కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్ సమయంలో కార్మికులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసం రూపొందించిన కార్యక్రమాల వివరాలతో కరపత్రాలను విడుదల చేసిన కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్
ఆరోగ్య, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : సంతోష్ గంగ్వార్
Posted On:
18 JUN 2021 2:54PM by PIB Hyderabad
కార్మికుల ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ అన్నారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను తెలియచేస్తూ రూపొందించిన కరపత్రాలను మంత్రి ఈ రోజు విడుదల చేశారు. అర్హులైన వారందరికి సంక్షేమ పథకాల ఫలితాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. కోవిడ్ వల్ల పరిస్థితుల్లో వస్తున్న మార్పులను గుర్తిస్తున్న ప్రభుత్వం వీటికి అనుగుణంగా తగిన చర్యలను అమలు చేస్తున్నదని అన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
కార్మికులకు కల్పిస్తున్న సామాజిక భద్రతా ప్రయోజనాలను మెరుగు పరచి విస్తృతం చేసి అమలు చేస్తున్నామని శ్రీ గంగ్వార్ వివరించారు. అయితే, దీనివల్ల యాజమాన్యాలపై ఎటువంటి అదనపు భారం ఉండదని అన్నారు. కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కార్మికులు తమ ఆరోగ్యం, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అంశాలతో వున్నారని మంత్రి అన్నారు. కార్మికులలో నెలకొన్న ఆందోళనను గుర్తించిన ప్రభుత్వం సామాజిక భద్రత అందించడానికి అమలు చేస్తున్న ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ నిబంధనలను సులభతరం చేసిందని అన్నారు.
ఉద్యోగుల డిపాజిట్ తో ముడిపడివున్న భీమా పథకంలో సభ్యునిగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు అతని కుటుంబ సభ్యులు పథకం ప్రయోజనాలు పొందేవిధంగా మార్పులు చేశామని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఈ పథకం కింద గ్రాట్యుటీ చెల్లింపు కోసం కనీస సర్వీస్ అవసరంఉండదు. కార్మికుడు అనారోగ్యంతో విధులకు హాజరు కాలేని స్థితిలో వున్నప్పుడు ఈపీఎఫ్, ఎంపీ చట్టం ప్రకారం ఏడాదిలో 91 రోజులపాటు వేతనంలో 70%ని చెల్లించడం జరుగుతోంది.
ఇటీవల మంత్రిత్వశాఖ ఈ కింది సవరణలను అమలులోకి తీసుకుని వచ్చింది.
ఎ . మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు అందించే గరిష్ట ప్రయోజనం మొత్తాన్ని 6 లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయలకు పెంచారు.
బి. మరణానికి ముందు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంస్థలలో 12 నెలల నిరంతరాయంగా సభ్యుడిగా ఉన్న మరణించిన ఉద్యోగుల కుటుంబంలో అర్హతగల సభ్యులకు కనీసం 2.5 లక్షల హామీ ప్రయోజనం అందిస్తారు. ఒకే సంస్థలో 12 నెలలు పని చేసి ఉండాలన్న నిబంధనను ఇది తొలగించింది. ఒక సంస్థలో కనీసం ఏడాది పాటు పనిచేయాలన్న నిబంధన వల్ల ప్రయోజనాలను కోల్పోతున్న కాంట్రాక్టు / సాధారణ కార్మికులకు ఈ సవరణ ఉపశమనం కలిగిస్తుంది.
సి. కనీస 2.5 లక్షల రూపాయల పరిహారాన్ని ఫిబ్రవరి 15, 2020 నుం చెల్లిస్తారు.
డి . రాబోయే 3 సంవత్సరాల్లో అర్హతగల కుటుంబ సభ్యులు 2021-22 నుంచి 2023-24 సంవత్సరాలలో ఈడీఎల్ఐ నుంచి అదనంగా 2185 కోట్ల రూపాయలను పొందుతారని అంచనా వేయడం జరిగింది.
ఇ. ఈ పథకం కింద మరణం కారణంగా క్లెయిమ్‌ల సంఖ్య సంవత్సరానికి 50,000 కుటుంబాలుగా అంచనా వేయబడింది. వీటిలో సుమారు 10,000 మంది కార్మికులు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
పని చేస్తున్న ప్రాంతంలో తగిలిన గాయం కారణంగా బీమా చేసిన వ్యక్తి (ఐపి) మరణించినప్పుడు లేదా అంగవైకల్యానికి గురైనప్పుడు అతనికి చెల్లిస్తున్న సగటు రోజువారీ వేతనంలో 90% కు సమానమైన పెన్షన్ జీవిత భాగస్వామి మరియు వితంతువు తల్లికి జీవితకాలం మరియు పిల్లలకు లభిస్తుంది పిల్లలు 25 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఆడపిల్లకి ఆమె వివాహం వరకు ప్రయోజనం లభిస్తుంది.
ఈఎస్ఐసి పథకం కింద బీమా చేసిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడానికి వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది. బీమా చేసిన వ్యక్తికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన తరువాత లేదా మరణించినప్పుడు పేర్లు నమోదు చేసుకున్నవారు అర్హత పరిస్థితులకు లోబడి ఉపాధి గాయం కారణంగా మరణించే బీమా వ్యక్తులపై ఆధారపడినవారు అందుకున్న అదే ప్రయోజనాలను మరియు అదే స్థాయిలో పొందటానికి అర్హులుగా వుంటారు. దీనికోసం ఈ కింది నిబంధనలు అమలవుతాయి.
a. మరణానికి దారితీసే కోవిడ్ వ్యాధి నిర్ధారణకు కనీసం మూడు నెలల ముందు ఆ వ్యక్తి ఈఎస్ఐసి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి.
బి. మరణానికి కారణమయ్యే కోవిడ్ -19 వ్యాధి నిర్ధారణకు ముందు ఒక సంవత్సరం పాటు సదరు కార్మికునికి కనీసం 78 రోజులు వేతనాలు చెల్లించి వండాలి లేదా వేతనం పొందడానికి అర్హత కలిగి ఉండాలి.
అర్హతలను కలిగి కోవిడ్ -19 వ్యాధి కారణంగా మరణించిన కార్మికులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి నెలా బీమా చేసిన వ్యక్తి యొక్క సగటు రోజువారీ వేతనాలలో 90% వారి జీవితకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది.
మరణించిన కార్మికుడి జీవిత భాగస్వామి సంవత్సరానికి 120 రూపాయల నామమాత్రపు చెల్లింపుతో వైద్య సంరక్షణకు అర్హత సాధిస్తారు.కోవిడ్ -19 నుంచి కోలుకున్న 30 రోజుల తరువాత సంభవించే కోవిడ్ -19 సంబంధిత మరణాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకం 24.03.2020 నుంచి రెండేళ్ల కాలానికి అమలులోకి వస్తుంది. ఇఎస్ఐసి సమస్యలను 15 రోజుల్లోపు, ఇపిఎఫ్ఓ సమస్యలను 7 రోజుల లోపు ఫిర్యాదులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివరాలను ఈ కింది లింకుల్లో చూడవచ్చును.
ఈఎస్ఐసి కోసం:
www.esic.nic.in EPFO కోసం:
https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/WhatsApp_Helpline.pdf
ఈ కార్యక్రమంలో కార్మిక కార్యదర్శి శ్రీ అపూర్వా చంద్ర, సీనియర్ కార్మిక, ఉపాధి సలహాదారు శ్రీ డి పి ఎస్ నెగి, శ్రీ ఆర్.కె.గుప్తా జాయింట్ సెక్రటరీ (ఎల్ అండ్ ఇ) పాల్గొన్నారు.
****
(Release ID: 1728281)
Visitor Counter : 350