వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం, అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను ప్రస్తావించిన వాణిజ్యశాఖ మంత్రి మత్స్య రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న మోదీ
భారతదేశ సాంప్రదాయ,పేద మత్స్యకారుల రక్షణకు సహకరించాలి
అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సముద్ర, దేశీయ చేపల వేటపై భారతదేశానికి హక్కులు కల్పించాలి
“ భవిష్యత్ లక్ష్యాలపై భారత్ రాజీ పడే ప్రసక్తే లేదు ”
వ్యవసాయ రంగంలో 30 సంవత్సరాల జరిగిన పొరపాట్లు పునరావృతం చేయవద్దని సూచన
Posted On:
15 JUL 2021 2:57PM by PIB Hyderabad
కీలకమైన మత్స్య రాయితీలపై ఈ రోజు జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మంత్రుల స్థాయి సమావేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, వస్త్ర శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రస్తావించి వీటిని పరిరక్షించాలని కోరారు . ఈ సమావేశంలో ఇతర డబ్ల్యుటిఒ సభ్య దేశాల మంత్రులు, రాయబారులు సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గోజీ పాల్గొన్నారు.
భవిష్యత్ లక్ష్యాలపై భారత్ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన శ్రీ గోయల్ ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని అన్నారు. అమలులో ఉన్న సహేతుకంగా లేని సబ్సిడీలు, అవసరానికి మించి కొన్ని దేశాలు సాగిస్తున్న చేపల వేట వల్ల భారతదేశ మత్స్యకారులు నష్టపోతూ జీవనోపాధిని కోల్పోతున్నారని మంత్రి అన్నారు. కీలకమైన అంశంపై ఇప్పటికీ సభ్య దేశాలు అవగాహనకు రాకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్య దేశాల మధ్య అందరికీ ఆమోదకరమైన, ప్రతి ఒక్కరి హక్కులను రక్షించే విధంగా అవగాహన కుదరవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న తమ ప్రభుత్వం చిన్న మత్స్యకారుల ప్రయోజనాలన రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.
మూడు దశాబ్దాల క్రితం ఉరుగ్వే సమావేశంలో చేసిన పొరపాట్లను తిరిగి పునరావృతం చేయవద్దని శ్రీ గోయల్ సూచించారు. ఉరుగ్వే సమావేశంలో ఎంపిక చేసిన కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు వ్యవసాయ రంగంలో అనుచితంగా అసమానంగా హక్కులను కల్పించారని మంత్రి ఆక్షేపించారు. దీనివల్ల ఆ సమయంలో తమ దేశాల్లో పరిశ్రమ/వ్యవసాయ రంగానికి అవసరమైన వనరులను సమకూర్చలేని అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోవలసి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసమతుల్యమైన లేదా అసమానమైన ఒప్పంద రూపకల్పనకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా లేని దీనిలో తమను భాగస్వాములను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ సబ్సిడీలు పొందుతున్న వారు తమ సబ్సిడీలను తగ్గించుకోవడానికి, చేపల వేట సామర్థ్యాన్ని తగ్గించుకోవడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.
వివిధ దేశాలు వివిధ అభివృద్ధి సాధన దశలో ఉన్నాయని, ప్రస్తుత మత్స్యకార ఒప్పందాలు వాటి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా రూపొందాయన్న అంశాలను ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాలని శ్రీ గోయల్ అన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ ఒప్పందం రూపొందాలని అన్నారు. మత్స్యరంగంలో అభివృద్ధి చెందిన దేశాలు కల్పిస్తున్న రాయితీలతో పోల్చి చూస్తే అభివృద్ధి చెందిన దేశాలు ఇస్తున్న రాయితీలు తక్కువగానే ఉంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. మత్స్య రంగంలో అభివృద్ధి చెందని భారతదేశం లాంటి దేశాలు తమ భవిష్యత్ లక్ష్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకు సబ్సిడీ లను కొనసాగించడానికి అనుమతించడం అన్యాయమని సహేతుకం కాదని మంత్రి స్పష్టం చేశారు.
డైరెక్టర్ జనరల్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పేద సంప్రదాయ మత్స్యకారులకు ప్రత్యేక హక్కులను కల్పించకపోవడం సరి కాదని దీనిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని శ్రీ గోయల్ వివరించారు. జీవనోపాధిని రక్షించి అభివృద్ధి సాధనకు సంప్రదాయ పేద మత్స్యకారులకు ప్రత్యేక హక్కులను కల్పించవలసి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. విధాన నిర్ణయాలను తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి వుంటుందని అన్నారు.
ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మత్స్య రంగానికి సంబంధించి ఎటువంటి అసమానతలు లేకుండా రూపొందే ఒప్పందాలకు భారతదేశం ఆమోదం తెలుపుతుందని శ్రీ గోయల్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని మంత్రి అన్నారు.
***
(Release ID: 1735897)
Visitor Counter : 249