ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 స్థితి పై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
ఈశాన్య రాష్ట్రాల పట్ల ప్రధాన మంత్రి తీసుకొంటున్న ప్రత్యేక శ్రద్ధ ను ప్రశంసించిన ముఖ్యమంత్రులు; కోవిడ్ మహమ్మారి ని సంబాళించడం లో సకాలం లో చర్య తీసుకొన్నందుకు ఆయన కు వారు ధన్యవాదాలు తెలిపారు
వైరస్ రూపు ను మార్చుకొంటూ ఉండటాన్ని నిశితం గా పర్యవేక్షిస్తుండటం తో పాటు అన్ని వేరియంట్ లను గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి
పర్వత ప్రాంత పట్టణాల లో తగిన ముందు జాగ్రతల ను పాటించకుండానే పెద్ద సంఖ్య లో గుమికూడటానికి వ్యతిరేకం గా గట్టి చర్యల ను తీసుకోవాలి
థర్డ్ వేవ్ ను ఏ విధం గా నివారించాలనేదే మన మనస్సు లో ప్రధానమైన ప్రశ్న కావాలి: ప్రధాన మంత్రి
టీకా వేయించుకోవడాని కి వ్యతిరేకం గా ఉన్న అపోహల ను ఎదుర్కోవడానికి సామాజిక సంస్థ ల, విద్య సంస్థ ల, ప్రముఖుల, ధార్మిక సంస్థ ల సహాయాన్ని పొందండి: ప్రధాన మంత్రి
‘అందరికీ టీకా మందు- అందరికీ ఉచితం’ ప్రచార ఉద్యమాని కి ఈశాన్య ప్రాంతం కీలకం: ప్రధాన మంత్రి
వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం లో ఇటీవల ఆమోదం లభించిన 23,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ సాయ
Posted On:
13 JUL 2021 2:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్-19 స్థితి ని గురించి ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో నాగాలాండ్, త్రిపుర, సిక్కిమ్, మేఘాలయ, మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్ ముఖ్యమంత్రుల తో పాటు అసమ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి ని సంబాళించడం లో సకాలం లో చర్యలు తీసుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు గాను ఆయన ను వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రుల కు తోడు హోం శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) శాఖ మంత్రుల తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు.
ముఖ్యమంత్రులు వారి వారి రాష్ట్రాల లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం తాలూకు పురోగతి ని గురించి, వ్యాక్సీన్ ను మారుమూల ప్రాంతాల కు సైతం తీసుకు పోవడానికి చేపడుతున్న చర్యల ను గురించి వివరించారు. టీకా ఇప్పించుకొనే అంశం లో సంకోచాన్ని గురించి, ఆ సమస్య ను అధిగమించడానికి తీసుకొంటున్న చర్యల ను గురించి కూడా వారు వివరించారు. కోవిడ్ కేసుల ను మరింత ఉత్తమమైన పద్ధతి లో ఎదుర్కోవడానికి అనువైన వైద్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం కోసం తీసుకొన్న చర్యల ను, పిఎమ్-కేర్స్ ఫండ్ ద్వారా అందుతున్న తోడ్పాటు ను గురించి తెలియజేశారు. వారి రాష్ట్రాల లో కేసుల సంఖ్య ను, పాజిటివిటీ రేటు ను తగ్గించడం కోసం సకాలం లో చర్యల ను తీసుకొంటాం అంటూ వారు హామీ ని ఇచ్చారు.
రోజువారీ గా మొత్తం కేసు ల సంఖ్య నమోదు లో తగ్గుదల ను గురించి కేంద్ర హోం శాఖ మంత్రి ప్రస్తావించారు. అయితే, ఇది ఏ వ్యక్తి అయినా సడలుబాటు ను కనబరచడానికి గాని, తగిన జాగ్రత చర్యల ను తీసుకోవడాన్ని తగ్గించివేయడానికి గాని దారి తీయకూడదు అంటూ ఆయన హెచ్చరిక చేశారు. దేశం లోని కొన్ని ప్రాంతాల లో పాజిటివిటీ రేటు అధికం గా ఉంటోందని ఆయన అన్నారు. పరీక్ష లు చేయడం, ట్రేసింగ్, ట్రాకింగ్, టీకా మందు ను వేయించడం వంటి అంశాల కు పెద్ద పీట వేయాలి అని ఆయన నొక్కిచెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి దేశం లో కోవిడ్ కేసు ల సమగ్ర వివరణ ను అందించారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు కొన్నిటి లో పాజిటివిటీ రేటు అధికం గా ఉందని ఆయన చర్చించారు. మెడికల్ ఆక్సీజన్ సరఫరా ను పెంచేందుకు చేపట్టిన చర్యల ను గురించి, ప్రజల కు టీకా ఇప్పించే కార్యక్రమం లో ప్రగతి ని గురించి కూడా ఆయన సమగ్రమైన నివేదిక ను సమర్పించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు దుర్గమ ప్రాంతాలు ఉండేటప్పటికీ పరీక్షల ను నిర్వహించడానికి, చికిత్స ను అందించడానికి, టీకామందు ను ఇప్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల ను కల్పించడం లోను, మహమ్మారి కి వ్యతిరేకం గా యుద్ధం చేయడం లోను అక్కడి ప్రజలు, ఆరోగ్య శ్రామికులు, ప్రభుత్వాలు కఠోరంగా పాటుపడినందుకు కొనియాడారు.
కొన్ని జిల్లాల లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం పై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సంకేతాల ను అందిపుచ్చుకొని క్షేత్ర స్థాయి లో కఠిన చర్యల ను తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. పరిస్థితి ని ఎదుర్కోవడం లో సూక్ష్మ కట్టడి విధి విధానాల ను అమలు పరచాలంటూ ఆయన మరో మారు స్పష్టం చేశారు. ఈ విషయం లో గత ఒకటిన్నర సంవత్సరాల కాలం లో సంపాదించుకొన్న అనుభవాన్ని, ఉత్తమమైనటువంటి అభ్యాసాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలి అని సూచించారు.
వైరస్ వేగం గా రూపు ను మార్చుకొంటోందని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మ్యుటేశన్ ను ఖచ్చితమైన విధం గా పర్యవేక్షించాలని, వేరియంట్ లు అన్నిటిని గమనిస్తూ ఉండాలని సలహా ఇచ్చారు. మ్యుటేశన్ లను, అవి కలుగజేసే ప్రభావాలను నిపుణులు అధ్యయనం చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాటి పరిస్థితి లో, ఆపుదల, చికిత్స లు కీలకం అవుతాయని ప్రధాన మంత్రి చెప్తూ, కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని మానవులు నడుచుకోవలసిన తీరు ముఖ్య పాత్ర ను పోషిస్తుందని నొక్కిచెప్పారు. ఒక మనిషి కి మరొక మనిషి కి మధ్య సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్ ను ధరించడం, టీకామందు ను వేసుకోవడం.. వీటితో మంచి ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం అయిందని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అదే విధం గా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ అనేది సత్ఫలితాల ను ఇచ్చేటటువంటి ఒక వ్యూహం గా కూడా నిరూపణ అయింది అని ఆయన అన్నారు.
పర్యటన రంగం పైన, వ్యాపార రంగం పైన మహమ్మారి చూపిన ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, పర్వత ప్రాంత పట్టణాల లో సరైన ముందు జాగ్రత చర్యల ను పాటించకుండానే గుంపులు గుంపులు గా గుమికూడటం తగదు అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. థర్డ్ వేవ్ వచ్చే కంటే ముందే ఆనందం గా గడపాలని ప్రజలు కోరుకొంటున్నారు అనే వాదన ను ఆయన తోసిపుచ్చుతూ, థర్డ్ వేవ్ దానంతట అదే రాదు అనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది అన్నారు. మన మనస్సు లో రేకెత్తవలసిన ప్రధానమైన ప్రశ్నల్లా థర్డ్ వేవ్ ను ఏ విధం గా అడ్డుకోవాలి అనేదే అని ప్రధాన మంత్రి చెప్పారు. అజాగ్రత గా ఉండకూడదు, గుంపులు గుంపులు గా చేరకూడదు, అలా చేస్తే కేసు లు అమాంతం పెరిగిపోతాయి అని నిపుణులు పదే హెచ్చరికల ను చేస్తున్నారు అని ఆయన అన్నారు. అవసరం లేని చోట్ల కు తండోప తండాలుగా వెళ్ళడం మానుకోవాలి అని ఆయన గట్టి గా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పూనుకొని నిర్వహిస్తున్న ‘అందరికీ టీకా మందు - అందరికీ ఉచితం’ ప్రచార ఉద్యమం లో ఈశాన్య ప్రాంతాల కు సైతం సమానమైన ప్రాముఖ్యం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. మనం టీకాకరణ ప్రక్రియ ను వేగవంతం గా అమలు జరపవలసిన అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పారు. టీకా వేయించుకోవడం, ప్రజల ను జాగృతం చేయడం.. వీటికి సంబంధించి అపోహల ను దూరం చేసే విషయమై ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దీని కోసం సామాజిక సంస్థ లు, విద్య సంస్థ లు, ప్రముఖుల తో పాటు ధార్మిక సంస్థ ల సహాయాన్ని అభ్యర్థించాలి అని సూచించారు. వైరస్ ఏయే ప్రాంతాల లో వ్యాప్తి చెందుతుందన్నది అంచనా వేసి, ఆయా ప్రాంతాల లో ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
పరీక్షల ను నిర్వహించడానికి, చికిత్సల ను అందించడానికి ఉద్దేశించిన మౌలిక సదుపాయాల ను మెరుగుపరచడం కోసం ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన 23,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ ని గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ ప్యాకేజీ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో ఆరోగ్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన ను బలపరచడం లో సాయపడగలుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో పరీక్షల నిర్వహణ, రోగ నిర్ధారణ, జన్యు క్రమ ఆవిష్కరణ లను శీఘ్రతరం చేస్తుందన్నారు. ఈశాన్య ప్రాంతం లో పడక ల సంఖ్య ను, ఆక్సీజన్ సంబంధిత సౌకర్యాల ను, శిశువైద్య సంరక్షణ సంబంధి మౌలిక సదుపాయాల ను వెంటనే పెంపొందించాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దేశం అంతటా పిఎమ్-కేర్స్ ద్వారా వందల కొద్దీ ఆక్సీజన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడం జరుగుతోందని, మరి ఈశాన్య ప్రాంతం లో కూడాను దాదాపు గా 150 ప్లాంటుల ను స్థాపించడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ప్లాంటుల ను ఏర్పాటు చేసే ప్రక్రియ ను వేగవంతం గా పూర్తి చేయవలసింది అంటూ ముఖ్యమంత్రుల కు ప్రధాన మంత్రి మనవి చేశారు.
ఈశాన్య ప్రాంత భౌగోళిక స్థితి కారణం గా తాత్కాలిక ఆసుపత్రి ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. బ్లాకు స్థాయి లోని రెండు ఆసుపత్రుల కు చేరుకోనున్న ఆక్సీజన్ ప్లాంటు లు, ఐసియు వార్డు లు, కొత్త యంత్రాల నిర్వహణ కు సిబ్బంది అవసరం అవుతారు కాబట్టి తదనుగుణంగా శిక్షణ పొందిన సిబ్బంది ని తయారుగా ఉంచుకోవాలి అని కూడా ఆయన సూచన చేశారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలు గాను సహాయం అందుతుంది అంటూ ఆయన హామీ ఇచ్చారు.
దేశం లో ఒక రోజు లో 20 లక్షల పరీక్షల సామర్ధ్యం సాధ్యపడిందని ప్రధాన మంత్రి వివరిస్తూ, ప్రభావిత జిల్లాల లో పరీక్షల నిర్వహణ తాలూకు మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని ప్రముఖం గా పేర్కొన్నారు. నమూనా పరీక్షల తో పాటు పరీక్షల నిర్వహణ ను ముమ్మరం చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. సమష్టి ప్రయాసల తో మనం సంక్రమణ ను అరికట్టి తీరగలుగుతాం అనే ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
***
(Release ID: 1735093)
Visitor Counter : 264
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam