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర రచనలో బాబా సాహెబ్‌ పాటించిన ప్రమాణాలను అనుసరించాలని యువ చరిత్రకారులకు ఈ సందర్భంగా నా విజ్ఞప్తి” అని ప్రధానమంత్రి సూచించారు. కాగా, గోవా విముక్తి ఉద్యమం, దాదర్‌-నాగర్‌-హవేలీ స్వాతంత్ర్య పోరాటాలకూ బాబా సాహెబ్‌ తనవంతు చేయూతనందించారని ప్రధాని గుర్తుచేశారు.

 

*****

 

DS

***



(Release ID: 1745826) Visitor Counter : 179