మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రాణవాయువు కొరతకు ఐఐటి-బాంబే పరిష్కారం
నత్రజని జనరేటర్-ఆక్సిజన్ జనరేటర్‌గా మార్పు
ఆక్సిజన్ సంక్షోభానికి సత్వర.. సరళ పరిష్కార మార్గం;
దేశవ్యాప్తంగా పరిష్కార అనుసరణలో సాయానికి సంస్థ సంసిద్ధత
Posted On:
29 APR 2021 2:15PM by PIB Hyderabad
దేశంలోని కోవిడ్-19 రోగులకు చికిత్సలో వైద్యపరమైన ఆక్సిజన్ కొరత పరిష్కారం దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బాంబే ఒక సృజనాత్మక, వినూత్న విధానాన్ని ముందుకు తెచ్చింది. ఈ మేరకు చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసింది. ఇందులో భాగంగా ఓ సాధారణ సాంకేతిక చిట్కా: ‘పీఎస్ఏ (పీడన శోషణసహిత) నత్రజని’ యూనిట్‌ను ‘పీఎస్ఏ ఉదజని యూనిట్‌గా మార్చేసింది! దీనికి సంబంధించి ఐఐటీ-బాంబే నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు ఆశావహ ఫలితాలిచ్చాయి. ఈ కొత్త పద్ధతిలో ‘3.5 ఏటీఎం ప్రెజర్’వద్ద ఆక్సిజన్ ఉత్పత్తిని సాధించడం సాధ్యం కావడంతోపాటు దీని స్వచ్ఛత 93 నుంచి 96 శాతంగా ఉండటం విశేషం. ఈ వాయురూప ఆక్సిజన్‌ను కోవిడ్ సంబంధిత అవసరాల కోసం ప్రస్తుత కోవిడ్ ఆస్పత్రులకేగాక కొత్తగా ఏర్పాటయ్యే కోవిడ్ ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలకూ సరఫరా చేయవచ్చు.
నైట్రోజన్ యూనిట్‌ను ఆక్సిజన్ యూనిట్‌గా మార్చడం ఎలా సాధ్యమైంది? ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ఐఐటీ-బాంబే (పరిశోధన-అభివృద్ధి విభాగం) డీన్ ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే మాటల్లో చెబితే- ‘‘ప్రస్తుత నైట్రోజన్ ప్లాంటు అమరికను సునిశిత రీతిలో మార్చడంతోపాటు కర్బన అణుసంబంధ జల్లెడలను జియోలైట్ జల్లెడలు’’గా మార్చడంద్వారా సాధ్యమైంది. ‘‘వాతావరణంలోని గాలిని ముడిపదార్థంగా స్వీకరించే ఇలాంటి నైట్రోజన్ ప్లాంట్లు దేశంలోని పలు ప్రాంతాల్లోగల పరిశ్రమల్లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అలాంటి ప్రతి ప్లాంటునూ ఆక్సిజన్ జనరేటరుగా మార్పిడి చేయడం సాధ్యమే. తద్వారా ప్రస్తుత అత్యవసర ప్రజారోగ్య పరిస్థితిని సజావుగా నిర్వహించే వీలుంటుంది’’ అని ఆయన తెలిపారు. ఐఐటీ-బాంబేతోపాటు ముంబైలో పీఎస్ఏ నైట్రోజన్-ఆక్సిజన్ ప్లాంట్లను ఉత్పత్తి చేసే ‘టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ అండ్ స్పాన్‌టెక్ ఇంజనీర్స్ సంస్థ ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టులో సంయుక్తంగా పనిచేశాయి.
ఈ ఆలోచనలోని వాస్తవ సాధ్యతను నిరూపించే దిశగా ఐఐటీలోని ‘రిఫ్రిజిరేషన్ అండ్ క్రయోజెనిక్స్ లేబొరేటరీ’లోగల ఒక పీఎస్ఏ నైట్రోజన్ ప్లాంటును మార్పిడి కోసం పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. ఈ అధ్యయనాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టడం కోసం ఐఐటీ-బాంబే, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ అండ్ స్పాన్‌టెక్ ఇంజనీర్స్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయదగిన ప్రామాణిక విధాన ప్రక్రియ ఖరారుకు నాందిపలికారు. ఐఐటీ-బాంబేలోని ‘రిఫ్రిజిరేషన్ అండ్ క్రయోజెనిక్స్ లేబొరేటరీ’లోగల పీఎస్ఏ నైట్రోజన్ ప్లాంటుకు స్పాన్‌టెక్ ఇంజనీర్లు అవసరమైన విడిభాగాలను అమర్చారు. ఈ ప్రయోగం కోసం ఏర్పాటు మూడు రోజుల్లో పూర్తవగా, పైన పేర్కొన్న విధంగా ప్రాథమిక పరీక్షలు ఆశావహ ఫలితాలిచ్చాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై- టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ శర్మతోపాటు స్పాన్‌టెక్ ఇంజనీర్స్ స్థాపకులు, ఐఐటీ-బాంబే పూర్వ (1970) విద్యార్థి అయిన రాజేంద్ర తహిలియాని, స్పాన్‌టెక్ ఇంజనీర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ మోహన్ సహా ఇందులో సహకరించి, పాలుపంచుకున్న వారి జట్టు సభ్యులందరికీ ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే ధన్యవాదాలతోపాటు కృతజ్ఞతలు తెలిపారు.
అనేక పరిమితుల నడుమ ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును సకాలంలో విజయవంతం చేయడంలో సహకరించిన పరిశోధక, సహాయ బృందాలకు అమిత్ శర్మ అభినందనలు తెలిపారు. ‘‘ఐఐటీ-బాంబే, స్పాన్‌టెక్ ఇంజనీర్స్ తదితర సంస్థలతో భాగస్వామ్యం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం అందుబాటులోగల మౌలిక వసతులతో ఆక్సిజన్ అత్యవసర తయారీకి పరిష్కారాన్ని అన్వేషించి, ప్రస్తుత సంక్షోభం నుంచి దేశం బయటపడటంలో అందరూ ఎంతగానో సహాయసహకారాలు అందించారు. పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య ఇటువంటి భాగస్వామ్యాలు ‘స్వయం సమృద్ధ భారతం’వైపు మన స్వప్నం సాకారంచేసే ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి’’ అన్నారు. ఈ వినూత్న పరిష్కారాన్వేషణలో పాలుపంచుకున్న అన్ని పక్షాలవారికీ ఐఐటీ-బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాశీష్ ఛౌధురి కూడా అభినందనలు తెలిపారు. మన దేశ ప్రగతికి, జాతి విజయానికి పరిశ్రమలు-విద్యా సంస్థల నడుమ ఇటువంటి భాగస్వామ్యాలు అత్యంత అభిలషణీయం, అత్యవసరమైనవని ఆయన అభిప్రాయపడ్డారు.
సంప్రదింపుల కోసం సమాచారం:
ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే, ఐఐటీ-బాంబే
(ఈ-మెయిల్: matrey@iitb.ac.in)
(ఫోన్: +91-22-25767522)
లేదా
టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్, ముంబై
***
(Release ID: 1714910)
Visitor Counter : 326