కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్ మృతులైన కార్మికుల కుటుంబాలకు అండ!
సామాజిక భద్రతా సహాయం ప్రకటించిన
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
Posted On:
30 MAY 2021 2:04PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ పలు చర్యలను తీసుకుంది. కార్మిక రాజ్యబీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.)ల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. ఉద్యోగి, లేదా కార్మికుడికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే మరింత విస్తృత స్థాయిలో సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలను ప్రకటించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇ.ఎస్.ఐ.సి. కింద బీమా పొందిన వ్యక్తి తన విధి నిర్వహణలో గాయాలతో మరణించినా లేదా అంగవికలుడైనా, సదరు ఉద్యోగి సగటు దినసరి వేతనంలో 90శాతానికి సమానమైన పెన్షన్,. తన జీవిత భాగస్వామికి లేదా వితంతువైన తల్లికి జీవితాంతం అందుతుంది. పిల్లలకు అయితే వారు పాతికేళ్ల వయస్సు వచ్చేవరకూ పెన్షన్ ఇస్తారు. అదే ఆడపిల్లకైతే తన వివాహం వరకూ ఈ సదుపాయం వర్తిస్తుంది.
అయితే, ఇ.ఎస్.ఐ.సి. పథకం కింద బీమా సదుపాయం ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఇ.ఎస్.ఐ.సి. ఆన్ లైన్ పోర్టల్ లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ అవే ప్రయోజనాలను, అవే పద్ధతిలో వర్తింపజేయాలని కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే, ఈ కింద సూచించిన అర్హతాపరమైన షరతులకు లోబడి ఈ ప్రయోజనాలను వర్తింపజేస్తారు.:
ఎ. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరగడానికి కనీసం 3 నెలలు ముందుగా ఇ.ఎస్.ఐ.సి. ఆన్ లైన్ పోర్టల్.లో తన పేరును నమోదు చేసుకుని ఉండాలి.
బి. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరిగిన సంవత్సరానికి మునుపటి ఏడాదిలో నియమితుడై ఉండి, తన వేతనంనుంచి కనీసం 78 రోజుల పాటు ఇ.ఎస్.ఐ.సి. చందా జమ అయి ఉండాలి.
ఈ అర్హతలన్నీ ఉన్న బీమా వ్యక్తులు, కోవిడ్ వ్యాధితో మరణించిన పక్షంలో సదరు వ్యక్తులపై ఆధారపడిన వారికి, బీమా వ్యక్తుల దినసరి వేతనంలో 90శాతం చొప్పున మొత్తం నెలవారీగా జీవితాంతం చెల్లిస్తారు. ఈ పథకం గత ఏడాది (2020) మార్చి 24నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇ.డి.ఎల్.ఐ.) పథకం కింద సభ్యుడైన వ్యక్తి మరణించిన పక్షంలో సదరు వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యలందిరికీ ఇ.డి.ఎల్.ఐ. పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద గ్రాట్యుటీ చెల్లింపునకు కనీస సర్వీసు ఉండాలన్న షరతులేకుండా ఈ ప్రయోజనాలను అందిస్తున్నారు. అలాగే, ఇ.పి.ఎఫ్ అండ్ ఎం.పి. చట్టం నిబంధనల కింద కుటుంబ పెన్షన్ చెల్లిస్తున్నారు. కార్మికులు అస్వస్థులై విధులకు హాజరు కాలేని పక్షంలో సదరు కార్మికులుకు తమ వేతనంలో 70శాతం మొత్తాన్ని సిక్.నెస్ బెనిఫిట్ గా 91 రోజులపాటు చెల్లిస్తూ వస్తున్నారు.
అయితే, ఈ నిబంధనలకు తాజాగా కొన్ని సవరణలను చేస్తూ ఒక నోటిఫికేషన్.ను మంత్రిత్వ శాఖ జారీ చేసింది.:
- మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు.
- ఒక సంస్థలో గానీ, అంతకు మించి పలు సంస్థల్లో గానీ ఎవరైనా ఉద్యోగి తాను మరణించిన సంవత్సరానికి పూర్వం 12 నెలలపాటు సభ్యుడై ఉండిన పక్షంలో అర్హులైన కుటుంబ సభ్యులకు రూ. 2.5లక్షల కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు అమలులో ఉన్న నిబంధన ప్రకారమైతే ఒకే సంస్థలో సుదీర్ఘంగా 12ఏళ్లపాటు ఉద్యోగి అయి ఉండాలన్న షరతు ఉండేది. అయితే, సవరించిన ఈ నిబంధనతో తరచుగా ఉద్యోగాలు మారవలసిన పరిస్థితుల్లో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కాజువల్ ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది.
- కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే రూ. 2.3లక్షల పరిహారానికి సంబంధించిన నిబంధనను,..గత ఏడాది (2020) ఫిబ్రవరి 15నుంచి అమలులోకి వచ్చేలా పునరుద్ధరించారు.
- రాబోయే మూడేళ్లలో, అంటే 2021-22వ సంవత్సరంనుంచి 2023-24వ సంవత్సరం వరకూ అర్హులైన కుటుంబ సభ్యులు ఇ.డి.ఎల్.ఐ. నిధినుంచి రూ. 2,185కోట్లను అదనపు ప్రయోజనంగా పొందే అవకాశాలున్నాయని లెక్కలు చెబుతున్నాయి.
- ఉద్యోగుల మరణాల కారణంగా నష్టపరిహారం, ప్రయోజనాల కోసం దాఖలు చేసుకునే క్లెయిముల సంఖ్య సంవత్సరానికి 50,000కు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్.తో అస్వస్థత కారణంగా దాదాపు పదివేలదాకా మరణాలు ఉండవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ లెక్కలు వేస్తున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సంక్షేమ చర్యలతో కోవిడ్ కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు తగిన సహాయం లభిస్తుంది. మహమ్మారి వైరస్ వ్యాప్తితో తీవ్రమైన సవాళ్లను, కష్టాలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది ఎంతో రక్షణ కల్పిస్తుంది.
xxxx
(Release ID: 1722929)
Visitor Counter : 375