నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కోవిడ్ సంరక్షణ కోసం ప్రధాన నౌకాశ్రయాల్లోని ఆస్పత్రుల సంసిద్ధతను సమీక్షించిన - మన్సుఖ్ మాండవీయ


నౌకాశ్రయాల్లోని ఆస్పత్రుల్లో 422 ఐసోలేషన్ పడకలు, 305 ఆక్సిజన్ సదుపాయంతో ఉన్న పడకలు అందుబాటులో ఉన్నాయి

Posted On: 29 APR 2021 4:35PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క రెండవ దశ నేపథ్యంలో నౌకాశ్రయాల్లోని ఆస్పత్రుల సంసిద్ధతను తెలుసుకోవడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఓడరేవులు, రవాణా మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి (ఐ/సి) శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని ప్రధాన నౌకాశ్రయాల చైర్మన్లు మాట్లాడుతూ, కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆసుపత్రుల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న 12 ప్రధాన ఓడరేవులు, కోవిడ్ సంరక్షణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన 9 ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయి. ఈ ఆసుపత్రులను - విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్; కోల్ కతా పోర్ట్ ట్రస్ట్; ముంబాయి పోర్ట్ ట్రస్ట్; మార్గోవా పోర్ట్ ట్రస్ట్; చెన్నై పోర్ట్ ట్రస్ట్; ముంబాయి పోర్ట్ ట్రస్ట్; జె.ఎన్. పోర్ట్ ట్రస్ట్; దీనదయాళ్ పోర్ట్ ట్రస్ట్ (గతంలో కాండ్లా పోర్ట్); నిర్వహిస్తున్నాయి. కోవిడ్-19 రోగులకు అవసరమైన సంరక్షణ అందించడానికి ఈ ఆసుపత్రుల్లో మొత్తం 422 ఐసోలేషన్ పడకలు; 305 ఆక్సిజన్ సదుపాయంతో ఉన్న పడకలు; 28 ఐ.సి.యు. పడకలతో పాటు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.

సి.ఎస్.ఆర్. నిధులను ఉపయోగించి, వారి సామర్థ్యం మరియు సౌకర్యాలను పెంచుకోవాలనీ, రాబోయే రోజుల్లో వీలైనంత వేగంగా వాటిని అమలు చేయాలనీ, ప్రధాన నౌకాశ్రయాల చైర్మన్లు అందరినీ, మంత్రి ఆదేశించారు. వైద్య పరమైన ఆక్సిజన్ కు సంబంధించిన రవాణా ప్రక్రియలను అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లోనూ వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించే విధంగా, వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మంత్రి, చైర్మన్లకు పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా, శ్రీ మాండవీయ మాట్లాడుతూ, "భారతదేశం ప్రస్తుతం అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందనీ, మన నౌకాశ్రయాల్లోని ఆసుపత్రుల సామర్థ్యాన్ని వినియోగించడం ద్వారా, పెంపొందించడం ద్వారా, అపారమైన సహకారం అందించడానికి, మనం సంసిద్ధులమై ఉండాలి. ప్రధాన ఓడరేవులన్నీ నిరంతరం, ఐక్య ప్రయత్నాలతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, అందుబాటులో ఉన్న అవకాశాలు అన్నింటినీ వినియోగించుకోవాలి." అని, తన ముగింపు వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.

 

 

*****

 



(Release ID: 1714949) Visitor Counter : 198