ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 చికిత్సపై ఆస్పత్రులకు కొత్త మార్గదర్శకాలు

ఆసుపత్రులలో కోవిడ్ రోగుల ప్రవేశానికి చేపట్టిన జాతీయ విధానం బాధితులకు మరింత అనుకూలంగా సవరించబడింది

కొవిడ్ వైద్య సేవ పొందేందుకు ఇకపై కొవిడ్-19 వైరస్ పాజిటివ్ టెస్ట్ తప్పనిసరి కాదు

ఏ కారణంగానూ రోగికి వైద్య సేవలు నిరాకరించరాదు

Posted On: 08 MAY 2021 2:31PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొవిడ్‌ రోగులకు వివిధ వర్గాల ద్వారా వైద్య సౌకర్యాలను అందించేందుకు నేషనల్‌ పాలసీ ఫర్ అడ్మిషన్‌ ఆఫ్‌ కొవిడ్ పేషెంట్స్‌ విధానాన్ని సవరించింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటూ రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్‌-19 తో బాధపడుతున్న రోగులకు సత్వర, సమర్థవంతమైన మరియు సమగ్రమైన చికిత్సను అందించడం ఈ విధానం యొక్క ఉద్దేశం.

కొవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా ఈ కింది ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది:

a. కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తిని సిసిసి, డిసిహెచ్‌సి లేదా డిహెచ్‌సి యొక్క అనుమానిత వార్డులో చేర్చుకుని చికిత్స అందించాలి.

b. కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.

c. వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించలేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.

d. ఆసుపత్రిలో ప్రవేశాలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టి ఉండాలి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వ్యక్తులచే పడకలు ఆక్రమించబడకుండా చూసుకోవాలి.

అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ విధానం https://www.mohfw.gov.in/pdf/ReviseddischargePolicyforCOVID19.pdf వద్ద అందుబాటులో ఉన్న సవరించిన విధానానికి అనుగుణంగా ఉండాలి.
పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా మూడు రోజుల్లో  అవసరమైన ఆదేశాలు మరియు సర్క్యులర్లను జారీ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు సూచించింది.

అనుమానిత / ధృవీకరించబడిన కొవిడ్-19 కేసుల సరైన నిర్వహణ కోసం మూడు అంచెల ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే విధానాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందు వివరించింది. ఈ విషయంలో 2020 ఏప్రిల్ 7 న జారీ చేసిన మార్గదర్శక పత్రం, వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది:

a. కొవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) తేలికపాటి కేసులకు చికిత్సను అందిస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆధ్వర్యంలో హాస్టళ్లు, హోటళ్ళు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జీలు మొదలైన వాటిలో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. రెగ్యులర్, నాన్-కోవిడ్ కేసులకు చికిత్స అందించే  సిహెచ్‌సిలు వంటి ఫంక్షనల్ ఆస్పత్రులను కూడా చివరి ప్రయత్నంగా కోవిడ్ కేర్ సెంటర్లుగా పేర్కొనవచ్చు.

b. డెడికేటెడ్‌ హెల్త్ సెంటర్ (డిసిహెచ్‌సి) వైద్యపరంగా ఆస్పత్రిలో చేరాల్సిన అన్ని కేసులకు చికిత్సను అందిస్తుంది. ఇవి పూర్తి ఆసుపత్రి లేదా ఆసుపత్రిలో ప్రత్యేక ఎంట్రీ / ఎగ్జిట్ / జోనింగ్ ఉన్న ప్రత్యేక బ్లాక్ అయి ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రులను కొవిడ్‌కు అంకితమైన ఆరోగ్య కేంద్రాలుగా కూడా నియమించవచ్చు. ఈ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్‌ అందుబాటులో ఉంటాయి.

c. డెడికేటెడ్‌ కొవిడ్‌ హాస్పిటల్ (డిసిహెచ్‌) వైద్యసహాయం తీవ్రంగా అవసరమున్న వారికి సమగ్ర చికిత్సను అందిస్తుంది. ఈ ఆస్పత్రులు పూర్తి ఆసుపత్రి లేదా ఆసుపత్రిలో ప్రత్యేక ఎంట్రీ / ఎగ్జిట్ ఉన్న ప్రత్యేక బ్లాక్ అయి ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రులను కొవిడ్‌ డెడికేటెడ్ హాస్పిటల్స్ గా కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ ఆసుపత్రులలో ఐసియులు, వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకలు ఉంటాయి.

పైన పేర్కొన్న కొవిడ్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలు క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌తో సిసిసికి తేలికపాటి కేసులను, డిసిహెచ్‌సికి మితమైన కేసులను మరియు తీవ్రమైన కేసులను డిసిహెచ్‌కు చేర్చడానికి అనుసంధానించబడ్డాయి.

***(Release ID: 1717271) Visitor Counter : 33