ప్రధాన మంత్రి కార్యాలయం

వారణాసికి చెందిన వైద్యులు, అధికారులతో సంభాషించిన - ప్రధానమంత్రి


నిర్లక్ష్యంగా ఉండవద్దనీ, బనారస్ మరియు పూర్వాంచల్ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని - ఆరోగ్య కార్యకర్తలకు సూచన

"మైక్రో- కంటైన్మెంట్ జోన్లు" మరియు "ఔషధాల హోమ్ డెలివరీ" వంటి చర్యలకు - అభినందన

రోగికి ఇంటి దగ్గరే చికిత్స ను అందించగలిగితే, ఆరోగ్య వ్యవస్థ పై భారం తగ్గుతుంది : ప్రధానమంత్రి

Posted On: 21 MAY 2021 2:16PM by PIB Hyderabad

వారణాసికి చెందిన వైద్యులు, అధికారులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు.  ప్రధానమంత్రి నిరంతర, చురుకైన నాయకత్వం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంలో సహాయపడిందనీ, అవసరమైన మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వంటి క్లిష్టమైన పరికరాలు తగినంతగా సరఫరా జరిగేలా నిర్ధారించిందనీ పేర్కొంటూ, వారణాసి కి చెందిన వైద్యులు, అధికారులు, ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.  గత నెలలో చేపట్టిన ప్రయత్నాల గురించి ప్రధానమంత్రి కి తెలియజేశారు.  కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం గత నెలలో చేపట్టిన ప్రయత్నాలు, టీకా పరిస్థితి తో పాటు, భవిష్యత్ సవాళ్లకు జిల్లాను సన్నద్ధం చేయడానికి కొనసాగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ప్రణాళికల గురించి, అధికారులు, ప్రధానమంత్రి కి వివరించారు.   ముకోర్మైకోసిస్ ముప్పు గురించి, అప్రమత్తంగా ఉన్నామనీ, ఈ వ్యాధి నిర్వహణకు తగిన చర్యలు, సౌకర్యాలను సమకూర్చుకున్నామనీ, వైద్యులు కూడా, ఈ సందర్భంగా,  ప్రధానమంత్రికి తెలియజేశారు. 

కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటున్న వారికి నిరంతర శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  ముఖ్యంగా పారామెడికల్ సిబ్బంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యుల కోసం శిక్షణా సమావేశాలు, వెబీనార్లు నిర్వహించాలని, ఆయన,  అధికారులకు, వైద్యులకు సూచించారు.  జిల్లాలో వ్యాక్సిన్ వృథా ను తగ్గించే దిశగా పనిచేయాలని ఆయన అధికారులను కోరారు.  కాశీకి చెందిన వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, వార్డ్ బాయ్స్, అంబులెన్స్ డ్రైవర్లు, ఇతర ఫ్రంట్‌-లైన్ ఆరోగ్య కార్యకర్తలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.  తన ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.  బనారస్‌ లో అతి తక్కువ సమయంలో ఆక్సిజన్, ఐ.సి.యు. పడకల సంఖ్య గణనీయంగా పెరిగిన తీరును, అదే విధంగా, అతి తక్కువ సమయంలో,  పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ ఆసుపత్రి ప్రారంభమైన తీరును,  ఆయన,  ప్రశంసించారు.  వారణాసిలో ఇంటిగ్రేటెడ్ కోవిడ్ కమాండ్ సిస్టమ్ చాలా బాగా పనిచేసిందని, వారణాసి ఉదాహరణ ప్రపంచానికి స్ఫూర్తి నిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అంటువ్యాధిని అరికట్టడంలో వైద్య బృందం చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఆయన, హెచ్చరించారు. ప్రస్తుతం బెనారస్ మరియు పూర్వాంచల్ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి పెట్టడం ద్వారా ఈ నిరంతర పోరాటం లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.  గత కొన్నేళ్లుగా మన దేశంలో జరుగుతున్న ప్రణాళికలు, ప్రచారాలు కరోనా తో పోరాడటానికి ఎంతో సహాయపడ్డాయని ఆయన తెలియజేశారు.  స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిర్మించిన మరుగుదొడ్లు;  ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స సౌకర్యాలు; ఉజ్జ్వాలా పథకం కింద గ్యాస్ సిలిండర్లు; జన ధన్ బ్యాంకు ఖాతాలు; ఫిట్ ఇండియా ప్రచారంతో పాటు,  యోగా మరియు ఆయుష్ అవగాహన వంటి కార్యక్రమాలు,  కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో  ప్రజల బలాన్ని పెంచుతున్నాయి. 

కోవిడ్ నిర్వహణలో ప్రధానమంత్రి,  'ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడే చికిత్స ఉంది' (जहां बीमार वहीं उपचार), అనే ఒక కొత్త మంత్రాన్ని అందించారు.   రోగి ఇంటి దగ్గరే చికిత్సను అందిస్తే, ఆరోగ్య వ్యవస్థ పై భారం తగ్గుతుందని, ఆయన పేర్కొన్నారు.  మైక్రో కంటైన్మెంట్ జోన్ ల ఏర్పాటును, ఔషధాలను ఇళ్ళ దగ్గరకు సరఫరా చేసే ఏర్పాటును, ప్రధానమంత్రి ప్రశంసించారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రచారాన్ని వీలైనంత సమగ్రంగా చేయాలని ఆయన ఆరోగ్య కార్యకర్తలను కోరారు.  'కాశీ కవచ్' అనే టెలి-మెడిసిన్ సదుపాయాన్ని కల్పించడానికి వైద్యులు, ప్రయోగశాలలు, ఇ-మార్కెటింగ్ కంపెనీలను ఏకతాటిపైకి తీసుకురావడం కూడా చాలా వినూత్నమైన ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. 

గ్రామాల్లో కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ఆశా మరియు ఏ.ఎన్.ఎమ్. సోదరీమణులు పోషించిన ముఖ్యమైన పాత్రను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. వారి సామర్థ్యాన్నీ, అనుభవాన్నీ గరిష్టంగా ఉపయోగించుకోవాలని, ఆయన, ఆరోగ్య అధికారులను, కోరారు.  ఫ్రంట్-లైన్ కార్మికులు ఇప్పటికే టీకాలు వేసుకుని ఉన్నందున, ఈ కోవిడ్-19 రెండవ దశలో, వారు, ప్రజలకు సురక్షితంగా సేవ చేయగలిగారని, ఆయన పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరూ, తమ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకోవాలని, ఆయన ఆయన కోరారు. 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా చేసిన ప్రయత్నాల వల్ల పూర్వాంచల్ ప్రాంతంలో ‘పిల్లలలో ఎన్సెఫాలిటిస్ కేసులు’ గణనీయంగా తగ్గిన విషయాన్ని, ప్రధానమంత్రి, ఈ సందర్భంగా ఉదహరించారు.  అధికారులు, వైద్యులు, అదే సున్నితత్వం మరియు అప్రమత్తతతో పనిచేయాలని, ఆయన కోరారు.  మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యుద్ధం లో భాగంగా,  ఇప్పుడు "బ్లాక్ ఫంగస్" రూపంలో ఎదురైన కొత్త సవాలుకు వ్యతిరేకంగా కూడా సమర్ధంగా పోరాడాలని, ఆయన, హెచ్చరించారు.  దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన జాగ్రత్తలు, ఏర్పాట్లపై దృష్టి పెట్టడం కూడా,  చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

కోవిడ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో వారణాసి ప్రజా ప్రతినిధులు అందించిన నాయకత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.  ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజల ఆందోళనల పట్ల పూర్తి సున్నితత్వాన్ని ప్రదర్శించాలని, ఆయన, సూచించారు. పౌరుడు ఎవరైనా, ఒక ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదుపై స్పందించడం, ప్రజా ప్రతినిధుల బాధ్యత అని,  ఆయన పేర్కొన్నారు.  నగరాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తామని చేసిన వాగ్దానాన్ని, నిలుపుకుంటున్నందుకు, ప్రధానమంత్రి, వారణాసి ప్రజలను ప్రశంసించారు.

*****



(Release ID: 1720680) Visitor Counter : 190