ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“కోవిడ్-19 కొత్త వేవ్ ప్రభావం పిల్లల మీద ఉంటుందనటానికి ఎలాంటి ఆధారాలూ లేవు”


భవిష్యత్తులో అలాంటి అలల ప్రభావాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: డాక్టర్ గులేరియా

Posted On: 08 JUN 2021 5:52PM by PIB Hyderabad

“ ఇకమీదట వచ్చే కోవిడ్ కెరటం పిల్లలమీద  తీవ్ర ప్రభావం చూపుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారం అర్థం లేనిది. అలా పిల్లలమీద ప్రభావం ఉంటుందన్న వాదనను బలపరచే దత్తాంశమేమీ ఇటు భారత్ నుంచి గాని, అటు అంతర్జాతీయంగా గాని అందుబాటులో లేదు. “ అని ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ రోజు ఢిల్లీ పిఐబి మీడియా సెంటర్ లో మీడియాతో మాత్లాడుతూ స్పష్టం చేశారు.

భారత్ లో కరోనా రెండో వేవ్ సమయంలో ఈ ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రులలో చేరిన పిల్లల్లో 60% నుంచి 70% వరకు పిల్లలకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమో, రోగనిరోధకశక్తి బాగా తక్కువగా ఉండటమో గమనించామన్నారు. స్వల్పలక్షణాలు కనబడిన ఆరోగ్యవంతమైన పిల్లలు ఎలాంటి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమూ లేకుండానే కోలుకున్నారని డాక్టర్ గులేరియా అన్నారు.

భవిష్యత్ అలల నియంత్రణకు కోవిడ్ నియంత్రణ అనుకూల ప్రవర్తనే కీలకం

సాంక్రమిక వ్యాధులు ఎందుకు అలా అలలు అలలుగా వస్తాయో ఎయిమ్స్ డైరెక్టర్ వివరించారు. శ్వాస సంబంధమైన వైరస్ లు – 1918 నాటి స్పానిష్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అలాంటివేనన్నారు. నిజానికి స్పానిష్ రెండో అల చాలా ఘోరమైనదని, ఆ తరువాత వచ్చిన మూడో వే చిన్నదేనని గుర్తు చేశారు. ప్రజల్లో నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడే ఒక వేవ్ వెంట మరొకటి వస్తుందని చెప్పారు.

1.     ఎక్కువ జనాభాకు రోగనొరోధకశక్తి పెరిగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ సీజన్ల్ వ్యాధిలాగా మారి బాగా చలికాలంలోనీ, వర్షాకాలాల్లోనో రావటం సహజం.

2.     వైరస్ స్వభావ మార్చుకోవటం వలన కూడా వేవ్ లు వస్తాయి, దాన్నే మనం వేరియెంట్స్ గా పిలుస్తాం. అలా కొత్త ముటేషన్స్ వచ్చినప్పుడు సహజంగానే ఇన్ఫెక్షన్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు వైర్స వ్యాపించే అవకాశం కూడా ఎక్కువవుతుంది.

3.     మనుషుల ప్రవర్తన కూడా ఇలా వేవ్ లు రావటానికి ఒక కారణం

కేసులు పెరుగుతున్నప్పుడు ప్రజల్లో భయం పెరగటం వలన ప్రవర్తనలో మార్పు వస్తుందని డాక్టర్ గులేరియా అన్నారు. ప్రజలు కోవిడ్ నియంత్రణకు అవసరమైన ప్రవర్తనను బలవంతంగా అలవరచుకుంటారని, అలా నడుచుకోకపోతే వ్యాధి బారినపడతామనే అభిప్రాయంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని అన్నారు.   అయితే, అన్ లాక్ ప్రక్రియ మొదలుకాగానే ఏమీ కాదన్న ధీమా ఏర్పడితే, జాగ్రత్తలు తగ్గించటం వలన ప్రజల్లో మళ్ళీ వైరస్ వ్యాపించే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా అలాంటి పరిస్థితి ఇంకో వేవ్ కు దారితీయవచ్చునని హెచ్చరించారు. 

మళ్ళీ కోవిడ్ ఇంకో వేవ్ రాకుండా ఉండాలంటే కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.  సహజసిద్ధమైన రోగనిరోధకశక్తి రావటమో లేదా గణనీయమైన జనాభా టీకాలు వేయించుకోవటమో ఒక్కటే మార్గమన్నారు.ఎక్కువమంది టీకాలు వేయించుకుంటే వ్యాధి వ్యాపించే అవకాశం బాగా తగ్గిపోతుందని చెబుతూ అందరూ  కచ్చితంగా కోవిడ్ నిరోధక ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 

***


(Release ID: 1725459) Visitor Counter : 258