ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

‘అల్ఫా’ రకం వైరస్‌తో పోలిస్తే బి.1.617.2గా పిలిచే ‘డెల్టా’ రకం 40-60 శాతం అధికంగా వ్యాధిని వ్యాప్తి చేయగలదు- డాక్టర్ ఎన్.కె.అరోరా, ‘ఇన్సాకాగ్’ (INSACOG) సహ-చైర్మన్


‘‘ఈ అంశంపై ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం...
ప్రస్తుత టీకాలు డెల్టా రకం వైరస్‌పై పోరులో ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి’’
“ఎక్కువ మంది టీకా తీసుకుని.. కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను కచ్చితంగా అనుసరిస్తే భవిష్యత్ వైరస్‌ దశలు కూడా నియంత్రణలో ఉండటమేగాక ఆలస్యం అవుతాయి”
డెల్టా రకం వైరస్‌ వల్ల వ్యాధి తీవ్రత మరింత అధికంగా
ఉంటుందని చెప్పడం కష్టం- డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా

Posted On: 19 JUL 2021 11:09AM by PIB Hyderabad

   వివిధ రకాల వైరస్‌ల నిర్ధారణ, అనుసరణకు సంబంధించిన ప్రామాణిక విధాన ప్రక్రియ (ఎస్‌ఓపి)గురించి ‘ఇండియన్‌ సార్స్‌-సీఓవీ-2 జెనోమిక్స్కన్సార్టియం’ (ఇన్సాకాగ్‌-INSACOG) సహ-చైర్మన్డాక్టర్ఎన్‌.కె.అరోరా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ‘డెల్టా’ రకం వైరస్‌ వల్ల వ్యాధి వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో, జన్యుపరమైన నిఘా ద్వారా దాని వ్యాప్తిని ఎలా అరికట్టవచ్చునో వివరించారు. అంతేకాకుండా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన ప్రాముఖ్యం గురించి పునరుద్ఘాటించారు.

   కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వైరస్‌ సంపూర్ణ జన్యుక్రమం రూపకల్పన కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ శాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్‌ఐఆర్‌)ల పరిధిలోని మొత్తం 28 ప్రయోగశాలలతో ‘ఇన్సాకాగ్‌’ (INSACOG) రూపుదిద్దుకుంది. దీన్ని భారత ప్రభుత్వంలోని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 25/12/2020న ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి:

ప్రశ్న: ‘ఇన్సాకాగ్‌’ ఇటీవల తన పరిధిని పెంచుకుంది... ఈ విస్తరణ వెనుక ఆలోచన ఏమిటి?

జవాబు: మనకు ఆందోళన కలిగిస్తున్న వైరస్‌ రకాల ఆవిర్భావం, వాటి వ్యాప్తిపై మనం నిశితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా అవి మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకముందే వాటిని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే 10 ప్రయోగశాలలతో ‘ఇండియన్‌ సార్స్‌-సీఓవీ-2 జెనోమిక్స్కన్సార్టియం’ (ఇన్సాకాగ్‌-INSACOG) 2020 డిసెంబరులో ఏర్పాటు కాగా, ఇటీవల మరో 18 ప్రయోగశాలలు ఇందులో భాగమయ్యాయి. ‘సార్స్‌-సీఓవీ-2’ జన్యుక్రమపరమైన నిఘా కోసం ప్రయోగశాలల బలమైన నెట్‌వర్క్‌ అవసరమన్నదే దీనివెనుకగల ఆలోచన. ఈ నెట్‌వర్క్‌ రూపొందించే సంపూర్ణ జన్యుక్రమ (WGS) సమాచారంతో వైద్య/వ్యాధులవ్యాప్తి అధ్యయన సమాచార సహసంబంధాన్ని పోల్చి చూస్తారు. తద్వారా ఏదైనా వైరస్‌ రకం మరింత అధికంగా వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందా, వ్యాధి తీవ్రత పెరుగుతుందా, వ్యాధి నిరోధకతను అధిగమిస్తుందా, ఇతర వ్యాధుల విజృంభణకు దారితీస్తుందా, టీకాల సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతుందా తదితర అంశాలనే కాకుండా ప్రస్తుత పరీక్ష పద్ధతులతో నిర్ధారణ సాధ్యమవుతుందా అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సమాచారం మొత్తాన్నీ ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం’ (NCDC) పూర్తిస్థాయిలో విశ్లేషిస్తుంది. ఇందుకోసం దేశాన్ని రెండు భౌగోళిక ప్రాంతాలుగా విభజించి ప్రతి ప్రయోగశాలకు ఒక ప్రాంతం బాధ్యత అప్పగించబడింది. అలాగే ప్రతి సముదాయంలో 4 జిల్లాల వంతున మొత్తం 180-190 సముదాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సముదాయాల పరిధిలో క్రమబద్ధంగా శ్లేష్మం నమూనాలు, తీవ్ర అనారోగ్యం బారినపడిన రోగుల నమూనాలు తీయడంతోపాటు టీకాల వల్ల కలిగే వ్యాధులు, ఇతర అసాధారణ వైద్య దృష్టాంతాలు వంటి వివరాలు సేకరించి, వాటి క్రమాన్ని రూపొందించడం కోసం ప్రాంతీయ ప్రయోగశాలలకు పంపుతారు. ప్రస్తుతం నెలకు 50,000కుపైగా నమూనాల జన్యుక్రమాన్ని రూపొందించగల సదుపాయాలు దేశంలో ఉండగా ఇంతకుముందు ఈ సామర్థ్యం సుమారు 30,000 నమూనాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

ప్రశ్న: ‘ఈ వైరస్‌ రకాల నిర్ధారణకుగల యంత్రాంగం ఏమిటి... ఆ రకాలను ఎలా అనుసరిస్తారు?

జవాబు: భారతదేశంలో ఇప్పటికే అత్యంత సమర్థ ‘వ్యాధులపై సమగ్ర నిఘా కార్యక్రమం’ (IDSP) యంత్రాంగం ఉంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలు/నిఘా కేంద్రాల నుంచి నమూనాల సేకరణ, ప్రాంతీయ జన్యుక్రమ రూపకల్పన ప్రయోగశాలల (RGSL)కు రవాణా బాధ్యతను సమన్వయం చేస్తారు. అటుపైన జన్యుక్రమం రూపకల్పన, ఆందోళనకారక వైరస్‌ రకాలు (VOC)/ఆసక్తికర వైరస్‌ రకాలు (VOI), సంభావ్య ఆసక్తికర రకాలు, ఇతర మార్పుల క్రమాన్ని రూపొందించడం ‘ఆర్జీఎస్ఎల్’ల బాధ్యత. ఇందులో ‘వీఓసీ/వీఓఐ‘లకు సంబంధించిన సమాచారం నేరుగా కేంద్రీయ నిఘా యూనిట్ (CSU)కు పంపబడుతుంది. అక్కడి అధికారులు దీన్ని రాష్ట్ర నిఘా అధికారులతో సమన్వయంద్వారా వైద్య-సాంక్రమిక వ్యాధులతో సహసంబంధాన్ని విశ్లేషిస్తారు. అనంతరం  నమూనాలను సంబంధిత ప్రత్యేక ‘జీవనిధి‘ (బయో బ్యాంక్)కి పంపిస్తారు.

   ప్రజారోగ్యంతో సంబంధంగల జన్యు పరివర్తనను గుర్తించిన తర్వాత, ఆ నమూనాలను ‘ఆర్జీఎస్ఎల్’లు ‘శాస్త్ర-వైద్య సలహా బృందానికి (SCAG) పంపుతాయి. ఈ బృందం సంభావ్య ఆసక్తికర రకాలు, వాటిలో పరివర్తనలపై నిపుణులతో చర్చించి, అవసరమైతే మరింత పరిశోధన కోసం ‘సీఎస్‌యూ’కు తిరిగి పంపాలని సిఫారసు చేస్తుంది. సమాచారం ‘ఎన్‌సీడీసీ’ పరిధిలోని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి, బయోటెక్నాలజీ శాఖ, భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, ఆయా రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా ‘ఐడీఎస్‌పీ’లు క్రోడీకరించిన సమాచారంపై వైద్య-సాంక్రమిక వ్యాధి సహసంబంధ విశ్లేషణ చేపడుతుంది. చివరగా, కొత్త ఉత్పరివర్తనాలు/ఆందోళనకారక రకాల సంవర్ధనం చేపట్టి శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తారు. తద్వారా వ్యాధి వ్యాపకతపై ప్రభావం, వైరస్‌ తీవ్రత, టీకా సామర్థ్యం, వ్యాధి నిరోధకత అధిగమనం తదితర లక్షణాలను గుర్తిస్తారు. 

ప్రశ్న: ‘డెల్టా’ రకంపై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది... దీన్ని తీవ్ర ప్రభావం గలదిగా పరిగణించడానికి కారణమేమిటి?

జవాబు: కోవిడ్‌-19 వైరస్‌ ‘బి.1.617.2’ను ‘డెల్టా’ రకంగా వ్యవహరిస్తారు. దీన్ని 2020 అక్టోబరులో భారతదేశంలో కనుగొనగా... దేశంలో రెండోదశ వ్యాధి వ్యాప్తికి ఇదే ప్రధానంగా కారణం. దేశంలో ప్రస్తుతం నమోదైన కోవిడ్‌-19 కేసులలో 80 శాతం దీనివల్ల వ్యాపించినవే. ఇది మహారాష్ట్రలో ఆవిర్భవించి దేశంలోని పశ్చిమ రాష్ట్రాల మీదుగా ఉత్తరదిశగా ప్రయాణించి, ఆ తర్వాత మధ్య, తూర్పు రాష్ట్రాలో ప్రవేశించింది. మన కణ ఉపరితలం మీదగల ‘ఏసీఈ2’ గ్రాహకాలతో మరింతగా పెనవేసుకోవడంలో దీని ప్రధాన (స్పైక్‌) ప్రొటీన్‌లో ఉత్పరివర్తనాలు తోడ్పడతాయి. దీనివల్ల ఇది మరింత ఎక్కువగా వ్యాపించడమే కాకుండా శరీర వ్యాధి నిరోధకతను మాయచేయగలుగుతుంది. అందువల్ల మునుపటి (అల్ఫా) రకంతో పోలిస్తే ఇది 40 నుంచి 60 శాతం ఎక్కువగా విస్తరించగలదు. ఇది ఇప్పటికే యూకే, యూఎస్‌ఏ, సింగపూర్‌ తదితర 80కిపైగా దేశాల్లో వ్యాపించింది.

ప్రశ్న: ఇతర రకాలతో పోలిస్తే దీనివల్ల వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందా?

జవాబు: ఈ రకంలో సంయుక్త కణ స్వరూపం దాల్చగల కొన్ని ఉత్పరివర్తనాలు చోటు చేసుకున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా మానవ కణంపై దాడిచేశాక ఇది మరింత వేగంగా తన ప్రతిరూపాన్ని సృష్టించగలదు. దీనికి ప్రతిస్పందనగా ఊపిరితిత్తుల వంటి అవయవాల్లో విపరీతమైన మంట, బాధ మొదలవుతాయి. అయితే, ‘డెల్టా’ రకం వల్ల వ్యాధి తీవ్రత అధికమవుతుందని చెప్పలేం. కాగా, భారతదేశంలో వైరస్‌ తొలిదశ తరహాలోనే రెండో దశలోనూ పీడితుల వయసు, మరణాలు ఒకేవిధంగా ఉన్నాయి.

ప్రశ్న: ‘డెల్టా’ రకంతో పోలిస్తే ‘డెల్టా ప్లస్‌’ మరింత తీవ్రమైనదా?

జవాబు: ఈ ‘డెల్టా ప్లస్‌’లో- ‘ఎవై.1, ఎవై.2’ రకాలకు చెందిన 55 నుంచి 60 కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ సహా 11 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ‘ఎవై.1’ రకం నేపాల్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, పోలాండ్‌, జపాన్‌ దేశాల్లో కూడా కనుగొనడినప్పటికీ ‘ఎవై.2’ రకం తక్కువగా కనిపిస్తోంది. దీని వ్యాపకత, తీవ్రత, టీకాల అధిగమన లక్షణాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది.

ప్రశ్న: ‘డెల్టా’ రకంపై టీకాలు సమర్థంగా పోరాడగలవా?

జవాబు: కచ్చితంగా... దీనికి సంబంధించి ‘ఐసీఎంఆర్‌’ నిర్వహించిన అధ్యయనం మేరకు మన టీకాలు ‘డెల్టా’ రకంపై సమర్థంగా పోరాడగలవు.

ప్రశ్న: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసుల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది... ఎందుకు?

జవాబు: దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్ధారణ పరీక్షల్లో కొత్త కేసుల శాతం (TPR) ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాల్లో, దక్షిణ భారతంలోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కేసులకు ఈ ‘డెల్టా’ రకం వైరస్‌ కారణం కావచ్చు.

ప్రశ్న: వైరస్‌ తదుపరి దశలను నిరోధించగలమా?

జవాబు: జనాభాలోని ఇతరత్రా వ్యాధి పీడితులకు, వ్యాధులకు తేలికగా లొంగిపోయే శరీర స్వభావంగలవారికి ఈ వైరస్‌ వ్యాపించడం ప్రారంభిస్తుంది. అధికశాతం జనాభాకు వ్యాపించిన తర్వాత వారిలో నిరోధక శక్తి పెరగడంతో ఈ వైరస్‌ అంతర్థానమై... జనాభాలో నిరోధకశక్తి తగ్గిన తర్వాత మళ్లీ దాడిచేయడం ప్రారంభిస్తుంది. ఆ మేరకు మరింత వ్యాధికారక వైరస్‌ వల్ల కొత్త కేసుల సంఖ్య బాగా పెరగవచ్చు. ఒక్కమాటలో చెబితే, తేలికగా లొంగిపోయే శరీర స్వభావం గలవారిపైనే తదుపరి దశ ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే, రెండోదశ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజలు మరింత అధికసంఖ్యలో టీకాలు తీసుకునేకొద్దీ భవిష్యత్‌ దశల నియంత్రణ, ఆలస్యం సాధ్యమే. ముఖ్యంగా జనాభాలో అధికశాతం టీకాలు తీసుకునేదాకా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను కచ్చితంగా అనుసరించడం తప్పనిసరి.

   కాబట్టి ప్రజలంతా టీకాలు తీసుకోవడంపై దృష్టా సారించడమే కాకుండా కోవిడ్‌-19 నివారణ దిశగా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అవశ్యం.

 

***

 

 (Release ID: 1736725) Visitor Counter : 277