ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై మంత్రుల బృందం (జి.ఓ.ఎం) 28 వ సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్


గత 61 రోజుల్లో కనిష్టంగా రోజుకు లక్ష నమోదౌతున్న - కొత్త కేసులు

పెరుగుతున్న రికవరీ రేటు : ఈ రోజు 93.94 శాతంగా నమోదు

7 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 1000 కంటే తక్కువగా, 5 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 2000 కంటే తక్కువగా నమోదవుతున్న - క్రియాశీల కేసులు

నిన్న 15 లక్షలకు పైగా పరీక్షల నిర్వహణ : పరీక్షా ప్రయోజనాల కోసం 2,624 వరకు పెరిగిన ప్రయోగశాలల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక మోతాదు టీకా వేయించుకున్న మొత్తం జనాభాలో 20.2 శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నారు

మహమ్మారితో పాటు దేశం హానికరమైన అసత్య సమాచార వ్యాప్తితో పోరాడుతోంది: డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 07 JUN 2021 4:03PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు ఇక్కడ, దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన కోవిడ్ -19 పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జి.ఓ.ఎం) 28 వ సమావేశానికి అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో ఆయనతో పాటు, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్; కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి (ఐ / సి), పౌరవిమానయాన శాఖ మంత్రి (ఐ/సి), వాణిజ్య. పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురీ;  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  శ్రీ నిత్యానంద్ రాయ్; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రభృతులు కూడా పాల్గొన్నారు.

కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయడానికి భారతదేశం చేసిన కృషి గురించి, డాక్టర్ హర్ష వర్ధన్, సంక్షిప్తంగా వివరిస్తూ -  "రికవరీ రేటు పెరుగుతోంది. ఈ రోజు 93.94 శాతంగా నమోదయ్యింది. గత 61 రోజుల్లో నమోదైన కేసుల కంటే కనిష్ట స్థాయిలో, గత 24 గంటల్లో, కేవలం ఒక లక్షకు పైగా (1,00,636) కొత్త కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 1,74,399 రికవరీలు నమోదయ్యాయి. కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదయ్యింది. ఈ రోజు వరుసగా 25 వ రోజున, మన దేశంలో కొత్త కేసులను మించి, రోజువారీ రికవరీలు నమోదయ్యాయి.” అని చెప్పారు. 

టీకాలు మరియు క్లినికల్ జోక్యంపై డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  "ఈ రోజు ఉదయం వరకు, వివిధ విభాగాలలో మన దేశ ప్రజలకు 23,27,86,482 టీకా మోతాదులను అందించడం జరిగింది.  18-44 వయస్సు లో ఉన్న ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, వీరిలో 2,86,18,514 మందికి, మొదటి మోతాదు టీకా వేయడం జరిగింది.  ఈ రోజుకు, రాష్ట్రాల వద్ద ఇంకా 1.4 కోట్ల కు పైగా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయి.” అని, తెలియజేశారు.  అదేవిధంగా, ఇతర విభాగాల గురించి, ఆయన  మాట్లాడుతూ, 60 ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి విభాగంలో 6,06,75,796 మందికీ, 45-59 మధ్య వయస్సు గల వారి విభాగంలో  7,10,44,966 మందికీ, మొదటి మోతాదు టీకా వేసినట్లు చెప్పారు. 

పరీక్షల గురించి, కేంద్ర ఆరోగ్య మంత్రి, వివరిస్తూ,  "జూన్, 7వ తేదీ ఉదయం వరకు 36.6 కోట్ల (36,63,34,111) పరీక్షలను మనం నిర్వహించాము. కాగా, నిన్న సెలవుదినం అయినప్పటికీ 15 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించడం జరిగింది.  పరీక్షా ప్రయోజనాల కోసం ప్రయోగశాలల సంఖ్య కూడా 2,624 కు పెరిగింది. రోజువారీ పాజిటివ్ కేసుల రేటు కూడా తగ్గుతోంది. ప్రస్తుతం అది 6.34 శాతంగా నమోదయింది. అంతే గాక, ఇది వరుసగా 14 రోజుల పాటు కొనసాగిన 10 శాతం పాజిటివ్ కేసుల రేటు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం, 15 రాష్ట్రాల్లో, ఇప్పటికీ, రోజువారీ పాజిటివ్ కేసుల రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉంది.” అని తెలియజేశారు. 

రెండవ దశలో, నిరంతరం రోజువారీ కేసులు తగ్గుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. కొత్త కేసుల కంటే,  రోజువారీ రికవరీలు ఎక్కువగా ఉన్నాయి.  మొత్తం క్రియాశీల కేసుల్లో 83 శాతం 10 రాష్ట్రాల్లో నమోదుకాగా,  మిగిలిన 17 శాతం 26 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి.  7 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్. జార్ఖండ్) వెయ్యి కన్నా తక్కువ కేసులు ఉన్నాయి. 5 రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాల్లో (జమ్మూ, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌ గఢ్, ఉత్తర ప్రదేశ్) రెండు వేల కన్నా తక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది.  కేసుల వృద్ధి రేటు 14.7 శాతం (మే, 5వ తేదీ) నుండి 3.48 శాతం (ఈ రోజు) కు తగ్గింది.

ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఇన్సాకోగ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ లు వ్యాధి వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేసే గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న "మ్యూటాంట్స్" కోసం చూస్తున్నాయి.  ఇంతవరకు, ఇన్సాకోగ్ క్రింద, 10 జాతీయ ప్రయోగశాలలు 30 వేల నమూనాలను పరీక్షించాయి.  పరీక్షల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఇటీవల, మరో, 18 ప్రయోగశాలలు ఈ కన్సార్షియం లో చేర్చబడ్డాయి.” అని తెలియజేశారు. 

పెరుగుతున్న ముకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులను నివారించడానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సహకారాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు.  ఇప్పటివరకు 28 రాష్ట్రాల నుండి 28,252 కేసులు నమోదయ్యాయి.  వీటిలో 86 శాతం (24,370 కేసులు) కోవిడ్-19 సంక్రమణ లక్షణాలను కలిగి ఉండగా, 62.3 శాతం (17,601) మందికి డయాబెటిస్ చరిత్ర ఉంది.  ముకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు  అత్యధికంగా మహారాష్ట్రలో (6,339), గుజరాత్ లో (5,486) నమోదయ్యాయి. 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఈ సమావేశంలో మాట్లాడుతూ, టీకాల పట్ల ప్రజల్లో నెలకొన్న సంకోచాలనూ, అపోహలనూ అధిగమించడానికి ప్రయత్నాలు జరగాలని కోరారు.  కోవిడ్-19 తో పోరాడటానికి ఇది ఒక ముఖ్యమైన సాధనం అయినందువల్ల, టీకాలు తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఆయన, చెప్పారు. 

టీకాలు వేసే ప్రక్రియ ప్రస్తుత పరిస్థితి గురించీ, పిల్లలకు కోవిడ్-19 సంరక్షణకు సంసిద్ధత గురించీ, మూడవ దశ ను నివారించడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించీ, నీతీ ఆయోగ్, సభ్యుడు (ఆరోగ్యం), డాక్టర్ వి.కె. పాల్, ఈ సదస్సులో, సంక్షిప్తంగా వివరించారు.   భారతదేశంలో  మొత్తం 23 కోట్ల మోతాదుల టీకాలు వేయడానికి 141 రోజులు పట్టిందని ఆయన పేర్కొన్నారు.  ఈ విషయంలో మన దేశం, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉండగా, అమెరికా కు 134 రోజులు పట్టింది.  అలాగే, ఇప్పటి వరకు నిర్వహించిన మోతాదుల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన దేశాలలో ఒకటిగా ఉంది.  ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక మోతాదు టీకా వేయించుకున్న 88.7 కోట్ల జనాభా లో, 17.9 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా టీకా వేయించుకున్న వారిలో 20.2 శాతం. చిన్న పిల్లలకు కోవిడ్-19 సంరక్షణ కల్పించడానికి భారతదేశం పూర్తిగా సంసిద్ధంగా ఉందనీ, అయితే, ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేసే సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా కీలకం కానుందని, ఆయన పేర్కొన్నారు.  కోవిడ్ తగిన ప్రవర్తనను కొనసాగిస్తే, మనం, మూడవ తరంగాన్ని, అతి సులువుగా నివారించవచ్చునని, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే మాట్లాడుతూ, దేశంలో ఆక్సిజన్ లభ్యత, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు.  ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడం, పి.ఎస్.ఏ. (ప్రెజర్ స్వింగ్ యాడ్సార్ప్షన్) ప్లాంట్ల ఏర్పాటుతో పాటు, ఎల్‌.ఎం.ఓ. మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల దిగుమతి ద్వారా ఆక్సిజన్ లభ్యత, పంపిణీని మెరుగుపరచడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.  2020 ఆగష్టు లో 5,700 మెట్రిక్ టన్నులుగా ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి, 2021 మే నెలలో 9,500 మెట్రిక్ టన్నులకు పైగా పెరిగిందని, ఆయన తెలియజేశారు.  అదేవిధంగా సుమారు 1,718 పి.ఎస్.ఎ. ప్లాంట్లు (ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. మరియు డి.ఆర్.డి.ఓ. లచే పి.ఎం.కేర్స్ కింద 1,213; పి.ఎన్.జి. మంత్రిత్వ శాఖ ద్వారా 108; బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా 40; విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా 25; విదేశీ ఆర్ధిక సహాయంతో 19; వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 313) ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు.  వీటితో పాటు, పి.ఎమ్.కేర్స్. నిధి కింద కింద 1 లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలుకు అనుమతి మంజూరు చేయబడిందనీ, అదేవిధంగా,  దేశంలో ఎల్‌.ఎం.ఓ. కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి వీలుగా అభివృద్ధి చేసిన ఒక వెబ్ మరియు యాప్ ఆధారిత ట్రాకింగ్ విధానం - ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఒ.డి.టి.ఎస్) ను కూడా అభివృద్ధి చేసినట్లు ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

ఛైర్మన్, ఈ.జి-8 మరియు ఐ & బి. కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే దేశంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి సంక్షిప్తంగా తెలియజేశారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధిని ఎదుర్కోవటానికి, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / ప్రభుత్వ రంగ సంస్థలు / స్వయంప్రతిపత్తి సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు / జిల్లాలు / పి.ఆర్‌.ఐ.లు “సంపూర్ణ ప్రభుత్వ” విధానంలో అనుసరిస్తున్న మంచి పనులను, ఆయన, ప్రశంసించారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.  అదేవిధంగా కోవిడ్ తగిన ప్రవర్తన యొక్క సందేశాన్ని ప్రచారం చేయడంలో కమ్యూనిటీ నాయకులు, స్థానికంగా ప్రజలను ప్రభావితం చేసేవారు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, సహకార సంస్థలు, పంచాయతీ రాజ్ ప్రతినిధులు మరియు ఎఫ్‌.ఎం.సి.జి. కంపెనీలు / రిటైల్ అవుట్‌లెట్లు / వాణిజ్య సంస్థలు పాల్గొనేలా చేయవలసిన అవసరం కూడా ఉందని, ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించడంలో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసార మాధ్యమాలైన పి.ఐ.బి., ఆకాశవాణి, డి.డి.న్యూస్ తో పాటు ప్రాంతీయ యూనిట్లు విస్తృతంగా చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ముందుకు వెళ్ళే మార్గంగా, టీకా తర్వాత ఎదురౌతున్న, కోవిడ్ తగిన ప్రవర్తన, బ్లాక్ / వైట్ ఫంగస్, కోవిడ్-ప్రభావిత, అనాథ పిల్లల దీర్ఘకాలిక శారీరక, మానసిక సంరక్షణ వంటి పలు సమస్యలపై దృష్టి పెట్టాలనీ, పూర్తి సానుకూల వాతావరణాన్ని కొనసాగించాలని, ఆయన, సూచించారు.

ఈ సమావేశంలో -  నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), డాక్టర్ వినోద్ కె పాల్;  నీతీ ఆయోగ్ సి.ఈ.ఓ., శ్రీ అమితాబ్ కాంత్;  విదేశాంగ శాఖ కార్యదర్శి, శ్రీ హర్ష వర్ధన్ ష్రింగ్లా;  సమాచార, ప్రసార శాఖ, కార్యదర్శి, శ్రీ అమిత్ ఖరే;  రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అర్మనే;  కార్యదర్శి (ఫార్మా), శ్రీమతి ఎస్. అపర్ణ;  కార్యదర్శి (ఆరోగ్య పరిశోధన) & డి.జి. (ఐ.సి.ఎం.ఆర్), డాక్టర్ బలరామ్ భార్గవ తో సహా, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. 

*****



(Release ID: 1725221) Visitor Counter : 223