ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొత్తం 20 కోట్ల టీకా డోసులు దాటిన భారత్


టీకాలు మొదలైన 130 రోజుల్లోనే సాధించిన భారత్

అమెరికా తరువాత ఈ మైలురాయి దాటిన రెండోదేశం

60 ఏళ్ళు పైబడ్డవారిలో 42% మందికి మొదటి డోస్ పూర్తి

Posted On: 26 MAY 2021 3:41PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారత్ ఈ రోజు మరో కీలకమైన మైలురాయి దాటింది. టీకాలు ప్రారంభించిన 130వరోజున 20 కోట్ల డోసులను దాటి ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 20,06,62,456 కి చేరుకోగా ఇందులో 15,71,49,593 మొదటి డోసులు,  4,35,12,863 రెండో డోసులు ఉన్నాయి.  ప్రపంచంలో అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న ప్రారంభించటం తెలిసిందే.

 

130 రోజుల్లో ఇన్ని టీకాలు వేయటంలో అమెరికా తరువాత రెండో స్థానం భారతదేశానిదే కావటం గమనార్హం. అమెరికా ఈ మైలురాయి చేరుకోవటానికి 124 రోజులు పట్టింది.

 

అవర్ వరల్డ్ ఇన్ డేటా తదితర వనరుల ద్వారా అందిన సమాచారం ప్రకారం కోవిడ్ టీకాల కార్యక్రమంలో ముందున్న దేశాలలో యుకె ( 168 రోజుల్లో 5.1 కోట్ల టీకాలు), బ్రెజిల్ ( 128 రోజుల్లో 5.9 కోట్ల టీకాలు), జర్మనీ ( 149 రోజుల్లో 4.5 కోట్ల టీకాలు ) ఉన్నాయి.   

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దగ్గర అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 45 ఏళ్ళు పైబడ్డ జనాభాలో 34 శాతం మంది కనీసం మొదటి డోస్ తీసుకున్నారు. అదే విధంగా 60 ఏళ్ళు పైబడ్డవారిలొ 42% మంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు.

 భారత్ లో ప్రస్తుతం మూడు రకాల టీకాలు వాడుతున్నారు, అందులో సీరమ్ ఇన్ స్టిట్యూ ఆఫ్ ఇండియా వారి కోవిషీల్డ్ , భారత్ బయోటెక్ వారి కొవాక్సిన్ అనే రెండూ భారత్ లో తయారైనవి కాగా మూడోది రష్యాలో తయారైన స్పుత్నిక్. అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణాధికారి దీనిని అనుమతించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దీనివాడకం ప్రారంభించగా రానున్న కొద్ది రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

130 రోజులక్రితం జనవరి 16న మొదలైన మొదటి దశ టీకాల కార్యక్రమానికి జాతీయ నిపుణుల బృందం నిర్దేశించిన విధంగా ప్రాధాన్యాలు నిర్ణయించారు. ముందుగా  ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.  మార్చి 1న రెండో దశ ప్రారంభం కాగా ఇందులో వ్యాధిబారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవర్గాల మీద దృష్టి సారించారు. ఆ విధంగా 60 ఏళ్ళు పైబడ్డవారిని, 45 ఏళ్ళు దాటి ఇతర దీర్ఘ కాల వ్యాధులతో బాధపడేవారిని ఇందులో చేర్చారు. ఆ తరువాత దీన్ని మరింత సరళతరం చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడ్డ వారందరినీ చేర్చారు. టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయటం కోసం మే 1 నుంచి మూడో దశగా 18 ఏళ్ళు దాటిన వారందరినీ టీకాలు తీసుకోవటానికి అర్హులుగా  ప్రకటించారు.  

 

***

 



(Release ID: 1721919) Visitor Counter : 213