రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

మ్యూకార్ మైకోసిస్ మందులకోసం ప్రభుత్వం చర్యలు!


ముడిపదార్ధాల సమస్య పరిష్కారానికి కంపెనీలతో
క్రమం తప్పకుండా సంప్రదింపులు..

యాంఫోటెరిసిన్-బి/లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు,
ప్రత్యామ్నాయ మందుల వనరులను గుర్తించిన విదేశాంగ శాఖ.


ఔషధాల తయారీ, దిగుమతి, సరఫరా, లభ్యతపై
కొనసాగుతున్న ప్రభుత్వ పర్యవేక్షణ

Posted On: 17 JUN 2021 1:41PM by PIB Hyderabad

  కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మ్యూకార్ మైకోసిస్ అనే సంక్లిష్ట వ్యాధితో బాధపడుతున్న రోగులకు నిర్దేశించే యాంఫో టెరిసిన్-బి. అనే ఔషధానికి కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా గిరాకీ పెరిగినట్టు ఒక పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో, ఈ మందు సమస్థాయిలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఔషధ ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు, దిగుమతి చేసుకునేందుకు పలు చర్యలు అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లోని రోగులకోసం 6.67లక్షల వయల్స్ యాంఫోటెరిసిన్-బి మందును ప్రభుత్వం సమీకరించగలిగింది. మ్యూకార్ మైకోసిస్ చికిత్సలో వినియోగించే యాంపోటెరిసిన్ డీయాక్సీ కోలేట్, పోసాకొనాజోల్ వంటి మందులతో పాటుగా, యాంఫోటెరిసిన్-బి. ఔషధాన్ని కూడా ప్రభుత్వం సమీకరించ గలిగింది.

  మ్యూకార్ మైకోసిస్ వ్యాధి చికిత్సకోసం వినియోగించే మందుల లభ్యతను కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు మధింపు చేస్తూ వస్తోంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ.) అందించిన సమాచారం ఆధారంగా స్వదేశీ మార్కెట్లో, దిగుమతుల ద్వారా అందుబాటులో ఉన్న ఔషధాల పరిస్థితిపై అంచనా కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఉత్పత్తి, నిల్వ, సరఫరా, కొనుగోలు ఆర్డర్లు వంటి అంశాలపై వివరాలను ఉత్పత్తిదార్లనుంచి సేకరించే ప్రక్రియ ఈ ఏడాది మే నెలనుంచి జరుగుతోంది. గిరాకీకి, ఉత్పత్తికి మధ్య ఏర్పడిన అంతరాన్ని అధిగమించేందుకు సహకరించవలసిందిగా తయారీదార్లను కూడా కోరారు. ఇందుకు సంబంధించి వివిధ కేంద్ర శాఖల మధ్య ఈ ఏడాది మే నెల 10న ఒక సమావేశం జరిగింది. కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి.డి.ఎస్.సి.ఒ., ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.హెచ్.ఎస్.)  ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఔషధాల లభ్యతపై ఈ సమావేశంలో కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పరమిత స్థాయిలో ఉన్న ఔషధ నిల్వలను కేటాయించవచ్చని, తద్వారా, గిరాకీ సరఫరా మధ్య నెలకొన్న అంతరాన్ని అధిగమించవచ్చని ఈ  సమీక్షా సమావేశం అభిప్రాయపడింది.

 

ఉత్పత్తి హెచ్చింపు

   దేశీయంగా ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉత్పత్తిదార్లతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. ఉత్పత్తిదార్లను, ప్రత్యామ్నాయ ఔషధాలను గుర్తించేందుకు, కొత్త ఉత్పత్తి సదుపాయాల ఏర్పాటును ఆమోదించేందుకు కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ, భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ (డి.జి.సి.ఐ.) ఎంతో సమన్వయంతో క్రియాశీలంగా పనిచేశాయి. ఔషధాల ఉత్పత్తి సంస్థలను సంప్రదించి, ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకతపై వారికి అవగాహన కల్పించారు. లిపోసొమాల్ యాంఫోటెరిసిన్-బి ఉత్పత్తకి సంబంధించిన ప్రస్తుత ఉత్పత్తి దార్లు కూడా తమ ఉత్పత్తిని పెంచాలని ఈ సందర్భంగా కోరారు. మ్యూకార్ మైకోసిస్ చికిత్సలో వాడే ప్రత్యామ్నాయ ఔషధాల ఉత్పత్తిని పెంచే అంశాన్ని కూడా ఉత్పత్తి దారులతో చర్చించారు. ఉత్పత్తిదార్లు, దిగుమతిదార్ల ఆందోళనలు, లైసెన్సింగ్ వ్యవహారం, ముడి పదార్ధాల లభ్యత వంటి అంశాల పరిష్కారానికి యత్నాలు కూడా వేగంగా జరుగుతున్నాయి.

    ప్రస్తుతం లిపోసొమాల్ యాంపోటెరిసిన్-బి ఔషధాన్ని భారత్ సీరమ్స్ వ్యాక్సీన్ లిమిటెడ్, సిప్లా, సున్ ఫార్మా, బి.డి.ఆర్. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ కేర్ ఇన్నవేషన్స్ అనే ఐదు సంస్థలు తయారు చేస్తున్నాయి. ఆ సంస్థల ద్వారా దాదాపు 2.63 లక్షల వయల్స్ మేర ఈ మందు ఈ ఏడాది జూన్ నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిపోసొమాల్ ఫార్మలా ఔషధం తయారీ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. అధునాత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరిశ్రమలు మాత్రమే ఈ మందును తయారు చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో ఔషధ తయారీదార్లతో సంప్రదింపుల అనంతరం యాంఫోటెరిసిన్-బి సూది మందు తయారీ, మార్కెటింగ్ కోసం ఆరు సంస్థలకు డి.జి.సి.ఐ. అనుమతి జారీ చేసింది. ఎమ్.క్యూర్, గుఫిక్, అలెంబిక్, లైకా, నాట్కో లిమిటెడ్, ఇంటాస్ ఫార్మా వంటి ఆరు సంస్థలకు ఈ అనుమతి లభించింది. ఈ కొత్త సంస్థల ద్వారా జూన్ నెలలో దాదాపు లక్షా 13వేల వయల్స్ వెలువడవచ్చని భావిస్తున్నారు.

  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 62,000 వయల్స్ మేర ఉన్న యాంఫోటెరిసిన్-బి ఔషధ ఉత్పత్తి సామర్థ్యం,..మే నెలలో లక్షా 63వేల వయల్స్ కు పెరిగింది. జూన్ నెలలో ఉత్పత్తి సామర్థ్యం 3.75లక్షల వయల్స్ కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే అతి స్వల్ప వ్యవధిలోనే ఉత్పత్తి ఐదురెట్లు పెరిగే సూచనలు ఉన్నాయన్నమాట.

   ఔషధ ఉత్పత్తి పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ వస్తోంది. ఉత్పత్తిని పెంపునకు సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు తయారీదార్లతో పలుసార్లు సమావేశాలను నిర్వహించింది. వారితో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. ఉత్పత్తిని, సరఫరాను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా కంపెనీలను కోరుతూ వస్తోంది.

దిగుమతికి వెసులుబాటు

  ఔషధాల ఉత్పత్తికి పేరుగాంచిన విదేశాల్లోని వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపడంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలకపాత్ర పోషిస్తోంది. మ్యూకార్ మైకోసిస్ చికిత్సలో వాడే యాంపోటెరిసిన్-బి/లిపోసొమాల్ యాంపీటెరిసిన్-బి ఇంజెక్షన్లు, ఇతర ప్రత్యామ్నాయ ఔషధాల ప్రాప్తి స్థానాలను ప్రపంచంలోని అన్ని దేశాల్లోని రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాల ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తించింది. గుర్తించిన వనరుల ద్వారా ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ, అర్జెంటీనా, బెల్జియం, చైనా దేశాలనుంచి లిపోసొమాల్ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరింది. మరో వైపు,..లిపోసొమాల్ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్.ను భారతదేశంలో తయారు చేసేందుకు వీలుగా,. మందు తయారీలో కీలకమైన అనుపానంగా వాడే హెచ్.ఎస్.పి.సి., డి.ఎస్.పి.జి-ఎన్.ఎ. వంటి వాటిని తప్పనిసరిగా తెప్పించే ప్రక్రియలో విదేశాంగ మంత్రిత్వ శాఖ క్రియాశీలంగా పనిచేస్తోంది.

   ఇక, ఔషధం దిగుమతిని పెంచేందుకు, అమెరికాకు చెందిన మెసర్స్ గిలీడ్స్ ఇన్.కార్పొరేషన్ సంస్థతో సత్వర బట్వాడాకోసం ఔషధ వ్యవహారాల శాఖ, అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం కలసి ప్రధాన దిగుమతి సంస్థ అయిన మైలాన్ ల్యాబ్స్.తో నిర్విరామంగా చర్చలు జరుపుతూ వస్తున్నాయి. గీలీడ్ సంస్థనుంచి మొత్తం 9,05,000వయల్స్ కోసం ఆర్డలు పెట్టగా, ఈ ఏడాది జూన్ 16వ తేదీనాటికి 5,33,971 వయల్స్ మైలాన్ సంస్థకు అందాయి. మిగిలిన వయల్స్.ను కూడా త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

కేటాయింపు

  పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్న ఔషధం నిల్వలు సమంగా పంపిణీ జరిగేలా చూస్తూ,.. సదరు పరిమిత నిల్వలనే అవసరమైన రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించారు. మ్యూకార్ మైకోసిస్ రోగులకు చికిత్స అందించాల్సిన రాష్ట్రాలకు తప్పనిసరిగా, సమంజసమైన వాటా రూపంలో ఔషధాలు తప్పనిసరిగా అందేలా ఈ చర్య తీసుకున్నారు. ఇక, లిపోసొమాల్ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ విషయంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయింపు జరుపుతూ వస్తోంది. లిపోసొమాల్, లిపిడ్, ఎమల్షన్ రూపంలో మందును తయారీ చేసే భారత్ సీరమ్ సంస్థను మినహాయించి మిగతా ఉత్పత్తి సంస్థల ఇంజెక్షన్ల కేటాయింపును కేంద్ర ప్రభుత్వమే చేపడుతోంది. సంప్రదాయపరమైన యాంపోటెరిసిన్ మందును ఈ ఏడాది జూన్ 14నుంచి కేటాయిస్తూ వస్తోంది. ఔషధానికి ఉన్న డిమాండును అంచనా వేసిన అనంతరం ఈ కేటాయింపు జరుపుతూ వస్తున్నారు.

   ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఔషధం సమస్థాయిలో పంపిణీ జరిగేలా చూసేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో రికార్డయిన కేసులతో పోల్చితే ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల సంఖ్య ప్రాతిపదికగా ఈ కేటాయింపు జరుగుతూ వస్తోంది. రోగుల సంఖ్యకు సంబంధించి  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వెబ్ పోర్టల్ లో ఆయా రాష్ట్రాలు పొందుపరిచిన సమాచారం ఆధారంగా కేటాయింపు చేస్తున్నారు. డిమాండ్ కు తగినట్టుగా ఔషధాల సరఫరా జరిగే వరకూ ఈ తరహా కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా అమలులో ఉంటుంది.

  ఏదైనా ఒక నగరంలో, పట్టణంలో, ఆసుపత్రిలో ఔషధం సరఫరా, లభ్యత వంటి అంశాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.  లిపోసోమాల్ ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తయారీదార్లనుంచి సేకరిస్తున్నాయి. కేటాయింరు ప్రాతిపదికగా ఈ మందును సంబంధిత ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14వ తేదీవరకూ చేసిన కేటాయింపుల ప్రకారం మొత్తం 6,67,360 వయల్స్ మేర ఔషధాన్ని ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ కేటాయించింది. దీనికి తోడు,..సంప్రదాయపరమైన యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ కు సంబంధించి 53,000వయల్స్.ను ఈ ఏడాది జూన్ 14న కేటాయించారు.

 

సరఫరా ఏర్పాట్లు

  అవసరమైన వారికి ఔషధం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ (ఎన్.పి.పి.ఎ.) సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తూ వస్తోంది. కేటాయించిన పరిమాణంలో ఔషధం సకాలంలో సరఫరా జరిగేలా చూసే పటిష్టమైన ప్రతిస్పందక వ్యవస్థను ఎన్.పి.పి.ఎ. ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఔషధ సరఫరాదార్లతో క్రమంతప్పకుండా సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖలకు ఔషధాల సరఫరాలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అప్పటికప్పుడు తగిన పరిష్కారం చూపుతూ వస్తోంది.

  కోవిడ్ సంబంధిత మ్యూకార్ మైకోసిస్ చికిత్సా నిర్వహణకు సంబంధించి కొన్ని ఆదేశాలను, సూచనలను కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూన్ 7న సర్క్యులేట్ చేసింది. కోవిడ్-19 చికిత్సపై ఏర్పాటైన కార్యాచరణ బృందానికి (టాస్క్ ఫోర్స్.కు) ఈ మేరకు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. మ్యూకార్ మైకోసిస్ చికిత్సలో యాంఫోటెరిసిన్-బి, లిపిడ్ కాంప్లెక్స్, లిపోసొమాల్ యాంఫోటెరిసిన్-బి, యాంఫోటెరిసిన్ డీయాక్సీ కోలేట్, పోసా కొనాజోల్ వంటి మందులను ఎలా వాడాలి, ఏ పరిస్థితుల్లో వాడాలి అన్న అంశాలను ఈ ఆదేశాల్లో పొందుపరిచారు. ఇక కేటాయించిన మందులను సమంజసంగా వినియోగించాల్సిన ఆవశ్యకతను, వాటి సరఫరా ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ కూడా ఈ ఏడాది జూన్ 10న ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులందరికీ ఈ ఆదేశాలు సర్క్యులేట్ అయ్యాయి.

  మరో వైపు, మ్యూకార్ మైకోసిస్ చికిత్సకు అవసరమైన ఔషధాల ఉత్పత్తి, దిగుమతి, సరఫరా, లభ్యత వంటి అంశాలపై తాజా పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉత్పత్తి సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. 

 

***



(Release ID: 1727978) Visitor Counter : 183