నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలను తీసుకొచ్చే ఓడలపై రుసుములన్నీ రద్దు చేసిన పెద్ద పోర్టులు ఆక్సిజన్‌ సంబంధిత రవాణా ఓడలకు బెర్తుల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం

Posted On: 25 APR 2021 12:53PM by PIB Hyderabad

దేశంలో ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలకు ఉన్న అధిక డిమాండ్‌ దృష్ట్యా; ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సంబంధిత సామగ్రిని తీసుకొచ్చే ఓడలపై రుసుములన్నీ (ఓడ సంబంధిత రుసుములు, నిల్వ రుసుములు సహా) రద్దు చేయాలని కామరాజర్‌ పోర్టు సహా అన్ని ప్రధాన పోర్టు ట్రస్టులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రింది వాటిని తీసుకొచ్చే ఓడలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి బెర్తులు కేటాయించాలని కూడా ఆదేశించింది:
* వైద్య ఆక్సిజన్‌
* ఆక్సిజన్‌ ట్యాంకులు
* ఆక్సిజన్‌ బాటిళ్లు
* పోర్టబుల్‌ ఆక్సిజన్‌ జనరేటర్లు
* ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు
* ఆక్సిజన్‌ సిలిండర్ల తయారీకి ఉపయోగించే ఉక్కు పైపులు, సంబంధిత సామగ్రి

    వచ్చే మూడు నెలలు లేదా మళ్లీ కొత్త ఆదేశాలు వచ్చేవరకు ప్రస్తుత ఆదేశాలు అమల్లో ఉంటాయి.

    ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయా ఓడలకు అధిక ప్రాధాన్యతతో బెర్తులు కేటాయింపు, ఆక్సిజన్‌ సంబంధిత సామగ్రిని ఓడల నుంచి దింపడం, సరకు సంబంధిత పత్రాలను వేగంగా పరిష్కరించేందుకు కస్టమ్స్‌ సహా ఇతర అధికార యంత్రాంగంతో సమన్వయం, ఓడ రేవు నుండి ఆక్సిజన్ సంబంధిత సరుకును వేగంగా తరలించడం వంటి పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని పోర్టు ట్రస్టు ఛైర్‌పర్సన్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

    ఒకవేళ ఆక్సిజన్ సంబంధిత సామగ్రితోపాటు ఇతర సరుకులు లేదా కంటైనర్లతో ఓడలు వస్తే, మొత్తం సరకును పరిగణనలోకి తీసుకుని, ప్రో-రేటా ప్రాతిపదికన ఆక్సిజన్ సంబంధిత సరుకుపై రుసుములు రద్దు చేయాలి.

    ఆయా ఓడలు, సరకు, ఓడలు నౌకాశ్రయ పరిధిలోకి ప్రవేశించిన సమయం నుంచి ఆ సరకును పోర్టులో దింపడానికి పట్టిన సమయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

    కరోనా రెండో దశ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. సరైన, కొత్త పద్ధతుల ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.

***



(Release ID: 1714074) Visitor Counter : 211