యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఒలింపిక్‌ పతక విజేత పి.వి.సింధుకు స్వదేశంలో చిరస్మరణీయ స్వాగతం


పి.వి.సింధు భారతదేశ ప్రతీక-స్ఫూర్తి... దేశం కోసం ఆడాలని కలలుగనే భారతీయులందరికీ ఆదర్శం: అనురాగ్‌ ఠాకూర్‌ 

భారత అత్యుత్తమ ఒలింపియన్లలో పి.వి.సింధు ఒకరు: క్రీడాశాఖ మంత్రి 

Posted On: 03 AUG 2021 7:41PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు: 

•పి.వి.సింధు అభినందన సభలో పాల్గొన్న కేంద్ర మంత్రులు శ్రీమతి నిర్మలా రామన్‌, శ్రీ జి.కిషన్‌ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌;

•ఎన్నో త్యాగాలతో, నిరంతర మద్దతునిచ్చిన తల్లిదండ్రులతోపాటు నా స్వప్న సాకారానికి సదా తోడ్పడిన నా శిక్షకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను: పి.వి.సింధు 

 

   టోక్యో ఒలింపిక్స్‌-2020 బ్యాడ్మింటన్‌లో ‘హీ బింగ్‌జియావో’పై వరుస గేమ్‌లలో విజయంతో కాంస్యం సాధించి, తొలిసారి వరుసగా రెండు ఒలింపిక్‌ పతకాలు చేజిక్కించుకున్న భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధును కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ ఇవాళ ఢిల్లీలో సత్కరించారు. సింధుతోపాటు ఆమె కోచ్‌ పార్క్‌ టే శాంగ్‌ను శ్రీ ఠాకూర్‌ సాదరంగా సత్కరించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌, సాంస్కృతిక-పర్యాటక, ఈశాన్యభారత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి, క్రీడా-యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌, ఆ శాఖ సీనియర్‌ అధికారులుసహా హైదరాబాద్‌ నుంచి వచ్చిన సింధు తల్లిదండ్రులు పి.విజయ, పి.వి.రమణ కూడా పాల్గొన్నారు.

   

 

ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్‌ ప్రసంగిస్తూ- “భారత అత్యంత గొప్ప ఒలింపియన్లలో పి.వి.సింధు కూడా ఒకరు. ఆమె భారత్‌కు ప్రతీక, స్ఫూర్తి... దేశం తరఫున ఆడాలని పరితపించే భారత క్రీడాకారులందరికీ ఆదర్శం. ఆమె రెండు వరుస ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించడం అపూర్వం. ఈ విజయం రాబోయే తరం క్రీడాకారులకు ఎంతో ఉత్తేజమిస్తుంది. ‘ఒలింపిక్‌ వేదికపై పతకమే లక్ష్యం’గా ప్రభుత్వం ఎందరో క్రీడాకారులకు సానపట్టేందుకు చేసిన కృషి ఫలించిదనడానికి ఆమె విజయం ఒక నిదర్శనం. టోక్యో ఒలింపిక్ క్రీడలకు బయల్దేరే ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింధుతో సంభాషించారు. అలాగే ఆమె విజయం సాధించగానే అభినందించిన మొదటి వ్యక్తి ఆయనే. ఆమె సాధించిన అద్భుత విజయంతో 130 కోట్ల మంది భారతీయులూ పులకించిపోయారు” అన్నారు.

   

తనకు సత్కారంపై సింధు హర్షం వ్యక్తం చేస్తూ- సెమీఫైనల్స్‌ చేరడంలో వైఫల్యంపై నిరాశ చెందినప్పటికీ ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించడం ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. “నన్ను అభిమానించే వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టేడియంలో అభిమానుల ప్రత్యక్ష ప్రోత్సాహం కొరవడినప్పటికీ మాతృదేశం నుంచి కోట్లాది భారతీయులు అండగా నిలిచారు. నేను సాధించిన విజయం వారి ఆశీస్సుల ఫలితమే. అలాగే నా కోసం ఎన్నో త్యాగాలు చేయడంతోపాటు నిరంతరం మద్దతునిచ్చిన తల్లిదండ్రులకు, నా కల నిజమయ్యేలా నాకు సదా తోడ్పాటునిచ్చిన నా కోచ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ” అని పేర్కొన్నారు.

   

శ్రీమతి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ- “సింధు గొప్ప క్రీడాకారిణి. ఆ విషయాన్ని ఆమె పలుమార్లు తననుతాను రుజువు చేసుకున్నారు. కఠోర సాధన, గచ్చిబౌలీలోని అంతర్జాతీయ స్థాయి శిక్షణ సౌకర్యాలు, గొప్ప శిక్షకుడు, కుటుంబం మద్దతుతోపాటు సింధు పట్టుదల, దీక్ష, నైపుణ్యం ఈ విజయానికి దోహదం చేశాయి. ఆమెను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తి పొందడానికి ఇదే తగిన రోజు. రాబోయే తరాలకు ఆమె ఎంతటి స్ఫూర్తినివ్వగలదో, ఉత్తేజితం చేయగలదో నాకు స్పష్టంగా గోచరిస్తోంది” అన్నారు. 

     

శ్రీ రెడ్డి ప్రసంగిస్తూ- “టోక్యో ఒలిపింక్‌ క్రీడల్లో పి.వి.సింధు విజయం పలు ‘తొలి ఘనత’లకు కారణమైంది. ఆ మేరకు రెండు ఒలింపిక్‌ పతకాలు గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా, వరుసగా రెండు ఒలింపిక్‌ క్రీడల్లో పతకాలు కైవసం చేసుకున్న ఏకైక షట్లర్‌గా రికార్డులకెక్కారు. ఈ గణాంకాల వెనుక జీవితకాల ఆకాంక్షలు, పట్టుదల, త్యాగాలు ఎన్నో ఉన్నాయి. తెల్లవారుజామునుంచి క్రీడాభ్యాసం, రాత్రి పొద్దుపోయాక కూడా కసరత్తులు వంటివి అనేక ఏళ్లుగా ఆమె జీవితంలో ఓ ‘కొత్త విధానం’గా మారిపోయాయి. ఒక తెలుగువాడుగా, మా ‘తెలుగు బిడ్డ’.. అందునా హైదరాబాద్‌ యువతి ఈ ఘనత సాధించడం చూసి, నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. సింధు సాధించిన విజయం 65 లక్షల మంది హైదరాబాదీలను, 6.5 కోట్ల తెలుగువారిని మాత్రమే కాకుండా భారతదేశంలోని మహిళలు, యువతులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ అపూర్వ విజయం సాధించింనదుకు ఆమెను మరోసారి అభినందిస్తున్నాను” అని కొనియాడారు.

   

శ్రీ ప్రామాణిక్‌ మాట్లాడుతూ- రెండు వరుస ఒలింపిక్‌ పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పి.వి.సింధుకు నా అభినందనలు. ఆమె అంకితభావం, చిత్తశుద్ధి, అణకువ, క్రీడాస్ఫూర్తి అందరికీ ఉత్తేజమిస్తాయి. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది” అన్నారు.

  

గత ఒలింపిక్‌ క్రమంలో 52 అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్లడంసహా హైదరాబాద్‌లో శిక్షణ శిబిరాలకు హాజరు కావడం కోసం సింధుకు దాదాపు రూ.4 కోట్లదాకా నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. అంతేకాకుండా ఒలింపిక్స్‌కు ముందు గచ్చిబౌలీ స్టేడియంలో శిక్షణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా తోడ్పాటునిచ్చింది.

   

టోక్యో ఒలింపిక్స్‌-2020లో మీరాబాయి చాను మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కిలోల విభాగంలో జూలై 24న రజత పతకం సాధించిన నేపథ్యంలో పతకంతో తిరిగివచ్చిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచారు. ఇక మహిళల బాక్సింగ్‌ 69 కిలోల విభాగంలో పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా బోర్ఘెయిన్‌ బుధవారం నాడు సెమీఫైనల్స్‌లో బూసెనెజ్‌ సుర్మెనెలి (టర్కీ)తో తలపడనుంది.

 

***



(Release ID: 1742050) Visitor Counter : 315