రైల్వే మంత్రిత్వ శాఖ
శూన్య కర్బన ఉద్గార లక్ష్యసాధనతో ప్రపంచంలోనే ‘అతిపెద్ద హరిత రైల్వే’ ఘనత దిశగా భారత రైల్వేలు
భారీ విద్యుదీకరణ... జల-కాగిత కనిష్ఠ వాడకంసహా పట్టాలపై గాయాలనుంచి జంతు రక్షణదాకా చర్యలతో పర్యావరణ పరిరక్షణలో తోడ్పాటుకు రైల్వేల కృషి;
39 వర్కుషాపులు.. 7 ఉత్పాదక యూనిట్లు.. 8 ఇంజన్ షెడ్లు.. ఒక సామగ్రి డిపోకు ‘గ్రీన్‌కో’ గుర్తింపు; ఇందులో ‘2 ప్లాటినం.. 15 స్వర్ణ.. 18 రజత రేటింగ్’లు;
19 రైల్వేస్టేషన్లకు 3 ప్లాటినం.. 6 స్వర్ణ.. 6 రజత రేటింగ్‌తో ‘గ్రీన్ సర్టిఫికేషన్’;
ఇవే కాకుండా 15 ప్లాటినం.. 9 స్వర్ణ.. 2 రజత రేటింగ్‌లతో 27 భవనాలు..
కార్యాలయాలు.. ప్రాంగణాలు... ఇతర రైల్వే సంస్థలకూ ‘గ్రీన్ సర్టిఫికేషన్’;
గడచిన రెండేళ్లలో పర్యావరణ నిర్వహణ వ్యవస్థల అమలు ద్వారా
600 రైల్వే స్టేషన్లకు ‘ఐఎస్‌ఓ: 14001 ప్రమాణంతో గుర్తింపు;
Posted On:
04 JUN 2021 3:59PM by PIB Hyderabad
ప్రపంచంలోనే ‘అతిపెద్ద హరిత రైల్వే’గా రూపొందడం కోసం భారత రైల్వేలు (ఐఆర్) ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2030లోగా “శూన్య కర్బన ఉద్గార” లక్ష్యం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఈ మేరకు “పర్యావరణ హిత, సమర్థ, చౌకైన, సమయపాలక, ఆధునిక” ప్రయాణ వాహకంగా అవతరించాలన్న సమగ్ర దృక్కోణం రైల్వేలకు మార్గనిర్దేశం చేస్తోంది. అంతేకాకుండా పెరుగుతున్న ‘నవ భారతం’ అవసరాలను తీర్చగల సరకు రవాణా వాహకంగానూ ముందంజ వేస్తోంది. అదే సమయంలో భారీ విద్యుదీకరణ... జల-కాగిత కనిష్ఠ వాడకంసహా పట్టాలపై గాయాలనుంచి జంతువులకు రక్షణదాకా అనేక చర్యలతో పర్యావరణ పరిరక్షణలోనూ తోడ్పాటునిచ్చేందుకు భారత రైల్వేలు కృషి చేస్తున్నాయి.
పర్యావరణ హితమైనదే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే రైలుమార్గాల విద్యుదీకరణ కార్యక్రమం 2014 నుంచి నేటికి 10 రెట్లు అధికంగా నమోదైంది. విద్యుత్ మార్గాలవల్ల ఒనగూడే లబ్ధిని వేగంగా అందిపుచ్చుకోవడంసహా మిగిలిన బ్రాడ్‌గేజి (బిజి) మార్గాల విద్యుదీకరణను 2023కల్లా పూర్తిచేసి 100 శాతం లక్ష్యాన్ని చేరే ప్రణాళికలను కూడా రైల్వేశాఖ సిద్ధం చేసుకుంది. రైలు విద్యుత్ అవసరాలన్నీ తీర్చగల వ్యవస్థలు, బయో-టాయిలెట్లు, ఎల్‌ఈడీ లైట్లు వంటివాటితో ప్రయాణిక సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ పరుగుతీసే రైలు పర్యావరణహిత ప్రయాణ వాహకంగా గోచరిస్తుంది.
దీర్ఘకాలిక కనిష్ఠ కర్బన ఉద్గార మార్గసూచీతో ప్రత్యేక సరకు రవాణా హరిత మార్గాల నెట్‌వర్క్‌ను భారత రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. తద్వారా మరింత ఇంధన పొదుపుసహా కర్బనహిత సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రక్రియలు, పద్ధతుల అనుసరణకు మార్గం సుగమం అవుతుంది. భారత రైల్వేశాఖ ప్రస్తుతం రెండు ప్రత్యేక సరకు రవాణా మార్గాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో తూర్పు సరకు రవాణా మార్గం (ఈడీఎఫ్‌సీ) లూధియానా-డంకుణి (1,875 కి.మీ) ఒకటి కాగా, పశ్చిమ సరకు రవాణా మార్గం (డబ్ల్యూడీఎఫ్‌సీ) దాద్రి-జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (1,506 కి.మీ) మరొకటి. కాగా, ‘ఈడీఎఫ్‌సీ’ మార్గంలోని సోన్‌నగర్-డంకుణి (538కి.మీ) భాగాన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో పూర్తిచేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
భారత రైల్వేల నెట్‌వర్క్, దేశవ్యాప్త విస్తృతివల్ల మహమ్మారి సమయంలోనూ ఆహార ధన్యాలు, ఆక్సిజన్ వంటి అత్యవసరాల సత్వర రవాణా సాధ్యమైంది. దీంతోపాటు రోడ్డు రవాణాతో పోలిస్తే ఇది మరింత పర్యావరణ హితమైనది కావడం గమనార్హం. ఈ మేరకు 2021 ఏప్రిల్ నుంచి 2021 మే నెల మధ్యకాలంలో భారత రైల్వేశాఖ 73 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను చేరవేసింది. అలాగే ప్రాణవాయువు నింపిన 922 ట్యాంకర్లతో 241 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపి దేశంలోని వివిధ ప్రాంతాలకు 15,046 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది.
హరిత ప్రమాణాలు – పర్యావరణ నిర్వహణ వ్యవస్థల అమలు:
భారత రైల్వేశాఖలో హరితానుకూల చర్యలకు సహకారం దిశగా 2016 జూలైలో ‘ఐఆర్- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ‘39 వర్కుషాపులు, 7 ఉత్పాదక యూనిట్లు, 8 ఇంజన్ షెడ్లు, ఒక పరికరాల డిపో”లకు ‘గ్రీన్‌కో’ గుర్తింపు లభించగా, ఇందులో ‘2 ప్లాటినం.. 15 స్వర్ణ.. 18 రజత రేటింగ్’లు కూడా లభించాయి. హరిత ప్రమాణాల ధ్రువీకరణ ప్రధానంగా- పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావం చూపగల ఇంధన పొదుపు చర్యలు, పునరుత్పాదక ఇంధన వినియోగం, హరితవాయు ఉద్గారాల తగ్గింపు, జల సంరక్షణ-పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సామగ్రి పొదుపు, పునర్నవీకరణ వంటి పరామితుల అంచనాలపై ఆధారపడి ఉంటుంది. తదనుగుణంగా 3 ప్లాటినం, 6 స్వర్ణ, 6 రజత రేటింగ్‌లుసహా 19 రైల్వేస్టేషన్లకు ‘హరిత ప్రమాణ ధ్రువీకరణ’ లభించింది. అదేవిధంగా 15 ప్లాటినం, 9 స్వర్ణ, 2 రజత రేటింగ్‌లతో 27 భవనాలు, కార్యాలయాలు, ప్రాంగణాలు, ఇతర రైల్వే సంస్థలకూ ‘హరిత ప్రమాణ ధ్రువీకరణ’ దక్కింది. దీనికి అదనంగా గత రెండేళ్ల వ్యవధిలో పర్యావరణ నిర్వహణ వ్యవస్థల అమలుద్వారా 600 రైల్వే స్టేషన్లకు ‘ఐఎస్‌ఓ: 14001 ప్రమాణంతో గుర్తింపు లభించిన నేపథ్యంలో మొత్తం 718 స్టేషన్లకు ఈ ఘనత దక్కినట్లయింది.
స్వీయ ముప్పు అంచనాలు, విపత్తు నిర్వహణకు భారత రైల్వేలు నిర్దేశించుకున్న విధివిధానాల్లో వాతావరణ మార్పు సంబంధిత అంశాలను కూడా ఒక భాగం చేసుకున్నాయి. ముప్పుల నిర్వహణసహా తన ఆస్తులు, మార్గాలు, పెట్టుబడుల గురించి సముచిత ఆత్మశోధన చేసుకోగల ఒక సంస్థగా సదా సంసిద్ధతతో ఉంటుంది. భారత రైల్వేలకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించే అగ్రశ్రేణి నాయకత్వం సామూహిక అవగాహన కోసం భాగస్వాములతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూంటుంది. వారు నాయకత్వం వహించే సంస్థల దీర్ఘకాలిక మనుగడ, సుస్థిరత దృష్ట్యా ఇదెంతో అవసరం. ఇక భారత రైల్వేలు, అనుబంధ సంస్థలు ఏటా ప్రచురించే వాతావరణ సుస్థిరత నివేదికలు వివిధ వ్యూహాలను నిర్వచించే చట్రానికి ఒక నిర్దేశక పత్రంలా ఉంటాయి. అంతేకాకుండా వాతావరణ మార్పు నేపథ్యంలో దృష్టి సారించాల్సిన అంశాలు, ముప్పుతేగల సమస్యలు-వాటి పరిష్కార చర్యలు తదితరాలనూ ఈ నివేదికలు చర్చిస్తాయి. వాతావరణ మార్పుపై ప్యారిస్ ఒప్పందం, ఐక్యరాజ్య సమితి సుస్థిర ప్రగతి లక్ష్యాలు, జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలు వంటి కర్తవ్య నిర్వహణలో ప్రభుత్వానికి రైల్వేలపరంగ మద్దతునివ్వడంలోనూ ఈ నివేదికలు తోడ్పడతాయి.
భారత రైల్వేలకు చెందిన వివిధ జోన్లు, నిర్మాణ యూనిట్లలో పనిచేసే ఇంజనీర్లు, యంత్ర నిర్వాహకులు, ప్రణాళిక రూపకర్తల విస్తృత అనుభవాలకు నిరంతరం విభిన్న సవాళ్లు ఎదురవుతుంటాయి. వివిధ సంప్రదింపుల సంస్థల నివేదికల ద్వారా అంతర్జాతీయ రైల్వేల/ఆస్తుల నిర్వాహకులు, నిరంతరం నడిచే సరంజామా/సామగ్రి నిర్వహణ ఇంజనీర్లు, నేపథ్య ప్రణాళిక రూపకర్తలు తదితరులు అనుసరించే అత్యాధునిక పద్ధతులపై వారు అధ్యయనం చేస్తుంటారు. తద్వారా భారత రైల్వేలకు సంబంధించిన వాస్తవ, క్షేత్రస్థాయి పరిస్థితులకు సముచితమైన పద్ధతులను విశ్లేషించుకుని రాబోయే సవాళ్లను ఊహించడం, వాటిని ఎదుర్కోవడంపై వ్యూహాలు రూపొందించేందుకు కృషిచేస్తారు.
‘పర్యావరణ సుస్థిరత నివేదిక’ కరదీపిక లింక్ ఇదే
***
(Release ID: 1724593)
Visitor Counter : 278