నీతి ఆయోగ్

భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అవాస్తవాలు,.. నిజాలు

Posted On: 27 MAY 2021 12:01PM by PIB Hyderabad

    కోవిడ్-19 వ్యాధి నిరోధం లక్ష్యంగా భారతదేశం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రస్తుతం అనేక అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి.  వక్రీకరించిన ప్రకటనలు, అర్థసత్యాలు, అసత్యాల కారణంగా ఈ అవాస్తవాలు, కల్పితాలు ప్రచారమవుతూ వస్తున్నాయి.

  ఈ అవాస్తవాలను, అపోహలను తోసిపుచ్చుతూ నీతీఆయోగ్ లోని ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ అమలుకు సంబంధించిన నిపుణుల బృందం అధ్యక్షుడు అయిన డాక్టర్ వినోద్ పాల్ ఒక వివరణ ఇచ్చారు. అన్ని అంశాలపై పూర్తి వాస్తవాలను ఆయన తెలియజేశారు.

  ఏది అవాస్తవం (కల్పితం), ఏది నిజం అన్నది ఈ దిగువన ఇస్తున్నాం.

 1వ అవాస్తవం:

  విదేశాలనుంచి వ్యాక్సీన్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం తగిన కృషి చేయడంలేదు.

  నిజం: ప్రముఖ అంతర్జాతీయ వ్యాక్సీన్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం గత ఏడాది మధ్యకాలం నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూనే వస్తోంది. ఇందుకు సంబంధించి ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా సంస్థలతో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి. వ్యాక్సినేషన్లు సరఫరా చేసేందుకు, లేదా భారతదేశంలో అవే వ్యాక్సీన్లను తయారు చేసేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ ప్రభుత్వం తన సంసిద్ధత కూడా తెలిపింది. వాళ్ల వ్యాక్సీన్లు సరఫరాకు అందుబాటులో లేవని చెప్పలేం. కానీ, అంతర్జాతీయంగా వ్యాక్సీన్లను కొనుగోలు చేయడమంటే, అందుబాటులో ఉన్న సరుకును అలవోకగా కొనుగోలు చేయడం కాదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అసలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ల సరఫరా చాలా పరిమితంగా ఉంది. పరిమితమైన తమ వ్యాక్సీన్ల నిల్వలకు సంబంధించి కంపెనీలకు కూడా తమ సొంత ప్రాధాన్యతలు, ప్రణాళికలు, ఒత్తిడులు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏ దేశంలో ఉంటున్నాయో సదరు దేశానికే అవి ప్రాధాన్యం ఇస్తాయి. మనదేశంలోని వ్యాక్సీన్ కంపెనీలు నిస్సందేహంగా మనకోసం ఏ చేస్తాయో అవి కూడా అదే రకంగా వ్యవహరిస్తాయి. వ్యాక్సీన్ అందుబాటులో ఉన్నట్టు ఫైజర్ కంపెనీ సూచనప్రాయంగా తెలపగానే, ఆ వ్యాక్సీన్.ను సాధ్యమైనంత త్వరగా దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఫైజర్ కంపెనీ ఉమ్మడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ కృషి ఫలితంగా స్పూత్నిక్ వ్యాక్సీన్ ప్రయోగాత్మక పరీక్షలు కూడా వేగం పుంజుకున్నాయి. వాటిని తెప్పించేందుకు సకాలంలో ఆమోదం కూడా లభించింది. ఆ వ్యాక్సీన్లను మన కంపెనీలు తయారు చేసేందుకు వీలుగా వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించేందుకు రష్యా ఇప్పటికే అంగీకరించింది. అతి త్వరలో ఆ వ్యాక్సీన్ల ఉత్పాదన కూడా మొదలవుతుంది. భారతదేశం రావాలని, భారత్ లో వ్యాక్సీన్లు తయారు చేయాలని, దేశంకోసం ప్రపంచ ప్రయోజనాల కోసం వాటిని తయారు చేయాలని అన్ని అంతర్జాతీయ వ్యాక్సీన్ కంపెనీలకు మేం మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.

  2వ అవాస్తవం:

  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సీన్లకు కేంద్రం ఆమోదం తెలపలేదు.

  నిజం: అమెరికాకు చెందిన ఫెడరల్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ (ఎఫ్.డి.ఎ.), యూరోపియన్ ఔషధ సంస్థ (ఇ.ఎం.ఎ.), బ్రిటన్ కు చెందిన ఔషధ, ఆరోగ్య రక్షణా ఉత్పాదనల నియంత్రణా సంస్థ (ఎం.హెచ్.ఆర్.ఎ.), జపాన్ కు చెందిన ఔషధ, వైద్య పరికరాల సంస్థ (పి.ఎం.డి.ఎ.) ఆమోదించిన వ్యాక్సీన్లు మన దేశంలోకి ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను సడలించడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీలంగా వ్యవహరించింది. అత్యవసర వినియోగంకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.)తన జాబితాలోకి అనుమతించిన వ్యాక్సీన్ల ప్రవేశానికి కూడా కేంద్రం వీలు కల్పించింది. మన దేశంలో ముందస్తుగా ఈ వ్యాక్సీన్లపై ఎలాంటి ప్రయోగాత్మక పరీక్షలు జరపాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో తయారై, పనితీరు ఇప్పటికే నిర్ధారితమైన వ్యాక్సీన్లు అన్నింటికీ ప్రయోగాత్మక పరీక్షలనుంచి మినహాయింపు కల్పిస్తూ సంబంధిత నిబంధనను ఇపుడు మరింత సడలించడం జరిగింది. ఆమోదం కోసం దాఖలు చేసుకున్న ఏ విదేశీ వ్యాక్సీన్ కంపెనీ దరఖాస్తు కూడా ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ వద్ద పెండింగ్.లో లేదు.

  3వ అవాస్తవం:

  దేశీయంగా వ్యాక్సీన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదు.

  నిజం: మరిన్ని కంపెనీలు వ్యాక్సీన్లను తయారు చేసేలా తగిన అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరం ప్రారంభంనుంచి కృషి చేస్తూవస్తోంది. కోవాగ్జిన్ అనే వ్యాక్సీన్ తయారీకి సంబంధించి ఒక కంపెనీ (భారత్ బయోటెక్) మాత్రమే మేథో సంపత్తి హక్కులు (ఐ.పి.) కలిగి ఉంది. భారత్ బయోటెక్ కంపెనీ నెలసరి వ్యాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా, మరో 3 కంపెనీలు, ప్లాంట్లు కూడా ఇదే వ్యాక్సీన్ తయారు చేసేలా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దీనితో మొత్తం నాలుగు కంపెనీలు వ్యాక్సీన్ తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. భారత్ బయోటెక్ కంపెనీ నెలసరి ఉత్పత్తి సామర్థ్యాన్నిదాదాపు కోటి డోసుల నుంచి, అక్టోబరు నాటికి పది కోట్ల డోసులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి అదనంగా, మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కలసి వచ్చే డిసెంబరు నాటికి నాలుగు కోట్ల డోసుల వరకూ ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమయ్యాయి. ప్రభుత్వంనుంచి అందుతున్న ప్రోత్సాహంతో కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరమ్ ఇన్.స్టిట్యూట్ కూడా తన ఉత్పత్తిని పెంచబోతోంది. నెలకు ఆరున్నర కోట్ల డోసులుగా ఉన్న కోవిషీల్డ్ ఉత్పత్తిని 11కోట్ల డోసులకు పెంచబోతున్నారు. ఇక స్పూత్నిక్ వ్యాక్సీన్ తయారీకి సంబంధించి రష్యాతో భాగస్వామ్యంకోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. డాక్టర్ రెడ్డీస్ కంపెనీ సమన్వయ కర్తగా ఆరు కంపెనీలు స్సూత్నిక్ వ్యాక్సీన్ ను తయారు చేయబోతున్నాయి. ఇక దేశీయంగా వ్యాక్సీన్ ఉత్పత్తికోసం ప్రయత్నిస్తున్న జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈవన్స్, జన్నోవా కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. కోవిడ్ సురక్షా పథకం కింద ఆయా కంపెనీలకు నిధులందించడం, జాతీయ లేబరేటరీల్లో తగిన సాంకేతిక మద్దతు అందించడం ద్వారా వాటికి కేంద్రం సహాయపడుతోంది. ముక్కు రంద్రాల ద్వారా చుక్కల రూపంలో వేసే ఒకే డోసు వ్యాక్సీన్.కు సంబంధించిన రూపకల్పన ప్రక్రియ భారత్ బయోటెక్ కంపెనీలో సజావుగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుకు కూడా భారత ప్రభుత్వం నిధులందిస్తోంది. కోవిడ్ నిర్మూలనకు సంబంధించి ఈ వ్యాక్సీన్ ప్రపంచంలోనే పెనుమార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మన వ్యాక్సీన్ తయారీ సంస్థల ద్వారా 200కోట్ల డోసులకు పైగా వ్యాక్సీన్ ను ఉత్పత్తి చేయవచ్చన్న అంచనాకు వచ్చామంటే అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, అందిస్తున్న భాగస్వామ్యమే కారణమవుతుంది. ఇంత భారీ సామర్థ్యంతో వ్యాక్సీన్ల ఉత్పత్తి,.. ఇతర దేశాల్లో కనీసం కలలోనైనా సాధ్యమవుతుందా? అదీ సంప్రదాయ పద్ధతిలోనేకాక, డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ వేదికల ప్రాతిపదికగా ఉత్పత్తి అంటే అది సాధ్యమేనా? అయితే, భారత ప్రభుత్వం, వ్యాక్సీన్ తయారీ కంపెనీలు కలసికట్టుగా రోజువారీ చర్చలు జరుపుతూ,  ఒక జట్టుగా గట్టిగా కృషి చేసినందునే ఇంతటి భారీ ప్రయత్నం ఫలితాలను అందించే అవకాశం ఏర్పడింది.   

  4వ అవాస్తవం:

 కేంద్రం నిర్బంధ లైసెన్సింగ్ విధానం ప్రవేశపెట్టాలి.

  నిజం:  నిర్బంధ లైసెన్సింగ్ లేదా తప్పనిసరి లైసెన్సింగ్ ప్రక్రియ అనేది అంత సరైన ప్రత్యామ్నాయం కాదు.  అంత ఉపయుక్తమైన సూత్రం కూడా కాదు.  క్రియాశీలక భాగస్వామ్యం, మానవ వనరులకు శిక్షణ, ముడి సామగ్రిని అందించడం, అత్యున్నత జీవ భద్రతా పరిశోధన శాలలు అనేవి చాలా అవసరం. ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. పరిశోధనా, అభివృద్ధి, రూపకల్పనా కార్యక్రమాలు నిర్వహించిన కంపెనీ చేతిలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. వాస్తవానికి, నిర్బంధ లైసెన్సింగ్ ప్రక్రియను మించిన రీతిలో మేం మరో అడుగు కూడా ముందుకేశాం. కోవాగ్జిన్ వ్యాక్సీన్ తయారీ సామర్థ్యం పెంపునకు సంబంధించి భారత్ బయోటెక్ కంపెనీ మరో 3 కంపెనీల మధ్య భాగస్వామ్యం ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నాం. స్పూత్నిక్ వ్యాక్సీన్ విషయంలో కూడా ఇలాంటి పద్ధతిని అనుసరిస్తున్నాం. దీన్ని గురించి ఆలోచించండి: తాను రూపకల్పన చేసిన ఫార్ములాతో వ్యాక్సీన్ ను తయారీ చేసే కంపెనీపై తాను కేసు దాఖలుచేయబోనంటూ మోడెర్నా కంపెనీ గత ఏడాది అక్టోబరులో ప్రకటించింది. అయినా ఇప్పటికీ ఏ కంపెనీ కూడా ఉత్పత్తికి సిద్ధపడలేదు. దీన్ని బట్టి చూస్తే, అనేక సమస్యల మధ్యలో లైసెన్సింగ్ అనేది ఏమాత్రం చెప్పుకోదగిన అంశం కాదని తెలుస్తోంది. వ్యాక్సీన్ తయారీ ప్రక్రియ అంత సులభమే అయిన పక్షంలో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యాక్సీన్ డోసులకు కొరత ఎందుకు ఏర్పడింది?

  5వ అవాస్తవం:

కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలపైకి వదిలేసింది.

  నిజం:  కేంద్రం అన్ని రకాల భారీస్థాయి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. వ్యాక్సీన్ తయారీ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించడం మొదలుకొని, విదేశీ వ్యాక్సీన్లు భారత్ కు తీసుకువచ్చి, ఉత్పత్తిని పెంచేందుకు సత్వర ఆమోదం ఇవ్వడం వరకూ అనేక బాధ్యతలను కేంద్రం నిర్వర్తిస్తోంది. తాను సేకరించిన వ్యాక్సీన్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అందిస్తోంది. ఇదంతా రాష్ట్రాలకు కూడా పూర్తిగా తెలుసు.  తమ, తమ అభ్యర్థనల మేరకు సొంతంగా వ్యాక్సీన్లను సేకరించుకునేలా ఆయా రాష్ట్రాలకు తగిన మద్దతును అందిస్తోంది. దేశంలో వ్యాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యం ఏమిటో, విదేశాలనుంచి నేరుగా వ్యాక్సీన్లను సేకరించడంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్రాలకు బాగా తెలుసు. వాస్తవానికి, ఈ ఏడాది జనవరినుంచి ఏప్రిల్ వరకూ మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వమే నిర్వహించింది. వ్యాక్సీన్లపై మే నెలలో నెలకొన్న పరిస్థితితో పోల్చితే అప్పట్లో అది చక్కగా సాగింది. అయితే, ఆరోగ్యరక్షణ సిబ్బందికి, కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు 3నెలల కాలంలో వ్యాక్సినేషన్ సక్రమంగా వర్తింపజేయని రాష్ట్రాలు,.. ప్రక్రియ మొత్తాన్ని మరింత వికేంద్రీకరించాలని కోరాయి. ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. తమకు మరింత అధికారం కావాలంటూ రాష్ట్రాలు పదేపదే కోరిన ఫలితంగానే ప్రస్తుతం సరళీకృత వ్యాక్సినేషన్ విధానం అమలులోకి వచ్చింది. వాస్తవానికి ఆయా రాష్ట్రాలు ప్రకటించిన ప్రపంచ వ్యాప్త టెండర్ల విధానం ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. దీనితో,.. మొదటనుంచి మేం రాష్ట్రాలకు చెబుతూ వస్తున్నదే నిజమని మరోసారి తేలిపోయింది.: వ్యాక్సీన్ల సరఫరా చాలా తక్కువగా ఉందని, స్వల్ప కాలంలోనే వాటిని సేకరించడం కుదరదని తేటతెల్లమైపోయింది.

  6వ అవాస్తవం:

కేంద్రం, రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సీన్లు ఇవ్వడం లేదు.

  నిజం: ముందస్తుగా అంగీకరించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సీన్లను కేటాయిస్తూ వస్తోంది. వాస్తవానికి వ్యాక్సీన్ల లభ్యత గురించి రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే సమాచారం కూడా అందుతోంది. సమీప భవిష్యత్తులో వ్యాక్సీన్ల లభ్యత పెరిగే సూచనలు ఉన్నాయి. సరఫరా మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. భారత ప్రభుత్వం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రాష్ట్రాలకు 25శాతం డోసుల వ్యాక్సీన్ అందుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు 25శాతం డోసులు అందుకుంటున్నాయి. అయితే, ఈ 25 శాతం వ్యాక్సీన్ డోసుల పంపిణీలో ప్రజలు అనేక అవాంతరాలు, అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటుగా మన నాయకుల్లో కొందరి వ్యవహార శైలి కూడా వింతగా ఉంది. వ్యాక్సీన్ల సరఫరా గురించి వాస్తవాలేమిటో తమకు పూర్తిగా తెలిసినప్పటికీ, వారు రోజూ టెలివిజన్ తెరలపై కనపడుతూ, ప్రజల్లో గందరగోళం సృష్టించడం చాలా దుదృష్టకరం. రాజకీయాలకు ఇది సమయం కాదు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలసి సమైక్య స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది.

  7వ అవాస్తవం:

  చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్.పై కేంద్రం ఎలాంటి చర్యా తీసుకోవడం,లేదు.

 

  నిజం: ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలోని ఏ దేశంలో చిన్నపిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం లేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎలాంటి సిఫార్సు చేయలేదు. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ఎంతమాత్రం సురక్షితం అనే అంశంపై అధ్యయనాలు కూడా జరిగాయి. అధ్యయనాలు ప్రోత్సాహకరంగా కూడా ఉన్నాయి. భారతదేశంలో పిల్లలపై వ్యాక్సీన్ ప్రయోగాత్మక పరీక్షలు త్వరలోనే ప్రారంభం కానున్నాయ. అయితే, వాట్సాప్ గ్రూపుల్లో కలిగించే గందరగోళం ప్రాతిపదికగా చిన్న పిల్లల వ్యాక్సినేషన్ పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొందరు రాజకీయ నాయకులు ఇలాగే తమ రాజకీయాలు సాగించాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవలసింది మన శాస్త్రవేత్తలు. అది కూడా,.. ప్రయోగాత్మక పరీక్షల ఆధారంగా తగినంత సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాతే వారు నిర్ణయం తీసుకుంటారు.   

 

*****(Release ID: 1722149) Visitor Counter : 325