ప్రధాన మంత్రి కార్యాలయం
భారత రాయబార కార్యాలయాల అధిపతులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
Posted On:
06 AUG 2021 10:30PM by PIB Hyderabad
నమస్కారం,
నా కేంద్ర కేబినెట్ సహచరులు, రాయబారులు, హై కమిషనర్లు; ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు; వివిధ ఎగుమతి మండలులు, వాణిజ్య మరియు పారిశ్రామిక మండలుల నాయకులు, సోదరసోదరీమణులారా!
ఇది దేశ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ సమయం. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించుకునే వేడుక మాత్రమే కాదు, భవిష్యత్ భారతావనికి ఒక స్పష్టమైన విజన్, ప్రణాళిక ఆవిష్కరించాల్సిన అరుదైన అవకాశం. ఎగుమతులు పెంచడంలో మీ పాత్ర, ప్రయత్నం, చొరవలు అత్యున్నతమైనవి. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఏమేమి జరుగుతున్నది మీరంతా గమనిస్తూనే ఉంటారు. ఈ రోజు భౌతి, సాంకేతిక, ఆర్థిక అనుసంధానత కారణంగా ప్రపంచం అతి చిన్నదిగా మారిపోతోంది. ఈ వాతావరణంలో మన ఎగుమతులు విస్తరించడానికి ఎన్నో అవకాశాలు మన ముందు నిలుస్తున్నాయి. ఈ వాస్తవాన్ని అనుభవిస్తున్న వారు మీరే. ఈ అంశానికి నా కన్నా మీరే సరైన న్యాయనిర్ణేతలు. ఇలాంటి సమయంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకునేందుకు జరుగుతున్న సమావేశం ఇది. ఇలాంటి చొరవ ప్రదర్శించినందుకు మీకందరికీ నా అభినందనలు. ఎగుమతులకు సంబంధించిన ఆశావహమైన లక్ష్యాలను సాధించేందుకు మీరందరూ ప్రదర్శిస్తున్న ఉత్సాహం, మీలోని ఆశావహ దృక్పథం, కట్టుబాటు ప్రశంసనీయమైనవి.
మిత్రులారా,
మన వాణిజ్య, ఎగుమతుల రంగాల బలంతోనే మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం అత్యధిక వాటా సాధించగలిగాం. ఈ రోజు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలతోనూ మనకి వాణిజ్య, వ్యాపార మార్గాలు, అనుసంధాతలు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆ వైభవాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నంలో మన ఎగుమతుల రంగం పాత్ర అత్యంత ప్రధానమైనది. కోవిడ్ అనంతర ప్రపంచంలో ప్రపంచ సరఫరా వ్యవస్థకు సంబంధించి విస్తృత చర్చ జరుగుతోంది. ఈ కొత్త అవకాశాల నుంచి ప్రయోజనం పొందేందుకు మన ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. జిడిపిలో మన ఎగుమతుల వాటా 20 శాతం మేరకు ఉన్నదని మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఆర్థిక వ్యవస్థ విస్తృతి, సామర్థ్యం, తయారీ, సేవల రంగాల మూలం పరిగణనలోకి తీసుకుంటే ఎగుమతులు పెంచుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంతో భారత్ ముందుకు సాగుతున్న సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో మన వాటా, ఎగుమతులు కొన్ని రెట్లు అధికంగా పెంచుకోవడం మనందరి లక్ష్యం కావాలి. అంతర్జాతీయ డిమాండుకు దీటుగా మనం విస్తరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన వ్యాపారాలు పెరుగుతాయి. మన పరిశ్రమ కూడా ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాలను ఆకళింపు చేసుకుని నవ ఆవిష్కరణలు, ఆర్ అండ్ డి వాటా పెంపుపై దృష్టి సారించాలి. అప్పుడే అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థలో మనం మంచి వాటా సాధించి వృద్ధి చెందగలుగుతాం. పోటీ సామర్థ్యం, సమర్థతను ప్రోత్సహిస్తూ మనం ప్రతి రంగంలోనూ ప్రపంచ చాంపియన్లను తయారుచేయాలి.
మిత్రులారా,
ఎగుమతులు పెంచడానికి నాలుగు అంశాలు ప్రధానం.
- తయారీ రంగం మరిన్ని రెట్లు పెరగడంతో పాటు నాణ్యతలో కూడా పోటీ సామర్థ్యం పెరగాలి. ధర కన్నా వస్తువు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్న కొత్త తరం ప్రపంచంలో ఉన్నదని మన మిత్రులు చెబుతున్నారు. దాన్ని మనం పరిష్కరించగలగాలి.
- లాజిస్టిక్, రవాణా సమస్యలను మనం పూర్తిగా నిర్మూలించాల్సి ఉంది. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వం ఎగుమతిదారులతో కలిసికట్టుగా పని చేయాలి. రాష్ట్రప్రభుత్వలు చురుగ్గా పాల్గొనకపోయినా, రాష్ర్టాల్లోని ఎగుమతి మండలులు నిర్లిప్తంగా వ్యవహరించినా, వ్యాపారవేత్తలు భాగస్వాములు కాకుండా ఏకాకులుగా ఉండిపోయినా, ఎగుమతులు వాటికవే పెరుగుతాయని భావించినా మనం ఆశించిన లక్ష్యాలు సాధించలేం. మనందరం సమన్వయంతో పని చేయాలి. సంఘటితం కావాలి.
- నాలుగోది ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రధానమైన అంశం. అదే భారతీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడం.
ఈ నాలుగు అంశాలు సుసంఘటితం అయినప్పుడే భారతదేశ స్థానికం ప్రపంచీయం అవుతుంది. అప్పుడే ప్రపంచం కోసం భారత్ లో తయారీ సిద్ధాంతాన్ని మనం మెరుగైన బాటలో నడిపించగలుగుతాం.
మిత్రులారా,
వ్యాపార ప్రపంచం అవసరాలు తెలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద పలు నిబంధనలకు ఎన్నో మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సరళం అయింది. కోవిడ్ ప్రభావానికి తీవ్రగా గురైన ఎంఎస్ఎంఇలు, ఇతర రంగాలకు రూ.3 లక్షల కోట్ల విలువ గల అత్యవసర రుణ హామీ సదుపాయం అందుబాటులోకి తేవడం జరిగింది. అంతే కాదు, ఆర్థిక రంగం పునరుజ్జీవం, వృద్ధిపథంలో పయనించడం కోసం ఇటీవల మరో రూ.1.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది.
మిత్రులారా,
ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మన తయారీ రంగం పరిధిని బహుముఖీనంగా విస్తరించడమే కాకుండా ప్రపంచ శ్రేణి నాణ్యత, సమర్థతకు సహాయకారి అవుతుంది. మేడ్ ఇన్ ఇండియాలో కొత్త వాతావరణం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. తయారీ, ఎగుమతి విభాగాలు రెండింటిలోనూ కొత్త ప్రపంచ చాంపియన్లు వస్తారు. మొబైల్ ఫోన్ల రంగంలో మనం ఈ అనుభవం పొందాం. 7 సంవత్సరాల క్రితం మనం 800 కోట్ల డాలర్ల విలువ గల మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకునే వారం. ఇప్పుడది 200 కోట్ల డాలర్లకు తగ్గింది. 7 సంవత్సరాల క్రితం భారత్ 30 కోట్ల డాలర్ల విలువ గల మొబైల్ ఫోన్లు మాత్రమే ఎగుమతి చేసేది.ఇప్పుడది 300 కోట్ల డాలర్లకు పెరిగింది.
మిత్రులారా,
తయారీ, ఎగుమతుల రంగాలకు చెందిన మరో సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. లాజిస్టిక్ వ్యవధి, వ్యయంకూడా తగ్గించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి. ఇది సుసాధ్యం కావాలంటే విధాన నిర్ణయాల్లో కావచ్చు, మౌలిక వసతుల నిర్మాణంలో కావచ్చు అమిత వేగంతో ముందుకు సాగాలి. బహుళ నమూనా కనెక్టివిటీ విషయంలో మనం నేడు ముందుకు వేగంగా పురోగమిస్తున్నాం.
మిత్రులారా,
రైల్వేల ద్వారా వస్తు రవాణాలో తాను సాధించిన అనుభవాన్ని బంగ్లాదేశ్ ఇటీవల అందరితోనూ పంచుకుంది. రైల్వేల ద్వారా వస్తు రవాణా ప్రారంభించిన తర్వాత వస్తురవాణా పరిమాణం ఆకస్మికంగా పెరిగిపోయిందని తెలిపింది.
మిత్రులారా,
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు, వైరస్ ఇన్ఫెక్షన్ అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ రోజు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమిత వేగంగా సాగుతోంది. దేశ ప్రజలు, పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్క సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం మీ అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మన పారిశ్రామికులు, వ్యాపారవేత్తలు కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు నవ్యత బాటలో తమను తాము మలుచుకున్నారు. దేశంలో ఏర్పడిన మెడికల్ ఎమర్జెన్సీని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహాయకారిగా నిలిచారు. వృద్ధి పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషించారు. దాని ఫలితంగానే ఈ రోజు ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్ తో పాటు వ్యవసాయ ఎగుమతులు కూడా కొత్త శిఖరాలకు చేరాయి. ఈ రోజున మనం ఆర్థిక పునరుజ్జీవంలోనే కాదు, అధిక వృద్ధి సాధన బాటలో కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఎన్నో పెద్ద ఆర్థిక వ్యవ్థల్లో కూడా వేగవంతమైన రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతులకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగు వేసేందుకు ఇది చక్కని సమయం అని నేను భావిస్తున్నాను. ఈ దిశగా ప్రతీ ఒక్క స్థాయిలోను అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎగుమతులకు సంబంధించి ప్రధాన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల మన ఎగుమతుల రంగానికి రూ.88 వేల కోట్ల విలువ గల బీమా కవరేజి లభిస్తుంది. అంతేకాదు, ఎగుమతి ప్రోత్సాహకాల హేతుబద్ధీకరణకు, అవి డబ్ల్యుటిఓ నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
మిత్రులారా,
విభిన్న దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన ఎగుమతిదారులకు సుస్థిరత ప్రభావం ఏమిటో బాగా తెలుసు. మా కట్టుబాటుకు, విధానాల్లో నిలకడ ధోరణికి పాత తేదీ నుంచి పన్నుల విధింపు (రెట్రో పన్ను) తొలగించే ప్రయత్నమే నిదర్శనం. భారతదేశంలోని నిర్ణయాత్మక ప్రభుత్వం కొత్త అవకాశాలకు మార్గాలు తెరవడమే కాదు, హామీలను కూడా నెరవేర్చుతుందన్న సంకేతం ఎగుమతిదారులకు ఆ నిర్ణయం ద్వారా ప్రసరిస్తుంది.
మిత్రులారా,
ఎగుమతి లక్ష్యాల సాధన, సంస్కరణల పురోగతి విషయంలో రాష్ర్టాల పాత్ర ఎంతో పెద్దది. పెట్టుబడులు, వ్యాపార సరళీకరణ, చివరి గమ్యం వరకు మౌలిక వసతుల విస్తరణ అన్నింటిలోనూ రాష్ర్టాల పాత్ర ప్రధానం. ఎగుమతులు, పెట్టుబడులపై నియంత్రణాపరమైన భారాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం రాష్ర్టాలతో సన్నిహితంగా పని చేస్తోంది. రాష్ర్టాల్లో ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో ఆరోగ్యవంతమైన పోటీని ప్రోత్సహిస్తున్నాం. ప్రతీ ఒక్క జిల్లా ఒక్కో ఉత్పత్తి కేంద్రంగా మారేందుకు రాష్ర్టాలు ప్రోత్సాహం ఇవ్వాలి.
మిత్రులారా,
సంపూర్ణమైన, సవివరమైన కార్యాచరణ ప్రణాళిక ద్వారా మాత్రమే మనం ఆశావహమైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మనం ప్రస్తుత ఎగుమతుల వేగం పెంచడమే కాదు, కొత్త ఉత్పత్తులకు సరికొత్త మార్కెట్ గమ్యాలు సృష్టించేందుకు కూడా కృషి చేయాలి. ఈ విషయంలో మీ అందరికీ కొన్ని సలహాలు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి, మనం ప్రస్తుతం మూడు గమ్యాలకు ఎగుమతులు చేస్తుంటే భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సమయంలో మరో ఐదు కొత్త గమ్యాలను మనం జోడించలేమా? అది మనం సాధింగలమని నేను నమ్ముతున్నాను. అంతే కాదు, ఇప్పటికే మనం ఎగుమతి చేస్తున్న వస్తువులకు మరో 75 కొత్త వస్తువులు జోడించలేమా? గత 7 సంవత్సరాలుగా ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న మన భారత సంతతి ప్రజలు మన ప్రయత్నాలకు బలాన్ని జోడిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ర్టాల్లో భారత సంతతి ప్రజల గ్రూప్ లు ఏర్పాటు చేసి దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకి బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఎగుమతులకు సంబంధించి అలాంటి సమావేశం ఏర్పాటు చేస్తోంది. కేంద్రప్రభుత్వం, రాష్ర్టాలకు చెందిన ఎగుమతిదారులు, బిహార్ కు చెందిన భారతీయ సంతతి ప్రజలు కలిసికట్టుగా నిలిచి ఏ వస్తువులు వారు నివశిస్తున్నదేశాలకు ఎగుమతి చేయవచ్చుననే అంశం చర్చించవచ్చు. భారతీయ సంతతి ప్రజలు కూడా ఈ ప్రయత్నంతో భావోద్వేగపూరితంగా అనుసంధానమై ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ లో సహాయపడవచ్చు. ఆ రకంగా మన ఉత్పత్తులు పలు గమ్యాలకు చేరగలుగుతాయి. అదే విధంగా రాష్ట్రప్రభుత్వాలు ఐదు నుంచి పది వస్తువులను ప్రాధాన్యక్రమంలో పెట్టి 75 దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించాలి. రాష్ర్టాలు ఇలాంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. మనం కొత్త విధానాలు అనుసరించడం ద్వారా దేశ స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ సంవత్సరం సందర్భంగా కొత్త ఎగుమతి గమ్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రపంచానికి తెలియని ఎన్నో ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. ఉదాహరణకి భారతదేశం చౌకధరలో ఎల్ఇడి బల్బులు తయారుచేస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలు భూతాపం పెరిగిపోవడంపై ఆందోళన చెందుతు ఇంధనం పొదుపు చేయాలని భావిస్తున్న ఈ సమయంలో తక్కువ ధరకు ఎల్ఇడి బల్బులను మనం ఎగుమతి చేయవచ్చు. అంతే కాదు, అది ఒక మానవతాపూర్వకమైన చర్య అవుతుంది. భారతదేశం భారీ మార్కెట్ సాధించగలుగుతుంది. అలాంటివే ఎన్నో ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. నేను ఒక్క ఉదాహరణ ఇచ్చానంతే. ప్రస్తుతం మన ఎగుమతుల్లో సగం నాలుగు ప్రధాన గమ్యాలకు మాత్రమే వెళ్తున్నాయి. అలాగే ఇంజనీరింగ్ వస్తువులు, ఆభరణాలు, వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ మాత్రమే మన ఎగుమతుల్లో 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇంత పెద్ద దేశం, ఇంత వైవిధ్యం గల దేశం, ఎన్నో ప్రత్యేక ఉత్పత్తులు కలిగి ఉన్న దేశం ప్రపంచం మొత్తానికి ఎందుకు చేరలేకపోతోందన్న విషయంలో మనందరం ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆ లోపాలను మనం తొలగించుకోవాలి. మనందరం కలిసి కూచుని మార్గాలు అన్వేషించాలి. ప్రస్తుత పరిస్థితిని మార్చి కొత్త గమ్యాలకు చేరేందుకు, ప్రపంచానికి కొత్త ఉత్పత్తులు అందించేందుకు కృషి చేయాలి. గనులు, బొగ్గు, రక్షణ, రైల్వే వంటి భిన్న రంగాలను నియంత్రణల శృంఖలాల వెలుపలికి తెచ్చి తెరిచి ఉంచిన నేపథ్యంలో మన పారిశ్రామికులు, ఎగుమతిదారులకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రంగాలకు మనం భవిష్యత్ వ్యూహాలు వ్యూహాలు రచించలేమా?
మిత్రులారా,
ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొంటున్న రాయబారులు, విదేశాంగ శాఖలోని నా సహచరులకు ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మీరు ఏ దేశంలో ఉండి భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నా అక్కడి స్థానిక అవసరాలు, కోర్కెలు ఏమిటో బాగా అర్ధం చేసుకుని ఉంటారు. అంతే కాదు భారతదేశంలోని ఏ ప్రాంతం ఆ డిమాండును తీర్చగలదో కూడా మీకు బాగా తెలుసు. గత ఏడేళ్లుగా మేం ఒక కొత్త ప్రయోగం చేశాం. విదేశీ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిని సొంత రాష్ర్టాలకు పంపి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో రెండు, మూడు రోజుల పాటు చర్చలు జరిపే అవకాశం కల్పిస్తున్నాం.దీని వల్ల ఆ దేశానికి అవసరం అయిన వస్తువులు ఎగుమతి చేసే విషయం ఆ రాష్ట్రం అన్వేషించగలుగుతుంది. ఇదే ప్రయోగం కొనసాగుతోంది. మన ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు మీరందరూ బలమైన వారధి. వివిధ దేశాల్లోని భారతీయ గృహాలు భారత తయారీ రంగం శక్తికి ప్రతినిధిగా మారాలని కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు సమయం వచ్చినప్పుడల్లా ఇలా దేశంలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకం చేసినట్టయితే దేశ ఎగుమతులు పెరగడానికి అది దోహదపడుతుంది. మన రాయబార కార్యాలయాలు, ఎగుమతిదారులతో నిరంతరం కాంటాక్టులో ఉండేందుకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖకు నేను సూచిస్తున్నాను.ఈ వర్చువల్ విధానం ద్వారా మనం ఎన్నో పనులు తేలిగ్గా చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. దూర ప్రాంతాలకు ప్రయాణించి సమావేశాలు నిర్వహించడం గతంలో పరిపాటి. కాని కరోనా తర్వాత ప్రపంచం అంతటా వర్చువల్ వ్యవస్థకు ఆమోదం ఏర్పడింది. భాగస్వాములు, పార్టీలందరితోనూ అనుసంధానం కావడంవల్ల మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఈ వర్చువల్ విధానం ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని భావిస్తున్నాను.
మిత్రులారా,
ఎగుమతుల నుంచి మన ఆర్థిక వ్యవస్థ గరిష్ఠ లాభం పొందేందుకు దేశం లోపల మనం నిరంతరాయమైన, అత్యున్నత నాణ్యతతో కూడిన సరఫరాల వ్యవస్థను నిర్మించాలి. ఇందుకోసం మనం కొత్త బంధాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలి. మన ఎంఎస్ఎంఇలు, రైతులు, మత్స్యకారులతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని, స్టార్టప్ లను ప్రోత్సహించాలని ఎగుమతిదారులను నేను కోరుతున్నాను. ప్రపంచ స్టార్టప్ ల విభాగానికి మన యువతరం ఎంతో వాటా అందించగలుగుతుంది. చాలా మంది ఎగుమతిదారులు ఇందులో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. వీలుని బట్టి మన వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంలో చొరవ ప్రదర్శించాలి. మనం స్టార్టప్ లు, ఎగుమతిదారులు, ఇన్వెస్టర్లతో ఉమ్మడి వర్క్ షాప్ నిర్వహించాలి. అప్పుడే ఒకరి బలాలు ఒకరు తెలుసుకోగలుగుతారు. మనం ఈ విషయంలో ఎంతో చేయవచ్చు. మనం మద్దతు ఇవ్వవచ్చు. నాణ్యత, సమర్థత గురించి మాట్లాడితే ఔషధాలు, వ్యాక్సిన్ల విషయంలో మన శక్తి ఏమిటో ప్రపంచానికి నిరూపించి చూపించాం. టెక్నాలజీని పూర్తిగా వినియోగించడం ద్వారా మనం నాణ్యత ఎంతగా పెంచుకోవచ్చునో మన తేనె నిరూపించింది. చిన్న అంశాలు కూడా మనని శక్తివంతంగా నిలుపుతాయనేందుకు నేను చిన్న చిన్న ఉదాహరణలే చెబుతున్నాను. అంతర్జాతీయ మార్కెట్ సాధించడానికి మనం తేనె నాణ్యతను ఎంతో పెంచాల్సివచ్చింది. తేనె నాణ్యత పరీక్షించేందుకు మనం కొత్త టెక్నాలజీ ఆధారిత విధానం ప్రవేశపెట్టాం. ఫలితంగా గత ఏడాది మనం 9.7 కోట్ల డాలర్ల విలువ గల తేనె ఎగుమతి చేయగలిగాం. మరి ఫుడ్ ప్రాసెసింగ్, పళ్లు, మత్స్య రంగాల్లో మనం అలాంటి కొత్త ఆవిష్కరణలు చేయలేమా? ప్రపంచంలో ఈ రోజు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు అనుకూల వాతావరణం ఉంది. మౌలిక పునాదుల స్థాయికి తిరిగి వెళ్లగలిగే వాతావరణం ఇప్పుడు ఉంది. భారత యోగ శక్తిని ఇప్పుడు ప్రపంచం గుర్తించగలిగింది. భారత ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచంలో పెద్ద మార్కెట్ ఉంది. మనం ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం ఎలా?
మిత్రులారా,
బ్రాండ్ ఇండియా కోసం కొత్త లక్ష్యాలతో కొత్త ప్రయాణం ప్రారంభించే సమయం ఇది. నాణ్యత, విశ్వసనీయతతో కొత్త గుర్తింపు సాధించేందుకు ఇది మంచి సమయం. భారతదేశానికి చెందిన విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రపంచం అంతటా విస్తరింపచేసేందుకు మరింత విలువ చేకూర్చడం కోసం మనందరం నిరంతరం శ్రమించాలి. మన ఉత్పత్తులకు సహజసిద్ధమైన డిమాండు కల్పించేందుకు నిరంతరాయంగా విలువ జోడించడం తప్పనిసరి. మనం దీని కోసం ప్రయత్నించాలి. ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తుందని నేను ఎగుమతిదారులకు, పారిశ్రామికవేత్తలకు హామీ ఇస్తున్నాను. సుసంపన్న భారత్ ను నిర్మించడం లక్ష్యంగా మనందరం ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం చేసుకోవాలి. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగా రాయబార కార్యాలయాల్లోను మనం ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. దేశ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అది మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచానికి చేరువయ్యేందుకు, మన ప్రభావాన్ని వారిపై వదిలేందుకు 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలు అతి పెద్ద స్ఫూర్తి. 2047లో స్వాతంత్ర్య శతజయంతి వేడుకలు నిర్వహించుకునేందుకు గల ఈ 25 సంవత్సరాల వ్యవధి ఎంతో విలువైనది. ఏ ఒక్క క్షణం వృధా చేయకుండా మనం ఇందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందడుగు వేయాలి. మనం ఈ రోజు ఈ సమావేశంలోనే ఆ ఆకాంక్షతో అదే సంకల్పాన్ని మించి కృషి చేయాలి. ఆ నమ్మకంతోనే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు.
గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తర్జుమా మాత్రమే.
***
(Release ID: 1743785)
Visitor Counter : 485
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam