ఆయుష్

దేశవ్యాప్త ‘‘ఆయుష్- కోవిడ్-19 సలహా... స‌హాయ కేంద్రం’’ ప్రారంభం

Posted On: 21 MAY 2021 11:18AM by PIB Hyderabad

   కోవిడ్-19 ఫలితంగా తలెత్తిన సవాళ్లపై అనుసరించాల్సిన ‘ఆయుష్’ ఆధారిత పద్ధతులు, పరిష్కారాలతో సామాజిక మద్దతు అందించేందుకు కేంద్ర ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ ఉచిత కాల్స్ చేసేందుకు వీలుగా నం.14443తో ప్రత్యేక సలహా...సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం వారంలో ఏడు రోజులూ ఉదయం 6:00 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 గంటలదాకా దేశవ్యాప్తంగా సలహ.. సంప్రదింపు సేవలందిస్తుంది.

   ఆయుష్ శాఖ పరిధిలోని ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాలకు చెందిన నిపుణులు ఈ 14443 నంబరుద్వారా ప్రజల ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలిస్తారు. వీరు రోగులకు సలహాలివ్వడంతోపాటు అనుసరించదగిన నివారణ పద్ధతులను సూచించడమే కాకుండా సమీపంలోని ‘ఆయుష్’ సదుపాయాల సమాచారం కూడా ఇస్తారు.

   కోవిడ్-19 అనంతరం రోగులు కోలుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, నిర్వహణ పద్ధతులపైనా ఈ నిపుణులు సలహాలిస్తారు. ఈ సహాయ కేంద్రం ఐవీఆర్ (పరస్పర గళ ప్రతిస్పందన) పద్ధతిలో ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటుంది. క్రమేణా ఇతర భాషలలోనూ సంప్రదింపులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రానికి ఏకకాలంలో 100 మంది కాల్స్ స్వీకరించే సామర్థ్యం ఉండగా, భవిష్యత్ అవసరాలను బట్టి పెంచబడుతుంది. ఈ సహాయ కేంద్రం ద్వారా సామాజిక స్థాయిలో కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు తనవంతు చేయూతనివ్వడమే ఆయుష్ మంత్రిత్వశాఖ లక్ష్యం. ఇందుకు ‘‘ప్రాజెక్ట్  స్టెప్ఒన్’’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది.

   ‘ఆయుష్’ వ్యవస్థలు ఆరోగ్యం-శ్రేయస్సు కోసం వినియోగంలోగల అత్యంత పురాతన సజీవ వైద్య పద్ధతులు కావడమేగాక దేశమంతటా వీటికి అధికారిక గుర్తింపు కూడా ఉంది. వ్యాధిని ఎదుర్కొనడంలో వ్యక్తుల రోగనిరోధకతను బలోపేతం చేయగల ఈ విధానాల విశిష్టత కారణంగా ప్రస్తుత మహమ్మారి సమయంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఇవి సమర్థమైనవేగాక సురక్షిత, సులభ లభ్యత కలిగినవే కాకుండా కోవిడ్-19 నిర్వహణకు అందుబాటులోగల రోగనిరోధానికి అనువైనవిగా గుర్తింపు పొందాయి. దీంతోపాటు వీటికిగల చికిత్స సామర్థ్యంకూడా తేటతెల్లమైన నేపథ్యంలో రెండు సమర్థ బహుళ మూలికా ఔషధాలు కూడా రూపొందించబడ్డాయి. ఈ మేరకు ‘‘ఆయుష్-64’’ పేరిట ‘సీసీఆర్ఏఎస్’’ ఒక ఆయుర్వేద మందును అభివృద్ధి చేయగా, ‘సిద్ధ’ వైద్య పద్ధతిలో ‘‘కబాసుర కుడినీర్’’ పేరిట మరొక మందు సిద్ధమైంది. ఓ మోస్తరు నుంచి స్వల్ప కోవిడ్-19 లక్షణాలను నియంత్రించడంలో ఇవి రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని రుజువైంది. ఈ నేపథ్యంలో సామాన్యుల ప్రయోజనార్థం ఈ మందులను ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ విస్తృతంగా ప్రోత్సహిస్తోంది.

 

***



(Release ID: 1720596) Visitor Counter : 231