ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి.ఎస్.టి. మండలి 43వ భేటీ సిఫార్సులు!


యాంపోటెరిసిన్-బి తో పాటుగా

కోవిడ్ సంబంధిత వైద్యపరికరాలకు, ఔషధాలకు

ఐ.జి.ఎస్.టి. పూర్తిగా మినహాయింపు

ఈ ఏడాది ఆగస్టు 31 వరకూ ఈ మినహాయింపు అమలు

, కస్టమ్స్ సుంకంనుంచి యాంపోటెరిసిన్-బికి మినహాయింపు

పెండింగ్ రిటర్నులపై లేటు ఫీజు నుంచి,

ఉపశమనం కలిగించే ఆమ్నెస్టీ పథకం

భవిష్యత్తు పన్ను కాలాలకు కూడా లేటుఫీజు హేతుబద్ధం

2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్నుల సరళీకరణ

Posted On: 28 MAY 2021 9:29PM by PIB Hyderabad

  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) మండలి 43వ సమావేశం న్యూఢిల్లీలో  వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక శాఖల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

   వివిధ సరుకుల, సేవలపై వస్తువ సేవల పన్ను (జి.ఎస్.టి.) రేట్ల మార్పులు, జి.ఎస్.టి. చట్టం, అమలు ప్రక్రియలో మార్పులకు సంబంధించి జి.ఎస్.టి. మండలి ఈ కింది సిఫార్సులు చేసింది.:

కోవిడ్-19 ఉపశమనం

  • కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉపశమన చర్యగా పలు చికిత్సా పరికరాలపై, ఔషధాలపై పన్ను మినహాయింపును జి.ఎస్.టి. మండలి ప్రకటించింది. కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ నిల్వ, రవాణా పరికర సామగ్రి, కోవిడ్ వ్యాధి నిర్ధారణకు వినియోగిస్తున్న కొన్ని మార్కర్ టెస్టుల కిట్లు, కోవిడ్ వ్యాక్సీన్లు వంటి వాటిని ఐ.జి.ఎస్.టి.నుంచి పూర్తిగా మినహాయించాలని జి.ఎస్.టి. మండలి సిఫార్సు చేసింది. ఈ పరికరాలను, పరికర సామగ్రిని ప్రభుత్వానికి, ఏదైనా అధీకృత సంస్థకు విరాళంగా అందిచేందుకు చెల్లింపు పద్ధతిలో దిగుమతి చేసుకున్నా, సరే ఇలాంటి వాటిని ఐ.జి.ఎస్.టి. నుంచి పూర్తిగా మినహాయించాలని సమావేశం సిఫార్సు చేసింది.  ఈ మినహాయింపు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీవరకూ చెల్లుబాటవుతుంది. ఇప్పటివరకూ , కేవలం “ఉచిత ప్రాతిపదిక”పై ఈ సరుకులు దిగుమతి చేసుకున్న పక్షంలో మాత్రమే ఐ.జి.ఎస్.టి. మినహాయింపును వర్తింపజేసేవారు. ఈ మినహాయింపు కూడా ఈ ఏడాది ఆగస్టు 31వరకూ కొనసాగేలా సిఫార్సు చేశారు. ఇవే పరికరాలు, సామగ్రికి ఇప్పటికే మౌలిక మైన కస్టమ్ సుంకంనుంచి మినహాయింపు ఇచ్చారు. దీనికి తోడు, పెరుగుతున్న బ్లాక్.ఫంగస్ కేసులను దృష్టిలో పెట్టుకుని యాంఫోటెరీన్ బి అనే ఔషధానికి కూడా ఐ.జి.ఎస్.టి. మినహాయింపును వర్తింపజేయాలని సిఫార్సు చేశారు.

ఈ ఏడాది జూన్ 8న మంత్రుల బృందం నివేదిక సమర్పించిన తర్వాతే కోవిడ్ ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను ఉపశమనం..

  • కోవిడ్ సంబంధిత ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులో సత్వరం మరింత రాయితీ కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని నియమించాలని సమావేశం నిర్ణయించింది. మంత్రుల బృందం జూన్ 8వ తేదీన తన నివేదిక సమర్పిస్తుంది.

సరకులపై ఇతర రాయితీలు

  • లింఫటిక్ ఫైలేరిసిస్ అనే వ్యాధి నిర్మూలనకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.)తో కలసి నిర్వహించే  కార్యక్రమానికి మద్దతుగా డైథైల్ కార్బమజైన్ (డి.ఇ.సి.) మాత్రలపై జి.ఎస్.టి. రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని జి.ఎస్.టి. మండలి సిఫార్సు చేసింది.
  • కొన్ని జి.ఎస్.టి. రేట్లకు సంబంధించి కొన్ని వివరణలను, వివరణలతో కూడిన సవరణలను కూడా సిఫార్సు చేశారు. వాటిలో ప్రధానమైనవి.,

 

    • మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న సరకులపై, వాటికి జరిగిన మరమ్మతు చార్జీలపై ఐ.జి.ఎస్.టి. విధించే అవకాశం
    • స్ప్రింక్లర్లు, డ్రిప్ సేద్యపు వ్యవస్థ పరికరాల విడిభాగాలపై వర్తించేలా 12శాతం జి.ఎస్.టి. రేటు. ఇవే పరికరాలు విడిగా విక్రయించినా జి.ఎస్.టి. రేట్లు వర్తింపజేసే అవకాశం.

 

సేవలు

  • అంగన్ వాడీలతో సహా విద్యా సంస్థలకు అందించే సేవలపై వివరణ ఇవ్వడం.  ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఆహారం అందించే ఏ కార్యక్రమం, సేవపై అయినా సరే జి.ఎస్.టి. నుంచి మినహాయింపు ఇవ్వడం.
  • ప్రవేశ పరీక్షతో సహా, ఫీజు చెల్లింపు ప్రాతిపదికన వివిధ పరీక్షల నిర్వహణ ద్వారా అందించే సేవలపై వివరణ ఇవ్వడం. జాతీయ పరీక్షల మండలి (ఎన్.బి.ఇ.), కేంద్ర, రాష్ట్ర విద్యా బోర్డులు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన సేవలను జి.ఎస్.టి.నుంచి మినహాయించడం.
  • అపార్ట్ మెంట్లకు సంబంధించి ప్రమోటర్ గా ఉన్న భూ యజమాని తనపై డెవలపర్ ప్రమోటర్లు విధించిన జి.ఎస్.టి. క్రెడిట్ ను వినియోగించుకోవడానికి వీలు కల్పించే నిబంధనకోసం సంబంధిత నోటిఫికేషన్ లో మార్పులు చేయడం. అలాంటి ఆపార్ట్మెంట్లకు సంబంధించి కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసేటపుడు కానీ, అంతకు ముందు గానీ డెవలపర్ ప్రమోటర్ జి.ఎస్.టి. చెల్లించేందుకు అనుమతి ఇవ్వడం.
  • విమానయాన రంగంలో నిర్వహణ, మరమ్మతు, సమగ్ర ప్రక్షాళన అంశాలకు నిబంధనలనుంచి ఇచ్చిన మినహాయింపులను నౌకలు, ఇతర భారీ బోట్లకు విస్తరింపచేయడం. విదేశీ నౌకల నిర్వహణ, మరమ్మతు, ప్రక్షాళనా అంశాలతో సమానంగా స్వదేశీ నౌకా రంగానికి కూడా మినహాయింపులు వర్తింపజేయడం
  • నౌకలు, ఇతర భారీ బోట్ల నిర్వహణకు సంబంధించి నిర్వహణ, మరమ్మతు, సమగ్ర ప్రక్షాళనా సేవలపై జి.ఎస్.టి.ని 18శాతంనుంచి 5 శాతానికి తగ్గించడం.
  • ధాన్యాన్ని, గోధుమలను మిల్లుల ద్వారా ఖనిజ లవణాలతో కూడిన పిండిగా, బియ్యంగా మరపట్టించి అందించే సేవలకు మినహాయింపు.  ఇలాంటి సరకులను ప్రజా పంపీణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి, స్థానిక పరిపాలనా సంస్థలకు సరఫరా చేసిన పక్షంలో వాటిని జి.ఎస్.టి. నుంచి మినహాయించడం. సదరు సరకుల మిశ్రమం 25శాతాన్ని మించని పక్షంలోనే ఈ రాయితీని వర్తింపజేయడం.
  • రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వార్షిక చెల్లింపులు, వాయిదా చెల్లింపులుగా అందినపుడు అలాంటి మొత్తాలకు  జి.ఎస్.టి. వర్తిస్తుంది.
  • రోప్ వే నిర్మాణం ద్వారా ప్రభుత్వానికి అందించే సేవలపై 18శాతం జి.ఎస్.టి.

 

వాణిజ్య సదుపాయాల కల్పనకు చర్యలు:

    1. పెండింగ్ లో ఉన్న రిటర్నులను ఆలస్యంగా సమర్పించినందుకు విధించే లేటు ఫీజుపై ఉపశమనం కల్పించే ఆమ్నెస్టీ పథకం:

పన్ను చెల్లింపు దార్లకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా,  జి.ఎస్.టి.ఆర్.-3బి ఫారంను సమర్పించనందుకు విధించే లేట్ ఫీజులో ఉపశమనం ఇవ్వడం. 2017 జూలైనుంచి 2021 ఏప్రిల్ వరకు గల కాలానికి సంబంధించి ఈ కింది విధంగా లేటు ఫీజును తగ్గించడమో, రద్దు చేయడమో జరిగింది.: -

  1. పైన పేర్కొన్న పన్ను కాలానికి సంబంధించి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారు  సి.జి.ఎస్.టి., ఎస్.జి.ఎస్.టి.లకుగాను గరిష్టంగా చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.500, రూ.250గా పరిమితి విధించారు.;
  2. ఇతర పన్ను చెల్లింపు దార్లకు సి.జి.ఎస్.టి., ఎస్.జి.ఎస్.టి.లకు సంబంధించి లేటు ఫీజును ఒక్కో రిటర్నుకు గరిష్టంగా రూ. 1000, రూ. 500 చొప్పున పరిమితి విధించారు.
  3.  అయితే, ఈ పన్ను కాలాలకు సంబంధించిన లేట్ ఫీజును ఈ ఏడాది జూన్ 1వ తేదీనుంచి ఆగస్టు 31వ తేదీలోగా చెల్లించిన పక్షంలోనే జి.ఎస్.టి.ఆర్.-3బి రిటర్నులకు తగ్గించిన లేట్ ఫీజును వర్తింపజేస్తారు.

 

    1. సి.జి.ఎస్.టి. చట్టంలోని 47వ సెక్షన్  కింద విధించే లేట్ ఫీజును కూడా హేతుబద్ధం చేశారు.

 చిన్న తరహా పన్ను చెల్లింపు దారులపై ఆలస్య రుసుం (లేటు ఫీజు) భారాన్ని తగ్గించేందుకు లేట్ ఫీజు గరిష్ట పరిమితిని హేతుబద్ధం చేస్తున్నారు. చెల్లించాల్సిన పన్ను మొత్తం,.. పన్ను చెల్లింపు దార్ల వ్యాపార పరిమాణం ప్రాతిపదికగా ఈ లేటు ఫీజును హేతుబద్ధీకరించారు.

 

3. పన్ను చెల్లింపుదార్లకోసం కోవిడ్-19 సంబంధిత ఉపశమన చర్యలు:

ఈ ఏడాది మే నెల ఒకటవ తేదీన వెలువరించిన నోటిఫికేషన్ ద్వారా పన్ను చెల్లింపు దార్లకు ఇప్పటికే అందించిన రాయితీలకు అదనంగా ఈ కింద సూచించిన మరిన్ని సడలింపులు అందిస్తున్నారు.:

  1. చిన్న తరహా పన్నుచెల్లింపు దార్లకు (సగటున రూ. 5కోట్ల టర్నోవర్ ఉన్నవారు)

 

    1. 2021 మార్చి, ఎప్రిల్ కాలాలకు :
  1. ఫారం జి.ఎస్.టి.ఆర్.-3బి, లేదా పి.ఎం.టి.-06 రూపంలో రిటర్నును మొదటి 15 రోజుల్లో  దాఖలు చేసిన పక్షంలో ఎలాంటి వడ్డీ రేటు ఉండదు. ఆ తర్వాత మార్చి 2021 కాలానికి అయితే 45 రోజుల వరకూ, ఏప్రిల్ 2021 కాలానికి అయితే 30 రోజులవరకూ  దాఖలు చేస్తే 9శాతం తగ్గింపు రేటు వడ్డీ వర్తిస్తుంది.
  2. ఫారం జి.ఎస్.టి.ఆర్.-3బి రూపంలో ఆలస్యంగా రిటర్ను దాఖలు చేసినందుకు ఆలస్య రుసుం మాఫీ అమలు చేస్తారు. మార్చి, క్యు.ఇ. మార్చి 2021 కాలానికిగాను గడువు చివరి తేదీనుంచి  60 రోజులకు, ఏప్రిల్ 2021 పన్ను కాలానికి గడువు చివరి తేదీనుంచి 45 రోజులకు లేటు ఫీజు మాఫీ వర్తింపు.
  3. క్యు.ఇ. మార్చి 2021 కాలానికి గాను సి.ఎం.పి.-08 రూపంలో స్టేట్మెంట్ సమర్పించే కంపోజిషన్ డీలర్లు, గడువు చివరి తేదీనుంచి తొలి 15 రోజుల్లోగా రిటర్ను దాఖలు చేస్తే అలాంటి వారిపై ఎలాంటి వడ్జీ రేటు విధించరు.  ఆ తర్వాత 45 రోజుల్లోగా దాఖలు చేస్తే 9శాతం తగ్గింపు వడ్డీ రేటు వర్తింపజేస్తారు.

 

 

    1. మే 2021 పన్నుకాలానికి:

 

  1. ఫారం జి.ఎస్.టి.ఆర్.-3బి, లేదా పి.ఎం.టి.-06 రూపంలో గడువు చివరి తేదీనుంచి మొదటి 15 రోజుల్లోగా రిటర్ను దాఖలు చేసిన పక్షంలో ఎలాంటి వడ్డీ రేటు విధింపు ఉండదు. ఆ తదుపరి 15 రోజుల్లో దాఖలు చేస్తే 9శాతం తగ్గింపు రేటు వర్తిస్తుంది.  
  2. ఫారం జి.ఎస్.టి.ఆర్.-3బి ద్వారా గడువు చివరి తేదీనుంచి 30 రోజుల్లోగా నెలసరి రిటర్నులు దాఖలు చేసే వారికి ఆలస్య రుసుంనుంచి మినహాయింపు ఉంటుంది.
  1. పెద్దతరహా పన్ను చెల్లింపు దారులకు (సగటు టర్నోవర్ రూ. 5 కోట్లకంటే ఎక్కువ)
  1.  మే, 2021 పన్ను కాలానికి గాను ఫారం జి.ఎస్.టి.ఆర్.-3బి రూపంలో గడువు చివరి తేదీనుంచి తొలి 15 రోజుల్లో రిటర్నులు దాఖలుచేసే వారికి 9శాతం తగ్గింపు వడ్డీ రేటు వర్తిస్తుంది.
  2. ఇదే కాలానికి లేటు ఫీజునుంచి మినహాయింపు కూడా లభిస్తుంది.

 

C. కోవిడ్-19 సంబంధించిన కొన్ని ఇతర సడలింపులు

        1.  2021 మేనెలకు జి.ఎస్.టి.ఆర్.-1/ఐ.ఎఫ్.ఎఫ్. దాఖలుకు సంబంధించి చివరి గడువు 15 రోజులు పొడిగింపు.  
        2. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జి.ఎస్.టి.ఆర్.-4 దాఖలుకు గడువు ఈ ఏడాది జూలై 31 వరకూ పొడిగింపు.
        3. క్యు.ఇ. మార్చి 2021కి సంబంధించి ఐ.టి.సి.-04 దాఖలుకు గడువు ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగింపు.
        4. 2021 ఏప్రిల్, మే, జూన్ పన్ను కాలానికి గాను ఐ.టి.సి.ని వినియోగించుకునేందుకు క్యుములేటివ్ దరఖాస్తుకు అవకాశం.
        5. రిటర్నుల దాఖలు కోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డి.జి.సి.)కి బదులుగా ఎలెక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఇ.వి.సి.) వినియోగించేందుకు కంపెనీలకు అనుమతి.  ఈ ఏడాది ఆగస్టు31వ తేదీవరకూ ఈ అనుమతి వర్తింపు.

 

  1. సి.జి.ఎస్.టి. చట్టంలోని 168 సెక్షన్ కింద సడలింపులు:

జి.ఎస్.టి. చట్టం ప్రకారం ఏదైనా అధీకృత సంస్థ, లేదా ఎవరైనా వ్యక్తి  వివిధ కార్యకలాపాలను పూర్తి చేయడానికి విధించిన కాలపరిమితి సడలింపు. ఇదివరకు 2021 ఏప్రిల్ 15నుంచి 2021 జూన్ 29 వరకూ విధించిన కాలపరిమితిని ఇపుడు 2021 జూన్ 30 వరకూ పొడిగించారు. అయితే కొన్ని మినహాయింపులకు లోబడి ఈ సడలింపునకు అనుమతి ఇచ్చారు.  [ఒక వేళ కాలపరిమితిని  సుప్రీంకోర్టు ఎప్పుడు పొడిగించినా సదరు పొడిగింపే అమలులోకి వస్తుంది.]

 

 

  1. 2020-21 ఆర్థిక సంవత్సరపు వార్షిక రిటర్నులు మరింత సరళతరం:

 

  1. సి.జి.ఎస్.టి. చట్టంలోని 35, 44వ సెక్షన్లకు 2021వ సంవత్సరపు ఆర్థిక చట్టం ద్వారా  చేసిన సవరణలను నోటిఫై చేయాల్సి ఉంది. దీనితో ఫారం జి.ఎస్.టి.ఆర్.-9సి రూపంలో రికన్సైలియేషన్ ప్రకటనను దాఖలు చేయడం మరింత సరళీకృతం అవుతుంది. ఎందుకంటే పన్ను చెల్లింపుదారు తన రికన్సైలియేషన్ ప్రకటనను చార్టర్డ్ అక్కౌంటెంట్ల ప్రమేయం లేకుండా సొంతంగా సర్టిఫై చేసుకునేందుకు ఈ సవరణ వీలు కలిగిస్తుంది. 2020-21వ ఆర్థిక సంవత్సరానికి ఈ మార్పు వర్తిస్తుంది.
  2. వార్షిక టర్నోవర్ రూ. 2కోట్లవరకూ ఉన్న పన్ను చెల్లింపు దార్లు 2020-21వసంవత్సరానికి ఫారం జి.ఎస్.టి.ఆర్.-9/9ఎ రూపంలో వార్షిక రిటర్ను దాఖలు చేయడం ఐచ్ఛికాంశం అవుతుంది.
  3. 2020-21వ ఆర్థిక సంవత్సరానికి ఫారం జి.ఎస్.టి.ఆర్.-9సి లో రికన్సైలియేషన్ ప్రకటనను,..వార్షిక సగటు టర్నోవర్ రూ. 5కోట్లకు పైగా ఉన్న పన్ను చెల్లింపు దార్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
  1. సి.జి.ఎస్.టి. చట్టంలోని 50వ సెక్షన్ కు చేసిన సవరణ 2017 జూలై 1వ తేదీనుంచి అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. దీనితో, నగదు ప్రాతిపదికగా వడ్డీని చెల్లించేందుకు వీలు కలుగుతుంది. ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ వెలుడవలసి ఉంది.

ఇతర చర్యలు

  1. జి.ఎస్.టి. చట్టంలో కొన్ని సవరణలు చేయాలని జి.ఎస్.టి. మండలి సమావేశం సిఫార్సు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న జి.ఎస్.టి.ఆర్.-1/3బి రిటర్ను దాఖలు ప్రక్రియ దానంతట అదే జి.ఎస్.టి. రిటర్ను దాఖలు వ్యవస్థలా రూపొందేలా మార్పు చేసేందుకు చట్టానికి సవరణ తేవాలని సమావేశం అభిప్రాయపడింది. 

*****

గమనిక: జి.ఎస్.టి. మండలి సిఫార్సులను భాగస్వామ్య వర్గాల సమాచారం కోసం ఈ ప్రకటనలో సరళమైన భాషలో తెలియజేశాం. ఈ సిఫార్సులు అన్నీ తగిన సర్క్యులర్లు, నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే చట్టబద్ధంగా అమలులోకి వస్తాయి.

 

***



(Release ID: 1722745) Visitor Counter : 334