మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యార్థుల భద్రత, సంక్షేమమే ధ్యేయం


కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పష్టీకరణ
రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల
విద్యా కార్యదర్శుల భేటీకి అధ్యక్షత
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాల విద్యపై ఇదే అతిపెద్ద సమావేశం

సమగ్ర శిక్షా కార్యక్రమం కింద రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు
అడ్ హాక్ గ్రాంటుగా రూ. 5,228కోట్ల విడుదల
విద్యా కార్యక్రమాల కొనసాగింపునకు త్వరలోనే
అదనంగా రూ. 2,500కోట్లు

పాఠశాల విద్యపై రాష్ట్రాల కృషికి అభినందన,.
పూర్తి మద్దతు ఇచ్చేందుకు కేంద్రం హామీ

Posted On: 17 MAY 2021 6:32PM by PIB Hyderabad

  దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా వ్యవస్ధ నిర్వహణకు తీసుకున్న చర్యలు, స్కూళ్లలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో విద్యాభ్యాసం కోసం ఇప్పటివరకూ అనుసరించిన వ్యూహాలు, ఇక ముందు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ 'నిశాంక్' వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖల కార్యదర్శులతో ఈ సమావేశం జరిగింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అనితా కర్వాల్, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యాశాఖల ప్రతినిధులు సమావేశంలో పాలుపంచుకున్నారు. విద్యాశాఖకు చెందిన అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రాజెక్టు డైరెక్టర్లు, విద్యా పరిశోధనా శిక్షణా మండలుల డైరెక్టర్లు తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పాఠశాల విద్యపై జరిగిన అతిపెద్ద సమావేశంగా దీన్ని పరిగణించవచ్చు.

  ఈ సమావేశంలో కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రసంగిస్తూ, దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 సంక్షోభం నెలకొనడం దురదృష్టకరమని, అయితే, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే విద్యార్థుల భద్రత, విద్యాపరమైన సంక్షేమం లక్ష్యంగా అనేక ప్రయోగాలు చేపడుతోందని చెప్పారు.

   కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గత ఏడాదిలో తీసుకున్న సందర్భోచిత చర్యలను కొనసాగించాల్సి ఉందని కేంద్రమంత్రి పోఖ్రియాల్ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో విద్యాపరంగా నష్టపోయేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని చెప్పారు. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నా, 2020-21వ సంవత్సరంలో విద్యాభ్యాసం కొనసాగేలా విద్యా శాఖ పలు చర్యలు తీసుకుందన్నారు. పి.ఎం. ఈ విద్యా (PM eVIDYA) కార్యక్రమం కింద దీక్షా పోర్టల్ విస్తృతం చేయడం, స్వయంప్రభ టీవీ ఛానల్స్ పరిధిలోకి డి.టి.హెచ్. చానల్స్ తీసుకురావడం, ఉపాధ్యాయులకు దీక్షా పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిష్తా శిక్షణను కల్పించడం, విద్యార్థుల మనస్తత్వానికి తగినట్టుగా సామాజిక భావోద్వేగ అవసరాలకు తగిన మనోదర్పణ కార్యక్రమం ప్రారంభించడం తదితర చర్యలను తీసుకున్నట్టు పోఖ్రియాల్ చెప్పారు. డిజిటల్ విద్యకు అనుసంధానం కాకుండా దూరంగా ఉంటున్న చిన్నారుల ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేయడంలో వివిధ భాగస్వామ్య వర్గాలకు ప్రమేయం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు.

  ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు ప్రస్తావించిన సమస్యలను, చేసిన సూచనలను పోఖ్రియాల్ రికార్డు చేసుకున్నారు. పిల్లల విద్యాపరమైన సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేసిన కృషిని రాష్ట్రాలు కూడా అభినందించాయి. విద్యారంగంలో ఆయా రాష్ట్రాలు చేసిన కృషి అభినందనీయమని కేంద్రమంత్రి కూడా అన్నారు. ప్రస్తుత కష్ట సమయంలో పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు తమ మంత్రిత్వ శాఖ సంసిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. కలసికట్టుగా సమస్యలను పరిష్కరించగలమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

  కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎదురైన సవాళ్లను పరిష్కరించేందుకు భారతీయ విద్యా వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నూతనమైన సృజనాత్మక చర్యలు తీసుకుందని చెప్పారు. విద్యా వ్యవస్థలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ బోధనా పద్ధతులను పాటించేందుకు తీసుకోవలసిన చర్యలను అన్వేషించాలని ఆయన సూచించారు. ఇందుకోసం మనకు కొత్త అభ్యాస పద్ధలు, నాణ్యమైన పాఠ్యాంశాలు, మధింపు నమూనాలు అవసరమని ఆయన అన్నారు. కోవిడ్ అనంతర ప్రపంచంలో విద్యార్థుల శాస్త్రీయ అవగాహన వంటివి నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉందని, అందువల్ల విద్యార్థుల్లో పరిశీలనాత్మక ఆలోచనా దృక్ఫథం, తార్కిక చింతనా సామర్థ్యం, శాస్త్రీయ అవగాహన వంటి అంశాలే లక్ష్యంగా మన విద్యా వ్యవస్థ పనిచేయాలని అన్నారు. 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానం స్ఫూర్తిని మరింత పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేయాలని, ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు ఈ విద్యావిధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.  కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఒక సమగ్రమైన ప్రతిస్పందనా పత్రాన్ని విద్యా శాఖ ఈ నెల 4వ తేదీన జారీ చేసిందని మంత్రి చెప్పారు.

  కొత్త విధానంలో భాగంగా గుర్తించిన అంశాలు: బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని విద్యాస్రవంతిలో చేర్చడం, వారి పేర్లు స్కూళ్లలో నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోవడం, విద్యాభ్యాసం, విద్యార్థుల మేధో వికాసం, సామర్థ్యాలకు పదను పెట్టడం, ప్రత్యేక దృష్టితో ఇంటిలోనే విద్యాభ్యాసం, విద్యార్థుల సామర్థ్యాల మధింపు, సమాచార వినియోగం, పౌష్టికాహార, భావోద్వేగ మద్దతు, డిజిటల్ విద్య, పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం.

  దీనికి తోడు, ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ కింద పేర్కొన్న సమగ్ర శిక్షా కార్యక్రమ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.:

  • విద్యార్థులకు అనుబంధ అంశాలను నేర్పించేందుకు అభ్యాసం పెంపుదల/విస్తరణ కార్యక్రమం.
  • చదువుకునే పుస్తకాలు, తగిన అభ్యాస సామగ్రిని విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయం మంజూరు
  • బడికి దూరమైన విద్యార్థులకు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం.
  • 16నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, బడికి దూరమైన విద్యార్థులకు జాతీయ సార్వత్రిక పాఠశాల విద్యా సంస్థ (ఎన్.ఐ.ఒ.ఎస్.), రాష్ట్ర స్థాయి ఓపెన్ స్కూళ్ళ ద్వారా తగిన మద్దతు అందించడం
  • విద్యార్థులకోసం సామాజిక భాగస్వామ్యం, తల్లిదండ్రుల మద్దతు కోసం స్కూల్ మేనేజిమెంట్ కమిటీ శిక్షణను వినియోగించుకోవడం.
  • చిన్న పిల్లల సంరక్షణ, విద్యాభ్యాసం, ప్రాథమిక స్థాయిలోనే అభ్యాస సామగ్రిని కల్పించడం
  • పంచాయతీల స్థాయిలో సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేయడం, సామాజిక ప్రచార సాధనాల వినియోగం ద్వారా విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించడం
  • విద్యార్థుల జాబితా తయారీ కోసం చైల్డ్ ట్రాకింగ్ నిధులను వినియోగించే అవకాశం.
  • పారిశుద్ధ్య చర్యలు, శానిటైజేషన్, పరిశుభ్రతకోసం పాఠశాలలకు ప్రత్యేక గ్రాంట్లు
  • ఆన్ లైన్ పద్ధతిలో భద్రతపై అవగాహన కోసం టీచర్స్ గ్రాంట్లు. ఆన్ లైన్ మార్గాన్ని వినియోగించుకునేలా విద్యార్థులకు తగిన సామర్థ్యం కల్పించడం.
  • ఆన్ లైన్ ద్వారా బోధించే అంశాల రూపకల్పన, వాటి ప్రచారం కోసం గ్రాంట్లు.
  • దీక్షా వేదిక ద్వారా నిష్తా శిక్షణతో అనుసంధానం కల్పించేందుకు ఉపాధ్యాయులకోసం గ్రాంట్లు.
  • విద్యాభ్యాసం కొనసాగింపునకు వీలుగా కంపోజిట్ స్కూల్ గ్రాంట్లు. ఆ గ్రాంట్లలో కనీసం పది శాతాన్ని స్కూళ్లలో నీరు, పారిశుద్ధ్య చర్యలకు, ఇతర సదుపాయాలకోసం వినియోగించే అవకాశం.

సమగ్ర శిక్షా పథకం కింద వివిధ రాష్ట్రాల, కేంద్ర ప్రాంతాల వార్షిక పనుల ప్రణాళిక, బడ్జెట్ల ఆమోదం కోసం వర్చువల్ పద్ధతిలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశాలను నిర్వహించడం. పై కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడానికి కావలసిన నిధుల సత్వర ఆమోదం కోసం ఈ సమావేశాలను నిర్వహించడం.

  దీనికి తోడు,  సమగ్ర శిక్షా పథకం కిందనే రూ. 5,228 కోట్ల మేరకు నిధులు.. ఆయా రాష్ట్రాలకు తాత్కాలిక ప్రాతిపదికన ఇప్పటికే విడుదలయ్యాయి. రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు చేపట్టే వివిధ విద్యా కార్యక్రమాల కొనసాగింపుకోసం మరో రూ. 2,500కోట్లను కూడా త్వరలో విడుదల కానున్నాయి. 

  వైరస్ మహ్మారి వ్యాప్తి సమయంలోనే విద్యాభ్యాస కార్యక్రమం కొనసాగింపుకోసం తమతమ వ్యూహాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే తెలియజేశాయి. చాలా వరకు విద్యార్థులకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అందాయని, దీనికి తోడు ఆనుబంధ గ్రేడ్ విద్యా సామగ్రిని కూడా ఆయా రాష్ట్రాలు సిద్ధం చేశాయని సమాచారం. హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవనప్పటికీ, పాఠశాల విద్యపై తమ మధింపు ప్రక్రియ వివరాలను తెలియజేశాయి. జార్ఖండ్, లఢక్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాలు డిజిటల్ రూపంలో విద్యాభ్యాస పద్ధతిని రూపొందించుకున్నాయి. విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల, సామాజిక సంఘాల కీలక పాత్రను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాయి. ఇక, డిజిటల్ పద్ధతుల్లోను, దూదర్శన్, రేడియో మాధ్యమాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సంబంధించిన తమ కార్యక్రమాల వివరాలను  రాష్ట్రాలన్నీ విపులంగా వివరించాయి.

 

****


(Release ID: 1719550) Visitor Counter : 212