ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మ్యూకోర్ మైకోసిస్ రుగ్మతను పేరుతోనే గుర్తించడం అవసరం

ఫంగస్ రంగును ప్రస్తావించడం తగదన్న ఎయిమ్స్ డైరెక్టర్

కోవిడ్ వైరస్ రోగుల్లో ఎక్కువగా కనిపించేది
మ్యూకోర్ మైకోసిస్ మాత్రమేనన్న డాక్టర్ గులేరియా
“ఇది అంటువ్యాధి కాదు, ఒకరినుంచి మరొకరికి సోకదు”

“ఆక్సిజన్ థెరపీతో దీనికి సంబంధమే లేదు”

“90నుంచి 95శాతం వరకూ మ్యూకోర్ మైకోసిస్ రోగులు
మధుమేహ పీడితులు, లేదా స్టెరాయిడ్లు వాడినవారు”

Posted On: 24 MAY 2021 5:39PM by PIB Hyderabad

   కోవిడ్-19 వైరస్ దాడినుంచి కోలుకున్న, లేదా కోలుకుంటున్న రోగుల్లో కనిపించే సాధారణ ఫంగస్ ఇన్ఫెక్షన్ మ్యుకోర్ మైకోసిస్. ఇలాంటి కేసులు ఇటీవల పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ఇది అంటువ్యాధి కాదు. అంటే, కోవిడ్-19 వైరస్ లాగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. న్యూఢిల్లీకి చెందిన అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇదే విషయాన్ని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో పి.ఐ.బి. నేషనల్ మీడియా సెంటర్.లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరణ ఇచ్చారు.

 

మ్యూకోర్ మైకోసిస్ అనాలి..బ్లాంక్ ఫంగస్ అనరాదు.

  మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి గురించి మాట్లాడేటపుడు, బ్లాక్ ఫంగస్ అనే పదం వాడరాదని, అలాంటపుడే, అనవసర అయోమయానికి, గందరగోళానికి తావుండదని డాక్టర్ గులేరియా అన్నారు. “బ్లాంక్ ఫంగస్ అనేది మరో వర్గానికి చెందిన రుగ్మత. తెల్లగా ఉండే ఫంగస్ సమూహంలో ఇది నల్లని మచ్చల్లాగా కనిపిస్తున్నందున మ్యూకోర్ మైకోసిస్. గురించి ప్రస్తావించేటపుడల్లా బ్లాక్ ఫంగస్ అనే పదం వాడుతున్నారు. సాధారణంగా ఫంగస్ ఇన్ఫెక్షన్.కు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. క్యాండిడా, యాస్పర్ గిల్లోసిస్, క్రిప్టోకోకస్, హిస్టాప్లాస్మోసిస్, కోక్సీడియో డోమైకోసిస్ వంటి రకరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వీటిలో మ్యూకోర్ మైకోసిస్, క్యాండిడా, యాస్పిర్ గిల్లోసిస్ అనే ఇన్ఫెక్షన్లు మాత్రం బాధితుడి వ్యాధి నిరోధక శక్తి మరీ తక్కువగా ఉన్నపుడు బయటపడతాయి.” అని ఆయన అన్నారు.

 

ఇన్ఫెక్షన్ స్వభావం, వ్యాధి లక్షణాలు, చికిత్స..

   ఈ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి గురించి డాక్టర్ గులేరియా మాట్లాడుతూ,. “క్యాండిడా అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినపుడు నోటిపై తెల్లని మచ్చలు, నోటిలో తొర్రలు, నాలుకపై పుండ్లు కనిపిస్తాయి. ఒక్కోసారి మర్మావయవాలపై ప్రభావం చూపుతుంది. రక్తంలో కూడా కనిపిస్తుంది. (ఇలాంటి సందర్భాల్లో కేసు తీవ్రతరమయ్యే ఆస్కారం ఉంటుంది). ఇక యాస్పర్ గిల్లోసిస్ అనేది మరీ అంత సాధారణమైన ఇన్ఫెక్షన్ కాదు. ఇది ఊపిరితిత్తులపై దాడి చేసి, ఊపిరిత్తుల్లో తొర్రలను ఏర్పరుస్తుంది. అయితే, కోకవిడ్-19 సోకినపుడు మాత్రం, వారిలో ఎక్కువగా మ్యూకోర్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ మాత్రమే కనిపిస్తోంది. అక్కడక్కడా యాస్పర్ గిల్లోసిస్, కొంతమందిలో మాత్రం క్యాండిడా ఇన్పెక్షన్ కనిపిస్తున్నాయి.” అని గులేరియా అన్నారు.

   మ్యుకోర్ మైకోసిస్ సోకిన వారిలో ప్రాణాపాయానికి గల ఆస్కారంపై ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. “ఇలా మ్యూకోర్ మైకోసిస్ సోకిన రోగుల్లో 90నుంచి 95శాతం మంది మధుమేహ పీడితులో, లేదా స్టెరాయిడ్ మందులు తీసుకున్నవారో ఉంటున్నారు. మధుమేహ రోగులు కానివారిలో, స్టెరాయిడ్ మందులు తీసుకోని వారిలో ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది.” అని అన్నారు.

   ఎక్కువ ముప్పును ఎదుర్కొనే కేటగిరీకి చెందిన రోగులు,..అంటే..అదుపులోకి రాని మధుమేహంతో బాధపడేవారు, స్టెరాయిడ్స్ వాడుతూన్న కోవిడ్ పాజిటివ్ రోగులు తమకు ఈ కింద సూచించిన వ్యాధి లక్షణాలు ఉంటే..వెంటనే డాక్టర్లకు ఆ విషయం తెలియజేయాలని రణదీప్ గులేరియా సూచించారు. “తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కునుంచి రక్తం కారడం, కళ్ల కింద వాపు, ముఖంపై స్పర్శ జ్ఞాననం తగ్గడం.. వంటి వ్యాధి లక్షణాలను మ్యూకోర్ మైకోసిస్ సోకిందనడానికి హెచ్చరికలుగా  పరిగణిస్తారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందనే వర్గానికి చెందిన, స్టెరాయిడ్స్ వాడుతున్న రోగుల్లో ఈ లక్షణాలు కనిపించిన పక్షంలో సత్వరం వైద్యులకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే సత్వర వ్యాధి నిర్ధారణకు, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.” అని ఆయన అన్నారు.

 

మ్యూకోర్ మైకోసిస్ రకాలు

మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి శరీరంలోని ఏ అవయవంపై దాడి చేస్తుందనే అంశం ఆధారంగా ఆ వ్యాధిని పలు రకాలుగా వర్గీకరించవచ్చు. అది ఏ అవయవంపై దాడి చేసిందనేదాన్ని బట్టి,.. ఇన్ఫెక్షన్ తీరు తెన్నుల్లో, లక్షణాల్లో కూడా పలు వ్యత్యాసాలు ఉంటాయి.

 

  • మెదడు సంబంధమైన మ్యూకోర్ మైకోసిస్: ఇది ముక్కు, నేత్ర కుహరం, కంటి చుట్టూ ఉన్న ఎముకల గూడు, నోటి కుహరాన్ని సోకి, చివరకు మెదడుకు కూడా వ్యాపిస్తుంది. తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ద్వారా ఆకుపచ్చని ద్రవం స్రవించడం, నాసికా రంద్రాల్లో నొప్పి, ముక్కులో రక్తస్రావం, ముఖం వాచిపోవడం, ముఖంపై స్పర్శ లోపించడం, చర్మం రంగు మారడం వంటివి ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు.

 

  • ఊపిరి తిత్తుల మ్యూకోర్ మైకోసిసిస్: ఇందులో ఫంగస్ ఇన్ఫెక్షన్, ఊపిరి తిత్తులను దెబ్బతీస్తుంది. జ్వరం, ఛాతీ నొప్పి, దగ్గు రావడం, దగ్గినపుడు రక్తం పడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా పరిగణిస్తున్నారు.   

 అన్నవాహిక మార్గానికి కూడా ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంది.

 

 ఆక్సిజన్ థెరపీతో ఎలాంటి సంబంధం లేదు

“ఇంటివద్దనే చికిత్స పొందే రోగులు, ఆక్సిజన్ థెరపీ తీసుకోని రోగుల్లో చాలా మందికి కూడా మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. అంటే,.. ఆక్సిజన్ థెరపీ ద్వారా చికిత్స తీసుకునే రోగులకు ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తో సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేం,” అని డాక్టర్ గులేరియా వివరించారు.

 

చికిత్సలో సవాళ్లు

  ఈ రుగ్మతకు ఫంగస్ నిర్మూలనకోసం చికిత్స చాలా వారాలపాటు సాగుతుంది. ఒక విధంగా ఇది ఆసుపత్రులకు చాలా సవాళ్లతో కూడిన చికిత్స. ఎందుకంటే, కోవిడ్ పాజిటివ్ రోగులను, కోవిడ్ నెగిటివ్.గా నిర్ధారితమై మ్యూకోర్ మైకోసిస్ సోకిన రోగులను ఆసుపత్రిలో విడివిడిగా ఉన్న వార్డుల్లో చేర్చాల్సి ఉంటుంది.

 ఇలాంటి రోగులకు సమంజసమనిపిస్తేనే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే,.. మ్యూకోర్ మైకోసిస్ రుగ్మతకు తీవ్రమైన సర్జరీ చేస్తే, కోవిడ్ రోగుల్లో ప్రతికూలమైన ఫలితాలు ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంటుంది.

  మధుమేహ పీడితులైన రోగుల విషయంలో సరైన శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రోగుల విషయంలో ఏలాంటి చిన్న ఆస్కారం దొరికినా, వెంటనే ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వినియోగించే వారు, గదిలో తేమ కారకాలైన వాటినన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

 

మీరు చదవాల్సినవి.:

  1. మ్యూకోర్ మైకోసిస్ నుంచి రక్షణ- కోవిడ్-19 రోగుల్లో కనిపించే  ఫంగస్ సంక్లిష్టతా వ్యాధి
  2. రక్తంలో చక్కెర నిల్వలపై నిరంతర పర్యవేక్షణ: మధుమేహ రోగులకు సూచన

 

****(Release ID: 1721566) Visitor Counter : 175