విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఇంధన పరివర్తన రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్ .. కేంద్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్


గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో భారత్ ముందడుగు. .. శ్రీ ఆర్ కె సింగ్

గ్రీన్ ఎనర్జీ రంగంలో విధానాలను ప్రభుత్వం సులభతరం చేస్తుంది ..ఇంధన శాఖ మంత్రి

Posted On: 16 JUL 2021 9:23AM by PIB Hyderabad

ఇంధన పరివర్తన రంగంలో భారతదేశం ప్రపంచంలో ముందున్నదని  కేంద్ర విద్యుత్కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ అన్నారు. ఆత్మ నిర్భర్ భరత్-పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచంలో  పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి  చేసుకుంటున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. 

పారిస్ లో జరిగిన కాప్-21 సమావేశంలో అంగీకరించిన విధంగా 2030 నాటికి  విద్యుత్ ఉత్పత్తిలో 40% ఉత్పత్తిని  శిలాజ రహిత ఇంధన వనరులను వినియోగించి చేయాలన్న ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 38.5% విద్యుత్ ను శిలాజ రహిత ఇంధన వనరులను వినియోగించి చేస్తున్నామని, సామర్ధ్య పెంపుదలకు అమలు చేస్తున్న పథకాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది 48. 5%గా ఉంటుందని మంత్రి వివరించారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గెగా వాట్లకి పెంచి ఈ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని శ్రీ సింగ్ అన్నారు. 

దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద ప్రతి గ్రామాన్ని, ప్రతి కుగ్రామాన్ని అనుసంధానించామని,, సౌభాగ్య పథకం కింద ప్రతి ఇంటిని అనుసంధానించడం ద్వారా భారతదేశం అందరికి విద్యుత్ అందించడంలో విజయం సాధించిందని  మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా సాగిన అతి భారీ పథకం ఇదేనని మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని అన్నారు. 

కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో విధ్యుత్ డిమాండ్ 200 గెగా వాట్లకు చేరుకున్నదని శ్రీ సింగ్ తెలిపారు. కోవిడ్ ప్రభావం లేని సమయంలో కూడా విద్యుత్ కు ఇంత డిమాండ్ లేదని వివరించిన మంత్రి ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. దీనివల్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. 

సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని శ్రీ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమాల ఫలితాలు దేశానికి ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో ఆత్మ నిర్భర్ భారత్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. భారత పరిశ్రమలను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో కొన్ని దేశాలు అతి తక్కువ ధరలకు సౌర ఘటాలుమాడ్యూళ్ళను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత పరిశ్రమలను రక్షించాలన్న లక్ష్యంతో సౌర ఘటాలుమాడ్యూళ్ళపై కస్టమ్స్ సుంకాన్ని విధించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. 

అనుమతి పొందిన నమూనాలు, ఉత్పత్తిదారుల జాబితా వల్ల కూడా స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కలుగుతుందని శ్రీ సింగ్ పేర్కొన్నారు. 

గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా రంగాల్లో కూడా ప్రపంచంలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని శ్రీ సింగ్ అన్నారు. 

దిగుమతి చేసుకున్న సహజ వాయువు నుంచి ఉత్పత్తి గ్రే హైడ్రోజన్ స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగించాలని పరిశ్రమలకు సూచిస్తున్నామని శ్రీ సింగ్ తెలిపారు. దీనికోసం పెట్రోలియం, ఎరువుల లాంటి రంగాలు గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుంటాయని ఆయన వివరించారు. దీనివల్ల స్వదేశంలో ఉత్పత్తి అవుతున్న సౌర, పవన విధ్యుత్ ఉత్పత్తి పరికరాలకు డిమాండ్ పెరగడమే కాకుండా నిల్వ సామర్ధ్యం కూడా పెరుగుతుందని అన్నారు. 

తమ అవసరాలకు గ్రీన్ ఎనర్జీ ని వినియోగించడానికి ముందుకు వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం త్వరలో నియమ నిబంధనలకు రూపకల్పన చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇటువంటి పరిశ్రమలు స్వయంగా లేదా ఇతరుల సహకారంతో ఇంధన ఉత్పత్తి సౌకర్యాలను నెలకొల్పుకునే దానిద్వారా తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుందని శ్రీ సింగ్ అన్నారు. దీనిపై అనవసరమైన సర్‌చార్జ్,లెవీలు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. 

***


(Release ID: 1736112) Visitor Counter : 213