ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

తిరిగి పుంజుకొనేందుకు డిజిట‌లైజేష‌న్‌ను పెంచేలా ప్ర‌క‌ట‌న‌కు జీ20 దేశాల‌ డిజిటల్ మంత్రుల సమావేశంలో ఆమోదం

-'లివ‌రేజింగ్ డిజిట‌లైజేష‌న్ ఫ‌ర్ ఏ రెజీలియెంట్, స్ట్రాంగ్‌, స‌స్ట‌యినెబుల్ అండ్ ఇన్‌క్యూజివ్ రిక‌వ‌రీ డిక్ల‌రేష‌న్‌'కు సై

- స‌మావేశంలో భార‌తీయ ప్ర‌తినిధి బృందానికి నాయ‌క‌త్వం వ‌హించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్

- సామాజిక చేరికల‌కు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కీలకమైన సాధనం: ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్

- జీ20 దేశాలు ఉచిత, బహిరంగ, పారదర్శకమైన, సురక్షితమైన మరియు విశ్వసనీయమైన ఇంటర్నెట్‌పై
సహకరించుకోవాలి.. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది: ఐటీ శాఖ స‌హాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 06 AUG 2021 11:49AM by PIB Hyderabad

జీ20 దేశాల‌కు చెందిన ఐటీ మంత్రుల స‌మావేశం ఆగష్టు 5, 2020న ఇటలీలోని
ట్రైస్ట్‌లో జ‌రిగింది. ఇట‌లీ దేశం నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో "స్థితిస్థాపకత, బలమైన, స్థిరమైన మరియు సమగ్ర రికవరీ కోసం డిజిటలైజేషన్‌ను మ‌రింత‌గా పెంచ‌డం" కోసం ఒక ప్రకటన ఆమోదించ‌డం జ‌రిగింది. డిజిటల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌
మరియు డిజిటల్ ప్ర‌భుత్వం అనే స్తంభాలపై మెరుగైన సహకారాన్ని అందించే దిశగా పనిచేయడానికి మంత్రులు ఈ స‌మావేశంలో అంగీకరించారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన ఈ స‌మావేశంలో భారత‌ ప్రతినిధి బృందానికి ఎలక్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మెష‌న్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నాయకత్వం వహించారు. ఈ వేదిక‌పై భారతదేశ డిజిట‌లైజేష‌న్‌ విజయ కథను పంచుకున్నారు. ఎలక్ట్రానిక్స్ మ‌రియు ఇన్‌ఫ‌ర్మేషన్ టెక్నాలజీ శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ స‌మావేశానికి హాజరయ్యారు. స‌మావేశంలో భాగంగా డిజిటల్ చేరికలు మరియు సామాజిక సాధికారత కోసం 2015 నుండి డిజిటల్ ఇండియా ద్వారా సాధించిన పరివర్తనను శ్రీ వైష్ణవ్ ఈ సంద‌ర్భంగా పంచుకున్నారు. ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) వంటి డిజిటల్ టెక్నాలజీలు, పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రజల సాధికారత గురించి మాట్లాడారు. 1.29 బిలియన్ మందికి త‌గిన‌ డిజిటల్ గుర్తింపు ఆధార్‌ను అందించడం, 430 మిలియన్ల మంది పేద ప్రజల బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ఈ రెండింటినీ లింక్ చేయడం ద్వారా ఆర్థిక అందుబాటుల‌ను నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి పంపడం వలన డెలివరీ సిస్టమ్ నుండి లీకేజీలు తొలగిపోతాయ‌ని అన్నారు.
ఏడు సంవత్సరాలలో 24 బిలియన్ల  పైగా ఆదా..
దాదాపుగా 900 మిలియన్ల మంది పౌరులు ఒకటి లేదా అంతకంటే కూడా ఎక్కువ పథకాల నుంచి త‌గిన‌ ప్రయోజనాలు పొందుతున్నార‌ని అన్నారు. ఇది సాధారణ పౌరులను శక్తివంతం చేయడమే కాకుండా గ‌డిచిన 07 సంవత్సరాలలో 24 బిలియన్ల పైగా ఆదా చేయడానికి దారి తీసింద‌న్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డిజిటల్ చేరిక యొక్క ప్రాముఖ్యతను కూడా శ్రీ వైష్ణవ్ ఇక్క‌డ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. సాంకేతికత డిజిటల్ చేరిక కోసమేన‌ని వివ‌రించిన మంత్రి.. ఇది డిజిటల్ విభజనను సృష్టించడానికి కాదని అన్నారు. సామాజిక చేరికకు డిజిటల్ ఎకానమీ ఒక ముఖ్యమైన సాధనం అని భారతదేశం ఎప్పుడూ వాదిస్తూ వ‌స్తోంద‌ని ఆయన అన్నారు. జీ20 దేశాల ఫోరమ్‌లో సన్నిహిత భాగస్వామ్యానికి భారతదేశానికి త‌గిన‌ మద్దతు అందిస్తూనే వ‌స్తోంద‌ని అన్నారు. భవిష్యత్తులోనూ డిజిటల్ చేరికలు  సామాజిక సాధికారత దిశ‌గా సహకారానికి జీ20 దేశాలను మంత్రి ఆహ్వానించాడు.
భార‌త విశిష్ట‌త‌ను వివ‌రించిన మంత్రి..
డిజిటల్ ఇండియా కార్య‌క్ర‌మం కింద డిజిటల్ ప్లాట్‌ఫాంలు మరియు కనెక్టివిటీతో సహా బలమైన మరియు సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాల లభ్యత కోసం స‌హాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ భారత నమూనాల‌ను ఈ వేదిక‌పై ఇత‌ర దేశాల వారితో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ డిజిట‌ల్ గుర్తింపు ఆధార్ పాత్రను నొక్కిచెప్పారు. ఏకైక డిజిటల్ గుర్తింపు భారతదేశంలోని నివాసితులకు ఎప్పుడైనా, ఎక్కడైనా ధ్రువీకరించడానికి మరియు సమర్ధవంతంగా మరియు పారదర్శకంగా సబ్సిడీలు, ప్రయోజనాలు మరియు సేవలను ల‌క్షిత ప్ర‌జ‌ల‌కు అందించడానికి దోహ‌దం చేస్తుంద‌ని అన్నారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌కు, జీవనోపాధికి, ఆర్థిక వ్యవస్థలకు చేసిన చేటు నుంచి త‌గిన విధంగా కోలుకునేందుకు ప్రపంచ చరిత్రలో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా సాంకేతికత మరియు డిజిటలైజేషన్‌ల వాడ‌కం జ‌రుగుతోంద‌ని మంత్రి తెలిపారు. సాంకేతికత మరియు డిజిటలైజేషన్‌ల కోవిడ్ ప్రభుత్వ ప్రతిస్పందన టూల్ కిట్‌లలో ముందుగాను మరియు కేంద్రంగా ఉంటున్నాయ‌ని ఆయన నొక్కి చెప్పారు.
జీ20 దేశాలు స‌హ‌క‌రించుకోవాలి..
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి జీ20 దేశాలు ఉచిత, బహిరంగ, పారదర్శకమైన, సురక్షితమైన మరియు నమ్మదగిన ఇంటర్నెట్‌పై సహకరించుకోవాల‌ని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పేద మరియు అణగారిన పౌరుల జీవితాలను మార్చే లా  టెక్నాలజీ ఆధారిత నమూనాను విజయవంతంగా ప్రదర్శించిందని కూడా మంత్రులు ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.
                                 

****



(Release ID: 1743672) Visitor Counter : 178