ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా: అపోహలు - వాస్తవాలు


నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ మరియు ఫ్రంట్‌-లైన్ కార్మికులతో పాటు అత్యంత దుర్బలులైన జనాభా సమూహాలను రక్షించడం ద్వారా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న - కోవిడ్ 19 టీకా కార్యక్రమం
పౌరులందరూ వారి ఆదాయ స్థాయి తో సంబంధం లేకుండా భారత ప్రభుత్వం ద్వారా ఉచితంగా టీకాలు వేయించుకోవడానికి అర్హులు
ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రైవేటు కోవిడ్ టీకా కేంద్రాల్లో, టీకాలు వేయించుకోవడానికి వీలుగా అందుబాటులోకి రానున్న - బదిలీ చేయలేని ఎలక్ట్రానిక్ వోచర్లు

Posted On: 01 JUL 2021 4:41PM by PIB Hyderabad

భారతదేశ జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం శాస్త్రీయ మరియు సాంక్రమిక రోగ విజ్ఞానం ఆధారాలతో పాటు, డబ్ల్యూ.హెచ్.ఓ. మార్గదర్శకాలు మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతుల పై ఆధారపడి, రూపొందించడం జరిగింది.  మొదటి నుంచి చివరిదాకా, ఒక క్రమబద్ధమైన విధానం ద్వారా, ఈ టీకాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.  రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు అన్నింటికీ మించి ప్రజల సమర్థవంతమైన, ఉపయుక్తమైన భాగస్వామ్యం ద్వారా అమలవుతోంది.  భారత ప్రభుత్వం, ఈ టీకా కార్యక్రమాన్ని, మొదటి నుండీ, స్థిరంగా, క్రియాశీలకంగా నిబద్దతతో నిర్వహిస్తోంది. 

భారత దేశ టీకా వ్యూహం ‘వయో వృద్ధులను, దుర్బలులైన ప్రజలను నిర్లక్ష్యం చేస్తోంది’ అనీ,  ఈ విధానం ‘ధనికులకు ప్రాధాన్యత ఇస్తోంది’ అనీ, ఆరోపిస్తూ కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. 

శాస్త్రీయ మరియు సాంక్రమిక రోగ విజ్ఞానం ఆధారాలతో రూపొందిన, భారతదేశ జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం - నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ మరియు ఫ్రంట్‌-లైన్ కార్మికులతో పాటు అత్యంత దుర్బలులైన జనాభా సమూహాలను రక్షించడం ద్వారా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, స్పష్టం చేయడం జరిగింది.  నమోదైన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు (హెచ్‌.సి.డబ్ల్యు) లలో 87.4 శాతం కంటే ఎక్కువ మంది టీకా మొదటి మోతాదు వేసుకోవడం ద్వారా, అదేవిధంగా, నమోదైన ఫ్రంట్-లైన్ కార్మికులు (ఎఫ్.ఎల్.డబ్ల్యు) లలో 90.8 శాతం కంటే ఎక్కువ మంది టీకా మొదటి మోతాదు వేసుకోవడం ద్వారా, ఈ విధానం సానుకూల ఫలితాలను ఇచ్చింది.  తద్వారా, కోవిడ్-19 మహమ్మారి రెండవ దశ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, నిఘా, నియంత్రణ కార్యకలాపాలలో పాల్గొంటున్న యోధులకు రక్షణ కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా, ఇప్పటి వరకు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో 45.1 శాతం మందికి మొదటి మోతాదు టీకా ఇవ్వడం జరిగింది.  60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారితో పాటు, 45-59 సంవత్సరాల వయస్సు గలవారిలో ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి టీకాలు వేసే కార్యక్రమంలో భాగంగా,  60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో 49.35 శాతం కంటే ఎక్కువ మందికి, ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్-19 టీకా మొదటి మోతాదు వేయడం జరిగింది. 

టీకా తయారీదారుల ఉత్పత్తి ని ప్రోత్సహించడంతో పాటు, కొత్త టీకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, 2121 జూన్ 21వ తేదీ నుంచి అమలులో ఉన్న సవరించిన జాతీయ కోవిడ్ టీకా విధానం ప్రకారం, దేశీయ టీకా ఉత్పత్తి దారులు తమ నెలవారీ ఉత్పత్తిలో 25 శాతం పరిమితికి లోబడి, ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా టీకాలను విక్రయించుకోడానికి అవకాశం కల్పించడం జరిగింది.  పౌరులందరూ వారి ఆదాయ స్థాయి తో సంబంధం లేకుండా భారత ప్రభుత్వం ద్వారా ఉచితంగా టీకాలు వేయించుకోవడానికి అర్హులు.  అయితే, చెల్లించే సామర్థ్యం ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రుల టీకా కేంద్రాల సేవలను ఉపయోగించుకోవచ్చు. 

చిన్న, పెద్ద ప్రైవేటు ఆస్పత్రులు మరియు ప్రాంతీయ సమతుల్యత మధ్య సమానమైన పంపిణీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రైవేట్ ఆసుపత్రుల అవసరాలను సమీకరించి భారత ప్రభుత్వానికి పంపుతాయి.  ఆ తర్వాత, ప్రైవేటు ఆసుపత్రులు, సేవా రుసుము గా, ఒక్కొక్క మోతాదుకు గరిష్టంగా 150 రూపాయలు చొప్పున వసూలు చేయవచ్చు. 

‘లోక కళ్యాణ్’ స్ఫూర్తితో, ప్రైవేటు కోవిడ్ టీకా కేంద్రాల్లో (సి.వి.సి.ల్లో), టీకాలు వేయించుకోవడానికి వీలుగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఆర్థికంగా సహాయపడడానికి, భారతీయులను ప్రోత్సహిస్తూ, బదిలీ చేయడానికి వీలు లేని ఎలక్ట్రానిక్ వోచర్లు, అందుబాటులోకి రానున్నాయి.  కోవిడ్ టీకాలు వేసే జాతీయ కార్యక్రమం కింద, మార్గదర్శకాలను, సమాజ-ఆధారిత, సౌకర్యవంతమైన, ప్రజల-కేంద్రీకృత విధానం కోసం భాగస్వామ్యం చేయడం జరిగింది. వయో వృద్ధులు మరియు విభిన్నమైన సామర్థ్యం ఉన్న ప్రజల సౌకర్యం కోసం, వారి నివాసాలకు దగ్గరగా కోవిడ్ టీకా కేంద్రాలు (ఎన్.హెచ్.సి.వి.సి) ప్రారంభించబడ్డాయి.

ప్రజలందరికీ కోవిడ్-19 టీకాలు వేయడం యొక్క అవసరాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం, ముఖ్యంగా సరైన గుర్తింపు కార్డులు లేని దుర్బల సమూహాలను  - ఉదాహరణకు, సంచార జాతులు (వివిధ మతాలకు చెందిన సాధు, సంతుల తో సహా), జైలు ఖైదీలు, మానసిక ఆరోగ్య సంస్థలలో ఉన్న వారు, వృద్ధాశ్రమాలలో ఉంటున్న పౌరులు, రహదారుల పక్కన ఉండే బిచ్చగాళ్ళు, పునరావాస కేంద్రాలు, శిబిరాల్లో నివసించే ప్రజలతో పాటు 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న అర్హత కలిగిన ఇతర వ్యక్తులను, సంబంధిత ప్రభుత్వ విభాగం / మైనారిటీ వ్యవహారాల విభాగం, సామాజిక న్యాయం, సాంఘిక సంక్షేమం మొదలైన సంస్థల సహాయం తో ఆయా జిల్లాల్లోని వ్యక్తుల సమూహాలను జిల్లా టాస్క్‌-ఫోర్స్ గుర్తిస్తోంది.

అదనంగా, మరింత ఎక్కువమందికి ఈ కార్యక్రమం చేరడానికి వీలుగా, వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పని ప్రదేశాల్లో టీకా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది.  18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు తమతో పాటు, తమ పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న టీకా కేంద్రాలతో అనుసంధానం కావడం ద్వారా టీకాలు వేయించుకోవచ్చు. 



(Release ID: 1732149) Visitor Counter : 252