విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల విద్యుత్ పంపిణీ వినియోగాలు, ర్యాంకులకు సంబంధించి 9వ సమగ్ర రేటింగ్స్ను కేంద్ర విద్యుత్శాఖ మంత్రి విడుదల చేశారు.
విద్యుత్ పంపిణీకి సంబంధించి న్యాయమైన, కచ్చితమైన అంచనాల వల్ల భారతీయ విద్యుత్రంగానికి ప్రయోజనం కలుగుతుంది. దాని పనితీరును అంచనా వేయడానికి, పనితీరును మరింతగా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది : ఆర్కే సింగ్
ఏర్పాటైనప్పటి నుంచి అద్భుతమైన పనితీరుతో 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ను విద్యుత్ మంత్రి అభినందించారు.
Posted On:
16 JUL 2021 2:52PM by PIB Hyderabad
రాష్ట్రాల విద్యుత్ పంపిణీ, వినియోగానికి సంబంధించి 9వ సమగ్ర రేటింగ్స్ను కేంద్ర విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ ఆర్కే సింగ్ విడుదల చేశారు. 9వ వార్షిక సమగ్ర రేటింగ్ కసరత్తు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 41 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ వినియోగాలను అంచనాలను పూర్తిచేసిందని, ఆయా రాష్ట్రాలు ఎంతో ఉత్సాహంతో ఇందులో పాల్గొనడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు.
కరోనా వంటి మహమ్మారి పరిస్థితుల్లో కూడా విద్యుత్ వినియోగాలకు సంబంధించి తొమ్మిద వార్షిక సమగ్ర రేటింగ్ కసరత్తును పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషించి, సహకరించిన వాటాదారులకు, ప్రత్యేకించి రాష్ట్రాల విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు మంత్రి అభినందించారు.
విద్యుత్ పంపిణీకి సంబంధించి న్యాయమైన, కచ్చితమైన అంచనాల వల్ల భారతీయ విద్యుత్రంగానికి ప్రయోజనం కలుగుతుంది. దాని పనితీరును అంచనా వేయడానికి, పనితీరును మరింతగా మెరుగుపర్చడానికి సహాయపడుతుందని మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, రుణసంస్థలు, ఇతర వాటాదారులు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు.
ఏర్పాటైనప్పటి నుంచి అద్బుతమైన పనితీరుతో 35 వసంతాలు పూర్తిచేసుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)ని మంత్రి అభినందించారు. పీఎఫ్సీ దేశంలోనే ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా మారిందని, భారతీయ విద్యుత్ రంగానికి ఆర్థికసహాయం చేయడంలో పీఎఫ్సీ కీలక పాత్ర పోషించిందన్నారు.
విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రభుత్వ సంస్కరణ పథకాలలో పిఎఫ్‌సి ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోందన్నారు. రూ.3 ట్రిలియన్ల.. రిఫార్మ్స్ బేస్డ్ అండ్ రిజల్ట్ లింక్డ్, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, ఆత్మనిర్బర్ డిస్కమ్ ప్యాకేజీ మొదలైనవి ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని మంత్రి ప్రశంసించారు. ఇదే రకమైన పంథాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనసాగిస్తుందని, విద్యుత్ రంగంలోని భాగస్వాములందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి ఆర్కేసింగ్ ఆకాంక్షించారు.
అనంతరం.. 1.52 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్స్ను ఏర్పాటుచేయడం ద్వారా వన్ నేషన్ – వన్ గ్రిడ్ – వన్ ఫ్రీక్వెన్సీ లక్ష్యాన్ని సాధించడం గురించి మంత్రి మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన, సఫరాకు సంబంధించిన అంతరాలను తగ్గించడంతోపాటు వినియోగదారుల సాధికారతపై కూడా ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. వినియోగదారుల హక్కుల నేపథ్యంతో ఇటీవల ప్రకటించిన విద్యుత్ నిబంధనలు–2020.. ఈ దిశలో ఓ ముందడుగుగా మంత్రి అభివర్ణించారు. ఈ ప్రయత్నం వినియోగదారుడిని కేంద్రస్థానంలో ఉంచుతుందని, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపర్చడానికి ఇదో కీలమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్రంగం మెరుగైన పనితీరుకు, లక్ష్యాల సాధనకు శక్తిమంతమైన, సమర్థమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ కీలకమని.. దేశ విద్యుత్ పంపిణీలో రాష్ట్రాల విద్యుత్రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం ద్వారా అన్ని గృహాలకు 24 గంటలపాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు అవసరమైన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతుగా నిలుస్తోందన్నారు.
కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సవాలుగా మారిన విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అత్మనిర్భర్ అభియాన్లోభాగంగా లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి వీలుగా విద్యుత్ రంగానికి ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ‘ విషయంలో అన్ని రాష్ట్రాల డిస్కమ్లు / విద్యుత్ శాఖ యొక్క కార్యాచరణ సామర్థ్యాలను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో.. రిఫార్మ్స్ బేస్డ్ అండ్ రిజల్ట్ లింక్డ్, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల ఆమోదించింది. విద్యుత్ సరఫరాకు సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు, ఆధునీకరించేందుకు డిస్కమ్లకు ఆర్థిక సాయం అందించాలని ఈ పథకం సంకల్పించింది. రాష్ట్రాలు తమ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు ఈ పథకం కింద నిధులను పొందొచ్చు. పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నచోట.. ఈ నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటేనే రాష్ట్రాలు ఈ పథకం కింద నిధులను తీసుకోగలవు. అందువల్ల విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలతోనే ఈ పథకం నిధులు ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే డిస్కమ్ పనితీరులో మెరుగుదల కనిపిస్తోంది. ఈ పథకం అమలుతో డిస్కమ్ల పనితీరు మరింత మెరుగుపడుతుంద’ని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్శాఖ సహాయ మంత్రి కిషన్ పాల్ గుర్జార్, విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అలోక్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వాల ఇంధన కార్యదర్శులు, రాష్ట్రాల విద్యుత్ పంపిణీ వ్యవస్థల సీఎండీలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ, ఆర్ఈసీ సీఎండీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ మంత్రిత్వశాఖ ఆమోదించిన పద్ధతి ప్రకారం ఈ సమగ్ర రేటింగ్ కసరత్తు వార్షిక ప్రాంతిపదికన 2012 నుంచి నిర్వహిస్తారు. ఇది ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో 41 విద్యుత్ పంపిణీ వ్యవస్థలను కలిగి ఉంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలుగా ఐసీఆర్ఏ, సీఏఆర్ఈ నియమింపబడ్డాయి. ఐసీఆర్ఏ అనలిటిక్స్ లిమిటెడ్, సీఈఆర్ఈ అడ్వైజరీ రీసెర్స్ అండ్ ట్రైనింగ్ లిమిటెడ్ తొమ్మిదవ సమగ్ర రేటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. ఈ కసరత్తులో విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, రేటింగ్ ఏజెన్సీలు, విద్యుత్ మంత్రిత్వశాఖలు సమన్వయంతో పూర్తిచేసుకునేలా చూడాలని మంత్రి ఆర్ కే సింగ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఆదేశించారు. విద్యుత్ మంత్రిత్వశాఖకు సమర్పించిన మొత్తం 41 విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన సమగ్ర రేటింగ్ నివేదికలను ఈరోజు విడుదల చేశారు. చేయబడ్డాయి.
***
(Release ID: 1736387)
Visitor Counter : 199