కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులలో కోవిడ్-19 సౌకర్యాలు తెలుసుకోడానికి - డాష్‌-బోర్డు


Posted On: 29 APR 2021 5:24PM by PIB Hyderabad

కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ.ఎస్.ఐ.సి., తన సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ప్రస్తుత మహమ్మారి సమయంలో, పౌరుల కేంద్రీకృత సేవలను మెరుగుపరచడం తో పాటు, సమాచారాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకు రావడానికి వీలుగా మరొక అడుగు వేసింది. కోవిడ్ సంరక్షణ కోసం పడకల సంఖ్యను పెంచడం, ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ అవసరం గా నిలిచింది. ఈ.ఎస్.ఐ. సంస్థ, తన లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన అనేక ఆరోగ్య సౌకర్యాలను, ఇప్పుడు, కోవిడ్ సంరక్షణ కోసం మన దేశ పౌరుల ప్రయోజనం కోసం కూడా విస్తరించింది. కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా సేవలు అందించడానికి కూడా కొన్ని ఈ.ఎస్.ఐ. సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. మన ధైర్యవంతులైన వైద్య నిపుణులు, ఇతర ఫ్రంట్‌-లైన్ కార్మికులు, ఈ కోవిడ్ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రుల్లో 24 గంటలూ ప్రాణాలను రక్షించే సేవలను బాధ్యతాయుతమైన పౌరులుగా మాత్రమే కాకుండా, "మానవ సేవే - మాధవ సేవ" అనే ఆశయంతో తమ సేవలను విస్తరిస్తున్నారు.

డిమాండ్ మరియు సరఫరాల మధ్య అంతరం కారణంగా, కోవిడ్ సంరక్షణ కోసం పడకలు తగినంతగా అందుబాటులో లేవు. ఒక వేళ, పడకలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ సమాచారం, అవసరమైనవారికీ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికీ, వెంటనే అందుబాటులో ఉండటం లేదు. ఈ.ఎస్.ఐ.సి. కి చెందిన ఐ.సి.టి. బృందం, బ్లూ-ప్రింట్‌ ను సిద్ధం చేయడానికి, రికార్డు సమయంలో డాష్‌-బోర్డ్‌ ను అభివృద్ధి చేయడానికి నిర్విరామంగా కృషి చేసింది. తద్వారా అవసరమైన పౌరులు, ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయాలతో అందుబాటులో ఉన్న పడకల కోసం వెతకడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో పాల్గొనే ఈ.ఎస్.ఐ. ఆరోగ్య సంస్థలు తమ రోజూ వారీ సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తున్నాయి. ఈ డాష్‌బోర్డ్ ద్వారా, ప్రజలు, ఇందులో ప్రదర్శించబడే ఈ.ఎస్.ఐ. ఆరోగ్య సంస్థలను ఎంపిక చేసుకుని, ఆ సంస్థల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను తెలుసుకుని, అక్కడ అందుబాటులో ఉండే సేవలను పొందడానికి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు.

కోవిడ్ సదుపాయాల డాష్-బోర్డు ద్వారా అందుబాటులో ఉండే సేవల వివరాలు తెలుసుకోడానికి ఈ లింక్ ను నొక్కండి :

https://www.esic.in/Dashboard/CovidDashBoard.aspx.

 

*****

 



(Release ID: 1714952) Visitor Counter : 198