గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, పి.ఎం.ఎ.వై.యు. 6వ వార్షికోత్సవం రేపే!

గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
వర్చువల్ ఈవెంట్.గా ఆన్ లైన్ ద్వారా కార్యక్రమం..
2020వ సంవత్సరపు ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ పోటీ
ఫలితం ఈ కార్యక్రమంలో విడుదల

పి.ఎం.ఎ.వై.యు.పై లఘు చలనచిత్ర పోటీని
రేపే ప్రకటించే అవకాశం

Posted On: 24 JUN 2021 2:46PM by PIB Hyderabad

స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్.సి.ఎం.), అమృత్ (ఎ.ఎం.ఆర్.యు.టి.), పట్టణ ప్రాంతాలకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పి.ఎం.ఎ.వై.-యు) పథకాలను ప్రారంభించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఒక కార్యక్రమాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాలన్నంటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 జూన్ 25న ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల పునరుద్ధరణ లక్ష్యంగా దార్శనికతతో కూడిన అజెండాతో ఈ మూడు పథకాలను రూపొందించారు. నగరాల్లో ఉంటున్న దేశపు 40 శాతం జనాభా ఆశలను నెరవేర్చే పలు అంచెల వ్యూహంలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు.

   గత ఆరేళ్లలో పట్టణ వ్యవహారాలకోసం 12లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారంటే, పట్టణాల పునరుద్ధరణపై ప్రభుత్వం ఎంత మేర దృష్టిని కేంద్రీకరించిందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాభివృద్ధి కార్యకలాపాలకోసం 2004-2014 సంవత్సరాల మధ్య పెట్టుబడి పెట్టిన లక్షన్నర కోట్ల రూపాయలతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఈ మూడు పథకాల కింద అమలు చేసిన కార్యక్రమాలతో దేశంలోని పట్టణ వాసుల జీవితాల్లో ఎంతో మార్పు మొదలైంది. ఈ పథకాల అమలుతో పట్టణ మౌలిక సదుపాయాలు అభవృద్ధి చెందాయి. మెరుగైన నీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు, అందరికీ గృహ వసతి వంటివి పట్టణ ప్రాంతాల ప్రజలకు సమకూరాయి. అంతేకాక నగరాల ప్రణాళికా రచన, సదుపాయాల నిర్వహణా ప్రక్రియలో అధునాతన సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను వినియోగించుకునేందుకు కూడా ఈ పథకాలు దోహదపడ్డాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా ఈ పథకాలు ఎంతో కీలకపాత్ర పోషించాయి. కోవిడ్ తో దెబ్బతిన్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కూడా ఇవి ఉపకరించాయి.

   ఈ నేపథ్యంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు ఈ వార్షికోత్సవ కార్యక్రమం వీలు కలిగిస్తుంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి హరదీప్ ఎస్. పూరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య వర్గాలన్నీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఆహ్వానం పలికారు.  వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు, నగరపాలక సంస్థల కమిషనర్లు, స్మార్ట్ సిటీల మేనేజింగ్ డైరెక్టర్లు, ముఖ్య కార్య నిర్వహణాధికారులు, రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీల ప్రతినిధులు, మిషన్ డైరెక్టరేట్లు, వారి బృందాలు, అధికారులు, వృత్తి నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు, సమాచార సాధనాల ప్రతినిధులు, విద్యా వేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ ఏర్పాటై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పట్టణీకరణ ప్రక్రియకు సంబంధించి పరిశోధనకు, అమలుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని పూడ్చి వేసేందుకు కూడా రేపటి కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది.

 

 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన –అర్బన్ (పి.ఎం.ఎ.వై.-యు.)

  పట్టణ, నగర ప్రాంతాల్లోని వారందరికీ గృహ వసతి కల్పించాలన్న లక్ష్యంతో, ‘అందరికీ ఇళ్లు’ అన్న స్ఫూర్తితో పి.ఎం.ఎ.వై-యు పథకాన్ని చేపట్టారు. ఆర్థిక బలహీన వర్గం, అల్పాదాయ వర్గం, మధ్యతరహా ఆదాయ వర్గాలకు చెందిన వారికి, మురికి వాడల్లో నివాసం ఉండేవారికి ఎదురయ్యే ఇళ్ల కొరత సమస్యను పరిష్కరించేందుకు, 2022వ సంవత్సరానికల్లా అర్హులందరికీ పట్టణ ప్రాంతాల్లో గృహవసతి కల్పించేందుకు ఈ పథకం చేపట్టారు. 2022లో దేశం 75ఏళ్ల స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకునేనాటికి ఈ లక్ష్యం సాధించాలన్న స్ఫూర్తితో కార్యక్రమాన్ని చేపట్టారు. పి.ఎం.ఎ.వై.-యు పథకం కింద మొత్తం కోటీ 12లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 82.5 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. దాదాపు 48 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిపోయింది.  

  రేపు నిర్వహించబోయే కార్యక్రమంలో పి.ఎం.ఎ.వై.-యు పై లఘు చిత్రాల పోటీని ప్రకటిస్తారు. విద్యార్థులు, యువజనులు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తులు, బృందాలు ఈ పోటీలో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. భారతదేశపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీకి రూపకల్పన చేశారు. ఆవాస్ పర్ సంవాద్ (టౌన్ హాల్) పేరిట 15రోజుల చర్చాగోష్టిని కూడా 75 నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థల్లో నిర్వహించనున్నారు.

 

అమృత్ (AMRUT) మిషన్

  అటల్ పట్టణ పునరుద్ధరణ, పరివర్తనా పథకం (అమృత్) పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. లక్షకు పైగా జనాభా ఉన్న 500 నగరాల్లో నీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ, జల వ్యర్థాల నిర్వహణ, వరదనీటి నిర్వహణ, పట్టణ రవాణా, హరిత ప్రాంతాల, పార్కుల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద సాధించిన విజయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.:

 

  • మొత్తం నీటి కుళాయిల కనెక్షన్లు: 105 లక్షలు+ 139 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పైపుల ద్వారా నీటి సరఫరా.
  • మురుగునీటి, సెఫ్టేజీ కనెక్షన్లు: 78లక్షలు+ లక్ష్యం 145 లక్షల కనెక్షన్లు.
  • ఇప్పటికే అభివృద్ధి చేసిన మురుగునీటి ట్రీట్మెంట్ సామర్థ్యం:  రోజుకు 1240 మిలియన్ లీటర్లు...రోజుకు  4960 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎస్.టి.పి.ల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది.  
  • నీరు నిలిచిపోయే 1,840 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే తొలగించారు.
  • హరిత ప్రాంతాలు, ఉద్యానవనాలు (పార్కులు): 1850 పార్కులను, 3770 ఎకరాల హరిత ప్రాంతాలను అభివృద్ధి చేశారు.
  • మున్సిపల్ బాండ్లు: రూ. 3,840 కోట్ల విలువైన మున్సిపల్ బాండ్లను పది నగరాలు ప్రకటించాయి.
  • భవన నిర్మాణానికి ఆన్ లైన్ ద్వారా అనుమతి మంజూరు చేసే వ్యవస్థను 2,465 పట్టణాల్లో ప్రారంభించారు.
  • వీధి దీపాలు: పాత విద్యుద్దీపాల స్థానంలో 88 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. దీనితో ఏడాదికి 192 కోట్ల యూనిట్ల మేర విద్యుత్ ఆదా అయింది. 15లక్షల టన్నుల కర్బన కాలుష్యం విడుదల నుంచి విముక్తి లభించింది.

 

స్మార్ట్ సిటీస్ పథకం

   దేశ పట్టణాభివృద్ధి ప్రక్రియలో విలక్షణమైన మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్.సి.ఎం.) పేరిట పరివర్తనా పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద మొత్తం ప్రతిపాదిత పనుల్లో ఇప్పటివరకూ రూ. 1,78,500 కోట్ల మేర (విలువపరంగా 87శాతం) విలువైన 5,890 ప్రాజెక్టులకు (సంఖ్యాపరంగా 114శాతం) టెండర్లు పిలిచారు. రూ. 1,45,600 కోట్ల విలువైన (విలువ పరంగా 71శాతం) 5,195 ప్రాజెక్టులకు (సంఖ్యాపరంగా 101శాతం) వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. రూ. 45,000 కోట్ల విలువైన (విలువపరంగా 22శాతం) 2,655 ప్రాజెక్టులు (సంఖ్యాపరంగా 51శాతం) నిర్మాణం ముగించుకుని ప్రస్తుతం పనిచేస్తున్నాయి.  

   బహుళ రంగాల అభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్ సిటీస్ పథకం కింద ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఆయా పట్టణాలు, నగర ప్రాంతాల స్థానిక ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ ప్రాజెక్టులను చేపట్టారు. తాజా సమాచారం మేరకు, దేశంలో 65 స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేశారు. దేశంలో వాటి సమగ్ర కమాండ్ కంట్రోల్ కేంద్రాలు (ఐ.సి.సి.సి.లు) కూడా పనిచేయడం ప్రారంభించాయి. స్మార్ట్ మౌలిక సదుపాయాల కార్యక్రమాలతోపాటుగా కోవిడ్ కట్టడి కార్యక్రమాల నిర్వహణలో కూడా ఈ ఐ.సి.సి.సి.లు ఎంతో కీలకపాత్ర పోషించాయి. సమాచార వ్యాప్తి, సమాచారం మెరుగుదల, కచ్చితమైన  విశ్లేషణ తదితర కార్యకలాపాల ద్వారా ఈ కేంద్రాలు కోవిడ్ తో పోరాటంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించాయి.

  రేపు జరగబోయే 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీస్ పోటీ (ఐ.సి.ఎ.సి.)2020 ఫలితాన్ని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డాటా మెచ్యూరిటీ అస్సెస్మెంట్ ఫ్రేంవర్క్ (డి.ఎం.ఎ.ఎఫ్.), క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అస్సెస్మెంట్ ఫ్రేంవర్క్ (సి.ఎస్.సి.ఎ.ఎఫ్.) ఫలితాలను కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారు. ఇండియా స్మార్ట్ సిటీస్ ఫెలోషిప్ నివేదిక, తులిప్ వార్షిక నివేదిక, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్.ఐ.యు.ఎ.) అభివృద్ధి చేసిన విజ్ఞాన ఉత్పాదనలను కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారు.

****************



(Release ID: 1730180) Visitor Counter : 237