సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మంగళవారం "సుగమ్య భారత్ యాప్"ను, "యాక్సెస్- ది ఫోటో డైజెస్ట్" సూచిక పుస్తకాన్ని వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించనున్న శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్
Posted On:
01 MAR 2021 12:26PM by PIB Hyderabad
"సుగమ్య భారత్ యాప్"ను, "యాక్సెస్- ది ఫోటో డైజెస్ట్" సూచిక పుస్తకాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆవిష్కరించనున్నారు. 'కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత' శాఖ ఆధ్వర్యంలో పనిచేసే 'దివ్యాంగుల సాధికారత విభాగం' వీటిని రూపొందించింది. ఈ కార్యక్రమం https://webcast.nic.in/msje/ ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆ తర్వాత, ఆడ్రాయిడ్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 15 నాటికి ఐవోఎస్ వెర్షన్ అందుబాటులోకి వస్తుంది.
"యాక్సెసబుల్ ఇండియా" కార్యక్రమంలోని మూడు ముఖ్యాంశాలైన పర్యావరణ నిర్మాణం, రవాణా రంగం, ఐసీటీ వ్యవస్థలో సౌలభ్యాన్ని మరింత సున్నితం, సమర్థవంతం చేయడానికి ఉద్దేశించిన 'క్రౌడ్ సోర్సింగ్ మొబైల్ అప్లికేషన్' సుగమ్య భారత్ యాప్. ఈ యాప్‌లో ఐదు ముఖ్యమైన అంశాలున్నాయి. వాటిలో నాలుగు ప్రాప్యతను పెంచడానికి ఉద్దేశించినవి కాగా, ఐదోది దివ్యాంగులకు సంబంధించినది. సౌలభ్యానికి సంబంధించిన అంశాలు: సుగమ్య భారత్ అభియాన్‌లోని మూడు ముఖ్యాంశాల్లో సౌలభ్యంగా లేని అంశాలపై ఫిర్యాదుల నమోదు; ఉత్తమ పద్ధతులపై సానుకూల స్పందనలు, 'జన్-భాగీరథి'గా ప్రజలు పాటించే విలువైన ఉత్తమ విధానాలు; ప్రభుత్వ విభాగ తాజా సమాచారం; ప్రాప్యతకు సంబంధించిన మార్గదర్శకాలు, సర్క్యులర్లు.
సుగమ్య భారత్ యాప్‌ను చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో నమోదు ప్రక్రియ కూడా సరళంగా ఉంటుంది. పేరు, చరవాణి సంఖ్య, ఈమెయిల్ ఐడీని మాత్రమే తప్పనిసరిగా అందించాలి. నమోదిత వినియోగదారులు, తాము ఎదుర్కొన్న సమస్యలను ఇందులో ప్రస్తావించవచ్చు. సులభమైన డ్రాప్ డౌన్ మెనూలు, హిందీ, ఆంగ్లంలో వీడియోలు, ఫిర్యాదులకు సంబంధించిన ఛాయాచిత్రాలు అప్‌లోడ్ చేయడానికి, వివరాలు నమోదు చేయడానికి సంజ్ఞలతో కూడిన భాష వంటి స్నేహపూర్వక అంశాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. దివ్యాంగులు తమకు అనుకూలంగా అక్షరాల పరిమాణాన్ని పెంచుకోవడం, తెర రంగును మార్చుకోవడం, టెక్ట్ టు స్పీచ్, హిందీ, ఆంగ్ల భాషల్లో సమీకృత స్క్రీన్ రీడర్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. హిందీ, ఆంగ్లం, మరాఠి, తమిళం, ఒడియా, కన్నడ, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళ భాషల్లో యాప్‌ను చూడవచ్చు. జియో ట్యాగింగ్‌తో కూడిన ఫొటోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదుల నమోదు, తాజా సమాచారం, తీర్మానం, పరిష్కార సమయాల్లో వినియోగదారులకు సూచనలు యాప్ ద్వారా అందుతాయి.
"యాక్సెస్- ది ఫోటో డైజెస్ట్" సూచిక పుస్తకాన్ని కూడా కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం రూపొందించింది. దేశవ్యాప్తంగా సేకరించిన రంగుల ఛాయాచిత్రాలు ఇందులో ఉన్నాయి. ప్రాప్యతకు సంబంధించి 10 ప్రాథమికాంశాలు; చేయదగిన, చేయకూడని చర్యలను ప్రజలు సులభంగా అర్ధం చేసుకునేలా చిత్రరూపంలో ఈ పుస్తకంలో ముద్రించారు. ఇది వారికి ఒక మార్గదర్శిలా ఉండేలా రూపొందించారు. యాప్‌లో, కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం వెబ్‌సైట్‌లో ఈ పుస్తకాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో చూడవచ్చు.
***
(Release ID: 1701868)
Visitor Counter : 251