సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
45ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులంతా సత్వరం కోవిడ్ టీకా తీసుకోవాల్సిందే
సిబ్బందికి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పిలుపు
కోవిడ్ నిరోధానికి డి.ఒ.పి.టి. తీసుకున్న చర్యలపై సమీక్ష
కేంద్రసిబ్బందికి జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను, సూచనలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పాటించాలని వినతి
Posted On:
07 APR 2021 5:48PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవాహారాల శాఖ (డి.పి.ఒ.టి.) తీసుకున్న చర్యలపై కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సమీక్ష జరిపారు. కేంద్ర సహాయమంత్రిగా ఆయన వివిధ శాఖలను స్వతంత్ర హోదాతో నిర్వహిస్తున్నారు. ఈశాన్య ప్రాంతం అభివృద్ధి, ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా సమస్యల పరిష్కారం, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖలను ఆయన అజమాయిషీ చేస్తున్నారు. డి.పి.ఒ.టి. కార్యదర్శి దీపక్ ఖండేకర్, కేంద్ర పరిపాలనా సంస్కరణల కార్యదర్శి ఇందీవర్ పాండే, ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారాల కేంద్ర కార్యదర్శి, ఆఫీసర్ కె. శ్రీనివాసన్, కేంద్ర కార్యదర్శులు అలోక్ రంజన్, సుజాతా చతుర్వేది, పెన్షన్ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి ఎస్. ఎన్. మాథుర్, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖల్లోని ఇతర సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు
కోవిడ్ కేసులు విపరీత స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 45ఏళ్లకు పైబడిన ఉద్యోగులందరూ కోవిడ్ టీకా (కోవిడ్ వ్యాక్సీన్) వేయించుకోవాలంటూ డి.ఒ.పి.టి. ఇప్పటికే ఆఫీస్ మెమోరాండమ్ జారీ చేసింది. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా ఉద్యోగులంతా కోవిడ్ నిబంధనలను పాటించి తీరాల్సిందేనని ఆ మెమొరాండమ్ ద్వారా స్పష్టం చేశారు. తరచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజేషన్, ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా అనుసరించాలని ఆ మెమొరాండమ్ ద్వారా ఆదేశించారు.
సమీక్షా సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించే కృషిలో భాగంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి.ఒ.పి.టి. ఎప్పటికప్పుడు ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూవస్తున్నాయని చెప్పారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన వ్యూహం ప్రకారం, 45 సంవత్సరాలు, అంతకు మించిన వయస్సు వారంతా వ్యాక్సినేషన్ లో భాగస్వాములు కావలసి ఉంటుందని అన్నారు. తమ భద్రత, వైరస్ నుంచి రక్షణకోసం ప్రభుత్వ ఉద్యోగులు, వారితో సన్నిహితంగా ఉండేవారంతా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవలసి ఉంటుందన్నారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకోసం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను, సూచనలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అనుసరించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంకోసమేకాక, కోవిడ్ తో ఉద్యోగులు అస్వస్థులైతే జరిగే పనిదినాల నష్టాన్ని నివారించేందుకు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను పాటించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఏడాది కాలంగా కోవిడ్ వైరస్ మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలను డి.ఒ.పి.టి. రూపొందించిందని కేంద్ర మంత్రి అన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడమేకాక కార్యాలయాలు నిరాటంకంగా సమర్థంగా పనిచేసేలా చూసే లక్ష్యంతో ఈ మార్గదర్శక సూత్రాలను తయారు చేసినట్టు చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటినుంచి పనిచేసేలా డి.ఒ.పి.టి. రూపొందించిన నిబంధనలు విజయవంతమయ్యాయని, చాలా సార్లు మామూలు పని విధానాన్ని మించిన ఫలితాలను అందించాయని, ఎందుకంటే, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు పనిదినాల్లోనే కాక, సెలవుదినాల్లో కూడా ఆన్ లైన్ ద్వారా విధులు నిర్వర్తించారని ఆయన చెప్పారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాదిగా సముపార్జించిన అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనితో,. తాజాగా పెరుగుతున్న కోవిడ్ కేసులను మరింత సమర్థంగా ఎదుర్కొనడం సాధ్యమవుతుందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్జారు.
<><><>
(Release ID: 1710339)
Visitor Counter : 205