ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిషీల్డ్ వాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని 12-16కు మార్చిన విషయాన్ని ప్రతిఫలించేట్టుగా కోవిన్ డిజిటల్ పోర్టల్ లో మార్పుచేర్పులు
కోవిషీల్డ్ రెండవ డోసు కోసం ఇప్పటికే తీసుకున్న అపాయింట్‌మెంట్లు చెల్లుబాటు; కోవిన్ వాటిని రద్దు చేయడం లేదు
కోవిషీల్డ్ రెండు డోసుల పెంచిన కాలపరిమితికి అనుగుణంగా లబ్ధిదారులు 2 వ డోసు కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవాలని సూచన
Posted On:
16 MAY 2021 6:11PM by PIB Hyderabad
కోవిషీల్డ్ వాక్సిన్ మొదటి డోసు, రెండవ డోసుకు మధ్య కాలపరిమితిని 12-16 వారాలకు పెంచవలసిందిగా డాక్టర్ ఎన్‌కె ఆరోరా నేతృత్వంలోని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సూచించింది. ఈ సూచనను భారత ప్రభుత్వం 13 మే 2021న ఆమోదించింది.
ఈ మార్పు గురించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం సమాచారమిచ్చింది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాలపరిమితిని ప్రతిఫలిస్తూ కోవిన్ డిజిటల్ పోర్టల్ లో కూడా మార్పులు చేశారు.
అయితే, మీడియాలోని కొన్ని వర్గాలలో కోవిన్ ప్లాట్‌ఫాంపై 84 రోజుల కన్నా తక్కువ కాలంలో రెండవ డోసు కోసం అపాయింట్‌మెంట్‌ను ముందుగానే బుక్ చేసిన వ్యక్తులకు కోవిషీల్డ్ రెండవ డోసు ఇవ్వకుండా తిప్పి పంపుతున్నారనే వార్తలు వచ్చాయి.
కాగా, అవసరమైన మార్పులను కోవిన్ డిజిటల్ పోర్టల్ లో చేసినట్టు స్పష్టం చేయడం జరిగింది. తత్ఫలితంగా, లబ్ధిదారు మొదటి డోసు తీసుకున్న తర్వాత 84రోజుల లోపు ఆన్ లైన్‌లో అపాయింట్‌మెంట్ ను బుక్ చేసుకోవడం సాధ్యం కాదు.
అదనంగా, ఇప్పటికే కోవిషీల్డ్ రెండవ డోసుకోసం ఆన్‌లైన్ బుక్ చేసుకున్న వారి అపాయింట్‌మెంట్ చెల్లుతుంది, కోవిన్ వాటిని రద్దు చేయడం లేదు. కనుక, వాక్సినేషన్ మొదటి డోసు తీసుకున్న లబ్ధిదారులు తమ అపాయింట్‌మెంట్‌లను 84వ రోజు తర్వాతకి వాయిదా వేసుకోవలసిందిగా సూచించడం జరుగుతోంది.
కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాలపరిమితిని మార్చకముందే, రెండవ డోసు కోవిషీల్డ్ కోసం ఆన్‌లైన్‌లో తీసుకున్న అపాయింట్ మెంట్ ను గౌరవించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం పునరుద్ఘాటించింది.
కనుక, క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందికి, అటువంటి లబ్ధిదారులు వాక్సినేషన్ కోసం వస్తే, కోవిషీల్డ్ రెండవ డోసు ఇవ్వాలని, వారిని తిప్పి పంపకూడదని తెలియజేయవలసిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
***
(Release ID: 1719315)
Visitor Counter : 206