రక్షణ మంత్రిత్వ శాఖ
శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకల రక్షణ కోసం 'అడ్వాన్స్‌డ్ చాఫ్ టెక్నాలజీ'ని అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
Posted On:
05 APR 2021 12:39PM by PIB Hyderabad
శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు,'అడ్వాన్స్‌డ్ చాఫ్ టెక్నాలజీ'ని 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్‌డీవోకు చెందిన 'డిఫెన్స్ లాబొరేటరీ జోధ్‌పూర్' (డీఎల్‌జే), ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, మూడు విభాగాలుగా రూపొందించింది. అవి, షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎస్‌ఆర్‌సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్ (ఎంఆర్‌సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎల్‌ఆర్‌సీఆర్). నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. ఈ దేశీయ పరిజ్ఞానం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరొక అడుగు.
ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో సంతృప్తికరంగా పరీక్షించింది.
శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్ పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, శర్త్రువుల భవిష్యత్ బెదిరింపులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్‌డీవో సాధించింది. ఈ రాకెట్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు రక్షణ పరిశ్రమకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తున్నారు.
ఇంతటి ఘనమైన విజయాన్ని సాధించిన డీఆర్‌డీవో, నౌకాదళం, పరిశ్రమను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.
నౌకాదళ నౌకల రక్షణ కోసం ముఖ్యమైన పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంలో పాల్గొన్న శాస్త్రవేత్తల బృందాన్ని డీఆర్‌డీవో ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రశంసించారు.
తక్కువ వ్యవధిలోనే వ్యూహాత్మకంగా ముఖ్యమైన సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయడానికి డీఆర్‌డీవో చేసిన ప్రయత్నాలను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్ జి.అశోక్ కుమార్ కూడా అభినందించారు. రాకెట్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇచ్చారు.
***
(Release ID: 1709633)
Visitor Counter : 267