రక్షణ మంత్రిత్వ శాఖ
సైనిక ర్యాంకులను ఉపయోగించుకోవడానికి రిటైర్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి
Posted On:
24 MAR 2021 2:13PM by PIB Hyderabad
సైన్యంలో రిటైర్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) అధికారులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులు తమ సైనిక ర్యాంకులను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడి) నిర్ణయించింది. నిబంధనల మేరకు షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి తమ సైనిక ర్యాంకులను ఉపయోగించుకోవడానికి ఇంతవరకు అనుమతి లేదు. పర్మనెంట్ కమిషన్ అధికారులు నిర్వహించిన విధులనే నిర్వర్తించి వారితో సమానమైన సర్వీసు నిబంధనలను కలిగి క్లిష్టమైన విధులను నిర్వర్తించిన తమకు పదవీ విరమణ చేసిన తరువాత సైనిక ర్యాంకులను ఉపయోగించుకొనే అధికారం లేకపోవడంతో రిటైర్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు అసంతృప్తితో వున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో నెలకొన్న అసంతృప్తిని నిర్మూలించడమే కాకుండా యువతకు స్ఫూర్తి కలిగిస్తుంది. ప్రస్తుతం సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులుగా పనిచేస్తున్న వారిలో ధైర్యాన్ని కలిగిస్తుంది.
సైనిక ర్యాంకులను ఉపయోగించుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలన్న రిటైర్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్ డిమాండ్ 1983 నుంచి పెండింగులో వుంది. సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు సహాయ అధికారులుగా పనిచేస్తూ వెన్నుముకగా వుంటారు. సైనిక యూనిట్లలో యువ అధికారుల కొరత లేకుండా చూడడానికి షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు 10 నుంచి 14 సంవత్సరాల పాటు పనిచేస్తారు. వీరికి సైన్యం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది.సైనిక ర్యాంకులను ఉపయోగించుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని వీరు ప్రధానంగా కోరుతున్నారు.
గతంలో షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు సైన్యంలో అయిదు సంవత్సరాలపాటు పనిచేసేవారు. ప్రస్తుతం వీరు 10 సంవత్సరాలపాటు అవసరమైతే అదనంగా మరో నాలుగు సంవత్సరాలు పనిచేయడానికి వీలు వుంది. సైనిక యూనిట్లకు యువ అధికారుల సేవలను అందుబాటులో తీసుకొని రావడానికి షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారుల వ్యవస్థకు రూపకల్పన జరిగింది.
***
(Release ID: 1707289)
Visitor Counter : 229